ప్రేమ కలలు (సీరియల్-PART-4)
హాస్పిటల్లో మంచం మీద పడుకోనున్నది రోహిని.
పక్కన అంజలి, నిర్మలా ఆంటీ...ఇంకా
కొంతమంది మహిళలు . కొంచం దూరంలో సుధీర్ నిలబడున్నాడు. ఒక బాటిల్ నుండి మందు,
గ్లూకోస్ కలిపిన నీళ్ళు ఆమె శరీరంలోకి చుక్కలు చుక్కలుగా
ఎక్కుతున్నాయి. చేతులలోని నరాల నుండి కొన్ని సూది మందులు వేసింది ఒక నర్స్.
కన్నీళ్ళు కారుతుంటే వాటినే చూస్తూ
నిలబడింది అంజలి.
డాక్టర్ లోపలకు రాగానే -- ఆయన్ని
చుట్టుముట్టారు అందరూ.
"ఇప్పుడు మా అమ్మకు ఎలా ఉంది డాక్టర్?"
"నువ్వు ఆవిడ కూతురివా?
చూడటానికి చదువుకున్న దానిలాగా ఉన్నావు? కానీ,
ఆమెను ఎలా చూసుకోవాలో తెలియలేదే?"
"ఏమైంది డాక్టర్?"
"ఇంతుకు ముందు ఇలాగే
ఒకసారైనా వచ్చుంటుందే?"
"అవును డాక్టర్...రెండు
సంవత్సరాలకు ముందు ఆవిడ స్కూల్లో పనిచేస్తున్నప్పుడు ఇలాగే సృహ తప్పి
పడిపోయింది"
"మీ అమ్మకు బ్లడ్ ప్రషర్ చాలా
ఎక్కువగా ఉంది. ఆమె ఎక్కువ ఆవేశపడితే మెదడుకు వెళ్ళే రక్త ప్రవాహం ఎక్కువై,
ప్రషర్ తట్టుకోలేక రక్త నాళాలు చిట్లి పోయే పరిస్థితికి తీసుకు
వెడుతుంది. ఇలాగే వదిలేస్తే ఏం జరుగుతుందో తెలుసా?"
"చెప్పండి
డాక్టర్..."---వణుకుతున్న స్వరంతో అడిగింది.
"పక్షవాతం రావచ్చు. రక్త నాళాలు
చిట్లిపోతే మరణం కూడా సంభవించవచ్చు. మీరు కరెక్టు టైముకు తీసుకు వచ్చారు. లేకపోతే
ఏమై ఉండేదో?"
దడ దడ మని కొట్టుకుంటున్న హృదయాన్ని
కట్టడి చేసుకుని మౌనంగా చూసింది అంజలి.
"ఎప్పుడు ఇంటికి తీసుకు వెళ్ళొచ్చు?
ఈవిడికి ఎప్పుడు సృహ వస్తుంది?"
"ఇంకాసేపట్లో సృహ
వస్తుంది. రెండు రోజుల తరువాత తీసుకు వెళ్ళొచ్చు. కానీ చాలా జాగ్రత్తగా
చూసుకోవాలి. చిన్న షాక్ కూడా తట్టుకోలేదు. ఆవేశం చెందేటట్టు ఏమీ చెప్పకండి!"
"సరే డాక్టర్...ఎన్ని రోజులకు మందులు
వేయాలి?"
"పదిహేను రోజులకు
మందులు రాసిస్తాను. తరువాత ఒక టెస్టుకు రండి -- నార్మల్ అయిపోతే ఏమీ
అక్కర్లేదు" అని చెప్పి ఆయన వెళ్ళిపోయారు.
ఇప్పుడు ఆడవాళ్ళందరూ,
అంజలిని చుట్టు ముట్టారు.
"ఏమిటే ఇది?
నిన్న ప్రొద్దున మీ అమ్మ నీతో మాట్లాడిందే. అప్పుడు చాలా నిదానంగానే
ఉన్నదే? సడన్ గా ఏమైందే? ఎందుకని సృహ
తప్పి పడిపోయంది?"
ఏం చెబుతుంది అంజలి?
దీనంగా సుధీర్ వైపు చూసింది.
ఇంతలో నిర్మలా ఆంటీ అడ్డుపడి "ఒంటికి
ఏం జరుగుతుందో, ఎప్పుడు జరుగుతుందో ఎవరికి తెలుసు? ఏమిటో---అనుభవించాల్సిన సమయం వచ్చింది. అంజలి దగ్గర ఏమైందని...ఎందుకు వచ్చిందని
అడిగితే అది ఏం చెబుతుంది? పాపం....చిన్న పిల్ల" అన్నది
అంజలికి ఆదరణగా.
"ఏడవకు అంజలి. మేమున్నాం. నిన్ను ఇలా
వదిలేయం. నువ్వు ఇక్కడ ఉండక్కర్లేదు. మీ ఇంటికి వెళ్ళిపో. నేనుండి అన్నీ
చూసుకుంటాను. రేపు ఉద్యోగానికి వెళ్ళు. అది చాలా ముఖ్యం" అన్నది రుక్మణీ ఆంటీ.
"సరే...అమ్మకు సృహ వచ్చిన తరువాత
ఒకసారి మాట్లాడి వెడతాను" అన్నది.
ఆమెను ఒంటరిగా పిలిచాడు సుధీర్.
"చేతిలో డబ్బులున్నాయా...లేదు కావాలా?
ఈ మందులన్నీ కొనమని డాక్టర్ రాసిచ్చాడు. నేవెళ్ళి కొనుక్కొస్తాను. నువ్వు
ఆంటీని జాగ్రత్తగా చూసుకో. ఆవిడ కళ్ళు తెరిచేటప్పుడు నేను గనుక ఇక్కడుంటే టెన్షన్
అవుతారు. అందుకని ఇక ఇక్కడికి రాను. సహాయానికి నిర్మలా ఆంటీ, రుక్మణీ ఆంటీ ఉన్నారు కదా...చూసుకుంటారు" అన్నాడు.
'అతన్ని చూడటానికే కష్టం
అనిపించింది. అమ్మ అతన్ని ఎందుకు కొట్టింది? మొహం చలనం లేని
మనిషిలా అయిపోయింది. అతని కళ్ళల్లోకి చూసి మాట్లాడలేకపోతోంది అంజలి. 'ఎక్కడ ఏడ్చేస్తానో...?' అనే భావాలను అనిచి
పెట్టుకుని తల మాత్రం ఊపింది.
అంతకు మించి అక్కడ పనేమీ లేదని భావించి
బయటకు వచ్చాడు సుధీర్.
అతను వెళ్ళిన కొద్దిసేపటికే రోహిని సృహలోకి
వచ్చింది. మెల్లగా కళ్ళు తెరిచింది. తన చుట్టూ ఉన్న వాళ్ళను గుర్తు పట్టటానికి
కొంత సమయం పెట్టింది.
"అంజలీ...నన్ను క్షమించమ్మా...నిన్ను
చాలా భయపెట్టేసేను. ఇప్పుడు నాకు బాగానే ఉంది" అన్నది కూతురు చేతులు
పుచ్చుకుని.
"బాగా చెప్పావు పో...దాన్ని మాత్రమా
భయపెట్టావు? మమ్మల్నందరినీ ఒక ఊపు
ఊపేవే! ఏమిట్రా ఇది... అంజలీ
చిన్న పిల్ల కదా. ఈ కొత్త చోట అది తానుగా అన్నిటినీ సర్దుకోగలదా అనే ఆలొచన
ఉండక్కర్లేదా ఒకత్తికి?" అన్నది నిర్మలా
ఆంటీ.
"ఆంటీ...దయచేసి మా అమ్మను తిట్టకండి.
ఆమె యముడితో పోరాడి ప్రాణం దక్కించుకుని ఇప్పుడే బయటకు వచ్చింది..."
"అందుకే చెబుతున్నా...మనమందరం
ఆడువారిగా పుట్టిన వాళ్ళం. మనసులో ధైర్యమూ, స్వీయ
నమ్మకమూ చాలా ముఖ్యం. అది వదిలేసి ప్రతిదానికీ ఆవేశపడి ఇలా అరిస్తే ఎవరికి నష్టం
చెప్పు?"
“నాకు అర్ధమవుతోంది ఆంటీ.
నా వల్ల నా ఆవేశాన్ని అనుచుకోలేకపోయానే?”
"అనుచుకోవాలి రోహినీ...ఖచ్చితంగా
అనుచుకోవాలి. నీకొసం కాకపోయినా, పాపం...నిన్నే
నమ్ముకునుందే...దీనికోసమైనా మనసును అనుచుకోవాలి. అర్ధం అయ్యిందా?"
"నాకు ఒకటి
అనిపిస్తోంది. ఇంతక ముందు తనకు జరిగిన ఏదో ఒక సంఘటనను మనసులో ఉంచుకునే రోహినీ ఇలా
అవస్తపడుతోంది అనుకుంటా. అలా ఉంటే నీ మనసును
బాధపెడుతున్న విషయాన్ని, నీకు బాగా దగ్గరగా ఉన్నవాళ్ళ దగ్గర
చెప్పు. దాని వలన మనసులోని భారం
తగ్గుతుంది. ప్రషరూ తగ్గుతుంది. ఆరొగ్యమూ బాగుపడుతుంది" అన్నది రుక్మణీ ఆంటీ.
అన్నిటినీ వింటూ మౌనంగా పడుకోనుంది రోహిని.
ఆమె మనసులో పలు పోరాటాలు.
రోహినిని ఇంటికి తీసుకు వచ్చారు. ఈ మూడు
రోజులలో ఒకసారి కూడా సుధీర్ వచ్చి ఆమెను చూడలేదు. అంజలితో మాట్లాడటానికి కూడా
ప్రయత్నించలేదు. కానీ, అంజలి అతన్ని చూడ
లేకుండా ఉండలేకపోయింది.
"సుధీర్ ఎక్కడమ్మా...కనబడటం లేదు?
ఎందుకని మీ అమ్మను చూడటానికి రాలేదు? ఆశ్రమంలో
ఎవరికైనా చిన్నగా తలనొప్పి అని చెప్పినా వెంటనే చూడటానికి వస్తాడు. అలాంటిది,
మీ అమ్మ హాస్పిటల్లో చేరి వచ్చింది..."
రుక్మణీ ఆంటీ అలా అడగగానే అంజలి గుండె
వేగంగా కొట్టుకోవడం మొదలు పెట్టింది.
"అదేమీ లేదు ఆంటీ...పని
ఉండుంటుంది. అందుకనే చూడటానికి వచ్చుండడు" అని సమాధానపరచింది. ఆంటీ
వెళ్ళిపోయింది.
"ఆమ్మా...నీకిప్పుడు ఒంట్లో ఎలాగుంది?"
తల్లిని ప్రేమగా అడిగింది.
"బాగుందిరా తల్లీ...కానీ మనసు మాత్రం
సరిలేదు"
"ఎందుకమ్మా?
నీ మనసును వేదన పడేటట్టు నేను నడుచుకోనమ్మా. ఇది నా ప్రామిస్. నాకు
నువ్వే చాలా ముఖ్యం. నీ మనసును బాధపెట్టి నేను సుఖంగా జీవించాలని అనుకోను" అన్నది అంజలి, తల్లి
చేతులు పుచ్చుకుని.
"నాకు మాత్రం నీ మనసును బాధపెట్టాలని
ఆశా? నువ్వు బాగా జీవించాలనేదే నా ఆశ,
కల, లక్ష్యం అన్నీ. అది నీకు అర్ధమయితే
సరి"
"అనవసరమైన విషయాలు ఆలోచించుకుని నీ
మనసును పాడుచేసుకోకు. ఇందా...ఈ మాత్ర వేసుకో. బాగా నిద్రపోయి రెస్టు తీసుకో.
అప్పుడు మంచిది" అన్న అంజలి తల్లికి మాత్ర ఇచ్చింది.
కొంచంసేపట్లో తల్లి బాగా నిద్రపోవడం మొదలు
పెట్టింది. అది నిర్ధారణ చేసుకుని సుధీర్ ను వెతుక్కుంటూ అతని ఇంటి వైపు నడిచింది.
మల్లె పూల పందిరి పక్కనున్న బెంచ్ మీద
ఆలొచనలకు బానిసైన వాడిలాగా కూర్చోనున్నాడు సుధీర్. అంజలిని చూసిన వెంటనే అతని
హృదయం కేరింతలు వేసింది. నిజం ఆమెను కాల్చింది.
"రా అంజలీ...మీ అమ్మకు ఇప్పుడు
పరవాలేదుగా?"
"హు...పరవాలేదు.
ట్యాబ్లెట్ ఇచ్చి వచ్చాను. ఇప్పుడే నిద్రపోతున్నారు"
ఏం మాట్లాడాలో తెలియక ఇద్దరూ మౌనంగా
నిలబడ్డారు.
"అంజలీ...ఆ రోజు మీ అమ్మ ఎందుకు అంత
ఆవేశపడి అరిచింది? నీకేమైనా తెలుసా?"
"ఏమీ తెలియటం లేదే!
నన్ను మా అమ్మ ఆ రోజే మొదటిసారిగా కొట్టింది తెలుసా? చిన్నప్పటి
నుండి ఆమె నన్ను బుజ్జగించిందే తప్ప కోప్పడటమో, కొట్టటమో
చేయలేదు!"
"ఐమ్ సారీ అంజలి...నువ్వు
దెబ్బతినటానికి నేను కారణమయ్యాను. నిన్ను నాతో కలిపి చూడటం వలనే ఆమె ఆవేశపడింది.
అందులోనూ నువ్వు మన ప్రేమను చెప్పేటప్పటికి ఆవిడకు బ్లడ్ ప్రషర్ ఎక్కువయ్యింది.
కళ్ళు తిరిగి కింద పడిపోయారు"
"అవును. నాకూ అలాగే అనిపించింది. ఆ
విషయం మాట్లాడటానికే నిన్ను వెతుక్కుంటూ వచ్చాను"
"చెప్పు అంజలి...నేనేం చెయ్యాలి?"
"సుధీర్...చిన్న వయసు
నుండి తల్లి, తండ్రీ, సహోదరి లాగా ఉండి
ఆమె నన్ను పెంచింది. నా మంచిని తప్ప, ఇంకేమీ తెలియదు. ఆమెను
వదులుకోవటానికి నాకు మనసు లేదు"
"దానికి నేనేం చేయాలి?"
"మన ప్రేమ ఆవిడకు
నచ్చలేదు. అందువల్ల మీరు నన్ను మర్చిపోవాలి. మనం ప్రేమించుకున్నది
మరిచిపోవాలి"
"ఒక విధంగా ఇది నేను ఎదురుచూశాను.
కానీ, ఇంత ఈజీగా నిర్ణయం తీసుకుంటావని
అనుకోలేదు. నువ్వు చెప్పాశావు...నా మనసు ఎంత మదన పడుతుందో నని ఆలొచించావా?"
"ఆలొచించకుండా ఉంటానా.
మీరు అనుకుంటునట్ట్లు నేనేమీ చాలా ఈజీగా నిర్ణయం తీసుకోలేదు! నా మనసును రాయి
చేసుకుని ఈ నిర్ణయానికి వచ్చాను"
"వేరే దారే లేదా అంజలీ?"
-- దీనంగా అడిగిన సుధీర్ కళ్ళల్లో నీరు పొంగుతుండగా చూసింది.
"మీ పరిస్థితి నాకు అర్ధం అవుతోంది.
కానీ, నా పరిస్థితిని మీరు ఆలొచించండి. మా
అమ్మకు ఎటువంటి షాక్ ఇవ్వకూడదని డాక్టర్ చెప్పాడు. దాంతో పాటు ఆమె ఆవేశపడకుండా
చూసుకోవాలని హెచ్చరించారు. ఈ పరిస్థితిలో మీ గురించి ఆవిడ దగ్గర నేనెలా చెప్పగలను?"
"ఇప్పుడు
చెప్పొద్దు...ఆవిడ ఆరొగ్యం పూర్తిగా కోలుకున్నాక చెప్పచ్చు కదా? దానికి రెండు సంవత్సరాలు అయినా నేను కాచుకోనుంటాను"
"మనం కాచుకోనుండచ్చు సుధీర్...కానీ,
ఆమె రేపే...'నువ్వు సుధీర్ ను
ప్రేమిస్తున్నావా' అని అడిగితే ఏం సమాధానం చెప్పను? ఆమె మనసును కష్టపెట్టనని ప్రామిస్ చేసాను నేను"
తిరిగి మౌనం వాళ్ళను చుట్టుముట్టింది.
"ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నావు...'ఇక నీకూ, నాకూ ఏ సంబంధమూ' లేదనా?
'ఈ జన్మలో మన పెళ్ళి జరగదనా'? ఏం
చెప్పాలనుకుంటున్నావు అంజలి?"
అతను అడిగిన ప్రశ్నతో క్రుంగిపోయింది అంజలి.
"నాకేమీ అర్ధం కావటం లేదు సుధీర్
గారు. నాకు నా తల్లి కావాలి. అంతే!"
ఆమె దగ్గరగా వచ్చాడు. ఆమె ఊపిరి బిగపెట్టి
నిలబడింది.
" అంజలీ...చిన్న
వయసు నుండే తల్లి ప్రేమకోసం, అనురాగం
కోసం ఎదురు చూసిన వాడిని నేను. నీకు అది దొరక కుండా చేస్తానా? నా వల్ల నిన్ను మర్చిపోవటం కుదరదు. ఇందులో కొంచం కూడా అనుమానం లేదు. ఏ
నాటికైనా నా మనసులో నువ్వు మాత్రమే ఉంటావు. కానీ, నీ కొసం
నీపైన ఉన్న ప్రేమను త్యాగం చేయటానికి తయారుగా ఉన్నాను. ఇక నేను నిన్ను ఇబ్బంది
పెట్టను. అందుకోసం నువ్వు నన్ను శత్రువులాగా చూడకు...నేనది తట్టుకోలేను"
మాట్లాడుకుంటూ వెళుతున్న సుధీర్,
స్వరం అడుపడితే కొంచం
ఆపాడు. అంజలి ఏదో చెప్పటానికి వచ్చింది...ఆమెను చేతితో అడ్డగించి తిరిగి
మాట్లాడాడు.
“నేను ఎప్పుడూ నీకు మంచి
స్నేహితుడినే. నీకు ఎటువంటి సహాయం కావాలన్న సంశయ పడకుండా నన్ను అడగొచ్చు. సరేనా...?"
అన్నాడు.
అతను అడిగినట్లే అతనికి 'సరే' అని సమాధానం చెప్పింది. ఇద్దరూ చెరో దిక్కుకూ
నడిచారు.
Continued....PART-5
***********************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి