6, ఫిబ్రవరి 2022, ఆదివారం

దృశ్యం...(సీరియల్)...PART-10

 

                                                                               దృశ్యం...(సీరియల్)                                                                                                                                                                         PART-10

కమలను జీపులో తీసుకు వచ్చిన ఇద్దరు ఆడ పోలీసులు జీపు ఓక ఇంటిముందు ఆగటంతో కమలను జీపులోనుంచి క్రిందకు దింపారు.

పరిసరాలను చూసిన కమల గాబరా చెందింది.

కమలను ఇంటిలోపలకు తీసుకు వెళ్ళారు.

"ఎందుకు నన్ను ఇక్కడకు తీసుకు వచ్చారు?"

"లోపలకు వెళ్ళు" అంటూ కమలను గదిలోపలకు తోసి, వాళ్ళూ లోపలకు వచ్చి తలుపులు వేశారు.

"మీరిద్దరూ పోలీసులు కాదా?"

"కాదు! పోలీసుల వేషం వేసుకుని వచ్చాము"

"ఎందుకు?"

"నీకు ప్రతిదానికి మేము వివరం ఇచ్చుకోవాలా? మేము అడిగేదానికి మాత్రం నువ్వు జవాబు చెప్పు"

"మొదట మీరెవరో చెప్పండి?"

"నీ అత్తగారు, ఆడపడుచూ...నోరు ముయ్యవే".....లాగి చెంప మీద ఒకటిచ్చారు.

"నన్నెందుకు కొడుతున్నారు?"

"కాంచన గురించి నీకు తెలిసిందంతా చెప్పు"

"ఎందుకు చెప్పాలి?"

"చెప్పకపోతే దెబ్బలు తినే చచ్చిపోతావు"

కమల హడలిపోయింది.

"చెప్పు. నీకు తెలిసున్నదంతా ఒక్కటి కూడా దాచకుండా చెప్పు"

"కాంచన, నేనూ ఒకే చోట పనిచేశాం, ఒకే ఇంట్లో కలిసున్నాం"

"అదంతా మాకూ తెలుసు...దానికి పైన చెప్పు"

"ఇంకేమీ లేదు"

"పెళ్ళి రిసెప్షన్ కు వచ్చావు! ఎవరు పిలిస్తే వచ్చావు...పెళ్ళీ కొడుకు తరఫా...పెళ్ళి కూతురు తరుఫా"

"పెళ్ళి కూతురు తరఫున"

"వాళ్ళు నీకెలా తెలుసు?”

ఒక్క క్షణం ఆలొచించింది.

"మా వస్త్ర దుఖాణంలో బట్టలు కొనుక్కోడానికి వచ్చినప్పుడు ఏర్పడ్డ పరిచయం"

"ఎవరితో?"

"పెళ్ళి కూతురి చెల్లితో"

"ఆమెను బయటకు తీసుకు వచ్చి ఏం మాట్లాడావు?”

"ఏమీ లేదు...స్నేహ పూర్వక మాటలే"

"లేదు...ఏదో చెప్పటానికే వచ్చావు!  అదేమిటి?"

"ఏమీ లేదు"

ఇద్దరూ ఒకరి తరువాత ఒకరు కమలను కొట్టారు.

"నువ్వు నిజం చెప్పలేదనుకో...చిత్రవధ అనుభవిస్తావు. మర్యాదగా చెప్పేయ్" 

చెప్పినట్లే దెబ్బలు ఎక్కువయ్యాయి.

కమల దెబ్బలను తట్టుకోలేకపోయింది.

పోలీసులకు భయపడి కాంచన గురించిన నిజాలను ప్రియంవదతో చెబితే, ఇంకెవరి దగ్గరో ఇరుక్కుపోయేము.

ఎవరు వీళ్ళు.

పోలీసుల వేషంలో వచ్చి నన్ను ఎత్తుకొచ్చిన ఆడ రౌడీలు.

అలాగైతే వీళ్ళు...చక్రవర్తి యొక్క కిరాయ్ మనుషులు.

నా మూలంగా పోలీసులకు ఎటువంటి నిజమూ తెలియకూడదని, నన్ను వెంబడించి పట్టుకున్నారు.

"చెప్పవే! ఏమిటి ఆలొచిస్తున్నావు? నువ్వు మాట్లాడకపోతే నిన్ని చంపేసి...డస్ట్ బిన్ లో పడేసి వెళ్ళిపోతాం"

చితకబాదారు.

"చెప్తాను! కాంచనకి ఒక డబ్బుగలవాడితో పరిచయం ఉన్నది. విదేశీయ కారులో వచ్చి దిగటం నేను చూశాను. అదే కారులోనే రోజు పెళ్ళికొడుకు వూరేగింపుగా వచ్చాడు. వాళ్ళ బిల్డింగులోనే హత్య జరిగింది. ఖచ్చితంగా వాళ్ళకు హత్యతో సంబంధం ఉంది. పెళ్ళికూతుర్ని కాపాడదామని  వచ్చాను. పెళ్ళికూతురి చెళ్ళెలు ఎవరనేది నాకు తెలియదు. పెళ్ళికూతురికి బాగా సన్నిహితంగా వేదికపై నిలబడి ఆమెతో నవ్వుతూ మాట్లాడుతోంది. అందుకని ఆమెను పిలిచి ఆమెకు కాంచన గురించి చెప్పాను."

"తరువాత?"

"అంతేనండి. ఇక మీరు నన్ను చంపి పారేసినా నా దగ్గర ఇంకేమీ సమాచారం లేదు" 

బెదిరించి చూశారు.

కమల దగ్గర నుంచి జవాబు లేదు.

ఒక మహిళ దగ్గరున్న సెల్ ఫోన్ మోగింది. ఆమె బయటకు వచ్చింది.

"విచారిస్తున్నాం సార్. దాని దగ్గర నుంచి ఒకే ఒక నిజమే దొరికింది. అంతకంటే ఇంకేమీ దొరికేటట్టు లేదు సార్"

"ఏమిటా నిజం?"

కమల చెప్పింది చెప్పారు. అవతలి నుండి వాళ్ళకు ఏదో అదేశాలు వచ్చినై.

"సరే సార్"

కమల దగ్గరకు వచ్చారు.

"సరే...దీన్ని కట్టిపడేయ్"

గదిలో ఉన్న ఒక కుర్చీలో కమలను కట్టేశారు.

కమల ఏదో అడుగుతున్నా సమాధానం చెప్పకుండా గది వెలుపలకు వచ్చి, గదికి తాళం వేసి, ఇంటి బయటకు వచ్చి అక్కడున్న జీపులో ఎక్కారు.

                                                                                *********************

సమయం రాత్రి పదకొండు.

రామకృష్ణ గారు, రాజేశ్వరి హడావడి పడుతున్నారు. రామకృష్ణ భార్యను ఇస్టం వచ్చినట్టు తిడుతున్నాడు.

"ఎందుకు వాళ్ళను పోనిచ్చావు? ఇంటిదగ్గర వాళ్ళిద్దరికీ అంత తలపోయేంత పనేమిటో?"

"నేను ఆపానండి. వాళ్ళు వినలేదు.వెళ్ళొచ్చి ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి అని చెప్పారు"

"ఎవరిదగ్గర?"

"మన ఇద్దరి దగ్గరా"....మన దగ్గర ముఖ్య విషయమా...ఏమిటది? సరే, ఫోన్ చెయ్యి"

ప్రియంవద సెల్ ఫోన్ కు ఫోన్ చేసింది రాజేశ్వరి. స్విచ్ ఆఫ్ చేయబడింది అని రిప్లై వచ్చింది. గౌతం నెంబరుకు ఫోన్ చేసింది. స్విచ్ ఆఫ్ చేయబడింది అని రిప్లై వచ్చింది.

ఇంటి నెంబర్ కు ఫోన్ చేసింది. రింగ్ అయ్యింది. ఎవరూ ఎత్తలేదు.

మరో పావుగంట సమయం గడిచింది. రామకృష్ణ గారికీ, రాజేశ్వరికీ ఆందోళణ మొదలయ్యింది.

పెళ్ళికూతురు దీపిక బయటకు వచ్చింది.

"ఆమ్మా...."ఏదైనా ప్రాబ్లమా?"

"నువ్వు పెళ్ళి కూతురువి. వెళ్ళి పడుకోమ్మా. ప్రొద్దున త్వరగా లేవాలి"

"ఇద్దరి ముఖాలూ సరిగ్గా లేవు. ఏమైంది?"

వేరే దారిలేక రాజేశ్వరి చెప్పడంతో, దీపిక కూడా ఆందోళనలో పడింది.

"మనుషులను పంపించి చూసిరమ్మను డాడీ"

రాజేశ్వరి ఏడవటం మొదలుపెట్టింది.

"ఏదో జరగకూడనిది జరిగింది"

"అమ్మా...ఏడవకు! ఎవరైనా చూస్తే తప్పుగా అనుకుంటారు" 

"నాలుగు రోజులుగా ప్రియా ముఖమే బాగాలేదు...దాని మనసులో ఏదో ఒక పెద్ద సమస్య ఉన్నది. పెళ్ళి మూలంగా అది చెప్పకుండా దాచింది"

"నువ్వేం చెబుతున్నావే?"

"అవునండి...అది నార్మల్ గానే లేదు"

"ఇద్దరూ లోపలకు వచ్చి మాట్లాడండి"

దీపిక తల్లిని లాక్కొచ్చింది. వాళ్ళ ముగ్గురే ఉన్నారు. తలుపులు వేయబడ్డాయి!

ఇదంతా రెండు కళ్ళు గమనిస్తునాయి!

"నువ్వేమంటావ్ దీపిక?"

"మనసులో అనిపించిందే చేబుతున్నాను"

"సరె...చెప్పు"

"వియ్యంకుడు చాలా టెన్షన్ గా...హడావిడిగా ఉన్నారు"

"రిసెప్షన్ కి పెద్ద పెద్ద వి..పి లు వచ్చారు... మాత్రం టెన్షన్ ఉండటం న్యాయమే?"

"పెళ్ళీకొడుకు ముఖాన కూడా నవ్వ లేక అదో విధంగా బిగుసుకు పోయాడు. దీపిక...నువ్వు పక్కనే ఉన్నావుగా! నీకు అర్ధం కాలేదా?"

"దానికి కారణం ఉన్నది"

"ఏమిటా కారణం?”

వాళ్ళ బిల్డింగులొ పట్టపగలు హత్య జరిగింది. అది మీడియాలో వచ్చి...ఊరంతా అదే మాట్లాడుకుంటున్నారు. వీళ్ళకూ హత్యతో సంబంధం ఉంటుందని మాట్లాడుకుంటున్నారు. వచ్చిన వాళ్ళందరూ దాని గురించి అడుగుతున్నారు...టెన్షన్ లేకుండా ఎలా ఉండగలరు?"

"నేనోకటి అడుగాతాను దీపిక. నిజంగానే వీళ్ళకు హత్యతో సంబంధం ఉంటుందా"

"ఏమిటే వాగుతున్నావ్?"

"కోపంతెచ్చుకోకండి! నా మనసులో తోచింది నేను చెబుతున్నా. ఇందులో ఏదో మర్మం ఉంది. మన ప్రియకి దాంట్లో సగం తెలుసనుకుంటా. అది 'మీడియా'లోని అమ్మాయి కదా!"

"ఏమిటే...ఏమిటేమిటో చెబుతున్నావు"

"లేదండి...ఇప్పుడు ప్రియా, గౌతం ఇంటికి వెళ్ళిన కారణం కూడా అదే. మనల్ని కూర్చోపెట్టి మాట్లాడాలని చెప్పింది ప్రియా..."

"దీపికా, మీ అమ్మ ఏం చెబుతోంది? మధ్యరాత్రి కాబోతోంది. వెళ్ళిన పిల్లలు కనిపించటం లేదు"

"అదేనండి భయంగా ఉన్నది. వాళ్ళకేదో ఆపద అని నా మనసు చెబుతోంది"

"రాజేశ్వరీ నువ్వు మాట్లాడుతూపోతుంటే... నా కాళ్ళు వణుకు తున్నాయి. నేను నిలబడలేక పోతున్నాను"

రామకృష్ణ గారు కూర్చుండిపోయారు.

"మీరు వెంటనే ఎవరితో మాట్లాడాలో, వాళ్ళతో మాట్లాడండి"

"భగవంతుడా...తెల్లారితే పెళ్ళి. ఏటువంటి గొడవలూ లేకుండా మంచిగా జరుగుతుందా? నాకేమి అర్ధం కావటం లేదు...?”

తనలో తానే గొణుకుంటున్నారు.

"వియ్యంకుడిని పిలిచి వెంటనే మాట్లాడండి..."

"దేనికే?"

"మాట్లాడే తీరాలి. వెళ్ళిన పిల్లలు తిరిగి రాలేదు?"

                                                                                   ***********************

కారులో నుండి ప్రియంవదని, గౌతం ని దింపి గోడౌన్ లాంటి పెద్ద హాలులోకి లాక్కువెళ్ళారు. తరువాత దాని షట్టర్స్ దింపారు.

అక్కడ లెక్కలేనన్ని బియ్యపు బస్తాలు ఎత్తుగా పెట్టున్నాయి. అవికాక దెబ్బతిని, పాడైపోయిన కారు, కారు స్పేర్ పార్టులు ఉన్నాయి.

వాళ్ళదగ్గర ఉన్న లాప్ టాప్ ను బలవంతంగా లాక్కున్నారు.

"చెప్పండి...మీరిద్దరూ ఎందుకు ఈ సమయంలో ఇంటికి వెళ్ళారు?"

"మా ఇంటికి మేము వెళ్ళటానికి మీకు కారణం ఎందుకు చెప్పాలి ...? అది అడగటానికి మీరెవరు?"

“కాంచన స్నేహితురాలు కమల తో ఏం మాట్లాడావు? రిసెప్షన్ కు వచ్చిన నిన్ను ఆమె ఎందుకు బయటకు తీసుకు వెళ్ళింది...ఏం చెప్పింది? ఆ తరువాతే మీరిద్దరూ ఇంటికి వెళ్ళారు..."

"కమల, చనిపోయిన కాంచనతో కలిసి పనిచేసింది. ఒకే ఇంట్లో కలిసున్నారు"

"దానికి....?"

కమల చెప్పినదానిని అలాగే చెప్పింది ప్రియా.

"సరే...ఎందుకు ఇంటికి వెళ్ళారు?"

"దానికీ, మేము ఇంటికి వెళ్ళినదానికి సంబంధంలేదు. ఇంట్లో అలాగే పడేసొచ్చిన వస్తువులను చక్కబరచటానికి వెళ్ళాము"

"కాదు...అబద్దం. మండపానికి ఈ లాప్ టాప్ అవసరం ఏమిటి?"

ఒకతను బ్యాగ్ తెరిచాడు. లోపల కెమెరా ఉన్నది.

"దేనికి ఇవన్నీ...?.

"ఫోటోలు తీయటానికి! తీసిన ఫోటోలను వెంటనే లాప్ టాప్ లో లోడ్ చేయటానికి తీసుకు వచ్చాము"

"ఇది నిజమేనా?"

"ఇంకేమీ లేదు"

అప్పుడు సెల్ ఫోన్ మోగింది.

"చెప్పండి సార్!"

"ఇద్దరూ ఉన్నారా?"

వాళ్ళిద్దరూ చెప్పింది ఇతను అలాగే వొప్పజెప్పాడు.

"....................."

"కమల మన గురించి చెప్పటానికి ప్రయత్నించింది. కానీ చెప్పలేదు. వీళ్ళు ఇంటికి వెళ్ళింది కెమేరా, లాప్ టాప్ లను తెచ్చుకోవటానికి"

"కమల చెప్పిన విషయాల వలన మనకెమైనా ఇబ్బంది ఉందా?"

"తెలియటం లేదు...".

“సరే...వాళ్ళను వదిలిపెట్టు. మండపానికి వచ్చేయని! లేకపోతే గొడవ పెద్దదవుతుంది"

"సరే సార్"

"కమలను మాత్రం మన కస్టడీలోనే ఉంచండి. వీళ్ళను వదిలేయండి"

ఆదేశాలు వచ్చిన తరువాత వాటిని అమలుపరచటంలోకి దిగారు.

"మీరిద్దరూ వెళ్ళొచ్చు"

"ఏమైంది...?"

"పట్టుకోండి మీ బ్యాగును. వెళ్ళండి...ఎటువంటి పరిశోధన చేయకండి. వెళ్ళి పెళ్ళి పనులు చూసుకోండి"

షట్టర్స్ ను తెరిచారు.

                                                                                              Continued...PART-11

****************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి