దృశ్యం...(సీరియల్) PART-1
అనుకోకుండా
ఒక దృశ్యాన్ని తన కెమేరాలో బందించింది ఈ నవలలోని నాయకురాలు. ఆ దృశ్యం: హీరో ఒక
అమ్మాయిని హత్య చేయడం. ఆ హీరో, ఈ నవలలోని నాయకురాలి అక్కను పెళ్ళి చేసుకోబోతాడు.
ఒక
హంతకుడు తన అక్కయకు భర్తగా రాకూడదని ఈ నవలలోని నాయకురాలు పెళ్ళిని ఆపటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది.
కానీ, ఏమీ చేయలేకపోతుంది. వివాహం జరిగిపోతుంది.
వివాహాం
జరిగిన తరువాత నిజం తెలుస్తుంది. తన పెళ్ళిని నాయకురాలి అక్క ఆనందంగా
అంగీకరిస్తుంది. నాయకురాలు ఆశ్చర్యపోతుంది.
అసలు
జరిగింది ఏమిటి? హత్యను తన కెమేరాలో బంధించినా నాయకురాలు ఎందుకు
ముందే నిరూపించలేకపోయింది? అక్కయ్య హంతకుడైన ఒకడ్ని ఎందుకు పెళ్ళి చేసుకుంది? అంటే
పెళ్ళికి ముందే అతను హంతకుడని ఆమెకు తెలుసా?
వీటన్నిటికీ
సమాధానాలు తెలుసుకోవటానికి ఈ సీరియల్ను చదవండి.
ఈ సీరియల్ ను పూర్తి నవలగా ఒకేసారి చదవాలనుకుంటే ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:
దృశ్యం...(పూర్తి నవల) @ కథా కాలక్షేపం-2
*************************************************************************************************
ప్రియంవద తనని అందంగా అలంకరించుకుంది!
వేసుకున్న మేకప్ సరిగ్గా ఉన్నదో, లేదో తెలుసుకోవటానికి తన గదిలోనే ఉన్ననిలువెత్తు అద్దంలో ఒకసారి చూసుకుంది.
వెనుక వచ్చి నిలబడ్డాడు తమ్ముడు గౌతం.
"సూపర్ గా ఉన్నావు ప్రియా! పెళ్ళి అక్కయ్యకా...నీకా?"
"ఏరా...నేను అలంకారం చేసుకోకూడదా?"
"రాత్రి పడుకునేటప్పుడు కూడా 'మేకప్' లేకుండా పడుకోవే! నిన్ను పోయి అలంకారం చేసుకోకూడదని చెప్పగలనా?" వెక్కిరించాడు తమ్ముడు గౌతం.
"రేయ్...నిన్ను" అంటూ తన చేతిలో ఉన్న దువ్వెనతో చిలిపిగా తమ్ముడ్ని కొట్టింది ప్రియంవద.
ఇంతలో తల్లి పిలుపు వినబడింది.
"ప్రియా, గౌతం...టిఫెన్ తినాడానికి రండి..."
ఇద్దరూ బయటకు వచ్చారు.
"అమ్మా! త్వరగా టిఫెన్ పెట్టు. నేను బయటకు వెళ్ళాలి" వాష్ బేసిన్ దగ్గర చేతులు శుభ్రం చేసుకుంటూ తొందర పడింది ప్రియంవద.
"టిఫెన్ కు రమ్మన్నది నేను. నన్నే హడావిడి పెడుతున్నావా...అసలు ఎక్కడికే వెడుతున్నావు?"
అడిగింది తల్లి రాజేశ్వరి.
"ఇలా అడిగితే...వెళ్ళే పని సక్సస్ అవుతుందా...?"
అక్కాతమ్ముళ్ళిద్దరూ డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చారు.
తండ్రి రామకృష్ణ టెన్షన్ పడుతూ అక్కడికి వచ్చాడు.
"రాజేశ్వరీ బయలుదేరు...టైమయ్యింది"
"ఇదిగో వస్తున్నా! ప్రియా, నువ్వు ఊరు తిరగడానికి వెళ్ళద్దు. రేపు కల్యాణ మండపానికి వెళ్ళాలి. చాలా పనులున్నాయి. …………గౌతం...నీకూ చెప్పేదదే"
అప్పుడే తీసిన వేడి వేడి పూరీలను ప్లేటులో పెట్టుకుని వస్తున్న దీపకని చూసిన వెంటనే "టిఫెన్ త్వరగా ఇవ్వవే" అన్నది ప్రియంవద.
"ఈ రోజు కూడా అక్కయ్యే పనులు చేయాలా? ఎల్లుండి దానికి పెళ్ళి! ఏం జరుగుతోంది ఈ ఇంట్లో" కోపంగా కసురుకున్నాడు తండ్రి.
"నేను చెయ్యనని చెప్పలేదు...ఏం పని చేయాలో అమ్మ చెప్పలేదు" అన్నది ప్రియంవద.
“ప్రియా! నువ్వేమీ చిన్న పిల్లవు కావు. చదువుకున్నావు. ఉద్యోగానికి వెడుతున్నావు. ఇన్ని రోజులు మీ అందరికీ దీపిక బాధ్యతతో పనులు చేసి పెట్టింది కదా. ఇక అక్కయ్య చోటికి నువ్వు రావాలి. తెలిసిందా...?” చీవాట్లు పెట్టాడు తండ్రి.
"సారీ డాడీ! నేను వంటింటికి పరిమితమయ్యే మహిళను కాదు...సాధించటానికి పుట్టిన మహిళను"
“మేమంతా కొట్లాడుకోవటానికి పుట్టామా?"...కవ్వించాడు తమ్ముడు గౌతం.
"మాటలు ఆపి అందరూ తినడం మొదలుపెట్టండి. టిఫెన్ చల్లారి పోతోంది" ఆర్డర్ వేసిన దీపిక, తమ్ముడివైపు చూసి "గౌతం నీకు ఇష్టమైన పుదినా పచ్చడి ఉంది" అన్నది.
టేబుల్ మీద ఉన్న పుదినా పచ్చడ్ని ప్లేటులో వేసుకుంటూ "అక్కా, చికెన్ తో కొత్తగా ఒక వంటకం వచ్చింది. టీ.వీ.లో చూపించారు. అది చేసి పెడతావా" దీపికను అడిగాడు గౌతం.
"అత్తారింటికి వెళ్ళిన తరువాత భర్తకు వండిపెడుతుంది" ప్రియంవద చెప్పింది.
"వాళ్ళింట్లో ఎవరూ నాన్ వెజ్ తినరు!" చెప్పింది దీపిక.
"అక్కా...నువ్వేం చేస్తావు...?"
"నేనూ తినడం మానాశా! ఆయనకు ఇష్టం లేనిది నాకెందుకు?"
"అది చాలా తప్పు దీపిక. తిండి, బట్ట, ఒపీనియన్...ఈ మూడు విషయాలలోనూ ఆడపిల్లలకు స్వాతంత్రం కావాలి...భర్త చెప్పినట్లు చేయాల్సిన అవసరం లేదు" చెప్పింది ప్రియంవద.
"అమ్మా...విప్లవ తల్లీ! పెళ్ళి అయ్యేంత వరకు నీ నోరు మెదపకుండా ఉండు" చెప్పింది తల్లి.
ఎప్పుడూ సరదాగా గడిపే కుటుంబం అది!
రామకృష్ణ గారికి కూరగాయల హోల్ సేల్ వ్యాపారం. అంతే కాదు...బియ్యం, వడియాలు, ఊరగాయలు, అప్పడాలు ఎక్స్ పోర్ట్ చేస్తాడు. లాభం వస్తుందని తెలిస్తే రియల్ ఎస్టేట్, సినిమా డిస్ట్రిబ్యూషన్...ఇలా పలురకాల వ్యాపారాలతో లక్షలు సంపాదించే మనిషి. వ్యాపార రంగంలో పేరు ప్రఖ్యాతలు గల వ్యక్తి. రామకృష్ణ భార్య రాజేశ్వరి హోమ్ మేకర్.
రామకృష్ణ, రాజేశ్వరి దంపతుల మొదటి సంతానం పెద్ద కూతురు దీపిక. ఎం.కాం చదువు పూర్తి చేసి ప్రైవేట్ బ్యాంకులో అధికారిగా పనిచేస్తోంది. పెళ్ళి ఫిక్స్ అయిన తరువాత ఉద్యోగం మానేసింది.
రెండో సంతానం రెండో కూతురు ప్రియంవద. విషువల్ కమ్యూనికేషన్ చదువు ముగించి మీడియా రంగంలో పనిచేస్తోంది. పత్రికలకూ, న్యూస్ పేపర్లకు, టీ.వీ.లకు,
అంతర్జాల మీడియాలకు ఫ్రీ లాన్స్ రిపోర్టర్ గా పనిచేస్తోంది.
మూడో సంతానం గౌతం. ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్న చలాకీ కుర్రాడు.
పెద్ద కూతురు దీపికకు మూడు నెలల క్రితం పెళ్ళి సంబంధం కుదిరింది.
అల్లుడు చక్రవర్తి ఎం.టెక్ పూర్తి చేసి, ఒక మల్టీనేషన్ అడ్వర్ టైజింగ్ కంపెనీలో పెద్ద అధికారిగా పనిచేస్తున్నాడు. అతనికి ఉద్యోగం చేయవలసిన అవసరంలేదు. కొన్ని రోజులు ఉద్యోగం చేసి ఆ అనుభవంతో తండ్రి వ్యాపారాలను చూసుకుంటే మంచిదని అతని ఆలొచన. నెలలో సగం రోజులు విదేశాలలో ఉంటాడు! తల్లితండ్రులకు ఒకడే కొడుకు.
మాట్రిమోనియల్ సైటు లో దీపిక ప్రొఫైల్ చూసి, నచ్చి, మాట్లాడి సెటిల్ చేసుకున్న సంబంధం. దేశంలోని ధనవంతుల లిస్టులో చోటు చేసుకున్న చక్రవర్తి కుటుంబం, ఎలాంటి కట్న కానుకలకు ఆశ పడకుండా కుదుర్చుకున్న పెళ్ళి సంబంధం.
రామకృష్ణ వాళ్ళకు ఏ విధంగానూ తక్కువ మనిషి కాదు. బంగారం, డైమండ్ నగలతో కూతుర్ని అలంకరించి, బ్రహ్మాండంగా పెళ్ళి జరుపబోతున్నాడు.
రేపు ప్రొద్దున మండపానికి వెళ్ళాలి.
ఆ సాయంత్రం విందు...మరుసటిరోజు తెల్లవారు జామున పెళ్ళి!
కాళ్ళల్లో చక్రాలు కట్టుకున్నట్టు రామకృష్ణ కుటుంబమే గిరగిరా తిరుగుతున్నది.
టిఫెన్ తినడం ముగిసింది.
ఫోన్ మోగింది...దీపిక ఎత్తింది.
కాబోయే అల్లుడు చక్రవర్తే!
"దీపికా, పెళ్ళి అయిన మరుసటి రోజే మనం హనీమూన్ వెడుతున్నాం. లండన్. ఇప్పుడే టికెట్స్ కన్ ఫరం అయినై. హనీమూన్ కు కావలసిన బట్టలు కూడా ప్యాక్ చేసి తీసుకొచ్చుకో"
"సరేనండి"
"పదిరోజులు విదేశాలలోనే! అక్కడి నుండి యూరప్. ఇది వరల్డ్ టూర్"
"అలాగే"
చక్రవర్తి చెప్పింది అలాగే తన తల్లితండ్రులకు చెప్పింది దీపిక.
"అక్కా! కోటీశ్వరుల కుటుంబంలో జీవించటానికి వెడుతున్నావు. మనందరికీ ఇక మీదట విమాన ప్రయాణాలే" అన్నాడు గౌతం.
"నిన్ను ఎవర్రా తీసుకు వెళ్ళేది?"
అన్నది ప్రియంవద.
“ఏమిటే అలా మాట్లాడుతున్నావు. ఆయనకి తోడ బుట్టిన వారు ఎవరూ లేరు. ఉన్నది మీరిద్దరే. మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికీ వెళ్ళను" అన్నది దీపిక.
"దీపికా! మనింట్లో లాగా నా చెల్లి, నా తమ్ముడూ అంటూ చనువు చూపలేవు. అల్లుడు గారి మనసు తెలుసుకుని నడుచుకోవాలి. మొదట నువ్వు సంతోషంగా ఉండు" చెప్పింది తల్లి రాజేశ్వరి.
"అమ్మకి భయమెక్కువ…సరి...నేను బయలుదేరతాను"
"ప్రియా...నాన్న నిన్ను బయటకు వెళ్ళద్దని చెప్పారుగా”.
"మూడింటికల్ల వచ్చాస్తానమ్మా... వారం రోజుల క్రితమే చేస్తానని ఒప్పుకున్న ప్రోగ్రాం. పెద్ద సెలెబ్రిటీ. ఇప్పుడు వెళ్ళకపోతే బాగుండదమ్మా"
అప్పుడే అక్కడికి వచ్చిన ప్రియంవద తండ్రి "సరే...ప్రియను వెళ్ళనీ. నువ్వు నాతో రా...కళ్యాణ మండపానికి వెళ్ళాలి. అక్కడ పనులు ఎలా జరుగుతున్నాయో చూడాలి" భార్య రాజేశ్వరితో చెప్పాడు.
'సరేనండి...ఐదు నిమిషాలలో వచ్చాస్తాను" అంటూ వాళ్ళ రూముకు వెళ్ళింది రాజేశ్వరి.
"గౌతం, నువ్వు దీపికతో ఉండు. పెళ్ళి కూతురు ఇంట్లో ఒంటరిగా ఉండ కూడదు"
“సరే డాడీ".
"డాడీ...మీరు వెళ్ళే దారిలో నన్ను డ్రాప్ చేస్తారా?"
ప్రియ అడిగింది.
"నీ స్కూటీ ఏమయ్యింది?"
"రిపేర్ డాడీ"
"సరే...త్వరగా రా"
నవ్వు ముఖంతో హ్యాండ్ బాగ్ తీసుకుని తండ్రితో బయలుదేరింది ప్రియంవద.
అందరూ కూర్చున్నాక కారు బయలుదేరింది.
ఒక టెలివిజన్ ఆఫీసు ముందు కారును ఆపమని చెప్పి ప్రియంవద దిగిపోయింది.
"త్వరగా ఇంటికి వెళ్ళమ్మా"
"సరే డాడీ"
ప్రియ ఆఫీసు లోపలకు వెళ్ళింది.
"మీటింగ్ ఇంకా మొదలు పెట్టలేదమ్మా...నువ్వు మీటింగ్ హాలుకు వెళ్ళొచ్చు" చెప్పాడు ఆఫీస్ సెక్యూరిటీ.
"నాకు మీటింగుతో పనిలేదు...నాకు అవుట్ డోర్ వర్క్" అని చెప్పి తన టేబుల్ దగ్గరకు వెళ్ళింది.
తాను చేయవలసిన పనికి కావలసిన పేపర్లు తీసుకుని, తన సొంత కెమేరాను హాండ్ బ్యాగులో పెట్టుకుని కెమెరా మాన్, లైట్ మాన్ తో కలిసి బయటకు వచ్చింది.
"ప్రియా! మీ అక్కయ్య పెళ్ళి విందుకు మన చానల్ నుంచి యాభై మంది దాకా వస్తున్నాం"
"సరె...మంచి గిఫ్టు కొనుక్కురండి. లేకపోతే డైనింగ్ హాలులోకి పంపను"
"ఎలా మాట్లాడుతోందో చూడు"
"అవునే...మా నాన్న లక్షలు ఖర్చు పెడుతున్నాడు. మీరు ఉచితంగా తిని వెడతానంటే ఎలాగే?"
"అయినా...నీకింత కొవ్వు పనికిరాదే"
"నేను మళ్ళీ వారం రోజుల తరువాతే ఆఫీసుకు వచ్చేది...అందరికి బై...బై"
ప్రియ బయలుదేరి ఆ స్టార్ హోటల్ కు వచ్చింది.
ఎనిమిదో ఫ్లోరు లోని రూం నెంబర్ 125 లో ఉంటోంది 'డాన్స్ మాస్టర్’ .
తాను వచ్చినట్లు రిమైండ్ చేయటానికి సెల్ ఫోన్ తీసింది ప్రియ.
ఇంతలో ఆ సెల్ ఫోన్ మోగింది.
"ఒక్క పది నిమిషాలలొ వచ్చేస్తాను. ఓపన్ టాప్ గార్డన్ లో టేబుల్ బుక్ చేశాను. అక్కడ వైట్ చేయండి" చెప్పింది డాన్స్ మాస్టర్ రోహిణి.
"సరే" అని చెప్పి...24 వ అంతస్తులో ఉన్న ఓపన్ టాప్ గార్డన్ కు వచ్చింది ప్రియంవద.
కెమేరా..స్టాండ్, ఫోకస్ లైట్లు, హ్యాండ్ మైక్...అన్నిటిని ఫిక్స్ చేసుకుంది.
ఇంటర్ ఫ్యూ లో అడగాల్సిన ప్రశ్నలను ఒక సారి చూసుకుంది.
ఆ డాన్స్ మాస్టర్ కి ఈ మధ్యే జాతీయ అవార్దు లభించింది...అందుకే ఇంటర్ వ్యూ!
ఆ అంతస్తు నుండి సిటీ మొత్తం కనబడుతోంది.
ప్రియ, కెమెరా మాన్ జోసఫ్...మరో ఇద్దరు స్టాఫ్ ఆ డాన్స్ మాస్టర్ కోసం కాచుకోనున్నారు.
ప్రియా మెళ్ళగా నడుచుకుంటూ ఆ ఓపన్ టెర్రస్ నుండి సిటి అందాలను తిలకిస్తోంది.
సిటీ అందాలు ఆమెను మురిపించడంతో…తన దగ్గరున్న తన పర్సనల్, లేటస్ట్ టెక్నాలజీ కెమెరాను బయటకు తీసింది. దానికి ఒక అతి నవీన లెన్స్ ఫిక్స్ చేసి దూరంగా కనబడుతున్న ఎత్తైన భవనాల అందాలను చూస్తూ, ఆ అందాలను రికార్దు చేస్తోంది.
అలా చూస్తూ వస్తున్న ప్రియంవద చూపులు సడన్ గా ఒకచోట ఆగినై.
దూరంగా పూర్తికాని ఒక ఎత్తైన భవనం...దాని చివర్లో మనిషిని భయపెట్టే ఒక దృశ్యం.
ఒక అమ్మాయిని ఒక మగమనిషి గొంతు పిసికి చంపుతున్నాడు. ఆ ఆమ్మాయి గింజుకుంటోంది. ఆ మగమనిషి వెనుకభాగమే కనబడుతోంది. మొహం తెలియటం లేదు.
ప్రియంవద శరీరంలో కొద్దిగా వణుకు మొదలయ్యింది.
ధైర్యం తెచ్చుకుని కెమెరాలో నుండి మళ్ళీ చూసింది.
ఈసారి...పిట్టగోడ చివరి అంచుపై ఆమె గొంతును నిక్కొ పెట్టి తన పూర్తి బలంతో బలంగా నొక్కుతున్నాడు.
ఆ అమ్మాయి కళ్ళు తేలేసి క్రిందకు ఒరుగిపోతున్న సమయం, అతని మొహం ముందుకు వచ్చింది.
ప్రియ తన కెమేరా ఫోకస్ ను పెంచింది.
ఆ అమ్మాయి నేలకు వొరిగింది!
ఆ అమ్మాయి ముక్కు దగ్గర తన చేతిని ఉంచి, చనిపోయిందని నిర్ధారణ చేసుకుని, పైకి లేచాడు.
అప్పుడతని మొహం, పూర్తి రూపం క్లియర్ గా కనబడింది.
అతను మరో వైపుకు పరిగెత్తాడు.
మెట్లుదిగుతూ కిందకు వెడుతున్నాడు.
పట్టపగలు బహిరంగంగా ఒక హత్య.
ప్రియ అక్కడ జరిగినదంతా రికార్డు చేసింది. అతని ముఖాన్ని ఎక్కడో చూసినట్లు అనిపించింది.
దానికంటే ఒరిగిపోతూ, ప్రాణాలను వదిలి కింద పడిపోయిన ఆ ఆమ్మాయి పైనే ప్రియంవద ఎక్కువ సేపు క్షుణ్ణం గా తన వీడియో కెమెరాను ఫోకస్ చేసింది.
అక్కడ జరిగిన సంఘటన అంతా అమె నవీన టెక్నాలజీ కెమెరాలో వీడియోగా చిత్రీకరించబడింది.
"ప్రియా, డాన్స్ మాస్టర్ వచ్చేసింది...త్వరగా రా"
"ఇదిగో వస్తున్నా" కెమెరా స్విచ్ ఆఫ్ చేసి కెమెరాను తన హ్యాండ్ బాగులో పెట్టుకుంది.
మనసంతా ఒక హత్యపైన ఉండగా, ఎలాగో ఒకలాగ తన ఇంటర్ వ్యూ ప్రారంభించింది.
ఒక గంటసేపట్లో ఇంటర్ వ్యూ ముగించుకుని బయటకు వచ్చేసింది.
“ఇంటికి వెళ్ళి కంప్యూటర్లో వేసి చూడాలి....ఆ హంతకుడు బాగా కావాల్సిన మనిషిలా ఉన్నాడు...ఎవరతను?....మొహం జ్ఞాపకానికి రావట్లేదు....కంప్యూటర్లో వేసి చూస్తే తెలుస్తుంది!”
Continued...PART-2
*************************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి