దృశ్యం...(సీరియల్) PART-3
పనులన్నీ చూసుకుని సాయంత్రం ఐదు గంటలకు ఇంటికి తిరిగి వచ్చింది ప్రియంవద!. హాలులో ఉన్న సోఫాలో కూర్చుంది.
ఇంట్లో వాళ్ళందరూ మరునాడు ప్రొద్దున పెళ్ళి మండపానికి వెళ్ళటానికి రెడీ అవాల్సిన పనులతో హడావిడి పడుతున్నారు.
"ఏమిటి ప్రియా! ఇంత అలశ్యంగానా రావడం. ఎన్ని పనులున్నాయో తెలుసా...సరె, త్వరగా ఫ్రెష్ అయి రా, నువు చెయ్యాల్సిన పనులేంటో చెబుతాను" టయర్డుగా వచ్చిన కూతుర్ను మందలించలేక ప్రేమతో చెప్పింది తల్లి రాజేశ్వరి.
సొఫాలో కూర్చున్న ప్రియంవద దగ్గరకు వచ్చింది పెళ్ళి కూతురు, అక్కయ్య దీపిక.
"ఏమిటే? ముఖం అదోలా ఉన్నది...ఓంట్లో బాగుండలేదా?"
"బాగానే ఉన్నానక్కా...కొంచం తలనొప్పిగా ఉంది. అంతే"
"వేడి వేడి కాఫీ తీసుకు వస్తాను. ఒక మాత్ర వేసుకుని కొంచంసేపు రెస్టు తీసుకో"
"సరేనక్కా కాఫీ తీసుకురా. కొంచం కంప్యూటర్లో పనుంది"
“కాఫీ తాగి కొంచంసేపు రెస్టు తీసుకోమంటే, కంప్యూటర్లో పని అంటావేమిటి"
"మీ అక్కయ పెళ్ళి పనులను కూడా కొంచం గమనించు ప్రియా!" చెప్పింది తల్లి రాజేశ్వరి.
"నాకు కొంచంసేపు ఆఫీసు పని ఉన్నదమ్మా. అది ముగిసిపోతే నేను పూర్తిగా పెళ్ళి పనులు చూసుకుంటాను".
"అది కాదు ప్రియా..." అంటూ తల్లి మళ్ళీ ప్రియాను ఏదో అనబోతుంటే
"దాన్ని వదిలేయమ్మా! ఎదో ముఖ్యమైన పని ఉన్నట్టుంది. లేకపోతే ప్రియ అలా అడగదు...నువ్వెళ్ళి నీ పని చూసుకోవే ప్రియా" అక్క అర్ధం చేసుకుంది.
ప్రియంవద తన రూముకు వెళ్ళి తన లాప్ ట్యాప్ ముందు కూర్చుంది!
లాప్ ట్యాప్ ఆన్ చేసి తన కెమెరాలోని మెమోరీ కార్దును తీసి లాప్ ట్యాప్ లో పెట్టింది.
ఇంతలో దీపిక తలనొప్పి మాత్ర, కాఫీ తీసుకు వచ్చింది.
"అక్కా నువ్వు కొంచం సేపు ఇక్కడ కూర్చో వా"
"ఎందుకు ప్రియా"
అక్కయ్య చేతులను ప్రియ గట్టిగా పట్టుకుంది.
"ఏమయ్యిందే"
"నువ్వు పెళ్ళి చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోతున్నావు! నువ్వు లేకుండా ఈ ఇంట్లో నేనెలా ఉండగలనో? అందరూ నాతో పోట్లాట పెట్టుకున్నా నువ్వు మాత్రం ఎప్పుడూ నాకు సపొర్టుగా ఉంటావు! నువ్వు వెళ్ళిపోతే నేనేం చేయను"
కళ్ళు చెమర్చినై.
"ప్రియా నువ్వా ఇలా అధైర్యంగా మాట్లాడేది"
“అక్కా! నువ్వంటే నాకు ఎంత ప్రేమో నేను చెప్పలేను. నువ్వెక్కడున్నా బాగుంటావు! నీ మనసు అలాంటిది...అందుకే నీకు అంత గొప్ప సంబంధం దొరికింది"
"అసలు ఈ రోజు నీకేమయ్యిందే?"
"నతింగ్"
నవ్వుతూ కళ్ళు తుడుచుకుంది ప్రియంవద.
దీపిక ప్రియంవద పక్కన కూర్చుని, ప్రియంవదను తన దగ్గరకు తీసుకుని ముద్దుపెట్టుకుని, గట్టిగా కౌగలించుకుంది.
"నేనెక్కడికి వెడుతున్నానే....ఈ సిటీలోనేగా ఉండేది. నన్ను చూడలనుకున్నప్పుడు నువ్వు, నిన్ను చూడాలనుకున్నప్పుడు నేను ఎప్పుడు పడితే అప్పుడు ఇద్దరం కలుసుకోవచ్చు"........దీపికాకి కూడా కళ్ళు చెమర్చాయి.
ప్రియంవద నవ్వుతూ తన లాప్ ట్యాప్ వైపు చూసింది.
ల్యాప్ టాప్ స్క్రీన్ ఆన్లో లేదు. ప్రియంవద మల్లీ లాప్ ట్యాప్ ను రీస్టార్ట్ చేసింది.
"సరే నీ పనిచేసుకో" అని చెప్పి దీపిక వెళ్ళిపోయింది.
రీస్టార్ట్ చెసినా లాప్ ట్యాప్ ఆన్ అవలేదు.
మళ్ళీ మళ్ళీ ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది.
బెడ్ మీద కు వాలిపోయి కళ్ళు ముసుకుంది.
ఆ ఓపన్ టెర్రస్ దృశ్యం! అక్కడ యువతిని గొంతు పిసుకుతున్న అతను!
అంత ఎత్తులో...పూర్తి వెలుతురులో, నల్లటి మీసాలతో ఆ ముఖం క్లీయర్ గా ఉన్నది 'ఎక్కడ చూశాను?'
"చ...ఎందుకు జ్ఞాపకం రావట్లేదు?"
"పట్టపగలు ఒక హత్య!"
“ఆ హత్య యొక్క ప్రత్యక్ష సాక్ష్యం నా దగ్గర!"
ఈ కిరాతకమైన కార్యాన్ని వదలకూడదు.
మనసులో ఏవేవో ఆలొచనలు.
‘రేపు మండపానికి వెళ్ళాలి. ఎల్లుండి మీ అక్కయ్య పెళ్ళి! నిన్ను వదలి, ఈ ఇంటిని వదలి ఆమె వెళ్ళిపోతుంది. అది నువ్వు భరించలేకపోతున్నావు. ఆమె కోసం కనీసం నాలుగు రోజులు ఆమెతో గడపలేవా! అది వదిలేసి ఎవడో, ఎవత్తినో హత్య చేసిందా నీకు ముఖ్యం. నీ కుటుంబం నీకు ముఖ్యం కాదా? ఇంటికంటే సంఘమే ముఖ్యమా?’
లేచి కూర్చుంది ప్రియ!
అవును. నా దగ్గర ఆ హత్య కైన సాక్ష్యం ఉందని చెప్పి ఖచ్చితంగా హంతకుడిని పట్టివ్వాలి.
దానికి ఇదా సమయం. పోలీసులకు సాక్ష్యం ఇచ్చిన వెంటనే నిన్ను ఎంక్వయరీ పేరుతో పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుకుంటారు.
ఇప్పుడు నీకు అక్కయ్య ముఖ్యమా...హత్య సంఘటన ముఖ్యమా
అలోచనలోతో సతమతమయ్యింది ప్రియంవద.
"ఇప్పుడు అక్కే కధా ముఖ్యం?"
అది ఒప్పుకుని, ఈ నాలుగు రోజులూ అక్కయ్య కోసం జీవించాలి! అక్కయ్యను తప్ప ఇక దేనినీ ముఖ్యంగా భావించకూడదు.
ప్రియంవద లేచింది!
ల్యాప్ టాప్ దగ్గరకు వెళ్ళింది. మెమొరీ కార్డును తీసి మళ్ళీ కెమేరాలో పెట్టింది.
కెమేరాను తీసుకువెళ్ళి తన బీరువాలో పెట్టింది.
గది బయటకు వచ్చింది.
హాలులోకి వెళ్ళింది. అక్కడ అందరూ హడావిడి పడుతున్నారు.
"డాడీ! నాకేదన్నా పనిచెప్పండి...చేస్తాను"
"ఇప్పుడు నువ్వు రెస్టు తీసుకో ప్రియా"
"లేదక్కా నేను బాగానే ఉన్నాను...ఈ నాలుగైదు రోజులూ నీ కోసమే"
దీపిక ముఖంలో వెలుగు కనిపించింది!
మండపానికి తీసుకు వెళ్ళాల్సిన సామాన్లను ప్యాకింగ్ చేస్తొంది ప్రియంవద.
అక్కడే వేరే పనిలో ఉన్న గౌతం టీ.వీ ఆన్ చేశాడు.
న్యూస్ మొదలయ్యింది!
ప్రక్యాత బిల్డర్ సాంబశివరావ్ గారి అసోక్ నగర్ లోని చక్రవర్తి కన్స్ ట్రక్షన్ బిల్డింగ్ ముప్పై వ అంతస్తు లో పట్టపగలే హత్య!
రామకృష్ణ కుటుంబంలోని వారందరూ ఒక్కసారిగా టీవీవైపు తలెత్తి చూశారు.
బిల్దింగ్ టెర్రస్సులో యుక్త వయసులో ఉన్న ఒక ఒక మహిళ శవం.....హత్యగా అనుమానపడుతున్న పోలీసులు.
హంతకుడిని పట్టు కోవటం కోసం ప్రత్యేక పోలీసు బృందాల ఏర్పాటు.
ఆ దృశ్యాలను టీవీలో చూపించే సమయంలో, ఆ మహిళ చుట్టూ గుంపుగా జనం.
కుప్పలుగా పోలీస్ బలగం.
"అదిగో వియ్యంకుడు నిలబడున్నారే!" రామకృష్ణ గాబరాగా చెప్పాడు.
"అల్లుడు కూడా ఉన్నాడండి" రాజేశ్వరి చెప్పింది.
టీవీ న్యూస్ కెమెరాను మొదట సాంబశివరావ్ వైపు, ఆ తరువాత చక్రవర్తి వైపు ఫోకస్ చేశారు.
"ఇదేం ఖర్మండి...రేపు స్నాతకం...ఈ రోజు పోలీసులా?"
తన భయాన్ని వ్యక్తం చేసింది రాజేశ్వరి.
దీపిక దగ్గరకు వచ్చింది.
"ఎలా జరిగింది ఇది...? అందులోనూ అల్లుడిగారి బిల్దింగులో"
ఆశ్చర్యంతో ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. ప్రియంవద మాత్రం లోపలకు వెళ్ళింది. తన రూములోకి వెళ్ళి, కబోర్డులో దాచిన తన కెమేరాను తీసుకుంది. స్నానాల గదిలోకి వెళ్ళి డోర్ వేసుకుంది.
తానుతీసిన వీడియోని రీవైండ్ చేసి చూసింది.
ఆ హత్యా దృశ్యం!
గొంతు పిసికేసి వెనక్కి తిరిగిన హంతకుడు.
అతను.
అతను వెరెవరో కాదు!
ఎల్లుండి అక్కయ్య మెడలో తాలి కట్టబోయే చక్రవర్తి!
ఇంతకు ముందు టీవి న్యూస్ లో క్లోస్ అప్ లో చూపించిన బిల్డింగ్ ఓనర్ చక్రవర్తే.
ఈ ఇంటి అల్లుడుగా రాబోతున్న చక్రవర్తే!
మళ్ళీ ఒకసారి కెమెరాలోని వీడియోని ప్లే చేసి చూసింది. హత్య చేసిన తరువాత హంతకుడు వెనక్కి తిరిగిన చోట వీడియోని ఆపింది. హంతకుడిని బాగా గమనించింది.
"అతడు చక్రవర్తే!"
అదే ఎత్తు,రంగు, పోలిక.
"అక్కయ్యను పెళ్ళి చేసుకోబోయే అతను ఒక హంతకుడా?"
తలంతా భారంగా, బరువుగా, నొప్పిగా అనిపించింది ప్రియంవదకు.
"దేముడా ఏమిటీ ఘోరం?"
“ఎలా? తన సొంత బిల్డింగ్ లోని టెర్రస్సులో ఒక అమ్మాయిని గొంతు పిసికి చంపేసి, ఆ తరువాత ఏమీ తెలియనట్లు పోలీసులతో నిలబడటం"
"ఇది సాధ్యమా?"
"కొన్ని వేల కోట్లకు సొంతమైన ఒక వ్యాపార వేత్త యొక్క ఒక్కగానొక్క కొడుకు"
అతనే ఒక పెద్ద కోటీశ్వరుడు! బాగా చదువుకున్న యువకుడు. డబ్బుంది కాబట్టి తప్పించుకుంటాడా "
"అతను ఒక హంతకుడా?"
"ఒకరిని చంపేసి తన వెలుగైన బ్రతుకును నాశనం చేసుకుంటాడా"
"చ....చ! చంపాల్సిన అవసరం అతనికేముంటుంది?"
మళ్ళీ వీడియోని రన్ చేసి చూసింది.
"అనుమానం లేదు...ఆ హంతకుడు చక్రవర్తే"
“ఒకవేల అతనిలాగానే ఉండే వేరే మనిషేమో?”
“అతని మీద పగ తీర్చుకునేందుకు, సంసార జీవితం ప్రారంభించేటప్పుడు వచ్చి దిగేడా?”
తల తిరిగింది
“ఈ విషయాన్ని ఇంట్లో చెబుదామా?”
“ఎలా చెప్పను? కుటుంబమే షాక్ తింటుందే?”
“కొన్ని వేల ప్రముఖ వ్యక్తుల సమక్షములో బ్రహ్మాండంగా జరగబొయే పెళ్ళికి ఆటంకం కలగొచ్చా?”
“డాడీ యొక్క మనొభావం ఎలా ఉంటుంది?”
“అందుకని చెప్పకుండా ఉండగలమా?”
ఆలొచనలలో మునిగి ఉన్నప్పుడు ఎవరిదో పిలుపు విని మామూలు స్థితికి వచ్చింది.
"ప్రియా ఎక్కడున్నావే?"
తల్లి రాజేశ్వరి గొంతు దగ్గరగా వినిపించడంతో తమాయించుకుంది!
"ఇదిగో వస్తున్నానమ్మా!"....కెమేరాను దాచుకుని బయటకు వచ్చింది.
హాలులో పెద్ద వివాదమే జరుగుతోంది.
”అల్లుడికి ఫోన్ చేసి అడుగుదామా"
ఈవెనింగ్ పేపర్ వచ్చి పడింది.
ఆ పేపర్లో హెడ్ లైన్ ఇదే.
“రేపు పెళ్ళి చేసుకోబోతున్న కోటీశ్వరడి కొడుకు చక్రవర్తి బిల్డింగ్ లో యువతి హత్య!”
వివరాలు లోపల.
చక్రవర్తి ఫోటో...తండ్రి సాంబశివరావ్ ఫోటో, హత్య చేయబడి పడున్న యువతి శవం ఫోటో.
"నేను వియ్యంకుడితో మాట్లాడనా?"
"వద్దు డాడీ మావయ్యే మాట్లాడతారు" చెప్పింది దీపిక.
“ఏమిటే నువ్వు అలా చెబుతున్నావు? రేపు వాళ్ళు మండపానికి రావాలి! ఊరంతా అక్కడే ఉంటుంది!” తల్లి రాజేశ్వరి తన ఆదుర్దాను వ్యక్తం చేసింది.
"ఆ ఆందోళన వాళ్ళకూ ఉంటుందమ్మా. ఇది వాళ్ళ గౌరవానికి వచ్చిన సమస్య. వాళ్ళ బిల్దింగులో ఒక హత్య జరిగితే వాళ్ళను విచారణ చేస్తారు కదా? జవాబు చెప్పకుండా వచ్చేయగలరా? మనం కూడా టార్చర్ పెట్టకూడదు! వాళ్ళే మాట్లాడుతారు"
ఇంటి ముందు కారు ఆగిన శబ్ధం.
తండ్రి కొడుకులు ఇద్దరూ కార్లో నుండి దిగారు.
"వాళ్ళు వస్తారని నాకు తెలుసు" దీపిక చెప్పింది.
"రండి"
“ఏమిటి మొత్త కుటుంబమే ఆందోళనలో ఉన్నరా?".
"అవునండి"
"ఉండదా మరి? మేమందరం కూడా అదే మనోబావంలో ఉన్నాము"
"కూర్చోండి!"
"ఎంత ఘోరమో చూడండి! మా బిల్డింగును వెతికి పట్టుకుని, సెక్యూరిటీ టీ తాగడానికి వెళ్ళినప్పుడు లోపలకు దూరి ఒక హత్య జరిగింది. మనసు కుంగిపోయింది"
"అలా ఏలాగండి?"
"ఆ అమ్మాయి ఎవరు? హత్య చేసిన వాడు ఎవరు? ఎందుకు హత్య చేశాడు.ఏమీ తెలియటంలేదు. శవాన్ని పోస్ట్ మార్టం కు పంపారు. ఆ రిపోర్టు వచ్చిన తరువాతే నిజాలు తెలుస్తాయి"
"హత్య చేసినవాడు తప్పించుకోలేడు. ఖచ్చితంగా దొరికిపోతాడు"...ఇది చెప్పింది చక్రవర్తి.
లోపల నిలబడున్న ప్రియంవదకి చక్రవర్తి చెప్పింది విని తల తిరిగింది.
చక్రవర్తి మొహాన్నీ లోతుగా గమనించింది.
అమాయకమైన ముఖం! ఆ ముఖంలో ఒక హంతకడికి ఉండవలసిన క్రూర లక్షణాలు ఏకోసానా కనిపించలేదు. 'హంతకుడు త్వరలోనే ఖచ్చితంగా దొరికిపోతాడూ అని నమ్మకంగ చెబుతూ’, ఆ మాటను నలుగురి మధ్య చెప్పే ఒక మనిషి హత్య ఎలా చేయగలడు?
"చాన్సే లేదు!"
"ఒక ప్రముఖ వ్యక్తి యొక్క కొడుకు. అందులోనూ తన సొంత బిల్దింగులో ఒక హత్య చేస్తాడా"
నేను చూసిన వ్యక్తి వేరే మనిషేమో
రక్తం వేడెక్కింది.
"మా బిల్డింగే కదా అది! వెంటనే మా ఇంజనీర్ చక్రవర్తికి విషయం తెలిపాడు. చక్రవర్తే పోలీసులకు హత్య గురించి సమాచారం ఇచ్చి, డాక్టర్ను తీసుకుని, నాకు ఫోన్ చేశాడు"
చక్రవర్తి కుర్చిలో నుండి లేచి దీపిక దగ్గరకు వెళ్ళాడు.
"నువ్వు బాధ పడకు దీపిక! వెంటనే నేనూ, డాడీ చట్ట ప్రకారం చేయాల్సినవన్నీ చేశాము. బాడీని అప్పగించి, పోలీసులతో కంప్లైంట్ రిజిస్టర్ చేశాము. పోలీసులు మమల్ని ఎంక్వయరి కూడా చేశేశారు! మన పెళ్ళి పూర్తి అయ్యేంతవరకూ ఈ సంఘటన గురించి మన దగ్గర ఏమీ అడగకూడదని పోలీసు డిపార్ట్ మెంటులో ఆర్డర్ వేశారు"
"మన బిల్డింగ్ కాబట్టి మనకి ఈ తలనొప్పి"
“అంతే తప్ప మీరేమీ కంగారు పడకండి! ఇలాంటి సంఘటనలు మీడియాలో రాకుండా తప్పించుకోలేవు. నలుగురు నాలుగు విధాలుగా ప్రశ్నలు అడుగుతారు"
గౌతం మధ్యలో లేచాడు.
"డాడీ! ఫేస్ బుక్ లో వివరాలు వచ్చేశాయి"
"ఈరోజుల్లో అంతర్జాలంలో, వాట్స్ ఆప్ ఆప్ లొ వెంటనే న్యూస్ ప్రపంచమంతా పాకిపోతోంది. కాబట్టి దేనిని దాచి ఉంచలేము"
"హంతకుడు ఖచ్చితంగా పట్టుబడతాడు" చెప్పింది చక్రవర్తి.
”అయితే మేము బయలుదేరతాం. పిల్లనిచ్చే వారు మీరు భయపడకుండా ఉండాలి. మీకు విషయాలు చెప్పి మీకు ప్రశాంతత ఏర్పరచి వెళ్ళాలనే వచ్చాము. పెళ్ళి పనులు కంటిన్యూ చేయండి. దాంట్లో ఎటువంటి ఆలశ్యమూ, అశ్రద్ద వద్దు"
సాంబశివరావ్ లేచాడు.
“దీపిక! నీ ముఖం లో ఇంకా టెన్షన్ పోలేదు. ధైర్యంగా ఉండు" కుర్చీలో నుండి లేస్తూ చెప్పాడు చక్రవర్తి.
"అదేం లేదండి! నా బాధంతా మీ గురించే. అందరూ మిమ్మల్ని ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి విసిగిస్తారు...ఎలా తట్టుకుంటారోనని..."
“వేరే దారిలేదు దీపిక! కోపం తెచ్చుకోకుండా జవాబు చెప్పే తీరాలి. పబ్లిక్ లైఫ్ లోకి వచ్చిన ఎవరూ తప్పించుకోలేరు. నేను చూసుకుంటా. నువ్వు కంగారుపడకు"
"........"
"నీ మీడియా చెల్లెలు ఎక్కడ కనిపించనే లేదు?"
"ప్రియా బయటకు రావే"
"మీ మీడియా సర్కిల్ లో హాట్ డిబేట్ జరుగుతోందా"
"అది...బయటకే వెళ్ళలేదు”
"సరే...మేము వెళ్ళోస్తాం"
తండ్రి కొడుకులు ఇద్దరూ కారులో ఎక్కారు. ప్రియంవద తప్ప మిగిలిన వాళ్లంతా ఇంటిబయటకు వచ్చి వారిని సాగనంపారు.
Continued...PART-4
***************************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి