22, ఏప్రిల్ 2022, శుక్రవారం

ప్రేమ ఎంత కఠినమో!…(సీరియల్)...PART-1

 

                                                                      ప్రేమ ఎంత కఠినమో!…(సీరియల్)                                                                                                                                                              PART-1

ప్రేమ ఎన్నో రూపాల్లో అభివ్యక్తం అవుతుంది. చాలామందికి, ఈ ప్రపంచంలో ప్రేమ అంటే ఒక మ్యూచువల్ బెనిఫిట్ స్కీమ్ లాంటిది. ప్రజలకి, ఎన్నో రకాల అవసరాలుంటాయి. శారీరికం, మానసికం, భావపరమైనవి, సామాజికం, ఆర్ధికపరమైనవి ఇలా ఎన్నో రకాల అవసరాలు. ఈ అవసరాలన్నీ నెరవేర్చుకోవడానికి “నిన్ను ప్రేమిస్తున్నాను” - అనేది ఒక మంచి మంత్రం.

ఈ మంత్రాన్ని ఎలా వాడుకోవాలి, ఎప్పుడు వాడుకోవాలి, ఎవరు వాడుకోవలొ తెలుసుకోవటమే కష్టం, కఠినం...కానీ తెలుసుకోగలిగితే మ్యూచువల్ బెనిఫిట్ అందుతుంది. అందుకున్న వారి జీవితం సాఫీగా సాగిపోతుంది.

ఈ నవలలో ఈ మంత్రాన్ని ఒక సారి విని మోసపోయిన హీరోయిన్ లత, జీవితంలో ఇక ఈ మంత్రాన్నే వినకూడదని నిర్ణయించుకుంది. కానీ, తన జీవిత ప్రయాణంలో ఈ మంత్రం తనకే ఎంతో అవసరం ఉన్నదని గ్రహించింది. చివరికి ఆ మంత్రాన్ని చెప్పించుకోవటానికీ, చెప్పటానికీ ఏంత కష్టపడిందో, ఎంత కఠినమైన అవమానాలను ఎదుర్కోవలసి వచ్చిందో ఈ సీరియల్ చదివి తెలుసుకోండి.

ఈ సీరియల్ను ఒకేసారి నవలగా చదవాలనుకుంటే ఈ క్రింది లింకుపై కిల్క్ చేయండి:

ప్రేమ ఎంత కఠినమో!…(పూర్తి నవల) @ కథా కాలక్షేపం-2

                                                                                   PART-1

తపస్సు చేస్తున్న ఆ అమ్మవారి పాదాలను తన అలల పూవులతో సముద్ర తల్లి అభిషేకం చేస్తుంటే, ఆకాశ దేవత పౌర్ణమి వెన్నెలను చేతులలోకి తీసుకుని దీపారాజన చూపిస్తుంటే, చుట్టూ ఉన్న పూల చెట్లు తమ సుగంధ వాసనలను వెదజల్లుతుంటే, ఆ సాయంత్ర సమయం అమ్మవారి చిరునవ్వులో ఆ సముద్రతీరమే పుణ్యభూమిలాగా దర్శనమిచ్చింది.

గాంధీ పార్కు ఎదుట కొత్తగా డెవలప్ చేయబడ్డ కాలనీలోకి ప్రవేశించింది లత. నాలుగు సంవత్సరాల క్రితం అక్కడక్కడ చిన్న చిన్న పెంకుటిళ్ళు, గుడిసెలు మాత్రమే ఉన్న ఆ ప్రాంతం పలురెట్లు మారిపోయింది.

'ఈ ఇల్లే' అనే ఒక లెక్కతో 'గేటును తెరిచింది లత. సిట్ ఔట్లొ కూర్చోనున్న కుమారి గేటు శబ్ధం విని తొంగి చూసింది. ఎవరో లోపలకు వస్తున్నది కనబడటంతో దీర్ఘంగా చూసింది. చిరు చీకట్లో వస్తున్నదెవరో గబుక్కున గుర్తుకు రాలేదు. కొద్ది క్షణాల తరువాత లోపలకు వస్తున్న మనిషి ఆకారం, తెలిసిన మనిషిలాగా అనిపించడంతో సందేహంతో......

"మీరు...?" అన్నది.

"ఏమిటి కుమారి! నన్ను మర్చిపోయావా?”

"నువ్వా లతా? నమ్మలేకపోతున్నాను" అన్నది ఉత్సాహంతో.

"నేనే నే" అని నవ్వింది లత.

అంతసేపు కట్ అయిన కరెంటు రావడంతో - కాంతివంతమైన వెలుతురులో కుమారి తన స్నేహితురాలుని బాగా చూడ గలిగింది. కొన్ని సంవత్సరాల క్రితం చూసిన లతేనా ఈమె? ఈమె జీవితంతో విధి ఇలాగా ఆడుకోవాలి?     

రెండు జడలు, తుంటరి తనం, పరువాల వయసు, వర్ణించలేనంత అందం...ఆమె ఊరిలో ఆమెకు ఫ్యాన్స్ అషోషియేషనే ఉండేది. కానీ, ఇప్పుడు ఆకులు రాలిన, ఎండిపోయిన చెట్టులాగా ఉన్నది. నల్లబడి, బుగ్గలు లోపలకు పోయి, డ్రస్సు సెన్స్ లో పట్టులేక...చూసిన వెంటనే కుమారికి ఆమె పరిస్థితి అర్ధమయ్యింది--కాలం ఈమె గాయాలను గుణపరచ లేకపోయింది. మరచిపోనివ్వనూ లేదు అని!

ఈజీగా మర్చిపోయి, మనసును చల్లార్చుకోగలిగే నష్టమా ఆమెకు జరిగింది?

'హు...' అంటూ పెద్దగా శ్వాశ పీల్చుకుని.

"రా... లతా " అంటూ ఆమె చేతిలో ఉన్న సంచిని తీసుకుంది.

లత ఆ ఊరు వదిలి వెళ్ళేటప్పుడు అక్కడున్న పెంకుటిల్లు ఇప్పుడు రెండంతస్తుల మేడ ఇల్లుగా మారి ఉన్నది.

"కుమారీ! ఇళ్లు సూపర్ గా ఉన్నదే" అన్నది.

"అన్నయ్య కువైత్ లో ఉన్నాడు కదా. పోయిన సంవత్సరం పాత ఇంటిని పడగొట్టి ఇది కట్టాము"

స్నేహితురాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ మెట్లు ఎక్కుతుంటే, ఆ మాటలు విని వచ్చిన సుందరి--లతను చూసి ఆశ్చర్యంతో, "ఎలా ఉన్నావు లతా?" అని సంతోషంగా అడిగింది.

ఆ పిలుపుతో అనిగిపోయున్న భావాలన్నీ కరిగి, ధైర్యం పారిపోయింది. కానీ, ఒక చిరు నవ్వు వెనుక తన భావాల ప్రవాహాన్నంతా అనిచిపెట్టుకుని నిలబడ్డ లత ఇంతకాలంలో చాలా నేర్చుకుంది.

"బాగున్నారా అమ్మా?"

"నాకేమే? అవును...నువ్వెందుకు ఇలా ఉన్నావు? నీ అందమంతా ఎక్కడే? ఏమైపోయిందే?"

ఆవేదనతొ అడిగిన ఆమెకు, ఒక విరక్తి నవ్వును సమాధానంగా ఇచ్చింది లత.

"ఎలా ఉండే అమ్మాయివి, ఆ నీచుడి వలన..." అని మొదలుపెట్టి, "అంతా విధే...అది ఎవర్నీ వదిలిపెట్టదు"

స్నేహితురాలి మొహంలో మార్పు కనబడటంతో "అమ్మా! లతని నా గదికి తీసుకు వెడుతున్నాను. మీరు భోజనం రెడీ చేయండి" అని తల్లికి చెప్పి, లతను తన గదికి తీసుకు వెళ్ళింది కుమారి.

"వెళ్ళమ్మా" అని లతకు చెప్పిన సుందరి వెళ్ళి స్నానం చేసి, డ్రస్సు మార్చుకురా. వేడిగా ఇడ్లీ ఇస్తాను" అని చెప్పింది.

స్నానం ముగించుకుని, డ్రస్సు మార్చుకుని బాల్కనీలోకి వచ్చి నిలబడింది లత.

ఆ రోజుల్లో పెంకుటిళ్ళు, గుడిసెలు ఉండే ఆ కాలనీలో ఇప్పుడు గుడిసెలు అసలు లేవు. పెంకుటిళ్ళు మాత్రం నాలుగో, ఐదో ఉన్నాయి. మిగిలినవన్నీ మేడలుగా మారిపోయి నిలబడ్డాయి. ఒకప్పటి పచ్చటి చెట్లన్నీ మేడలకు అడ్డు ఉండకూడదని మాయమైపోయేయి.

తెలిసిన చోటు, తెలిసిన ముఖాలు...పలు పాత ఆలొచనలను జ్ఞాపకపరచి - లత  మనసును అలజడికి గురిచేసింది.

ఎంతోమంది ప్రశాంతతను వెతుక్కుంటూ, దానికోసం పంటకాలువ దగ్గరగా నివాశం ఏర్పరచుకుని ఆనందంగా నివసిస్తున్నారు. లతకు మాత్రం ప్రశాంతతకు బదులు కష్టాలను మూటలుమూటలుగా అందించింది ఆ పంటకాలవ నివాశం.

లత ఆలొచనలు ఆమెను మరింత పీడించే లోపు కుమారి అక్కడకు వచ్చింది.

"రా లతా. డిన్నర్ చేద్దాం"

"వద్దు కుమారి. నాకు ఆకలిగా లేదు"

"ఏమిటీ, ఆకలిగా లేదా? అంత దూరం నుండి వచ్చావు?"

"లేదు కుమారి. నేను విజయవాడ నుండి వచ్చి మూడు రోజులు అయ్యింది"

లత చెప్పింది నమ్మనట్లు చూసింది కుమారి.

"ఈ మూడు రోజులు ఎక్కడున్నను అనుకుంటున్నావా? నూజివీడు వెళ్ళాను"   

"ఏమిటీ? మీ నాన్న ఊరికా?"

"అవును"

"ఏమిటి అంత సడన్ గా! నేరుగా ఇక్కడకు వచ్చుంటే మా నాన్న నీకు తోడుగా వచ్చుంటారుగా?" అన్నది కుమారి.

"తెలుసు. అందుకే రాలేదు. నా సమస్య నాతోనే పోనీ. మీ నాన్నకు వాళ్ళు మర్యాద ఇవ్వకుండా మాట్లాడితే అది చూసి నేను తట్టుకోలేను. అంతే కాదు. ఇప్పటికే నేను మీ కుటుంబానికి ఎంతో రుణపడి ఉన్నాను. మళ్ళీ మళ్ళీ మీ కుటుంబాన్ని నేను కష్టపెట్ట దలుచుకోలేదు కుమారీ " బాధ నిండిన గొంతుతో చెప్పింది.   

'ఏమిటి లతా! అలా మాట్లాడుతున్నావ్? నీకు మేము తప్ప ఇంకెవరున్నారు చెప్పు చూద్దాం?"

"అందుకోసమే కదా ప్రశాంతత కోసం రెండు రోజులు మీ ఇంట్లో ఉండి వెడదామని వచ్చాను" అన్నది లత. అంతకంటే ఆపుకోలేక వెక్కి వెక్కి ఏడ్చింది.

స్నేహితురాలిని సమాధానపరిచే విధంగా కౌగలించుకుంది కుమారి.

డిన్నర్ ముగించుకుని, 'సిట్ అవుట్' లో కూర్చోనుండగా కుమారి నాన్న వెంకట్ వచ్చి చేరారు. కుశల ప్రశ్నల తరువాత ఆయన అడిగిన మొదటి ప్రశ్న.

"సంతకం చేసే ముందు నన్ను ఒక్కసారి అడిగి ఉండొచ్చు కదా?"

'ఈయనకెలా తెలిసింది?'--ఆశ్చర్యంతో తల ఎత్తిన లత "సారీ అంకుల్. వాళ్ళ గుణం మీకు తెలుసుకదా! మర్యాద ఇవ్వకుండా మాట్లాడతారు. నా వల్ల మీ గౌరవం తగ్గిపోకూడదు కదా? అందుకే? నన్ను తప్పుగా అనుకోకండి" అన్నది క్షమించమన్న దోరణితో.

"తప్పు చేశావమ్మా. మీ చిన్నాన్నలు ఇంత స్వార్ధ పరులా? తల్లి, తండ్రిలేని పిల్లకు మనం తప్ప ఇంకెవరున్నారు అనే ఆలొచన రావద్దా? ఆస్తికొసం ఇలాగా మానవత్వాన్ని వదిలేసుకుంటారు?....ఆ ఆస్తంతా వాళ్ళు సంపాదించిందా? మీ తాత ముత్తాతల నాటి ఆస్తి. ఈ రోజు రేటుకు కనీసం ఐదు కోట్లు దాటుతుంది. నీ షేర్ గా కోటి రూపాయలన్నా దొరికుంటుంది. ఆ రోజుల్లోనే  మీ అత్తయ్యలిద్దరికీ ఎటువంటి తక్కువ చేయకుండా పెళ్ళిళ్ళు చేశాడు మీ నాన్న విశ్వం.  కానీ ఇప్పుడు అతను ప్రాణాలతో లేడనే కారణం పెట్టుకుని అందరూ కలిసి నీమీద పగ తీర్చుకున్నారు. ఆ కుటుంబంలో ఒక్కరికి కూడానా నీ మీద ప్రేమ లేదు? ఏం మనుష్యులమ్మా వాళ్ళు! ఛీ, ఛీ"

వెంకట్ బాధతోనూ, కోపంతోనూ మాట్లాడాడు.

"పరవాలేదు అంకుల్. వెళ్ళేటప్పుడు నెత్తి మీదా పెట్టుకుపోతాం. బంధువులే లేరని అనుకున్న తరువాత, వాళ్ళ ఆస్తి మాత్రం నాకెందుకు?" అన్నది లత విరక్తిగా.

లత తండ్రి విశ్వనాధ్, షీలాను ప్రేమించి పెళ్ళిచేసుకుని పక్క ఊర్లో కాపురం పెట్టాడు. కుటుంబానికి పెద్దకొడుకైన అతను కులం కాని కులంలోని అమ్మాయిని పెళ్ళి చేసుకోవటంతో,కుటుంబమే అతన్ని బహిష్కరించటం మొదలుపెట్టింది. తరిమి తరిమి కొడుతున్నా, గౌరవం చూడకుండా వాళ్ళను వెతుక్కుంటూ వెళ్ళాడు విశ్వం. రోజులు గడుస్తున్న కొద్ది వాళ్ళ కోపం తగ్గుతుందనే నమ్మకంతో--ఆ నమ్మకాన్ని అతను చచ్చి పోయేంతవరకూ విడిచిపెట్టలేదు. ఒక ప్రమాదంలో ప్రేమించి పెళ్ళి చేసుకున్న భార్యను పోగొట్టుకున్న అతను, తన కూతురు లత కోసం జీవించాడు.

తండ్రికి తండ్రిగా, తల్లికి తల్లిగా తనను ప్రేమతో పెంచిన తండ్రిని యముడికి అప్పగించటానికి లతానే కారణం అయ్యింది. పిల్లలు, కన్నవారికి పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టకపోయినా, ప్రశాంతతనైనా ఇవ్వాలి.

కానీ, లత తండ్రిని చంపిన పాతకి అయిపోయింది.

                                                                                            Continued....PART-2

****************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి