దృశ్యం...(సీరియల్) PART-2
చక్రవర్తి తల్లి తండ్రులు హడావిడి పడుతున్నారు.
ఇంటి నిండా బంధువులు.
చక్రవర్తి తండ్రి సాంబశివరావ్ కొన్ని కోట్లకు అధిపతి.
ఎనిమిది కంపెనీలకు ఓనర్.
చక్రవర్తి, తండ్రి నడుపుతున్న ఏ వ్యాపారాన్నీ పట్టించుకోడు. దానికి కారణం చక్రవర్తికికి తన కంటూ ఒక ఉద్యోగం ఉండటమే. ఉద్యోగరీత్యా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సంస్థలతో లావాదేవీలు పెట్టుకున్నందు వలన ...నెలలో ఎక్కువరోజులు విదేశాలలొ ఉంటాడు!
నెలకు ఒకసారి అతన్ని చూడటమే కష్టమయ్యేది సాంబశివరావ్ దంపతులకు. పెళ్ళి గురించి మూడు నెలలు కొడుకుతో మాట్లాడిన తల్లి అనుసూయ చివరికి అతన్ని సెంటిమెంటల్ గా లాక్ చేయడంతో చక్రవర్తి పెళ్ళికి ఒప్పుకున్నాడు.
అతనే మాట్రీమొని సైటులో అమ్మాయిని సెలెక్ట్ చేసుకుని, పెళ్ళికి అంగీకరించాడు.
"మిగిలిన ఏర్పాట్లన్నీ నువ్వు చూసుకో అమ్మా"
"రేయ్...పెళ్ళి చేసుకోవటానికి నువ్వే రావాలి. నువ్వు వచ్చే తాళి కట్టాలి. మమ్మల్ని అవమానపరిచేటట్లు చేయకు!"--కొడుకును హెచ్చరించాడు సాంబశివరావ్.
పెళ్ళి సంబంధం ఖాయం చేసుకున్న తరువాత దీపికతో రోజూ ఫోన్లో మాట్లాడుతున్నాడు చక్రవర్తి.
ఆమెను రెండు మూడు సార్లు బయటకు తీసుకు వెళ్ళటం, హోటల్స్ లో భోజనాలు చేయడం లాంటివి జరిగాయి.
దీపిక రెండుసార్లు చక్రవర్తి ఇంటికి వెళ్ళడం కూడా జరిగింది. కానీ అతను మాత్రం దీపిక వాళ్ళింటికి ఒక్కసారి కూడా వెళ్ళలేదు.
దీపిక తల్లితండ్రులతో, దీపిక తమ్ముడితో చక్రవర్తి ఫోన్లో మాట్లాడుతున్నాడు.
ఇంతవరకు చక్రవర్తి మాట్లాడనది దీపిక చెల్లి ప్రియంవదతో మాత్రమే!
"నాది అడ్వర్ టైజింగ్ కంపని, ఆమె మీడియాలో ఉంటోంది. ఆమెతో నాకు ఎక్కువ పనులు ఉంటాయి. అమె సహాయం నాకు కావాలి"...దీపికతో చెప్పాడు చక్రవర్తి.
ఈ విషయాన్ని చెల్లితో చెప్పినప్పుడు...ప్రియంవద ఎంతో గర్వపడింది.
"ఏమండీ....రేపు సాయంత్రం నాలుగింటికల్లా మనం మండపానికి వెళ్ళాలి"
“నీ కొడుక్కి జ్ఞాపకం చెయ్యి...మనల్ని ఇబ్బంది పెట్టద్దని చెప్పు"
"మినిస్టర్లు, ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు, వెండితెర నటినటులు, సంఘంలో ప్రముఖ వ్యాపారవేత్తలు వస్తారు"
"వియ్యంకుడితో చెప్పారా?"
కరెక్టుగా అదే సమయానికి సెల్ ఫోన్ రింగ్ అయ్యింది.
ఫోనులో పేరు చూసి "ఆయనే మాట్లాడుతున్నారు" అని భార్యకు చెబుతూ "ఎక్కడున్నారు?"
అని వియ్యంకుడిని అడిగాడు.
"మీ ఇంటి వాకిట్లో"
వాకిటికి వచ్చి రామకృష్ణగారిని ఆహ్వానించాడు సాంబశివరావ్.
మండపంలో వి.ఐ.పి లకు స్వాగతం, కుర్చొటానికి ప్రత్యేక సోఫాలు అంటూ ఏర్పాట్ల గురించి రామకృష్ణ వివరిస్తుంటే....సాంబశివరావ్ ఆశ్చర్యపోయాడు.
"చాలాబాగా చేశారు" అంటూ ప్రశంసించాడు.
"డబ్బు ముఖ్యం కాదు...వచ్చే పెద్ద మనుష్యులు ముఖం వాలేయకుండా సంతోషంగా దంపతులను ఆశీర్వదించాలి కదా?"
అనుసూయ ఆజ్ఞ ప్రకారం పండ్ల రసం వచ్చింది.
"భోజనం చేసి వెళ్ళొచ్చుకదా"
"లేదండి.అంత టైములేదు...అల్లుడుగారు ఉన్నారా?"
అడిగాడు రామకృష్ణ .
"లేడండి. పనుందని బయటకు వెళ్ళేడు. రాత్రికి కాళ్ళూ చేతులూ కట్టేసి, రేపు మండపానికి కరెక్ట్ టైముకు తీసుకువస్తాను"
ఫోన్ మోగింది. చేతులో ఉన్న సెల్ ఫోన్ ఆన్ చేశాడు సాంబశివరావ్.
"డాడీ నేను చక్రవర్తి మాట్లాడుతున్నాను"
"తెలుస్తోంది...విషయం ఏమిటో చెప్పు. ఇక్కడ నీకు కాబోయే మామగారు ఉన్నారు"
"మా మామగారి గురించి తరువాత మాట్లాడు కుందాం! మొదట నేను చెప్పేది విను. నేను చెప్పే చోటుకు నువ్వు వెంటనే రావాలి...ప్లీజ్ డాడీ"
"ఎక్కడికి?...ఎందుకు?"
"మీరు వెంటనే బయలుదేరి రండి. ఇక్కడికి వచ్చిన తరువాత చెబుతాను" అంటూ అడ్రెస్స్ చెప్పాడు .
"అక్కడికెందుకురా....సరే...సరే వస్తాను...వెంటనే వస్తాను" అంటూ ఫోన్ కట్ చేసి “మా అబ్బాయి నన్ను అర్జెంటుగా రమ్మంటున్నాడు. వెంటనే బయలుదేరాలి. ఏమనుకోకండి" వియ్యంకుండిని చూసి అన్నాడు సాంబశివరావ్.
"మేమూ బయలుదేరతాం" అంటూ రమకృష్ణ కూడా బయలుదేరాడు.
సాంబశివరావ్ కార్లో కూర్చున్నాడు.
"డ్రైవర్...కొత్తగా కడుతున్న ముప్పై అంతస్తుల ‘చక్రవర్తి కన్స్ ట్రక్షన్ బిల్డింగ్’ ఉందికదా అశోక్ నగర్ లో...అక్కడికి పోనీయ్"
"సరే సార్".
సాంబశివం బిల్డర్స్, చక్రవర్తి కన్స్ ట్రక్షన్, అనుసూయా రియల్ ఎస్టేట్ అనే పేర్లతో సిటీలో చాలా ప్రదేశాలలో స్థలాలు కొని అపార్ట్ మెంట్స్, ఆఫీస్ కాంప్లెక్స్, గెస్ట్ హౌస్ లు కడుతున్నారు.
అన్నీ విదేశీ డిజైన్లతో, నవీన వసతులతో, అత్యుత్తమ నాణ్యతా పరికరాలతో కొన్ని వేల రూపాయల పెటుబడితో నిర్మించబడుతున్నాయి.
డబ్బు గలవారు మాత్రమే కొనగలిగిన ఇళ్ళు.
సాంబశివరావ్ అరగంటలో ఆ చోటుకు వెళ్ళాడు...చుట్టూ బోలడంతమంది జనం. పోలీస్ వాహనాలు!
కార్లో నుండి సాంబశివరావ్ దిగగానే, చక్రవర్తి పరిగెత్తుకుని వచ్చాడు.
అతనితో పాటూ పోలీస్ హై అఫీషియల్స్ వచ్చారు.
"ఏమిటి విషయం?” కంగారు పడుతూ అడిగాడు సాంబశివరావ్.
ఒక పోలీస్ అధికారి సాంబశివరావ్కు షేక్ హ్యాండ్ ఇచ్చాడు.
"పైకి రండి సార్" .
పనులకోసం అమర్చబడిన ఒక లిఫ్టులో ఏడెనిమిదిమంది ఎక్కి ముప్పై వ అంతస్తు టెర్రస్ కి చేరుకున్నారు.
అది అతి పెద్ద విశాలమైన టెర్రస్.
అక్కడ కూడా పోలీస్ బృందాలు గ్రూపులుగా నిలబడున్నారు.
సాంబశివరావ్ తో పాటూ వచ్చిన పోలీస్ అధికారులు సాంబశివరావ్ ని ఒక చోటుకు తీసుకు వెళ్ళారు.
అక్కడ ఒక పడుచు యువతి బోర్ల పడి ఉంది.
సాంబశివరావ్కి షాక్!.
"ఎవరది?...ఏమైంది?"
"ఎవరో ఒకమ్మాయి చచ్చి పడుంది డాడీ. డాక్టర్ వచ్చి చూశాడు. ప్రాణం లేదని చెప్పాడు"
"ఎవరీ అమ్మాయి? మన బిల్డింగ్ చివరి అంతస్తుకు ఎలా వచ్చింది?"
"ఈ రోజు పనివాళ్ళు, సూపర్వైజర్లు ఎవరూ పనిలోకి రాలేదు. నేషనల్ హాలిడే కదా. ఎవరూ పనికి రాలేదు. ఒక సెక్యూరిటీ మాత్రం ఉన్నాడు. అతను గంటకు ఒకసారి చెకింగ్ కు వస్తాడు...అలా వచ్చినప్పుడు ఈ అమ్మాయి ఇక్కడ చచ్చి పడుందట "
"ఈమె పైకి వెళ్ళటం నువ్వు చూడలేదా?"
అక్కడే నిలబడున్న సెక్యూరిటిని చూసి కోపంగా అడిగాడు సాంబశివరావ్.
"టీతాగటానికి వెళ్ళిన సమయంలో వెళ్ళుంటుంది సార్"
"ఇతను మన సూపర్ వైజర్ కు సమాచారం ఇచ్చి, అతను ఇంజనియర్ ను పిలుచుకు వచ్చి చూసిన తరువాత నాకు ఫోన్ చేశారు. నేను పోలీసులకు ఫోన్ చేసి, డాక్టర్ను పిలుచుకుని వచ్చాను"
"ఎలా...ఎలా ఈ సంఘటన జరిగుంటుంది"
"గొంతు నరాలు చితికి ఉన్నాయట సార్. ఖచ్చితంగా గొంతు నొక్క బడున్నదని డాక్టర్ గారు చెపారు. పొస్టు మార్టం అయితేగానీ అసలు నిజాలు తెలియవు సార్ "
"అలాగైతే...హత్యా? ఈ అమ్మాయి హత్య చేయబడిందా?"
"తెలియటం లేదు"
"ఏమిటి సార్ ఇది? మేము పేరు, గౌరవమూ ఉన్న బిల్డర్స్. మా బిల్డింగ్ లో ఇలా ఒక సంఘటన జరిగితే మా పేరు ప్రఖ్యాతలు ఏంగాను...ఇదెవరో మేమంటే గిట్టని వాళ్ళు చేసుంటారు. ఇది మీడియాకు వెళ్ళకూడదు"
"సారీ సార్...అల్ రెడీ వెళ్ళిపోయింది"
"మై గాడ్!"
ఈ లోపు కొంతమంది పత్రికా విలేఖర్లు, రెండు మూడు టీవీ చానల్ రిపోర్టర్స్ అక్కడికి వచ్చారు........వాళ్లను అరికట్టలేకపోయేరు.
టీవీ చానల్స్ రిపోర్టర్లు అక్కడి విషయాలను వాళ్ళకు తోచిన రీతిలో కళ్ళు, ముక్కు, చెవి పెట్టి ప్రత్యక్ష ప్రశారం చేస్తున్నారు.
అది చూసిన సాంబశివరావ్ కొడుకును చూసి "ఏమిట్రా చక్రవర్తి ఇది" అడిగాడు.
"వేరే దారి లేదు డాడీ. ఎవరినీ మనం అడ్డగించలేము. జరగాల్సింది జరగనివ్వండి"
ఫోరన్సిక్ నిపుణులు వచ్చి పని మొదలు పెట్టారు. పోలీస్ ఫార్మాలిటీస్ ముగిసింది. ఆ అమాయి శవాన్ని వ్యానులోకి ఎక్కించారు.
ఆ సెక్యూరిటీ గార్డును, భవనంలో పనిలో ఉన్న ఉద్యోగస్తులను, ఇంజనియర్ ను పోలీసు స్టేషన్ కు రావాలని ఆర్డర్ వేశారు పోలీసులు.
"మిస్టర్ చక్రవర్తి! మీరు, మీ డాడీ కూడా స్టేషన్ కు రావాలి"
"వద్దు, వద్దు. చక్రవర్తి వద్దు. రేపు అతనికి పెళ్ళి. ఆ రోజు సాయంత్రం రిషెప్షన్, ఎళ్ళుండి పెళ్ళి"
"అక్కడ మీకేమీ పెద్ద పనిలేదు సార్. మీరు స్టేషన్ కు వచ్చి స్టేట్ మెంట్ ఇచ్చి, ఒక కంప్లైంట్ రిజిస్టర్ చేసి వెళ్ళండి. మేము విచారణ మొదలుపెడతాం...పెళ్ళి ముగించుకుని రండి. ఈ లోపు మీకు మా నుండి ఎటువంటి ఒత్తిడీ రాదు" ఇన్స్ పెక్టర్ చెప్పాడు.
"ఇది మామూలుగా జరిగే తంతే డాడి. మీరేమీ కంగారుపడకండి!" తండ్రికి ధైరం పంచాడు చక్రవర్తి.
ఇద్దరూ కారు ఎక్కారు. ..చక్రవర్తి స్టీరింగ్ ముందు కూర్చున్నాడు.
కారు పోలీస్ స్టేషన్ వైపుకు వేగంగా పోతోంది.
"ఎందుకురా మన బిల్డింగును ఎంచుకున్నారు?".
"డాడీ, ఈ చుట్టు పక్కల చాలా బిల్దింగులు ఉన్నాయి. అన్నింటిలోనూ పనులు జరుగుతున్నాయి. జన సంచారం తక్కువ, అనువైన చోటు కోసం వెతుకుతున్నప్పుడు మన బిల్డింగ్ లిఫ్ట్ తో పాటు కనబడుంటుంది...అంతే, దానిలోకి చొరబడుంటారు"
"చ...నేనెంత గౌరవమైన మనిషిని…. నాకెందుకీ అవమానం " తనలోతానే గొణుకున్నాడు సాంబశివరావ్.
వెనుక నుండి నాలుగు పోలీసు కార్లు సైరన్ వేసుకుని వేగంగా వీళ్ళ కారుని దాటుకుని ముందుకు వెళ్ళినై.
సాంబశివరావ్ బుర్ర ఆలొచనలతో సతమత మయ్యింది.
”వ్యాపారంలో నాకు చాలామంది శత్రువులున్నారు. అందులో ఎవరో ఒకరు నా పేరుకు కళంకం తీసుకురావాలని నా బిల్డింగును ఎంచుకున్నారా "
"ఎవరా అమ్మాయి?"
"హత్యా లేక ఆత్మహత్యా?"
"పోలీసులు హత్య అని చెబుతున్నారు"
"హత్యే అయితే ఆమెను గొంతుపిసికి చంపిందేవరు?"
"హంతకుడికి ఆమెతో గొడవేమిటి"
పలురకాల ఆలొచనలు సాంబశివరావ్ బుర్రను తింటున్నాయి.
ఇద్దరూ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు.
సాంబశివరావ్ ఆ పోలీసు స్టేషన్ కి వస్తున్నాడని తెలుసుకుని పోలీసుల ఉన్నత అధికారి తన బృందంతో అక్కడకు వచ్చాడు.
సాంబశివరావ్ తన బాధను ఆ అధికారితో మొరపెట్టుకున్నాడు.
“కనిపెట్టేయొచ్చు సార్. ఎవరు మిమ్మల్ని ఇరకాటంలో పెట్టాలని చూస్తున్నారో వాళ్ళని కనిపెట్టేయచ్చు. దానికొసం మీరు అధైర్యపడకండి. మీ అబ్బాయి పెళ్ళి పనులు చూసికోండి"
"ఇది మీడియాలో వస్తోందే'
"రానివ్వండి. ఈ రోజుల్లో మీడియాలో తొంబై శాతం ఇలాంటి వార్తలే! అందుకని మీరెందుకు బాధపడటం. గొప్ప వాళ్ళ పేర్లను అల్లరిపెట్టటానికి ఒక గ్రూపే ఉన్నది సార్. మేము చూసుకుంటాం. మీరు హాయిగా ఉండండి"
"అయితే మేము బయలుదేరవచ్చా?"
"బయలుదేరండి సార్"
వెనక్కు తిరిగి రెండడుగులు ముందుకు వేసిన సాంబశివరావ్ ఏదో గుర్తుకు వచ్చి వెనక్కి తిరిగాడు.
“చెప్పండి సాంబశివరావ్ గారు"
"రేపు మా అబ్బాయి పెళ్ళి..."
"మూడు రోజులు మిమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దని ఆల్రెడీ మా వాళ్ళకు చెప్పాను"
"ధాంక్యూ డి.ఎస్.పి" అని చెప్పి తండ్రీ కొడుకులిద్దరూ బయలుదేరారు.
Continued...PART-3
*************************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి