దృశ్యం...(సీరియల్) PART-5
రామకృష్ణ గారి కుటుంబమే కల్యాణమండపానికి రావటంతో అక్కడ వాతావరణం హడావిడిగా మారింది.
అలంకరణ, ఖరీదైన డిజైన్ ఆర్చ్ లపై వధూవరుల పేర్లు, తోరణాలు...ఇలా అన్నీ హంగులతో కల్యాణ మండపమే అందంగా వెలిగిపోతోంది.
మధ్యాహ్నం లంచ్ రక రకాల వంటలతో రెడీ అవుతోంది.
వీడియోగ్రాఫర్లు, ఫోటోగ్రాఫర్లు స్పీడుగా పనిచేస్తున్నారు.
సన్నాయి మేళం, బ్యాండు మేళం కళాకారులు రెడీగా ఉన్నారు.
రామకృష్ణ గారు అన్ని చోట్లకూ వెళ్ళి అందరికి ఆర్డర్లు ఇస్తూ ఆనందంగా తిరుగుతున్నారు.
కుటుంబం మొత్తం ఆనందంగా ఉన్నది.
వచ్చిన బంధువులు, స్నేహితులూ పెళ్ళి కూతురు దీపికని మెచ్చుకుంటుంటే, ప్రియంవద శారీరకంగా అక్కడున్నా, అమె మనసంతా ఆ హత్యపైనే ఉన్నది.
మళ్ళీ మళ్ళీ చక్రవర్తి ముఖము, ఆకారం ఆమెకు గుర్తుకు వస్తోంది.
"చెప్పకపోతే అక్కయ్య జీవితం నాశనమైపోతుంది"
“చెప్పి, పెళ్ళి ఆగిపోతే కొన్ని లక్షల రూపాయల నష్టంతో పాటూ తండ్రి గౌరవం, అక్క జీవితం రెండూ దెబ్బ తింటాయి"
ప్రియంవద మనసు గందరగోళంగా ఉన్నది.
మధ్యాహ్నం రామకృష్ణ గారు పంపిన వాహనాలలోనూ, పెళ్ళి కొడుకు తరఫు కార్లలోనూ వియ్యంకుడి తోటి బంధువులు, స్నేహితులు దిగారు.
పెళ్ళికొడుకు చక్రవర్తి...అతని తల్లితండ్రులు తమ సొంత కార్లలో, మరికొంతమంది దగ్గర భందువులతో వచ్చి దిగారు. హారతి తీసి బ్రహ్మాండంగా స్వాగతం పలికారు.
ప్రియంవద ఒక పక్కగా నిలబడుంది.
చక్రవర్తి యొక్క ఈ అమాయకపు ముఖం, కృరమైన మరో ముఖం మారి మారి కనబడుతోంది.
అదే ముఖం, అదే ఎత్తు.
ఎటువంటి మార్పు లేదు.
“దేముడా ఒక ఆడదాన్ని హత్య చేశేసి, ఇక్కడ ఏమీజరగనట్లు సహజమైన రీతిలో పెళ్ళికొడుకు అవతారంలో వచ్చి నిలబడగలమా?"
పెళ్ళికొడుకును లోపలకు తీసుకు వెళ్ళి ఉపచారాలు చేశారు.
"ప్రియంవదను పిలు!" తండ్రి గొంతు వినబడటంతో…
లోపలకు వెళ్ళింది ప్రియంవద.
"ప్రియా! అందరూ ఇక్కడుంటే, నూవ్వేంచేస్తున్నావ్ అక్కడ"
"వస్తున్నానమ్మా"
"ఏమిటే నువ్వు? పెళ్ళికొడుకు ఇంట్లోని వాళ్ళందరూ వచ్చాశారు, నువ్వేంటి అలా పటించుకోకుండా నిలబడ్డావ్?"
"లేదమ్మా ఇదిగో వస్తున్నా"
“ఎందుకే అలా ఉన్నావు. నాన్నగారు కోపగించుకుంటున్నారు. ఏమైందే నీకు! వాళ్ళింటి ఆడవాళ్ళను పలకరించి, వాళ్ళకేం కావాలో కనుక్కొని, అవి అందేటట్లు చూడు."
గౌతం వచ్చాడు.
"అమ్మా టిఫిన్ రెడీ".....
“వస్తున్నానురా...వాళ్ళందరినీ డైనింగ్ హాలుకు తీసుకు వెళ్ళు"
"అమ్మా ఇదిగే ముప్పై మూరల మల్లె పూవులు"
“ప్రియా! ఆ పూవులను తీసుకువెళ్ళి పెళ్ళికొడుకు తల్లికి ఇవ్వు. వాళ్ళందరూ పెట్టుకుంటారు"
ప్రియంవద ఆ పూవులను తీసుకుని, పెళ్ళికొడుకు తరపు వాళ్ళున్న రూముల వైపు వెళ్ళింది.
వియ్యాలవారికి వసతులు ఎలా ఉన్నాయో తెలుసుకుంటున్నాడు తండ్రి.
తండ్రి దగ్గరకు వెళ్ళింది ప్రియంవద.
"డాడీ అత్తయ్యా వాళ్ళ గది ఎక్కడుంది?"
తండ్రిని అడిగింది ప్రియంవద.
"అదిగో అక్కడ నాలుగు నెంబర్ వేసుందే...అదే వాళ్ళ గది"
నాలుగో నెంబర్ ఉన్న గది దగ్గరకు వెళ్ళింది. గది తలుపు తట్టింది.....
"కమిన్" అన్న పిలుపు విని లోపలకు వెళ్ళింది. అక్కడ చక్రవర్తి మరియు అతని తల్లి అనుసూయ ఉన్నారు.
"అత్తయ్యా! పూవులు" అంటూ పూవులను ఆమె చేతిలో ఉంచి వెనక్కి తిరిగింది.
"ప్రియా ఆగు! నిన్ను చూడటమే కష్టంగా ఉంది. ఇలా రా"
"కుర్చో. నేను అడ్వర్ టైజ్ మెంట్ విభాగం. నువ్వు మీడియా. ఇద్దరికీ దగ్గర దగ్గర ఒకే లాంటి పనే కదా."
"అవును!"
"నువ్వేమిటి ఇలా ఉన్నావు... మీడియాలో ఉండే అమ్మాయులు ఎక్కువగా మాట్లాడాలికదా?"
"ఉరుకోరా. వాళ్ళ అక్కయ్య పెళ్ళి పనులతో తను బిజీగా ఉంది. ఇప్పుడు మాట్లాడటానికి టైమెక్కడింది."
"రండి సార్" తండ్రి సాంబశివరావ్ ఎవరినో తీసుకుని లోపలకు వచ్చాడు.
పోలీసు ఉన్నత అధికారులు.
వారిని చూసి చక్రవర్తి గబుక్కున కూర్చున్నాడు.
అది గమనించింది ప్రియంవద.
తల్లి ముఖంలో అదుర్ధా.
"కూర్చోండి"
"మేము మిమ్మల్ని డిస్టర్బ్ చేయటానికి రాలేదు. మీరు బిల్డింగ్ ఓనర్. హత్య జరిగింది మీ బిల్దింగులో. మేము తెలుసుకున్న సమాచారం మీకు తెలియపరచాల్సిన డ్యూటి మాకుంది."
ప్రియంవద అక్కడ్నుంచి జరగలేదు.
"చెప్పండి"
"హత్య చేయబడ్డ అమ్మాయి పేరు కాంచన. వస్త్ర దుకాణంలో పని చేస్తున్న పిల్ల. అశోక్ నగర్ లో ఒకింట్లో ఉంటోంది. తల్లి-తమ్ముడు ఊర్లో ఉన్నారు. చనిపోయిన అమ్మాయి మూడు నెలల గర్భవతి. ఎవరతను అనేది విచారణలో ఉంది. ఆమె గర్భవతి అని తెలిసిన తరువాత ఆమెను హత్య చేశాడు. చాలా చాకచక్యంగా ఒక్క క్లూ కూడా ఇవ్వకుండా హత్యచేశాడు. మరో స్పెషల్ టీమ్ అతనికోసం తీవ్రంగా వెతుకుతోంది. త్వరలోనే పట్టుకుంటాం"
ప్రియంవద మళ్ళీ చక్రవర్తి ముఖం వైపు లోతుగా చూసింది.
ఆ ముఖంలో ఎటువంటి మార్పు కనిపించలేదు.
“చాలావరకు ధనవంతుల పిల్లలే అయ్యుంటారు సార్. పిల్ల అందంగా ఉంది. షాపుకు వెళ్ళినప్పుడు కవర్ చేశుంటాడు...దాన్ని ప్రేమ అనుకోనుంటుంది"
చక్రవర్తి లేచి నిలబడ్డాడు.
"సార్! వీళ్ళందరూ ప్రేమను నమ్మరు"
"డబ్బు కోసం ధనవంతులను వశం చేశుకోవాలని చూస్తారు. గర్భాన్ని కారణం చూపి డబ్బు గుంచుటానికి ప్రయత్నిస్తారు."
"కరెక్ట్ చక్రవర్తి గారు....అలాగే ఇతన్ని కూడా బ్లాక్ మైల్ చేసుంటుంది. అతను చంపేశాడు అనుకుంటున్నాం"
"దానికి మా బిల్డింగే దొరికిందా?"
చక్రవర్తి అడిగాడు.
"ఇది ఎదో కొద్ది క్షణాలలో, ఎమోషనల్ ఔట్ బ్రేక్ వలన జరిగిన హత్య కాదు. అందంగా ప్లాన్ వేసి చేసిన హత్య ఇది. డబ్బుగల అబ్బాయి. చదువుకున్న అబ్బాయి. బుద్ది పనిచేసుంటుంది.ఏలా హత్య చేయాలనేది క్లీన్ గా తీర్మానించుకుని హత్య చేశుంటాడు. కానీ వాడికి తెలియకుండానే వాడు ఏదో ఒక క్లూ వదిలేసి ఉంటాడు. మీ బిల్దింగును ఎంచుకున్నందుకు ఏదో ఒక బలమైన కారణం ఉంటుంది."
"అలాగా చెబుతున్నారు?"
"ఖచ్చితంగా! మీకు తెలిసిన వాడై ఉంటాడు"
“ఏమిటి సార్...కేసు మా వైపు తిప్పుతున్నారు"
"లేదు సార్! మీరు అర్ధంచేసుకోండి. వ్యాపారపరంగా మీకు గానీ, మీ అబ్బాయికి గానీ చాలా మంది శత్రువులు ఉంటారు. అందులో ఒకరు ఈ తప్పు చేయటానికి ప్లాన్ వేసి, మీ బిల్డింగును ఎన్నుకోనుండచ్చు కదా? ఇప్పుడు అనవసరంగా మీ పేరు దెబ్బతిని, మీకు మనశ్శాంతి లేకుండా చేయలేదా?"
"అది నిజమే!..పెళ్ళి పనులలొ తీవ్రంగా ఉంటున్నా, ఆలొచనలు మాత్రం ఆ హత్య గురించే వస్తున్నాయి. మనసు ప్రశాంతత కోల్పోయి గజిబిజిగా ఉంటోంది."
"అలాంటి శత్రువులు ఎవరైనా ఉన్నారా? దాంట్లో ప్లే బాయ్ లాగా ఎవరైనా ఉన్నారా? ఈ మధ్య మీరు ఏవరితోనైనా గొడవపడ్డారా? అర్జెంటు లేదు....వీటన్నిటి గురించి కూడా మీరు బాగా ఆలొచించి మాకు ఒక రిపోర్ట్ రాసిస్తే, హంతకుడిని పట్టుకోవటానికి మాకు హెల్ప్ గా ఉంటుంది".
"ఓ.కే.! కానీ, ఈ నాలుగు రోజులు మాత్రం మమ్మల్ని వదిలిపెట్టండి సార్"
"తప్పకుండా"
“ఎందుకంటే, కొన్ని లక్షలు ఖర్చు పెట్టి రామకృష్ణ గారు తన కూతురి పెళ్ళి జరుపుతున్నారు. దానికి ఎటువంటీ ఆటంకమూ రాకూడదు. అదొక్కటే కాదు....నాకూ ఇది పరువుప్రతిష్ట సమస్య. చాలా మంది పెద్ద మనుషులు ఈ రోజు విందుకు రాబోతున్నారు...అర్ధం చేసుకోండి"
"నాకు అర్ధమయింది"
“మేము ఖచ్చితంగా మీతో సహకరిస్తాం. నాలుగు రోజులైన తరువాత మాట్లాడదాం. భోజనం చేసి వెళ్ళండి...ప్రియా వీళ్ళను డైనింగ్ హాలుకు తీసుకెల్లమ్మా!"
"వుండనివ్వండి సార్! మేము డ్యూటిలో ఉన్నాం..."
వాళ్ళందరూ బయలుదేరి వెళ్లారు.
ప్రియ అక్కడ్నుంచి తప్పుకుంది.
ధనవంతుడు, ప్లే బాయ్, చదువుకున్నవాడు, తెలివిగలవాడు! అన్నీ చక్రవర్తికి సరిపోతున్నాయా?
ఆ బిల్దింగులో హత్య జరగటానికి కారణం ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.
సొంత బిల్డింగులో ఇలాంటి ఒక నేరాన్నీ చేయటానికి ఒకడు ముందుకు వస్తాడా?
ఒకవేల ఇలా ఉంటుందా?
తన సొంత బిల్డింగులో హత్య చేస్తే, ఎవరికీ తనమీద అనుమానం రాదని లెక్కేసుంటాడా? వేరే చోట హత్య చేస్తే తనని ఎవరైనా చూసే అవకాశం ఎక్కువ...తన బిల్దింగ్ అయితే తనకు సేఫ్ అనుకునుంటాడా?
ఖైదు చేయబడ్డ సెక్యూరిటీ గార్డును డబ్బుతో కొనేసుండటం వలన, యజమానికి వ్యతిరేకంగా మట్లాడలేకపోతున్నాడా? లేక సెక్యూరిటీని తప్పించి ఈ హత్య చేశుంటాడా?
ప్రియంవదకు అనుమానం బలపడ్డది.
కారణం....బలమైన సాక్ష్యం తన దగ్గరుంది.
చక్రవర్తో, లేక అతనిలాంటి ఇంకొకడో....మొత్తానికి ఆ హంతకుడు తన కెమేరాలో!
రేపు తెల్లారితే నా అక్కయ్యకు భర్త అవుతాడు.
భగవంతుడా! నేను ఏం చేయబోతాను? ….ఏదో తెలియని అనుభూతి శరీరమంతా పాకుతోంది.
గౌతం వేగంగా వచ్చాడు.
"అక్కయ్య నిన్ను పిలుస్తోంది" ప్రియంవదతో చెప్పాడు.
"ఇదిగో వస్తున్నానురా"
*********************
పోలీస్ స్టేషన్ కు ఫోన్ వచ్చింది...ఇన్స్ పెక్టర్ ఫోన్ ఎత్తాడు...వస్త్ర దుఖాణం నుండి కమల మాట్లాడింది.
"సార్! కాంచన వాళ్ళ అమ్మ, తమ్ముడూ ఇద్దరూ వచ్చారండి"
"వెంటనే జీప్ వస్తుంది. దాంట్లో వాళ్ళని ఎక్కించి పంపించండి!"
పదిహేను నిమిషాలలో కాంచన తల్లి గుండెలు బాధుకుంటూ పోలీస్ స్టేషన్ కు వచ్చింది. ఆమెతో కాంచన తమ్ముడూ వచ్చాడు.
“అయ్యో, అయ్యో....మా కాంచనకా ఈ గతి? ఎవరితోనూ ఎటువంటి గొడవలకూ వెళ్ళదే? మంచి అమ్మాయే? ఏ పాపాత్మడు దాన్ని హత్య చేశాడు? వాడు బాగుంటాడా? వాడి కుటుంబం బాగుపడుతుందా?”
ఏడుపు, గుండెలు బాధుకోవటం ఆపింది.
"మేము దాన్ని చివరిసారిగా చూడగలమా?"
"పోస్ట్ మార్టం అయిపోయింది! ఇంకా కొన్ని పరిశోధనలు ఉన్నాయి...రేపు మీకు అప్పగిస్తారు"
ఇద్దరూ మళ్ళీ ఏడవటం మొదలుపట్టారు.
"ఎందుకు రాజమండ్రిలో కాకుండా కాంచనని ఉద్యోగానికి ఇక్కడికి పంపారు?”
“అది ఇంటర్ వరకే చదువుకుంది. వాళ్ళ నాన్నగారు కూడా చనిపోయారు. వీడు కార్ల మెకానిక్ షెడ్డులో పనికి వెల్తున్నాడు. నేను బజ్జీల కొట్టు నడుపుతున్నాను. సంపాదన సరిపోవటం లేదు.
కాంచనకి మా ఊళ్ళో మంచి ఉద్యోగం దొరకలేదు. కాంచనతో కలిసి చదువుకున్న ఒకమ్మాయి ఇక్కడ వస్త్ర దుఖాణంలో పనిచేస్తోంది. ఆ ఆమ్మాయి కాంచనని రమ్మంది. వెంటనే కాంచన ఇక్కడికి వచ్చేసింది. వస్త్ర దుఖాణం వాళ్ళే భోజనం, దుస్తులు ఇస్తారు. ఇంటి అద్దె మాత్రమే. ఆ ఆద్దె కూడా నలుగురు అమ్మాయిలు కలిసి కట్టుకుంటారు....అందువలన కాంచన మాకు డబ్బును ఒక లెక్కగా పంపిస్తుంది"
"ఎవరినైనా ప్రేముస్తున్నదని మీకు సమాచారం వచ్చిందా?"
“లేదండీ...అది అలాంటి తప్పుడు పనుల జోలికి వెళ్లదండి"
"అలంకారం చేసుకోవటానికి ఎక్కువ ఆశ చూపుతుందా?"
"లేదండి"
"మరి...కాంచన ఉన్న గదిలో బోలెడు ఖరీదైన దుస్తులు, అందాన్ని మెరిగుపరిచే వస్తువులు దొరికినై. అయితే ఇవన్నీ ఎవరో ఒక డబ్బుగల కుర్రాడు కాంచనకు కొని పెట్టాడు. బదులుగా అతనికి తననే అర్పించుకుంది నీ కూతురు....కాంచన గర్భంతో ఉన్నది మీకు తెలుసా?"
"నా కూతురు తప్పు చెయ్యదయ్యా...."
"చేసిందే....లేకుంటే గర్భం ఎలా వస్తుంది"
"భగవంతుడా...ఇవన్నీ విని నేను ఇంకా ప్రాణాలతో ఉండాలా?"
"ఇలాంటి పరువుతక్కువ పనులు చేసిన తరువాత అది చావటమే మంచిది" తన భాధనంతా కక్కాడు తమ్ముడు.
"ఏమిట్రా అలా మాట్లాడుతున్నావ్?"
"ఇక నేను, నువ్వు ఊరికి తిరిగి వెళ్ళగలమా? వెడితే అందరూ మన ముఖాన ఉమ్మేయరా?"
"చూడమ్మా...మీ ఇద్దరికీ ఏదైన తెలిసుంటే దాచ కుండా చెప్పండి! హంతకుడిని పట్టుకోవద్దా?"
"పట్టుకుంటే...నా కూతురు తిరిగి వస్తుందా?"
"సరే! మీరు వెళ్ళండి. మేము ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలి...అర్ధమయ్యిందా"
"మేము ఎక్కడుండాలి?"
"మీ కూతురు ఉన్న ఇంట్లోనే ఉండండి. మేము చెప్పి ఏర్పాటు చేస్తాము"
ఇద్దరూ తిరిగి వెళ్ళేరు.
Continued...PART-6
*************************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి