25, జులై 2021, ఆదివారం

అంతరిక్షంలోనూ కాలుష్యం...!!!...(సమాచారం)R

 

                                                                         అంతరిక్షంలోనూ కాలుష్యం...!!!                                                                                                                                                           (సమాచారం)

కాలుష్యం: కాలుష్యం అంటే అర్ధం తెలియని వారు ఎవరూ ఉండరు. ఎందుకంటే ఎక్కడ చూసినా కాలుష్యమే. మాట ఎత్తినా అందులో కాలుష్యం ఉంటుంది. ఉదాహరణకు: పర్యావరణ కాలుష్యం, వాతావరణ కాలుష్యం, నీటి కాలుష్యం, మట్టి కాలుష్యంఇలా ఎన్నో కాలుష్యాలు. కానీ ఒక్కరు కూడా అంతరిక్షం కూడా కాలుష్యానికి గురై ఉంటుందని ఊహించుడరు....నిజమే. కానీ అంతరిక్షం కూడా పూర్తిగా చెత్తతో కాలుష్యం అయిపోయింది. అదికూడా మానవుల వలనే.

ప్రకృతి మానవులకు పరిశుభ్రమైన జీవనార్ధాలను ఇచ్చింది. కానీ, మనిషి వాటినన్నింటినీ రకరకాల చెత్తతో కాలుష్యం చేసేరు. 

మనుషులు ఉన్నంత కాలం చెత్త ఉంటుంది. మనుషులు ఎక్కడికి వెళ్ళినా, వాళ్ళు చెత్తను వదిలేస్తారు -  1950 చివరి నుండి, ఇందులో అంతరిక్షం కూడా ఉంది. అంటే అంతరిక్షాన్ని కూడా మనిషి వదిలిపెట్టలేదు. చెత్తని వదిలిపెట్టటం మానవ స్వభావమా? ఖచ్చితంగా అవుననే అనిపిస్తోంది. చెత్త కుప్పలాగా పెరిగి, దాన్ని తొలగించే ఖర్చు అధికం అయ్యేంతవరకూ దాన్ని పట్టించుకోకుండా ఉండటం కూడా మానవ స్వభావం లాగే కనిపిస్తోంది!  

అంతరిక్ష వ్యర్థాల యొక్క పర్యవసానంను కెస్లర్ సిండ్రోమ్ అంటారు.(1978 లో నాసా శాస్త్రవేత్త డోనాల్డ్ జె.కెస్లర్ అంతరిక్ష వ్యర్థాల వలన ఏర్పడే ఘటన ఎలా ఉంటుందో వివరించాడు. అందువలన దానికి కెస్లర్ సిండ్రోమ్ అని పేరు పెట్టారు). భూమికి దగ్గరగా ఉన్న కక్ష్యలో ఉన్న అంతరిక్ష చెత్త లో ఉన్న ఒక్క వస్తువుగాని, ఇంకొక వస్తువతో ఢీ కొంటే అంతరిక్షమే ప్రమాదకరమైన ప్రదేశంగా మారుతుంది. ఉపగ్రహాలకు, రాకెట్లకు మరియు మానవ అంతరిక్ష ప్రయాణికులకు అది చాలా ప్రమాదకరంగా ఉంటుంది.

అంతరిక్షంలో కాలం చెల్లిన ఉపగ్రహాల చెత్తా చెదారం విషయంలో 'చికిత్స కన్నా నివారించడమే మేలు అనే సూత్రాన్ని పాటించడం మంచిదని శాస్త్రజ్ఞులు నమ్ముతున్నారు. అందువల్ల వారు ఉపగ్రహ ప్రయోగంలోనే దాని వల్ల ఏర్పడే అనవసర పధార్ధాల్ని (జంక్) తొలగించే ఏర్పాటు చేస్తారు. ఒక ఉపగ్రహం జీవితకాలం ముగియగానే అది తన కక్ష్య నుంచి తప్పుకుని భూమివైపు పయనించే ఏర్పాటు చేస్తారు. అలా కాలం చెల్లిన ఉపగ్రహం భూవాతావరణంలోకి ప్రవేశించి అక్కడి వాయువులతో ఘర్షణ ఏర్పడి మాడి మసైపోతుంది.

 అంతరిక్షంలో ఉపగ్రహాల వల్ల ఏర్పడిన 'జంక్' ను తొలగించాడానికి భూస్థావరంగా అమర్చిన లేజర్ కిరణాలను కాలం చెల్లిన ఉపగ్రహాల వల్ల ఏర్పడిన 'జంక్' పై కేంద్రీకరిస్తే అవిభూమిపై పడకుండా ఆవిరైపోతాయి.

కానీ ఇది వరకే పేరుకుపోయిన చెత్త, ఇప్పుడు కొత్తగా చేరుతున్న చెత్త కలిపి అంతరిక్షం ప్రమాదకరమైనదిగా మారుతోంది. రెండేళ్ళ క్రితం నుండే అంతరిక్ష చెత్తను శుభ్రం చేయాలని అగ్ర రాజ్యాలు ఒక నిర్ణయానికి వచ్చాయి. కానీ, దానికి ఖర్చు భరించలేనంతగా ఉండటంతో కొత్తరకం మార్గాలను పరిశోధిస్తున్నారు.

అంతరిక్షంలోకి ప్రయోగించే ఉపగ్రహాలు, వ్యోమనౌకలు, రాకెట్లకు సంబంధించిన పనికిరాని వస్తువులు, రాకెట్లు వదిలిపెట్టే విడిభాగాలు, కాలం చెల్లిన ఉపగ్రహాలు, నట్లు, బోల్టులు ఇవన్నీ అంతరిక్షంలో పేరుకుపోయి అంతరిక్ష చెత్తగా మిగిలిపోతాయి. వీటిలో కొన్ని చిన్నవిగా ఉండొచ్చు మరికొన్ని పెద్దవిగా ఉండొచ్చు. ఇవి అంతరిక్షంలో చాలా వేగంగా ప్రయాణిస్తుంటాయి. వీటి వేగం గంటకు 28వేల కిలోమీటర్లకు పైనే ఉంటుంది అంటే వేగం ధ్వని వేగం కన్నా 23 రెట్లు ఎక్కువ. 10 సెంటీమీటర్ల అల్యూమినియం ముక్క సెకనుకు 7.7 కిలోమీటర్ల వేగంతో ఢీకొంటే, 300 కిలోల టీఎన్టీ పేలుడు పదార్థం పేలినంత శక్తి వెలువడుతుంది. మరికొన్ని ఉపగ్రహాలైతే తిరిగి భూ వాతావరణంలోకి ప్రవేశించే ప్రమాదం కూడా ఉంటుంది.

అక్టోబర్ 4, 1957 అంతరిక్షంలోకి పంపిన మొదటి ఉపగ్రహం 'స్పుట్నిక్-1' భూమ్యాకర్షణ శక్తి దాటి వెళ్ళటంతో మొదలైంది మానవుని అంతరిక్ష అన్వేషణ. అన్వేషణ మొదలై, ఇప్పటి వరకు సుమారు 5000 ఉపగ్రహాలు పంపబడ్డాయి. ఇందులో 2000 ఉపయోగంలో ఉండగా, మిగిలిన 3000 చనిపోయిన ఉపగ్రహాలు. ఇవి మాత్రమే కాకుండా సుమారు 34,000 ఉపగ్రహ ముక్కలు 10 సెంటీ మీటర్ల కొలతతోనూ, ఒక మిల్లీ మీటర్ తక్కువ కొలతతో 128 మిల్లియన్ల చిన్న ముక్కలు ఉన్నాయి. ఇందులో 10,000 ఒకటి ఢీ కొనే పోజిషన్ లో ఉన్నది. 25 ముక్కలను అంతర్జాతీయ అంతరిక్ష నౌక (ISS) రోజూ తప్పించుకు తిరుగుతోంది.

అంతరిక్ష చెత్తను తొలగించే, తీసిపారేసే పరిశోధనలు త్వరగా పూర్తి అయ్యి అంతరిక్షం పరిశుభ్రం ఎప్పుడు అవుతుందో నని ఎదురుచూస్తున్నాయి అగ్ర రాజ్యాలు. ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. మనంకూడా వేచి చూద్దాం.  

Image Credits: To those who took the original photo.

***********************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి