12, జనవరి 2022, బుధవారం

పవిత్ర...(సీరియల్)...PART-13

 

                                                                                    'పవిత్ర'...(సీరియల్)                                                                                                                                                                           PART-13

ముహూర్త బజంత్రీలు...ముహూర్త బజంత్రీలూ -- పెద్దవారి గొంతుకులు విన్న సన్నాయి మేళం కళాకారులు పెద్ద, స్పీడు ధ్వనితో మేళాలు కొట్టగా... స్వాతి మెడలో తాళి కట్టాడు మనోహర్. పవిత్ర కళ్ళు కాంతులు వెదజల్ల, ఆమె అక్షింతలు వేసింది.

కన్నవారి కాళ్ళమీద పడి నమస్కరిస్తున్న వధూవరులు, తన కాళ్ళ మీద కూడా పడటంతో...బిత్తరపోయింది.

రేయ్...ఏమిట్రా ఇది...నా కాళ్ళ మీద పడి

నువ్వు కూడా నాకు ఒక అమ్మవే అక్కా. ఆశీర్వదించు

అవును వదినా...మీ వలనే మా పెళ్ళి జరిగింది. ఆశీర్వాదం చెయ్యండి -- స్వాతి కూడా చెప్పగా, ఆమె కళ్ళల్లో నీరు పొంగింది.

ఇద్దరూ ఎప్పుడూ అన్యోన్యంగా - సంతోషంగా - గొప్పగా జీవించాలి రెండు చేతులు పైకెత్తి దీవించింది.

ఇంతలో బంధువుల గుంపు బహుమతుల వస్తువలతో వేదిక ఎక్కడం మొదలు పెట్టింది. పవిత్ర మెల్లగా దిగి వేదిక దగ్గర నిలబడింది.

సిగ్గూ, సంతోషంతోనూ నిలబడ్డ భార్యను ఆనుకుని ఫోటోకు నవ్వుతూ నిలబడ్డ తమ్ముడ్ని చూసింది. బహుమతులు ఇచ్చి తిరిగి వస్తున్న వారిని భోజనాలకు తీసుకు వెడుతున్న అమ్మనూ బొంగరంలాగా చుడుతూ ఉన్న నాన్నను అంటూ, అందరినీ నిలబడ్డ చోటు నుండే కావలసినంతగా చూసుకుంది.

ఇక వీళ్ళను ఎప్పుడు చూడబోతానో? రోజు ఉన్న ఇదే ఆనందం చివరి వరకు వాళ్ళళ్ళో నిలిచే ఉండాలి దేవుడా...మనసారా వెడుకుంటున్నప్పుడు రామ్మోహన్ గొంతు వినబడింది.

ఏమిటి పవిత్రా...ఇక్కడే నిలబడ్డావు?”

ఏమిటి విషయం?”

నాతోరా...కొత్త దంపతులతో మనమూ ఒక ఫోటో తీసుకుందాం -- న్యాచురల్ గా అతను పిలవగా, ఆవేశపడకుండా చెప్పింది.

పారిపోయిన భార్యను తీసుకువచ్చి ఫోటో తీసుకోండి

పవిత్రా...

నోరు ముయ్యండి. నా పేరు కూడా ఉచ్చరించే హక్కు మీకు లేదు -- కఠినంగా చెప్పేసి అక్కడ్నుంచి బయలుదేరింది.

పెళ్ళికి వచ్చిన గుంపు భోజనాల బంతికీ, వేదికకూ వెళ్తుండగా... పవిత్ర వెళ్లటం ఎవరి కళ్ళకూ తెలియదు.

మెల్లగా నడుచుకుంటూ మండపం బయటకు వచ్చి, నెమ్మదిగా ఇంటివైపుకు నడిచింది.

తొందరలేని నిదానమైన నడక, ఊరు వదిలి వెళ్ళటానికి ఇంకా పూర్తిగా రెండు గంటలు ఉంది. ఒంటి గంటకు ఆఫీసు గేటు దగ్గరకు వచ్చి నిలబడమని చెప్పారు అర్జున్ రావ్ గారు.

వెళ్ళటానికి కావలసిన అన్ని పనులనూ చేసేసింది. కావలసిన బట్టలు మాత్రం తీసి పెట్టుకుంది. తన పేరు మీద బ్యాంకులో ఉన్న మొత్త డబ్బునూ అంతకు ముందే తండ్రి ఖాతాలోకి మార్చింది.

ఇక...నేను వెళ్ళేది మాత్రం చెబితే చాలు. మొదట్లో కొన్ని రోజులు వెతుకుతారు...ఏడుస్తారు. తరువాత వాళ్ళుగా బయటపడతారు. అన్నిటినీ అలవాటు చేసుకోవాలే!

మనో చాలా కష్టపడతాడు . కొత్త భార్య ధైర్యం చెప్పి సమాధానపరుస్తుంది. రేపు వాళ్ళకు పిల్లలూ...కుటుంబ బాధ్యత అని వచ్చేటప్పుడు పవిత్ర యొక్క జ్ఞాపకం నిదానంగా తగ్గిపోతుంది.

ఇదే ప్రకృతి. ప్రకృతితో కలిసే జీవితం వెడుతుంది. దీనినే 'విధీ అంటారో? నిన్న ఎలా ఉన్నాం? రోజు ఎలా ఉన్నాం? రేపు ఎలా ఉంటాము...?

తనలోనే తాను నవ్వుకుంటూ ఇళ్ళు చేరింది. తన దగ్గరున్న తాళం చెవితో తలుపులు తీసింది. లోపలకు వెళ్ళిన వెంటనే తాను వేసుకున్న నగలను అమ్మ బీరువాలో దాచింది.

పట్టు చీర తీసేసి, కాటన్ చీర కట్టుకుంది. మొహంకడుక్కుని, తుడుచుకుని, అద్దంలో తన ఆకారాన్ని చూసింది. తృప్తిగా అనిపించింది.

సన్యాసిని లాంటి జీవితానికి ఇది చాలు. ఇక శరీరం, ప్రాణం కొందరి కోసమే పనిచేస్తుంది! తనలో చెప్పుకుంటూ మనోహర్ గదిలోకి వెళ్ళింది.

మనసులో ఏదో తెలియని నొప్పి పుట్టింది. గోడ మీద వేలాడ దీసిన తమ్ముడి ఫోటోలను ఒక్కొక్కదాన్నీ చూసింది. కంట తడి పెట్టుకుంది.

చిన్న వయసు నుంచే తన మీద వాడికున్న అపరిమితమైన అభిమానం, మనసులో ఒక సినిమాలా కనబడింది.

అక్కా...ఒంటరిగా బయటకు వెళ్ళకు...నేనూ వస్తాను

నువ్వు షాపులకు వెళ్ళద్దక్కా...నేను వెళ్ళోస్తాను

అక్కా నువ్వు పెద్దమనిషి వయ్యావుట. ఇక మీదట స్కూలుకు నాతోనే వచ్చేయి. నేను నీకు తోడుగా ఉంటాను

అక్కను మాత్రం ఎందుకమ్మా చదువుకోవద్దు అంటున్నావు? నా కంటే అక్కయ్యే కదా బాగా చదువుతోంది

ఏయ్. మా అక్కయ్య గురించి ఏదైనా మాట్లాడావా...నిన్ను చంపేస్తాను

ఎందుకక్కా ఏడుస్తున్నావు? నీకు నేను ఉన్నాగా. నువ్వు చదువుకో అక్కా. నేను చదివిస్తాను

మా ఎం.డి చాలా మంచివారక్కా. నీ గురించి చెప్పిన వెంటనే ఉద్యోగం ఇచ్చేసారు. ఇక మీదట నువ్వు ఉద్యోగం చేస్తూ చదువుకోవచ్చు

నువ్వూ నాకు ఒక అమ్మలాంటి దానివే అక్కా’ -- మనో యొక్క స్వరం చెవిలో మోగ...ఫోటోను గుండెలకు హత్తుకుని కళ్ళనీళ్ళు పెట్టుకుంది.

నువ్వు నా తమ్ముడివి కాదు. నా తండ్రివి. మరో జన్మ అనేది ఉంటే నేను నీకు కూతురుగా పుట్టాలి

కన్నీరు తుడుచుకుంది. నిన్న రాత్రి రాసి పెట్టుకున్న ఉత్తరాన్ని విప్పింది.

నా భవిష్యత్తును ఉపయోగపడేలా మార్చుకోబోతాను. ఎవరూ నన్ను వెతక వద్దు. నా కోసరం ఏడవకండి. అమ్మా...ఇక మీదట స్వాతి నీ కూతురుగా ఉంటుంది. నాన్నా...నీ కూతురు...ఇంకొకళ్ల కోసం జీవించబోతోంది.

తమ్ముడూ తొందరగా పిల్లలను కను. అది చూసి అమ్మ తన బాధలను మర్చిపోనీ. నీ జీవితం సంతోషంగా ఉండాలి.

స్వాతీ...నా తమ్ముడికి నువ్వే అన్నీ. తల్లిగా, సహోదరిగా...భార్యగా, స్నేహితురాలిగా ఉంటూ వాడిని జీవితంలో పైకి తీసుకు వస్తానని పరిపూర్ణంగా నమ్ముతున్నాను

ప్రేమతో.

పవిత్ర.

ఉత్తరాన్ని చదివి తమ్ముడు టేబుల్ మీద పెట్టి దానిపై అతని ఫోటోను ఉంచింది. గడియారం చూసుకుంది. టైము పన్నెండున్నర దాటింది.

ఇక బయలుదేరాలి -- మనసును ప్రశాంతత చేసుకుని, తన పెట్టెను తీసుకుని బయలుదేరటానికి సిద్దమైంది.

కళ్యాణమండపం చాలా వరకు ఖాలీ అయ్యింది. మెడలో వేసున్న పూలమాలను తీయకుండా, చమటతో తడిసి ముద్దైన మనోహర్ అటూ, ఇటూ తిరుగుతూ సహోదరిని వెతుకుతున్నాడు.

పెళ్ళి కొడుకు గారూ...రండి భోజనం చేద్దాం...

ఒక్క నిమిషం...మా అక్కయ్య ఎక్కడ?”

నేనూ ఆమెనే వెతుకుతున్నాను. కనబడలేదు...

బయట ఎక్కడన్నా నిలబడుందేమో---కొంచం చూడండి

అరగంటగా వెతుకుతున్నా నాయనా...గ్రూప్ ఫోటో తీసుకోవలనుకున్నావే?”

అందుకొసమే నమ్మా ఫోటోగ్రాఫర్ను పంపించకుండా నిలబెట్టాను. నాన్న ఎక్కడ...?”

భోజనం చేస్తున్నవారిని గమనించుకుంటున్నారు

సరే...నా ఫోను ఇవ్వండి. అక్కయ్యతో మాట్లాడుదాం

ఆమె అప్పుడే వెళ్ళిపోయింది -- చిరాకుగా చెప్పిన రామ్మోహన్ను గబుక్కున తల ఎత్తి  చూసాడు మనోహర్.

ఏమిటీ?”

ఆమె వెళ్ళి రెండు గంటలు అవుతోంది

ఏమిటి...ఎక్కడికి వెళ్ళింది?”

ఇంకెక్కడికి వెడుతుంది? ఇంటికే...అందులోనూ నడుచు కుంటూనే వెళ్ళింది

ఏయ్...నువ్వేమైనా చెప్పావా?”

ఏరా...మీ కుటుంబానికి ఎవరినీ గౌరవించటం తెలియదా?”

రామ్మోహన్..అడిగిన దానికి మాత్రం కరెక్టుగా జవాబు చెప్పు. ఆమె మనసు కష్టపడేటట్టు ఏదైనా మాట్లాడావా?”

ఇదేమిట్రా బాబూ నాకు చుట్టుకుంది? ఒక ఫోటో తీసుకుందాం...వధూ-వరులతో వెళ్ళి నిలబడదాం అని అడిగాను. దానికి ఎలా తిట్టిందో తెలుసా?”

చదివిస్తాను, ఆమె తెలివితేటలను పెంచుతానూ అంటూ ఆమె గుణాన్నే మార్చావు కదరా. నన్ను ఒక మనిషిగా కూడా గౌరవించటం లేదు

నువ్వు మనిషిగా ఉంటేనే కదా గౌరవించేందుకు...?”

అనవసరంగా మాట్లాడొద్దు మనో. రోజుకైనా మీ ఇంటి అల్లుడ్నే

చెప్పుతో కొడతా. అక్కయ్యే వద్దంది. ఇంకేమిటి అల్లుడూ...గిల్లుడూ అంటూ చుట్టరికం కలుపుతున్నావు?”

రేయ్...మర్యాదగా మాట్లాడరా...

ఎవర్ని చూసి చూపుడు వేలు చూపి మాట్లాడుతున్నావు...?” -- మనోహర్ కోపంగా రామ్మోహన్ చొక్క పుచ్చుకోగా, స్వాతి తల్లి-తండ్రులు ఆందోళన చెందారు. గుంపు చేరింది.

గోపాల కృష్ణ వచ్చి ఇద్దర్నీ విడదీశాడు. రామ్మోహన్ని బయటకు తీసుకు వెళ్ళాడు స్వాతి తండ్రి.

మనో...ఏమిట్రా ఇదంతా?”

నాన్నా...అక్కయ్యకు ఏమయిందో తెలియటం లేదు. రింగ్వెడుతూనే ఉన్నది. ఫోన్ ఎత్తటం లేదు

స్వరాజ్యం ఆందోళన చెందింది. ఏమిటి మనో ఏం చెబుతున్నావు?”

అవునమ్మా...మొదట ఇంటికి వెళ్ళి చూద్దాం రండి

అల్లుడుగారూ...మీరింకా భోజనం చేయలేదే?”

ఇప్పుడు భోజనమా ముఖ్యం -- స్వాతీ రా త్వరగా

అందరినీ తీసుకుని కారులో బయలుదేరి ఇంటి దగ్గర దిగాడు.

ఇళ్ళు తాళం వేసుందే?”

అంటే పవిత్ర ఇక్కడకు రాలేదా?”

వేరే ఎక్కడికి వెళ్ళుంటుంది? ఉద్యోగమూ మానేసిందే?”

ఏమండీ... రాక్షసుడు ఏదైనా చెప్పుంటుండా? అది విని మనసు విరిగి నా కూతురు ఏదైనా చేసుకుందో?”

నోరు ముయ్యి. నీ నోటి నుంచి మంచి మాటలే రావా?”

లేదండీ నాకు భయంగా ఉంది

ఇప్పుడు ఏడ్చి ఏం ప్రయోజనం? కాళ్ళ మీద పడ్డాడని శనిగాడిని తీసుకువచ్చి ఇంట్లో కూర్చోబెట్టిన రోజు నుంచే ఇంటి మొత్త ప్రశాంతత పోయింది

నాన్నా...మొదట తలుపు తెరవండి -- అంటూ మనోహర్ తన సెల్ ఫోన్ నుండి పవిత్ర ఫోన్ కు ఫోన్ చేశాడు...ఇంట్లో నుండి రింగ్ టోన్ వినబడింది.

నాన్నా...త్వరగా తెరవండి. ఫోన్ ఇక్కడే మోగుతోంది

ఫోన్ పెట్టేసే వచ్చిందా?”

లేదే! మండపంలో ఉన్నప్పుడు దాని దగ్గర ఉన్నదే?”

ఆమ్మా కనకదుర్గ తల్లీ...నా కూతురుకి ఏదీ జరిగి ఉండకూడదు -- స్వరాజ్యం  వేడుకుంటూ ఇంట్లోకి వెళ్ళింది...ఒక్కొక్కరూ ఒక్కొక్క వైపుకు వెళ్ళారు.

మనోహర్, పవిత్ర రూములోకి వెళ్లాడు. ప్రొద్దున కట్టుకున్న పట్టు చీర...దన్నెం మీద మడత నలగ కుండా ఉంది.

ఎక్కడికి వెళ్ళింది?’

మళ్ళీ ఇంకోసారి ఇల్లంతా చుట్టి వచ్చి నీరసంగా తన గదిలోకి వెళ్లాడు. ఫ్యాన్ వేసి మెడలోని పూలమాలను తీస్తున్నప్పుడు చూసాడు. తన టేబుల్ మీద, తన ఫోటో కింద ఒక కాగితం గాలికి కొట్టుకుంటోంది.

పరిగెత్తుకు వెళ్ళి కాగితాన్ని తీసాడు. అందులో ఉన్న అక్కయ్య చేతి రాతను చూసి తల్లడిల్లిపోయాడు.

చదివిన వెంటనే '' అంటూ అరిచాడు.

కొడుకు అరిచిన శబ్ధం విని హాలులో ఉన్న గోపాల కృష్ణ, పూజ గదిలో ఉన్న స్వాతి, స్వరాజ్యం పరిగెత్తుకు వచ్చారు...తన గదిలో కూర్చుని తల పట్టుకుని ఏడుస్తున్నాడు మనోహర్.

అయ్యో...ఏమండీ ఏమైంది?” -- భార్య కళ్ళు చెమర్చ....

ఏం మనో...ఏంటయ్యా జరిగింది?” -- నాన్న గాబరాగా అడుగగా.....

అయ్యో...నా కొడుకు ఏడుస్తున్నాడే...ఏదో అయిపోయింది! నాన్నా...ఏంటయ్యా జరిగింది? అమ్మకు భయంగా ఉందయ్యా...--కన్నీటితో అన్న తల్లిని కౌగలించుకుని ఏడ్చాడు.

వద్దూ వద్దూ అని ఎన్నోసార్లు చెప్పానే! నా మాట వినకుండా అక్క మనసును చంపేసారే...ఇప్పుడు వెళ్ళిపోయింది. మనమెవరం వద్దని వెళ్ళిపోయింది

... నో...

మన మొహాలకే కనబడనని రాసిపెట్టి వెళ్ళిపోయిందమ్మా. ఇక అక్క రాదు...ఏడుస్తున్న అతని చేతిలోంచి ఉత్తరాన్ని తీసుకుంది స్వాతి.

చదివేసి మామగారికి చేతికి అందించింది. ఆయన చదివి శిలలా నిలబడిపోయాడు. స్వరాజ్యం కి ఏమీ అర్ధంకాక పిచ్చిదాని లాగా అందరినీ చూసింది.

ఏమండి...ఏమి రాసింది?”

వెళ్ళిపోయిందే...పరిగెత్తుకుంటూ వెంబడించి వచ్చారే. ఏం చేస్తుంది పిల్ల. అందుకే మొత్తంగా మనందరిని శోఖంలో ముంచేసి వెళ్ళిపోయింది. వెతక కూడదట

... మి...టీ...?”

ఇక రాదే. మన అమ్మాయి మనకు లేదు. అంతా నీ వల్లే, నీ వలనే

అయ్యో...కన్న కూతురు హాయిగా జీవించాలనే కదా ఆశపడ్డాను...అది తప్పా? నా ఆశ తప్పా?” -- ఆమె ఏడుపుతో కుటుంబమంతా గందరగోళంలో ఉంటే, విమానంలో ఎగురుతూ వెడుతోంది పవిత్ర.

రెక్కలు విరుచుకుని ఎగరటం మొదలుపెట్టిన కొత్త ఫీనిక్స్ పక్షికి ఇక ఆకాశమే హద్దు!

                                                                                                                       సమాప్తం

**************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి