దృశ్యం...(సీరియల్) PART-9
కమల ఇంటికి తిరిగి వచ్చింది. సమయం రాత్రి తొమ్మిదైంది.
కాంచన తల్లి గొణుగుతూనే ఉన్నది.
"ఏమ్మా కమలా...ఎక్కడికెళ్ళావు?"
"మంచి జరగటం కోసం వెళ్ళాను. కాంచనను చంపిందేవరో త్వరలోనే బయటపడుతుంది. చెప్పాల్సినది ఎవరికి చెప్పాలో...వాళ్ళకు చెప్పేశాను!"
“నువ్వు మాట్లాడేదేమిటో అర్ధంకావటంలేదు"
"రేపు అర్ధమవుతుంది. కాంచనను పోగొట్టుకుని మీ కుటుంబం కొట్టుమిట్టాడుతోంది. దానికి నష్ట పరిహారం నేను ఇప్పిస్తాను"
"అదే చనిపోయిన తరువాత, డబ్బుతో ఏం చేయగలం?"
"అలా చెప్పకండి. ఉన్నవాళ్ళు బ్రతకాలిగా?"
కాంచన తల్లి ఏడుపు మొదలెట్టింది.
"ఏడవకండి. ఇప్పటికే ఒకసారి డాక్టర్ దగ్గరకు వెళ్ళొచ్చాము. ఎక్కువ ఆలొచించకుండా పడుకోండి"
కమల బయటకు వచ్చింది.
సహ ఉద్యోగులు కమల దగ్గరకు వచ్చారు.
"కమలా...మేము చెబుతున్నామని కోపగించుకోకు! రేపు ప్రొద్దున వాళ్ళను పంపించేయి"
"ఎందుకు..దేనికి?"
"ఏమిటి కమలా అలా అడుగుతున్నావు? ఇప్పటికే కాంచన హత్య చేయబడ్డ కారణంగా, ఇక్కడికి పోలీసులు రావటం...మనల్ని విచారణ పేరుతో ప్రశ్నలతో వేధించడం తట్టుకోలేకపోతున్నాం. పత్రికలలో అందరి పేర్లూ వచ్చాశాయి. ఎంత అవమానం? ఊర్ల నుండి ఫోన్లు. 'ఉద్యోగం మానేసి వచ్చేయ’ అని చెబుతున్నారు. ఇప్పుడు అలా చేస్తే పోలీసులకు సందేహం వస్తుంది. ఎంతటి ప్రాబ్లం వచ్చిందో చూడు. ఇక్కడ ఉండలేకపోతున్నాము...ఇళ్ళకు వెళ్ళలేకపోతున్నాము"
"సరేనే...! ఇలా జరుగుతుందని మనం అనుకున్నామా? అది చెడిపోయి, మన ప్రాణం తీస్తోంది. నువ్వు వాళ్ళమ్మకు ఆశ్రయం ఇస్తున్నావు. అది మాకు నచ్చలేదు. వాళ్ళను బయటకు పంపించేయి"
"పాపమే! కూతుర్ని పోగొట్టుకున్న శోకం ఒక పక్క, ఆరొగ్యం బాగోలేక మరొపక్క"
"దానికి మనమా బాధ్యులం? ఆలాంటి కూతుర్ని కన్నందుకు అనుభవించని"
"మెల్లగా మాట్లాడవే! ఆవిడ వింటుందే..."
సమయం రాత్రి పది అవుతోంది.
ఎవరో తలుపు తడుతున్నారు.
ఇద్దరు ఆడ పోలీసులు.
"చూసావా...ఏ టైములో విచారణకు వచ్చారో"
"ఏమిటండి"
"మిమ్మల్ని చూడటానికే వచ్చాము"
“ఏం అడగాలి? చాలా అడిగేశారు! ఈ టైములో వస్తే ఎలా చెప్పండి”
"కమలానే కదా నువ్వు?... నువ్వు మాత్రం రా”
"ఎక్కడికి"
"పోలీస్ స్టేషన్ కే!"
"వద్దండి! రేపు ప్రొద్దున వస్తాను"
"మేము పిలిస్తే రావాలి. నువ్వుగా వస్తావా? లేక కొట్టి లాక్కెళ్ళమా...రావే"
కమల భయపడిపోయింది.
"రా...వచ్చి జీపులో ఎక్కు"
బలవంతంగా పట్టుకుని కమలను తీసుకు వెళ్ళారు. మిగిలిన సహ ఉద్యోగస్తులు వణికిపోయారు...ఆ గోలకు పడుకోనున్న కాంచన తల్లి లేచి బయటకు వచ్చింది.
"కమలను ఎందుకు పోలీసులు తీసుకు పోతున్నారు?"
“కారణం మీ అమ్మాయే. అది హత్య చేయబడ్డది. మమ్మల్ని పోలీసులు ప్రాణాలతో చంపుతున్నారు. ఇందులో మీరొచ్చి మా ప్రాణాలు తోడేస్తున్నారు. తెల్లవారిన వెంటనే మీరు వెళ్ళిపోవాలి. మీ వలన మాకు మరో అవస్త వద్దు"
"భగవంతుడా! కమల చాలా మంచి పిల్ల. పోలీసులు ఆ అమ్మాయిని ఏం చేస్తారో?"
"మీ కూతురి వలనే దానికి ఈ అవస్త. వెళ్ళి పడుకోండి. లైట్లు ఆపేసి మేము కూడా పడుకోవాలి"
ఆవిడ లోపలకు వెళ్ళి పడుకుంది.
కళ్ళు మూస్తే కాంచన వస్తోంది. నవ్వుతోంది.
తట్టుకోలేకపోయింది.
"నిప్పులాగా ఉన్నవేమ్మా. నిన్ను ఎవడో దగ్గరకు తీసుకుని నీ జీవితాన్నే బూడిద చేశాసాడే?"
నీవల్ల ఎంతమంది కష్టపడుతున్నామో?
డబ్బుకీ, విలాశాలకూ ఆశపడా నిన్ను నువ్వు నాశనం చేసుకున్నావు?
అలాంటి అమ్మాయివి కాదే?
ప్రశ్నలు వరుసగా ఆమె మెదడును విసిగిస్తున్నాయి...సమాధానాలు లేక అనిగిపోతున్నాయి.
************************
"అమ్మా...నేనూ, గౌతం ఇంటికెళ్ళి అరగంటలో వచ్చేస్తాం" చెప్పింది ప్రియ.
"ఎందుకే? ఇక్కడ చాలా పనులున్నాయి...ప్రొద్దున్నే పెళ్ళి. అన్ని ఏర్పాట్లూ చేయాలి"
"వచ్చేస్తామమ్మా...వచ్చి ఇద్దరమూ నీ దగ్గర మాట్లాడాలి. నాన్నను కూడా రెడీగా ఉండమను"
"ఏం మాట్లాడాలి?"
"వచ్చి చెప్తాను...రారా గౌతం"
ఇద్దరూ బయటకు వచ్చినప్పుడు, ఎవరినో సాగనంపి లోపలకు వస్తున్న సాంబశివరావ్ గారు ఎదురుపడ్డారు.
"ఇంటివరకు వెళ్ళొస్తాం" మర్యాద కోసం చెప్పింది.
"ప్రియా...ఇలా రా”
"ఏమిటి అంకుల్?"
"అమ్మాయి ఒకతి వచ్చిందే?"
"ఎవరు?"
"నిన్ను బయటకు తీసుకువెళ్ళి మాట్లాడిందే....?".....ప్రియా ఆశ్చర్య పడింది.
"కమలతో నేను వెళ్ళటం ఈయన చూశాడా?"
"ఆయనదగ్గర ఏదో ఒక భయం, కంగారు ఖచ్చితంగా కనబడుతోంది...నిఘా బలంగా ఉన్నది!"
"అవును...అంకుల్"
"ఎవరమ్మా ఆ అమ్మాయి? నీకు ఇంతకు ముందే ఆ అమ్మాయితో పరిచయం ఉందా?"
"లేదు"
"మరైతే అ అమ్మాయి నిన్నెందుకు తీసుకు వెళ్ళింది? ఏమడిగింది? ఏదైనా కన్ ఫ్యూజ్ చేయటానికి వచ్చిందా?"
"ఏం సమాధానం చెప్పాలి?"
“అంకుల్! ఆ అమ్మాయి చనిపోయిన కాంచన తో కలిసి ఒకే ఇంట్లో ఉంటున్న అమ్మాయట. వస్త్ర దుఖాణంలొ పనిచేస్తోందట"
"ఆమె ఇక్కడికి ఎందుకు వచ్చింది?"
"కాంచన హత్య గురించి పోలీసులు వాళ్ళను చాలా ఇబ్బందులు పెడుతున్నారట. మా కెందుకీ కష్టాలు? మేము ఏ పాపమూ చెయ్యలేదు అంటూ గొణిగింది"
"నిన్ను ఎలా కనిపెట్టింది?"
“వేదికపైన అక్కయ్య పక్కన నేనుండటంతో, నన్ను పిలిచి ఫిర్యాదులాగా గొణిగి వెళుతోంది"
"అంతే కదా?"
"అవును అంకుల్"
"సరేనమ్మా! మీరు వెళ్ళి తొందరగా వచ్చాయండి"
ఇద్దరూ వచ్చి కారు ఎక్కిన తరువాత....కారు వేగంగా బయలుదేరింది.
సాంబశివరావ్ అవసర అవసరంగా లోపలకు వెళ్ళాడు.
ఎవరికో ఫోన్ చేసి గబగబా చెప్పటం మొదలుపెట్టాడు.
ఆయనలో ఆందోళణ ఎక్కువగా కనబడుతోంది.
ఆయన చేతులు చెమట పట్టి ,చేతిలో నుండి సెల్ ఫోన్ జారుతుంటే...
హడావిడి పడుతూ అక్కడకొచ్చిన ఆయన భార్య అనుసూయ సెల్ ఫోన్ క్రింద పడకుండా పట్టుకున్నది.
"ఏమిటండి మీరు... ఎక్కడికి వెళ్ళారు?"
"రిసెప్షన్ అయ్యిందా?"
"ఇప్పుడే అయ్యింది…చక్రవర్తి, దీపిక డైనింగ్ హాలుకు వెళ్ళారు. రేపు మనం పెట్టాల్సిన బట్టలు తీసి పెట్టాలి. మీరు రండి."
"నువెళ్ళు” కోపంగా అరిచాడు.
"ఎందుకు కోపగించుకుంటున్నారు"
సాంబశివరావ్ ఆందోళణతో మెట్లు దిగి డైనింగ్ హాలుకు వెళ్ళాడు.
ఆయన కళ్ళు వెతకటం మొదలుపెట్టింది.
డైనింగ్ హాలు చివర్లో...చేతులో ప్లేట్లు పెట్టుకుని చక్రవర్తి, దీపిక నిలబడున్నారు...వాళ్ళ చుట్టూ ఒక గుంపు.
ఫోటో ఫ్లాష్ లైట్ వాళ్ళ మీద పడింది. యూత్ జనరేషన్ గుంపు.
మెళ్ళగా నడిచొచ్చారు సాంబశివరావ్ గారు.
"చక్రవర్తి...డిన్నర్ ముగించుకుని కొంచం వస్తావా, నీతో మాట్లాడాలి"
"అర్జెంటా డాడీ?...ఇప్పుడే వస్తాను"
"అర్జెంటేమీ లేదురా...డిన్నర్ ముగించుకునేరా"
"నేనూనా మావయ్యా?"
అడిగింది దీపిక.
"లేదమ్మా...నువెళ్ళి రెస్ట్ తీసుకో”
తండ్రి వెళ్ళిన తరువాత చక్రవర్తి డిన్నర్ వేగంగా తినడం మొదలుపెట్టాడు.
"ఎందుకు అవసరపడుతున్నారు?"
"ఏమీ లేదు దీపిక! ఇంతసేపూ రిసెప్షన్ లో నిలబడే ఉన్నానుగా. బాగా టైర్డుగా ఉన్నది. డాడీతో మాట్లాడి రెస్ట్ తీసుకోవాలి. నువ్వు కూడా రెస్ట్ తీసుకో"
గబగబా తినేసి, చేతులు కడుక్కున్నాడు.
"ప్రొద్దున్నే చూద్దాం దీపిక" అని చెప్పి వేగంగ మెట్లు ఎక్కాడు...ఒక గదిని చేరటానికి అవసర అవసరవసంగా నడిచాడు.
రామకృష్ణ గారి ఇళ్ళు.
ఇంటి వాకిట్లో కారు ఆగింది.
దాంట్లో నుండి ప్రియా, గౌతం దిగారు.
లోపలకు వచ్చారు.
"అక్కా...నాక్కొంచం దఢగా ఉందక్కా"
“నాలుగు రోజులుగా నేను చిత్రవధ అనుభవిస్తున్నానురా. దాని నొప్పి నాకు మాత్రమే తెలుసు...సరే రా"
తలుపులు మూశాడు గౌతం.
ఇద్దరూ లోపలకు వెళ్ళారు.
"మొదట లాప్ టాప్ తీసి పెట్టు. కెమెరా కనెక్షన్ రెడీ చెయ్యి. నేను బీరువాలో నుండి కేమేరా తీస్తాను. లాప్ టాప్ కు కనెక్షన్ ఇచ్చి ల్యాప్ టాప్ లోకి ఎక్కిద్దాం. తరువాత వీడియో ప్లే చేసి చూద్దాం"
"అక్కా...ఇది హత్యకైన సాక్ష్యం. వాళ్ళు పెద్ద మనుష్యులు. చాలా ప్రశ్నలు తలెత్తుతాయ్. ఎందుకైనా మంచిది పెన్ డ్రైవ్ లో కాపీ చేసి ఇంకో కాపీ మనం ఉంచుకుందాం"
లాప్ టాప్ తీసి రెడీ చేశాడు గౌతం.
బీరువా తెరవటానికి తాళం చెవి పెట్టింది ప్రియంవద.
"గౌతం ఈ సాక్ష్యాన్ని పోలీసులకు ఇద్దాం. వాళ్ళు చక్రవర్తిని అరెస్టు చేస్తారు. రేపు మీడియాలో వస్తుంది. పెళ్ళికూతురి ఇంట్లోని వాళ్ళే హంతకుడిని పట్టించారు. అందువలన పెళ్ళి ఆగిపోయింది అని మాట్లాడుకుంటారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ న్యూస్ వ్యాపిస్తుంది. అంతర్జాలం, ఫేస్ బుక్ ల్లో బహిరంగంగా హంతకుడ్ని నిందిస్తారు"
"వేరే దారేలేదుగా అక్కా....?"
“అక్కయ్యను కాపాడేతీరాలి. అదే సమయం ఆ పాపాత్ముడి వలన, అతను చేసిన హత్య వలన పూర్తి నష్టం మన కుటుంబానికే వస్తుంది! కొన్ని లక్షల రూపాయలు నష్టం మాత్రమే కాదు...అక్కయ జీవితం పెద్ద ప్రశ్నార్ధకం అయిపోతుంది....రెండు విధాలుగా"
"ఎలా"
“పీటలవరకు వచ్చి పెళ్ళి ఆగిపోయింది. రాసిలేని పిల్ల. అంటూ అక్కయ్య రాసిని వివాదానికిపెడతారు. పెళ్ళికొడుకు ఇంటివారిని పట్టించి ఇచ్చిన కుటుంబం అనే మాటలు కూడా వినిపిస్తాయి....అక్కయ్య జీవితమే ప్రశ్నార్ధకంగా మిగిలిపోతుంది"
"అవును"
"అది మాత్రమే కాదు! సాంబశివరావ్ గారు పలుకుబడి ఉన్న కోటీశ్వర్లు. రిసెప్షన్ లో చూశావుగా...ఎంతమంది రాజకీయ ప్రముఖులో? ఆయన కొడుకే హంతకుడని నిరూపించబడి ఖైదైతే ...అది ఆయనకొక అతిపెద్ద అవమానం కాదా...? దానికి కారణమైన మన కుటుంబాన్ని వదిలిపెడతారా?"
"ప్రియా, నువ్వేం చెబుతున్నావ్? తలచుకుంటేనే వణుకు పుడుతోంది. మనల్నెవరినీ బ్రతకనివ్వరంటావా?"
"దీని గురించి కూడా నేను ఆలొచించి ఉంచాను"
"మన కుటుంబం వాళ్ళ చేతుల్లో బాగా చిక్కుకుందా"
"అవున్రా గౌతం!"
"అలాగైతే ఈ ఆధారాన్ని బయటకు తీయాలా?"
"మనం ఈ ఆధారాన్ని బయటపెట్టకపోతే, ఇంకో విధంగా నిజం బయటపడుతుంది. అప్పుడుకూడా అక్కయ్య జీవితం పాడైపోతుందే?"
"అప్పుడుకూడా బాధింపు మన అక్కయ్యకే కదా?"
"అది వేరురా గౌతం"
"సరే...మొదట ఈ ఆధారాన్ని కాపీ చేసుకుందాం. తరువాత ఆలొచిద్దాం"
బీరువాను తెరిచింది.
సెల్ ఫోన్ మోగింది...ఫోన్ లో తల్లి.
"టైము పదిన్నర...ఇద్దరూ ఎక్కడున్నారు?"
"మనింట్లోనేనమ్మా!"
"అక్కడికెందుకు వెళ్ళారు? మీ డాడీ ఇక్కడ కోపంగా ఉన్నారు"
"వచ్చి విషయం చెబుతాము...అర గంటలొ వచ్చేస్తాం"
బీరువాను తెరిచి కెమేరాను బయటకు తీసింది ప్రియంవద.
"మొదట నేను చూస్తానక్కా...తరువాత లాప్ టాప్ లో ఎక్కిద్దాం"
“అలాగే”…ప్రియా వేగంగా కెమేరాలోని వీడియో మీటను నొక్కింది.
వీడియో ఆన్ అవలేదు.
"ఏమిటి...బ్యాటరీ వీక్ గా ఉన్నదా?...ఆకుపచ్చ లైటు వెలగటంలేదు!” అనుకుంటూ కెమేరాను వేనక్కి తిప్పి చూసింది ప్రియంవద.
"కెమేరాలో బ్యాటరీ లేదురా”
"నువ్వే తీసుంటావ్?"
“నేను బ్యాటరీని బయటకే తీయలేదేరా"
"మర్చిపోయుంటావ్?”
"ఇప్పుడు బ్యాటరీ లేకుండా ఎలారా?"
"నేను వెళ్ళి కొనుక్కొస్తా"
"ఈ టైములో ఏ షాపు తెరిచుంటుంది? బగవంతుడా...ఇలా ఒక ఇబ్బంది ఎలా వచ్చింది?"
బీరువాలో వెతికింది.
"నేను బ్యాటరీ తీయలేదు. తీసున్నా ఇక్కడే పెడతాను"
మళ్ళీ సెల్ ఫోన్ మోగింది...మళ్ళీ తల్లే చేసింది.
"బయలుదేరేరా?"
"వస్తున్నామమ్మా"...ఫోన్ కట్ చేసింది.
"గౌతం...కెమేరా, లాప్ టాప్ రెండూ తీసుకుని వెళ్ళిపోదాం"
"వెళ్ళి"
"ఏదో ఒకటి చేద్దాం. అమ్మా-నాన్నల దగ్గర విషయం చెప్పేద్దాం. ఆధారం ఎలాగు కెమెరాలోనే ఉన్నది. ప్రొద్దున షాపులు తెరుస్తారు. బ్యాటరీ కొని అందులో వేస్తే నిజం తానుగా బయటకు వస్తుంది...రా...వెల్దాం"
కెమేరా, లాప్ టాప్ లను లెదర్ బ్యాగులలో పెట్టుకుని ఇద్దరూ బయటకు వచ్చారు.
కారును గౌతం డ్రైవ్ చేశాడు.
సమయం రాత్రి పదకుండు గంటలు....కారు కల్యాణ మండం వీధిలోకి తిరిగింది...
రోడ్డు మీద అడ్డంగా ఇద్దరు నిలబడి కారును అడ్డగించారు.
కారును ఆపి గౌతం క్రిందకు దిగాడు.
"ఎవరు మీరు...మీకేం కావాలి"
"మొదట నువ్వు కారులోకి ఎక్కు"
మెడ మీద కత్తిపెట్టి గౌతం ని కారులోకి నెట్టారు.
ఇంకొకడు డ్రైవింగ్ సీటులో కూర్చున్నాడు.
గౌతం అరిచాడు...
"ఉష్..! కేకలు వేస్తే ఈ అమ్మాయి గొంతు కోసేస్తాం...మాట్లాడకుండా రా"
కారు బయల్దేరింది.
ప్రియా, గౌతం హడలిపోయారు.
"మమ్మల్ని ఎక్కడికి తీసుకెల్తున్నారు?”...భయపడుతూ అడిగాడు గౌతం.
"మాట్లాడకుండా రారా...లేదంటే నీ గుండెళ్ళోకి ఈ కత్తి దిగుతుంది"
" గౌతం వద్దు...మాట్లాడొద్దు" ప్రియ హెచ్చరించింది.
కారు వేగంగా వెడుతోంది.
అంత గందరగోళంలోనూ ప్రియ ఆలొచించటం మొదలుపెట్టింది.
ఎవరో మమ్మల్ని గమనిస్తూ, మమ్మల్ని వెంబడిస్తూ వచ్చారు.
"ఎవరై ఉంటారు? ఎందుకు?"
"నిజం మేము బయటపెట్టబోతున్నామని బయట ఎవరికీ తెలియదే?!"
"చివరగా మండపం వాకిట్లో నాతో మాట్లాడిందేవరు?"
చక్రవర్తి తండ్రి సాంబశివరావ్ గారు.
"ఆయనకెలా తెలుస్తుంది? నాకొక్కదానికే నిజం తెలుసు...నేను చెప్పందే ఎవరికీ తెలియదు"
"మరి ఎందుకీ కిడ్నాప్?"
Continued...PART-10
***************************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి