25, జనవరి 2022, మంగళవారం

దృశ్యం...(సీరియల్)...PART-4

 

                                                                                   దృశ్యం...(సీరియల్)                                                                                                                                                                            PART-4

బిల్డింగ్ చూట్టూ పోలీసుల బలగం మోహరించబడింది. బలమైన సెక్యూరిటీ వలయం వేయబడింది.

పోలీసులు బిల్దింగ్ సెక్యూరిటి గార్డ్ ను లాకప్ లో ఉంచి కఠినంగా విచారణ చేస్తున్నారు.

ప్రొద్దున ఆరు గంటల నుండి అక్కడ పనివాళ్లను, మేస్త్రీలను, ఇంజనీయర్ ను క్షుణ్ణంగా విచారించి పంపుతున్నారు.

 బిల్డింగ్ నుండి అర కిలోమీటర్ దూరంలో ఒక టీ కొట్టు. టీ కొట్టు యజమానిని పిలుచుకువచ్చి విచారణ జరిపారు.

కస్టడీలో ఉన్న సెక్యూరిటీ గార్డును తీసుకు వచ్చారు.

పోలీసులు అతనిపై లాఠీలతో నాలుగు తగిలించారు.

"ఖచ్చితంగా నీకు తెలిసుంటుంది. నీకు డబ్బులిచ్చేసి అమ్మాయిని పైకి తీసుకు వెళ్లిన వాళ్ళు ఎవరు?...చెప్పు...చెప్పు"

అతను గొల్లుమన్నాడు.

"నిజంగా నాకు తెలియదు. నేను ఎవరినీ చూడలేదు. నేను పిల్లలుగలవాడిని. దయచేసి నన్ను వదిలిపెట్టండి"

కఠినమైన విచారణ ఒక పక్క జరుగుతోంది.

బిల్దింగులో క్లూ ఏదైనా దొరకదా?.........జల్లడ పెట్టి వెతుకుతున్నారు పోలీసులు.

హత్య చేయబడ్డ మహిళ దగ్గరున్న వాచ్, హాండ్ బ్యాగ్, సెల్ ఫోన్, కర్చీఫ్, హ్యర్ పిన్స్, గాజులు ఇలాంటి వాటిలో ఒక్క దాన్ని కూడా హంతకుడు వదిలిపెట్టలేదు. బట్టలు, చెప్పులు తప్ప ఆమె శరీరంపై ఇంకేవీ లేవు. చాలా నాజూకుగా ఉన్నది. తలతల మెరిసే రంగు, అందమైన ముఖం.

అందంకోసమో, ఆమె యుక్త వయసు కోసమో చేయబడ్డ హత్య ఇది అని పోలీసులు నమ్ముతున్నారు.

 పోలీసులు వెతికినంతవరకు అక్కడ వాళ్ళకు ఎటువంటి క్లూ దొరకలేదు. ఫోరన్సిక్ మనుష్యులు మాత్రం ఇంకా పనిచేస్తూనే ఉన్నారు.

తెల్లవారింది.

రోజు ప్రొద్దున వెలువడిన అన్ని వార్తా పత్రికలలోనూ ఒకటే హెడ్ లైన్స్.

రామకృష్ణ గారు నిద్ర లేచారు.

హాలులోకి వచ్చారు.

అక్కడుంచబడ్డ న్యూస్ పేపర్లన్నింటిలోనూ మొదటి పేజి హెడ్ లైన్స్ చూశాడు.

"అన్నీ న్యూస్ పేపర్లలోనూ, టీవీ లలోనూ బిల్డింగ్ లో జరిగిన హత్య గురించిన చర్చే జరుగుతోంది. పోలీసులు అనుమానిస్తున్నారో లేదో తెలియదు కానీ, టీవీ చానల్స్ మాత్రం హత్యకు కారణం వాళ్ళేనని బల్ల గుద్ది చెబుతున్నారు"

"రోజుకు వంద హత్యలు జరుగుతున్నాయి డాడీ. బిల్డింగులో జరిగిన హత్య గురించి మాత్రం ఎందుకు అంత ముఖ్యత్వం" అడిగాడు కొడుకు గౌతం.

"అలా కాదురా. ఇది ఒక పెద్ద వ్యాపార వేత్త బిల్డింగులో జరిగింది. ఎక్కడ ప్రముఖులు ఉంటారో అక్కడ ఎక్కువ శ్రద్ధ,చూపు ఉంటుంది. సరే! మన పనులు మొదలుపెడదాం" చెప్పాడు రామకృష్ణ.

బంధువులు చాలా వరకు వచ్చాశారు.

ప్రశ్నల వర్షం కురిపించారు.

వాటికి సమాధానం చెప్పలేక రాజేశ్వరి ఉక్కిరిబిక్కిరి అవుతోంది.

 రామకృష్ణ గారు కేకలేశారు.

"పెళ్ళి మండపానికి వెడుతున్నాము. అవసరం లేకుండా ఒక మరణం గురించి ఎవరూ ఇక్కడ మాట్లాడొద్దు. రాజీ....నువు ఎవరికీ సమాధనం చెప్పక్కర్లేదు. నీ పనేమిటే అది చూసుకో"

రెండు పెద్ద వ్యానులు వచ్చి నిలబడాయి.

సామాన్లన్నీ ఎక్కించారు.

గౌతం, నువ్వూ నీ ఫ్రెండ్ భాస్కరూ బయలుదేరండి. మండపంలో సామన్లను దింపుకోవటానికి మన పనివాళ్ళు ఉన్నారు...తరువాత, ఆడవాళ్ళందరూ రెండో వ్యానులో ఎక్కండి. మిగిలిన వాళ్ళు కార్లలో ఎక్కండి"

గబగబా ఆర్డర్ వేశాడు.

"ప్రియా ఎక్కడా?"

"లోపల ఉంది".

నువ్వు దీపికతో ఉండు రాజేశ్వరీ. దేముడికి దీపారాధన చేసి, అమ్మాయికి బొట్టు పెట్టి...మంచి టైము చూసుకుని బండిలో ఎక్కించాలి"

లోపలున్న ప్రియంవదకు గందరగోళంగా ఉన్నది.

పెళ్ళి ముగిసిన తరువాత కెమేరాను బయటకు తీద్దామా?"

"దేముడా...చక్రవర్తి హంతకుడైతే, పెళ్ళిని జరగనివ్వచ్చా?"

తెలిసుండే అక్క జీవితాన్ని పాడుచేయచ్చా?

ఆలొచనలు ప్రియ బుర్రను పొడుస్తున్నాయి.

"ప్రియా వస్తావా?" బయట నుండి అమ్మ గొంతు.

"సరే! సాక్ష్యాన్ని ఇంట్లోనే దాచి వెడదాం. అవసరమైతే బయటకు తీద్దాం"

బీరువాలో పెట్టి తాళం వేసి ప్రియంవద బయటకు వచ్చింది.

"ప్రియా, నువ్వెందుకు అంత డల్ గా ఉన్నావు?"...అరిచాడు తండ్రి.

"డాడీ! దాన్ని ఏమీ అనకండి! అది నిన్నటి నుండి అలాగే ఉన్నది. నా పెళ్ళి తరువాత అది ఒంటరిగా ఉండాలికదా...అది దాని బెంగ. పాపం ప్రియ"

దీపిక వచ్చి ప్రియతొ చేతులు కలిపింది.

సరే, బయలుదేరాల్సిన సమయం వచ్చింది. మంచి టైములో మండపంలో అడుగు పెట్టాలి. ఆలశ్యం అవ కూడదు. దేముడికి దన్నం పెట్టుకుని నువ్వు బయలుదేరు దీపిక

పూజ గదిలోకి దీపిక రావటం, తల్లి రాజేశ్వరి కుంకుమ భరిణ తీసుకువచ్చి దీపిక నుదురు మీద బొట్టుపెట్టటానికి ప్రయత్నించడం...కుంకుమ భరిణ చేతిలో నుండి జారిపోయింది.

"ఏమిటి రాజీ ఇది?" భర్త అడిగాడు.

"చై జారిపోయింది"

"డాడీ, కుంకుమ ఒలికిపోతే శుభం అని బామ్మ చెప్పేది. మంచి శకునమే

"సరే! కుంకుమ మీద కాలు పడకుండా తప్పుకోండి. త్వరగా దేముడికి దన్నం పెట్టుకుని బయలుదేరండి. టైమవుతోంది"

దేముడికి దన్నం పెట్టుకుని వాకిట్లోకి వచ్చారు.

"అన్నీ కరెక్టుగా పెట్టేరా?...ప్రియా తలుపు తాళం వేసి రా "

తాళం వేయటానికి తాళంచెవి పెడుతుంటే అది జారి పడిపోయింది.

"ఏమిటి ప్రియా నువ్వుకూడా ఇలా...జాగ్రత్తగా వేయకూడదూ...నాన్న చూసుంటే!...సరే త్వరగా తాళంవేసి రా"

అందరూ కారులో ఎక్కారు. కారు బయలుదేరింది. మండపంలో ఉన్నవారికి సమాచారం ఇచ్చాడు రామకృష్ణ.

అన్నీ రెడీగా ఉంచుకోండి! మేము వచ్చిన వెంటనే, దీపికకు పులమాల వేసి, హారతి తీసి స్వాగతం పలకాలి. భజంత్రీ వాళ్ళకు చెప్పండి..."

కారు వేగంగా పోతూంటే...రామకృష్ణ ఫోనులో ఎవరికో ఆదేశాలు జారీ చేస్తున్నాడు.

ప్రియంవద ఆలొచిస్తూ కూర్చుంది.

"ఏమిటే దేనిగురించో ఆలొచిస్తున్నట్లున్నావు?" అడిగింది దీపిక.

"ఏమీ లేదు" చెప్పింది ప్రియంవద.

"మనం ఇంకా చెప్పకుండా ఉండొచ్చా?"…..మనసులో చక్రవర్తి చేసిన హత్యా దృశ్యం ప్రియంవదను హెచ్చరిస్తూ ఆలొచింప చేస్తోంది.

                                                                      *********************************

పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చేసింది...పోలీసు ఉన్నత అధికారుల ముందు ఉన్నది.

యువతి మూడు నెలల గర్భవతి. గొంతు పిసికి హత్య చేయబడింది. హత్య జరిగిన సమయం కూడా క్షుణ్ణంగా తెలుపబడింది.

పట్టపగలు జరిగిన హత్య!

అధికారులు చర్చించుకోవటం మొదలుపెట్టారు.

"గర్భవతి కాబట్టి, దానికి కారణమైన వాడే, ఆమెను హత్య చేసుంటాడు" అనే పాయింటు మీదే చర్చ కొనసాగుతోంది.

డి.ఎన్. టెస్ట్ చేస్తే, దానికి కారణమైన వాడ్ని కనిపెట్టవచ్చు. యువతి యొక్క ఫోటోలో ఆమె ముఖం చాలా క్లియర్ గా కనిపిస్తోంది. వార్తా పత్రికలలోనూ, టీవీలలోనూ ఇదివరకే యువతి ఫోటో ప్రచురింపబడింది.

ఇప్పుడు హత్య గురించిన మరికొన్ని వివరాలకోసం మీడియా ఎదురుచూస్తోంది.

మధ్యలో పోలీసులకు ఒక అజ్ఞాత వ్యక్తి నుండి ఫోన్ వచ్చింది.

"సార్... యువతి వస్త్ర దుకాణంలో పనిచేస్తున్న యువతి. పేరు కాంచన" అంటూ వ్యక్తి దుకాణం పేరుకూడా చెప్పాడు.

"మీరెవరు?"

"నా పేరు చెప్పి నేను కష్టాల్లో పడటానికి రెడిగా లేను" అని చెప్పి ఫోన్ కట్ చేశాడు.

వెంటనే పోలీసులు బయలుదేరారు.

అరగంటలొ పేరుపొందిన వస్త్ర దుకాణంలోకి పోలీసులు జొరబడ్డారు. తిన్నగా దుకాణం యజమాని దగ్గరకు వచ్చారు.

అప్పటికే వస్త్ర దుకాణంలో గందరగోళంగా ఉంది. పోలీసులను చూసిన వెంటనే గందరగోళం ఎక్కువైంది. సమయంలోనైనా పోలీసులు రావచ్చు అనే ఎదురుచూపుతో వాళ్ళు ఉన్నారని తెలుస్తోంది.

"యజమాని ఎవరు?"

యజమాని దగ్గరకు తీసుకువెళ్ళారు.

"హత్య చేయబడ్డ కాంచన మీ షాపులో పనిచేస్తున్న అమ్మాయేనని మాకు అధారాలతో సమాచారం వచ్చింది. ఆమె గర్భంతో ఉన్నది. గొంతుపిసికి చంపబడింది. మీరు మాతో సహకరించాలి"

"మా షాపులో చాలామంది మహిళలు పనిచేస్తున్నారు. అందువలన ప్రత్యేకంగా యువతి గురించిన వివరాలు ఇవ్వలేను. అమెతో పనిచేస్తున్న సహ ఉద్యోగులను పిలుస్తాను"

అక్కడున్న మేనేజర్, సూపర్ వైజర్, సహ ఉద్యోగులను పిలిచారు.

వాళ్ళందరిలో భయం కనబడ్డది.

వాళ్ళలోకమలఅనే పేరుగల అమ్మాయి హత్య చేయబడ్డ కాంచన కు బాగా క్లోజ్ అని తెలిపారు.

అమ్మాయిని పిలిచారు.

"ఏదీ దాచకుండా చెప్పమ్మా...లేకపోతే నిన్ను పిలుచుకువెళ్ళి విచారణ చేయవలసి వస్తుంది"

అమ్మాయి ఏడవటం మొదలుపెట్టింది.

"భయపడకుండా చెప్పు. మేము నిన్ను ఏమీచేయం"

"మేము నలుగురు అమ్మాయిలం కలిసి ఒక ఇళ్ళు అద్దెకు తీసుకుని ఉంటున్నాం సార్. అందులో కాంచన ఒకత్తి. దగర దగ్గర మూడు సంవత్సరాలుగా ఒకటిగా ఉంటున్నాం. మా ఫ్యామిలీ ఊర్లో ఉన్నది"

"కాంచన ఫ్యామిలీ ఎక్కడ ఉంటోంది?"

దానికి తండ్రి లేడు. తల్లి, తమ్ముడు మాత్రం ఉన్నారు. తమ్ముడికి చదువు అబ్బ లేదు. వాళ్ళ ఊర్లోనే ఒక కారు మెకానిక్ షెడ్ లో పనిచేస్తున్నాడు"

" ఊరు?"

"రాజమండ్రి. తల్లి కూడా అక్కడే ఉంది. ఇది మితంగా ఖర్చు పెట్టుకుని తల్లికి డబ్బు పంపేది."

"కాంచనకి ఎంత వయసు?"

"ఇరవైమూడు సార్. చదువు ఇంటర్ సార్"

"ఉద్యోగం సమయం ఎంత?"

"ప్రొద్దున తొమ్మిదింటికి షాపు తెరుస్తే, రాత్రి పదింటివరకు ఉంటుంది. ఇంటికి జేరుకునేటప్పటికి పదిన్నర అయిపోతుంది. వారంలో ఏదో ఒకరోజు సెలవు!"

" అమ్మాయి బయటకు వెళ్ళేదా? అమ్మాయిని చూడటానికి ఎవరైనా వచ్చేవారా? అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా?"

"నాకు తెలిసి అలాంటిదేమీ లేదు సార్.”

"అబద్దం చెప్పకు!"

"నిజంగా లేరు సార్. లీవ్ రోజుల్లో మేము బయటకు వెల్తాం...సినిమాకు వెల్తాం"

"ఎప్పుడూ కలిసే వెల్తారా?"

"అందరికీ ఒకేరోజు లీవు దొరకదు సార్. ఆమ్మాయికి లీవు దొరికినప్పుడు నాకు పని ఉండోచ్చు. అందువలన అమ్మాయి ఎక్కడికి వెడుతున్నదీ తెలియదు సార్?"

"సరే...ఒకే ఇంట్లో ఉన్నారు కదా"

"అవును"

పోలీసులు వెంటనే అడ్రెస్సు తీసుకున్నారు. తోడుగా ఒకమ్మాయిని తీసుకుని ఇంటికి బయలుదేరారు.

పదే నిమిషాలలో ఇంటికి జేరుకున్నారు.

ఇల్లున్న లొకాలిటీలో గందరగోళం మొదలయ్యింది.

ఒక మీడియా రిపోర్టర్ వదలకుండా పోలీసుల వెనుకే వెడుతూ, వార్తలను సేకరిస్తున్నాడు.

అమ్మాయి ఉండే గదిని పూర్తిగా చెక్ చేశారు.

ఆమె వేసుకునే బట్టలు, ఆమె సేవింగ్స్ బ్యాంకు పుస్తకం, ఆమె ఉపయోగించే బ్యూటీ ప్రాడక్ట్స్... ఒక్కటి కూడా పోలీసుల పరిశోధన నుండి తప్పించుకోలేదు.

"ఆమె సెల్ ఫోన్ ఉపయోగిస్తుందా?"

"ఉపయోగిస్తుందండి. ప్రొద్దున్నే షాపులో 'సరండర్చేశేయాలి. ఇంటికి వెళ్ళేటప్పుడు ఇస్తారు."

"ఆమె సెల్ ఫోన్ నెంబర్ చెప్పండి"

నెంబర్ చెప్పింది. పోలీసులు నెంబర్ కు ఫోన్ చేశారు.

ఆమె ఫోన్ కట్ అవుతోంది.

ఆమె గురించిన వివరాలలో చాలా వరకు అక్కడే సేకరించారు.

ఆమె ఉంటున్న ఇంటి చుట్టూ ఉన్న వారందరినీ కూడా విచారించారు.

ఆమెకు లీవు ఇచ్చిన రోజున ఆమె ప్రొద్దున్నే బయటకు వెడితే సాయంత్రం ఇంటికి తిరిగివస్తుందట. విషయాన్ని పోలీసులు తమ విచారణలో తేల్చుకున్నారు. దీన్ని ముఖ్య విషయంగా నోట్ చేసుకున్నారు. అలా ఆమె బయటకు వెళ్ళేటప్పుడు ఎవర్నీ తోడు తీసుకువెళ్ళదని కూడ తేల్చుకున్నారు. ఇలా ఆమె ఒక్కత్తే వెళ్లటం గత ఏడెనిమిది నెలలుగా జరుగుతోందట. మధ్య లీవు లేని రోజులలో కూడా ప్రొద్దున్నే ఆరుగంటలకే బయటకు వెళ్ళి షాపు తెరిచే సమయానికి వచ్చేదట.  

అలా ఒక్కత్తే బయటకు వెళ్ళిన రోజుల్లో ఆమె ఎవరినో కలుసుకుని అది ప్రేమగా ఎదిగి ఉండొచ్చు.

అలా ప్రేమ పెరిగి ఆమె గర్భం దాల్చే వరకు దారి తీసుండొచ్చు. గర్భం దాల్చిందని తెలుసుకున్న తరువాత దానికి కారణమైన వాడు భయపడి, ఆమెను వదుల్చుకోవటానికి ఆమెను హత్య చేసుండచ్చు.

"ఎవరతను?"

ఎంతో తెలివిగా ఆమెను రమ్మని చెప్పి, తీసుకువెళ్ళి హత్య చేశాడు.

ఎటువంటి క్లూ దొరకనటువంటి హత్య.

అతను సాధారణ మనిషి కాదు... తెలివిగలవాడు.

"ఎవరతను?"

                                                                                                               Continued...PART-5

*************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి