29, జులై 2021, గురువారం

ప్రేమ కలలు...(సీరియల్-PART-7)

 

                                                                                 ప్రేమ కలలు                                                                                                                                                                       (సీరియల్-PART-7)

పూలమాల, మంగళసూత్రంతో తనని చూసిన వెంటనే నాన్న, అన్నయ్యలు మొదట తిడతారు...కోపగించుకుంటారు. కానీ చివరకు తన పెళ్ళిని అంగీకరించి తనని చేర్చుకుంటారు అని నమ్మింది. అదే నమ్మకం హరికృష్ణకూ ఉన్నది. వీళ్ళను వాకిట్లో చూసిన వెంటనే అన్నయ్యలిద్దరూ పరిగెత్తుకు వచ్చారు.

"రోహినీ...ఏంటమ్మా...ఇలా చేశావు? ఈ సారి ఎంత మంచి పెళ్ళికొడుకును చూశామో తెలుసా? నీకెందుకంత తొందర...ఎందుకమ్మా ఇలా చేశావు?"

"క్షమించండి అన్నయ్యా... ఇది తప్పితే నాకు వేరే దారి తెలియలేదు? నేను ఈయన్ను ప్రేమిస్తున్నాను. ఈయన్ని మనసులో ఉంచుకుని ఇంకొకరితో కాపురం చేయటం నా వల్ల కాదన్నయ్యా"

"నరసింహం...దాని దగ్గర ఏమిటి మాటలు? ఏ రోజైతే మనల్ని కాదని అది పెళ్ళిచేసుకుందో...అప్పుడే అది మన చెల్లి కాదు. ఇక దీనికీ మనకూ ఎటువంటి సంబంధమూ లేదు అనుకుని తలకి స్నానం చేసిరా"

"ఏమిటి జగన్ చెబుతున్నావు? ఈ నిర్ణయం మనం ఎలా తీసుకోగలం? నాన్న ఏం చెబుతారో?" అని రెండో అన్నయ్య మాట్లాడుతున్నప్పుడే ఆయన లోపలి నుండి వచ్చారు. ఆయన మొహం చలనం లేకుండా ప్రశాంతంగా ఉంది.

"నాన్నా...మీ ముద్దుల కూతురు చేసిన ఘనకార్యం చూశారా?  మీరున్నారు... ఇద్దరు అన్నయ్యలం మేమున్నాము. అందరినీ వదిలేసి...నిన్న వచ్చిన వాడితో భార్యగా వచ్చి నిలబడింది"

"ఊ...నేనూ చూస్తున్నాగా. మీరెందుకు కంగారు పడి ఇలా అరుస్తున్నారు? ఆమె జీవితాన్ని ఆమే నిర్ణయించుకుంది. దీన్నెందుకు పెద్ద విషయంగా తీసుకుంటున్నారు" --- అనేటప్పటికి....షాక్ అయ్యారు అందరూ.

మనసంతా పువ్వులాగా వికసించింది రోహినికి.

"నాన్నా, మీరు నన్ను క్షమించారా! నేను చేసినదాంట్లో మీకేమీ కోపంలేదే? చాలా థ్యాంక్స్ నాన్నా. లోపలకు వెళ్ళి వివరాలు మాట్లాడుకుందాం" అంటూ హరికృష్ణను తీసుకుని లోపలకు వెళ్లటానికి రెడీ అయ్యింది.

"ఉండమ్మా" అన్నది నాన్న స్వరం.

"ఏ హక్కుతో మా ఇంటి లోపలకు వస్తున్నావు? నువ్వు తీసుకున్న ఈ నిర్ణయం నన్నూ, మీ అన్నయ్యలనూ ఎంత బాధకు గురిచేస్తుందో ఆలొచించటానికి కూడా నువ్వు సిద్దంగా లేవు. ఎప్పుడైతే నీ జీవితాన్ని నువ్వే అమర్చుకున్నావో...అప్పుడే నువ్వు ఒంటరిదానివి అయ్యావు. ఇప్పుడు నువ్వు బయట మనిషివి. మావల్ల నీకో...నీ భర్తకో జరగాల్సింది ఏదైనా ఉంటే చెప్పేసి వెళ్ళిపో. మా వల్ల అయినది చేస్తాం" అన్నారు నిదానంగా.

హరికృష్ణ కొంచం ముందుకు వచ్చాడు.

"మీరు మమ్మల్ని క్షమించాలి. ఎక్కడ రోహిని నాకు కాకుండా పోతుందో అన్న భయంతో ఈ నిర్ణయానికి రావలసి వచ్చింది. ఇప్పటికీ ఏమీ పరవాలేదు సార్. రహస్యంగా జరిగిన ఈ పెళ్ళి...ఎవరికీ తెలియదు. ఊరంతా తెలిసేటట్టు ఏర్పాటు చేసి మీరు జరిపే పెళ్ళిలాగా చేసేయండి. అప్పుడు మీకు అవమానంగా ఉండదు"

నవ్వారు బాపిరాజు గారు.

మీ పెళ్ళిని ఊరంతా తెలుసుకునేటట్టు నేనెందుకయ్యా జరపాలి? ఒకమ్మాయి మెడలో ఎన్నిసార్లు తాళి కడతావు? అంతే కాకుండా నాకు అమ్మాయే లేదే. అలాంటప్పుడు పెళ్ళి కొడుకు ఎక్కడ్నుంచి వస్తాడు?"

"సార్...నా వల్ల మీ కుటుంబంలో గొడవలు వద్దు. నేను తప్పు కుంటాను. మీరు మీ అమ్మాయిని పిలుచుకుని లోపలకు వెళ్ళండీ అన్నాడు హరికృష్ణ.

"మీరెందుకండీ వీళ్ళను బ్రతిమిలాడతారు?  మనం ఏమంత చెయ్యకూడని తప్పును చేశేశాము? ప్రేమించి పెళ్ళి చేసుకోవటం అంత పెద్ద నేరమా? వీళ్ళ రక్తమే నా శరీరంలోనూ పారుతోంది. నాకూ అదే వైరాగ్యం ఉంది. రండి...మనం వెళ్దాం" అంటూ వెనక్కి నడిచింది రోహిని.

"ఉండు రోహినీ...నా గురించి బాధ పడకు. నేను ఎలాగైనా బ్రతికేస్తాను. కానీ నువ్వు...వసతిగా జీవించావు. నా వలన నువ్వు కష్టపడకూడదు. మనకి పెళ్ళే జరగలేదు అనుకో. తాళిని విప్పి నాకు ఇచ్చేసి వెళ్ళిపో. అప్పుడు వాళ్ళు నిన్ను మన్నించి చేర్చుకుంటారు"

"కేవలం...డబ్బుకోసం, వసతికోసం నేను తాళిని విప్పేస్తాననుకున్నారా? ఈ రోజు బూజును దులిపినట్లు, నన్ను దులిపేసి వదిలేసేరు కదా! వీళ్ళ ముందు మనం గొప్పగా బ్రతికి చూపిద్దాం. మన దగ్గర శ్రమ ఉంది. దాన్ని నమ్మితే చాలు. రండి..."

"చూడమ్మా...ఈ రోజుతో నీకూ, ఈ ఇంటికీ ఉన్న బంధం ముగిసిపోయింది. ఇక డబ్బో-నగలో అడుగుతూ ఈ గుమ్మం తొక్కకూడదు. అలా చేసే ధైర్యం నీకుందా?"

ఏదో చెప్పటానికి నోరు తెరిచిన హరికృష్ణను మాట్లాడనివ్వకుండా తానే మాట్లాడింది రోహిని.

"ఇలా చూడండి సార్, నేను ఇక ఈ ఇంటికి రానే రాను. ఇక నాకు అన్నీ ఈయనే. మీ ఆస్తిలో చిల్లి గవ్వ కూడా వద్దు. మీ డబ్బు పెట్టుకుని మీరే ఏడవండి" అన్న రోహిని, హరికృష్ణను పిలుచుకుని వచ్చేసింది.

ఇక పాత ఉద్యోగం అతనికి ఉండదని తెలిసి, ఇద్దరూ విజయవాడకు దగ్గరలో ఉన్న గ్రామానికి వచ్చారు. అదే బాపిరాజు గారి పూర్వీకుల ఊరు అని రోహిని విని ఉంది. అక్కడ ఒక ఇంటిని అద్దెకు తీసుకుని కాపురం పెట్టాల్సి వచ్చింది. తల మీద చేతులు పెట్టుకుని ఒక మూలగా కూర్చున్నాడు హరికృష్ణ.

"మీరు బాధ పడకండి కృష్ణా --మీకు నేనున్నాను. ఇంకో ఉద్యోగం దొరక కుండానా పోతుంది"  అన్నది ఓదార్పుగా.

ఒక్కసారిగా బుసకొట్టాడు అతను "ఎంకమ్మా...నా ప్లానునే చెడగొట్టేసేవే! నల్ల పిల్లిలాగా ఉన్న నిన్ను ఎందుకు ప్రేమించానో? లేదు...లేదు...ప్రేమిస్తునట్టు నటించానో తెలుసా? నువ్వు బాపిరాజుకి ఒకే కూతురువి. నిన్ను పెళ్ళి చేసుకుంటే వసతిగా -- ఉద్యోగమే చేయకుండా ఇంటల్లుడుగా ఉండి పోదామనుకున్నాను. ఆస్తి బాగా వస్తుందని లెక్క వేసుకున్నాను. శనేశ్వరం...అంతా చెడ దొబ్బేవు కదే!"

మనసు మధ్య భాగంలో గట్టిగా దెబ్బతిన్నది రోహిని. తల తిప్పుతున్నట్టు అనిపించింది. నిలబడలేక కాళ్ళు వణికినై. ఒక్కసారిగా చెమటలు పట్టినై. షాక్ తో నాలిక పొడిబారింది.

అతను మాట్లాడుతూ వెడుతున్నాడు.

"వాళ్ళు మన పెళ్ళిని ఒప్పుకోరని తెలుసుకున్న తరువాత వెంటనే త్యాగం చేసేవాడిలాగా నటించి నిన్ను విడిచి పెట్టి, కనీసమైన డబ్బును గుంజుదామని చూశాను...పెద్ద పతివ్రతలాగా తాళిని విప్పను అని చెప్పి దాన్ని కూడా పాడుచేసావు"

హరికృష్ణ మాట్లాడుతూ పోతుంటే అతని అసలు రూపం ఆమెలో విచ్చు కుంటూ పోతోంది. 'వీడికి మనసే లేదు. వీడుత్త డబ్బు పిశాచి అనేది చాలా ఆలశ్యంగా అర్ధం చేసుకుంది ఆ అమాయకురాలు. హృదయం నొప్పి పుట్టింది. మెడడులో చాలా గందరగోళం.

"సరి...సరి...జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు మనం చెయ్య గలిగింది ఒకటే ఒకటి. త్వరగా ఒక బిడ్డను కని, దాన్ని మీ నాన్న కాళ్ళ దగ్గర పడేసి బేరమాడితే, ఒక వేల మనల్ని క్షమించి కొంచమైనా ఆస్తి ఇస్తారు. ఇలా చూడమ్మా...'మనం వీడ్ని పెళ్ళి చేసుకున్నామే, ఇతను ఉద్యోగం చేసి మనల్ని కాపాడతాడు అని మాత్రం కలలు కనకు. ఇంటికి చిల్లి గవ్వ కూడా ఇవ్వను" అంటూ బయటకు వెళ్ళిపోయాడు.

అతను వెళ్ళిపోయిన తరువాతే కొంచం కొంచంగా స్వీయ భావ వలలోకి  వచ్చింది.

'భగవంతుడా...వీడ్ని నమ్మి ఎంత పెద్ద తప్పు చేశేను? నాన్న ఎంతగా చెప్పారో...ఎందుకు వినలేదు? ప్రేమ మోహం కళ్ళు కప్పేసింది. ఇక నేనేం చేయను?' వేదనతో ఆమె కళ్ళల్లో నీళ్ళు నదిలా ప్రవహించినై.  తన తలరాతను తలుచుకుని ఏడుస్తూనే ఉంది. సముదాయించే వాళ్ళు కూడా లేరు.

రెండు గంటలైనా వెళ్ళిన అతను తిరిగి రాలేదు. ఇప్పుడు ఆ భయం కూడా ఆమెను చేరుకుంది.

కళ్ళు తుడుచుకుంది. దేవుడి మీద భారం వేసింది. ఎప్పుడో చనిపోయిన తల్లి జ్ఞాపకానికి వచ్చింది. మళ్ళీ కన్నీరు మొదలయ్యింది. 'అమ్మా...నువ్వుంటే నాకు ఇలాగంతా జరిగేదా?' -- ఏడ్చింది.

'ఇంకా ఏడుస్తూ కూర్చుంటే ప్రయోజనం లేదు. నా జీవితం ఇంతే అనేది తెలిసిపోయింది. ఏ కారణం  చేత కూడా పుట్టింటికి మళ్ళీ వెళ్ళకూడదు. అది ఖచ్చితం. వీడ్ని నమ్ముకుని ప్రయోజనమూ లేదు. నా చేతులను నమ్ముకునే నేను బ్రతకాలి. చదువు సహాయం చేస్తుంది తనని తాను సముదాయించుకుంది!

సుమారుగా ఏడున్నర ప్రాంతంలో హరికృష్ణ వచ్చాడు. బాగా తాగున్నాడనేది అతను దగ్గరకు వస్తున్నప్పుడే అర్ధమయ్యింది.

"మీరు తాగుతారా?"

అవును...బాగా తాగుతాను. నీకేమొచ్చింది? నీ డబ్బుతోనా తాగాను? ఏమిటే ఆ చూపు? నేనేమీ భయపడను. ఈ రోజు మనకి 'ఫస్ట్ నైట్' త్వరగా బిడ్డ పుట్టాలని వేడుకో" అన్నాడు.

మరుసటి రోజు తెల్లవారుతుండగానే బయటకు వెళ్ళిపోయాడు.

ఇంట్లో ఒక జీవి ఉందే...భోజనానికి ఏం చేస్తుంది? అనే ఆలొచన కూడా లేకుండా...'నేను రాత్రికే వస్తాను అని వదిలేసి వెళ్ళిపోయాడు.

మళ్ళీ ఏడవటానికి ఓపిక లేదు...మనసూ రాలేదు రోహినికి. జరగవలసిన పనులు మొదలుపెట్టింది.

చేతులకూ, చెవులకూ వేసుకున్న స్వల్ప బంగారాన్ని అమ్మి ఇంటికి కావలసిన వస్తువులు కొన్నది. కొంచం డబ్బుతో రెండు చీరలు, జాకెట్టు గుడ్డలు అని కొనుక్కుంది.

పక్కన ప్రైవేట్ స్కూలు ఒకటుంది. అక్కడికి వెళ్ళి తన చదువు గురించి చెప్పి ఉద్యోగం అడిగింది. ఆమె ఎం.ఎస్.సి.మాత్స్ చేసినందువలన వెంటనే ఉద్యోగం దొరికింది. జీతం నెలకు ఐదువేలు. శనివారం కూడా స్కూలుకు రావాలి. అంటూ అన్ని షరతులకూ ఒప్పుకుంటూ ఉద్యోగంలో చేరింది.

ఆమెకు ఉద్యోగం దొరికిందని తెలుసుకున్న వెంటనే తాను ఉద్యోగం వెతుకుంటున్న పని ఆపాశాడు హరికృష్ణ.

ఎప్పుడు చూడూ భార్యను తిడుతూనే ఉంటాడు. తన పధకం ఓడిపోయింది. ఆస్తి, డబ్బూ దొరకలేదని గొణుగుతూ ఉండేవాడు. కొన్నిసార్లు దెబ్బలు కూడా తగిలినై. రోజులు గడుస్తున్న కొద్ది మూర్ఖత్వం పెరిగిందే తప్ప -- ఆమెపై జాలో-దయో చూపించనే లేదు.

అన్నిటినీ మౌనంగా సహించటం అలవాటు చేసుకుంది రోహిని. లోతైన మనసులో నుండి ఎంత అణుచుకున్నా దాన్ని దాటి తన జరిగిపోయిన కాలం జ్ఞాపకాలను ఆశపడుతుంది. 'ఎలాగో వసతులు -- విలాశవంతంగా ఉండవలసిన ఆమె ఇలా కష్టపడుతున్నామే?' అని ఆవేదన చెందుతుంది. ఆ టైములో మనసును రాయి చేసుకుంటుంది. స్కూల్ పిల్లల  నోటు పుస్తకాలనో, పరీక్ష పేపర్లనో తీసి పెట్టుకుని ఆ పనిలో ఐక్యమైపోతుంది.

ఒక్కొక్క రోజూ నరకంలా గడిచింది. అయినా కానీ పళ్ళు కొరుక్కుంటూ గడిపింది. ఇలాంటి టైములోనే ఆమె గర్భం దాల్చిందని కన్ ఫర్మ్ అయ్యింది. విషయం తెలిసిన వెంటనే హరికృష్ణ పెద్దగా రియాక్ట్ అవలేదు.

"ఇది పుట్టిన తరువాతైనా మీ నాన్న నిన్ను చేర్చుకుంటాడా అని చూద్దాం?" అన్నాడు.

కానీ, రోహిని తన బిడ్డకొసం చాలా ఆశగా ఎదురుచూసింది. 'ఎండి పోయిన ఎడారిలో వర్షం కురిసినట్టు’… 'నాలిక మీద పడ్డ తేనె బొట్టులాగా '...తన జీవిత ఆనందమే ఈ బిడ్డే  కనుక రాధ చాలా దృఢంగా ఉంది.  బాగా తింటూ ఆరొగ్యాన్ని మెరుగుపరుచుకుంది. మర్చిపోకుండా వాక్సిన్లు వేసుకోవటానికి చాలా గమనికతో ఉండేది.

కాన్పు నొప్పులు వచ్చి చుట్టు పక్కలున్న వారి సహాయంతో ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. ప్రశవం జరగబోతోంది అన్న పరిస్థితిలోనూ అతను వచ్చి చూడలేదు.

బుధవారం సాయంత్రం అందమైన ఆడపిల్లకు జన్మనిచ్చి తల్లి అయ్యింది రోహిని. మూడు రోజులు ఆసుపత్రిలోనే ఉంది. అప్పుడు కూడా అతను రాలేదు. తానే రిక్షా చేసుకుని వచ్చి ఇంట్లో దిగింది.

బిడ్డ పుట్టిన శరీరం నీరసంగా ఉంది. అయినా ఆమె వలన ఒక్క క్షణం కూడా రిలాక్స్ గా కూర్చోలేకపోయింది. ఆమె లేని సమయంలో హరికృష్ణ ఇంటిని అశుభ్రం చేసేశాడు. అది శుభ్రం చేసి -- బిడ్డకు పాలిచ్చి--తనకు పత్యం భోజనం తయారుచేసుకోవటం అనే పనులు చేసి ముగించుకునేటప్పటికి తల తిరుగుతున్నట్టు అనిపించింది.

ఆమె పరిస్థితి చూసి పక్కింటి పనిమనిషి గౌరి, భోజనం చేసి పంపేటట్టు...దానికి తగిన డబ్బు తీసుకునేటట్టు ఒప్పుకుని భోజనం బాధ్యత ఆమె తీసుకుంది. అది రోహినికి చాలా ప్రశాంతతను ఇచ్చింది.

హరికృష్ణ కనిపించనే లేదు. దాని గురించి రోహిని బాధ పడనూ లేదు. ఐదు నెలలు గడిచినై. బిడ్డను గౌరి దగ్గర ఇచ్చేసి స్కూలుకు వెళ్ళటం మొదలుపెట్టింది. జీవితం సాఫీగా గడుస్తోంది.    

సడన్ గా ఒకరోజు వచ్చాడు భర్త.

"అరెరే...ఇదేనా నా బిడ్డ? ఆడపిల్లనా? అరే శనేశ్వరం...మగ బిడ్డగా పుట్టి ఉండకూడదా? నీకు టాలెంట్ చాలదు. అందుకనే ఆడపిల్లను కని తీసుకు వచ్చావు" అన్నాడు కఠినంగా.

మౌనంగా అతనికి కంచం పెట్టి భోజనం వడ్డించింది.

"మగ బిడ్డగా పుట్టుంటే తాతయ్య ఆస్తి, మనవడికే వస్తుందని చెప్పి కోర్టులో దావా వేసుండొచ్చు కదా? అందుకే చెప్పాను. సరి...సరి...ఇప్పుడు కూడా చెడిపోయింది ఏమీలేదు. బిడ్డను తీసుకుని బయలుదేరు"

"ఎక్కడికి?" అన్నది పులుసు పోస్తూ!

"ఇంకెక్కడికి...మీ ఇంటికే. మీ నాన్న కాళ్ళ దగ్గర ఈ బిడ్డని పడేయ్. దీన్ని పెంచటానికి మా వల్ల కావటం లేదు. 'డబ్బులేక అల్లాడిపోతున్నాము అని చెప్పి ఏడు. ఆయన నిన్ను మాత్రం చేర్చుకున్నా పరవాలేదు. నేను నిదానంగా వచ్చి కలిసిపోతాను. అంతవరకు నువ్వు నాకు కొంచం డబ్బులిచ్చి ఆదుకోవా ఏమిటి? "అన్న హరికృష్ణ, భోజనం పూర్తి చేసి లేచాడు.

ఉన్నదాంట్లోనే బాగా చినిగిపోయిన చీరను కట్టుకో. బిడ్డకు కూడా మామూలు గుడ్డలు వేయి. ఇలా పౌడర్ అంతా పూసి అందంగానూ, శుభ్రంగానూ తీసుకువెళ్ళకు. అలా ఉంటేనే నీ మీద జాలి కలుగుతుంది" అన్నాడు.

అంత వరకు మాట్లాడ కుండా ఓర్పుగా ఉన్న రోహిని పిల్లను గుడ్డ ఊయలలో వేసి నిద్ర పోనిచ్చి వచ్చింది. చిన్నగా చెప్పినా ఖచ్చితమైన స్వరంతో మట్లాడింది.

"చూడండి...మీరెంత ఒత్తిడి చేసినా మా నాన్న దగ్గరకు బిచ్చం ఎత్తుకుంటూ వెళ్ళను. ఆయనకున్న కఠిన మనసు, పరువు, రోషమూ నాకూ ఉండదా? నా పిల్లను బిచ్చగత్తెను చెయ్యలేను. మీరు నన్ను కొట్టి చంపినా పరవాలేదు...ఆ ఇంటి గడప తొక్కను..." అన్న  రోహిని ఊయలను ఊపటానికి వెళ్ళింది.

ఆమె చెప్పింది విన్న తరువాత హరికృష్ణ నోటి నుండి వచ్చిన మాటలు చెప్పటానికి పనికిరావు.  అంత అసహ్యంగా మాట్లాడాడు. ఒక సమయంలో చేతులు ఎత్తి కొట్టటానికి వచ్చినప్పుడు ఆపింది.

"నన్ను కొట్టటానికి చెయ్యి ఎత్తేరంటే...ఊరీకే  ఉండను. తిరిగి కొడతాను. ఆ అవమానం మీకు అవసరమా? మాట్లాడ కుండా, గొడవ పడకుండా ఉండేటట్టు అయితే భర్త అనే కారణంతో భోజనం పెడతాను. అది వదిలేసి 'మీ ఇంటికి వెళ్ళు -- డబ్బులు తీసుకురా' -- అలాఇలా అని మెదలుపెట్టేరా... ఊరికే ఉండను. పోలీసులకు చెప్పి లోపల  పెట్టిచేస్తాను. అప్పుడు జీవితాంతం చిప్ప కూడే" అన్నది.

ఆమెను కోపంతో, విసుగుతో చూసేసి, ఏమీ మాట్లాడకుండా కోపంతో తలుపులను గట్టిగా మూసి బయటకు వెళ్ళిపోయాడు. ఆ శబ్ధానికి పాపకు నిద్రా భంగం కలిగి ఏడుపు మొదలు పెట్టింది.

                                                                                                      Continued...PART-8

***********************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి