28, ఏప్రిల్ 2022, గురువారం

ప్రేమ ఎంత కఠినమో!...(సీరియల్)....PART-4

 

                                                                            ప్రేమ ఎంత కఠినమో!...(సీరియల్)                                                                                                                                                                PART-4

కూతుర్ని కాలేజీ హాస్టల్లో జేర్చి దుబాయ్ దేశానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు విశ్వం.

దానికోసం ఉన్న పొలాన్ని అమ్మి, దాంట్లో దొరికిన డబ్బును, ఇంటిని తాకట్టు పెట్టి అప్పు తీసుకున్న డబ్బును పెట్టుకుని, లతకు ఇంజనీరింగ్ కాలేజీలో సీటు, తాను దుబాయ్ వెళ్ళటానికి కావలసిన ఏర్పాట్లు చేసుకున్నాడు.

లతకు కాలేజీ తెరవక ముందే, విశ్వం దుబాయ్ వెళ్ళాల్సిన సమచారం వచ్చింది.

కూతురు చేసిన పనికి బంధువుల మధ్య, ఊరి ప్రజల మధ్య అవమానపడి నిలబడ్డ ఆయనకు కూతుర్ని ఒంటరిగా విడిచి వెళ్ళటానికి మనసు రాలేదు. ఆమె కాలేజీ తెరవటానికి ఇంకా రెండువారాలు ఉంది.

తండ్రి తరపు బంధువులు ఉన్నా, వాళ్ళ దగ్గరకు వెళ్ళలేని పరిస్థితి. తల్లి తరపు సొంతం అని చెప్పుకునే పిన్ని లత పుట్టటానికి ముందే, ఎవరో ఒక సగం ముసలివాడ్ని పెళ్ళిచేసుకుని నార్త్ ఇండియా వైపు వెళ్ళిపోయిందని విన్నది.

కూతుర్ని ఆదరించటానికి ఎవరూ లేని స్థితిలో, ఆమెను ఒంటరిగా వదిలి దుబాయ్ వెళ్ళిపోయాడు తండ్రి విశ్వం. ఆయన వెళ్ళిన ఇరవైయవ రోజు ఒక ఫోన్ వచ్చింది లత కు.

అందులో వచ్చిన వార్త!

"ఓ"...అని గట్టిగా ఏడవాలని అనిపించక అలాగే నిలబడింది.

వార్తలోని పూర్తి వివరాలు విన్నదో ఏమో! షాక్ లో శిలలాగా నిలబడిపోయిన లతను, ఫోనులో అవతలవైపు మాట్లాడుతున్నవారు చాలా సార్లు పిలిచినా ప్రయోజనం లేకపోయింది.  

చాలాసేపు తరువాత, షాకుతో మొద్దుబారిపోయిన లత  హృదయం చిన్నగా తెలివిలోకి రావటంతో ----జారవిడిచిన టెలిఫోన్ రీసీవర్ను తీసింది.

ఫోన్ కట్ అయ్యింది కూడా గ్రహించలేక "హలో! నాన్నా...నాన్నా..." అంటూ అరిచింది.

ఏం చేయాలి? ఎలా చేయాలి?’ అనేది అర్ధంకాక--ఇంటి బయటకు పరిగెత్తింది.

అప్పుడు ఆ అమాయకురాలి కళ్ళల్లో కనబడింది దివాకర్  ఇల్లు మాత్రమే.

మెరుపులాగా పరిగెత్తుకుని వెళ్ళి తలుపు తట్టింది.

"మామయ్యా...మామయ్యా...తలుపులు తెరవండి"

తలుపులు తీసాడు కిషోర్.

"మామయ్యా" అరుస్తూ క్రింద పడిపోయింది.

ఏదో చూడకూడనిది చూసినట్టు అతనిలో ఒక విరక్తి భావం.

"ఏయ్! ఏమిటి ఇది? ఎందుకు ఇక్కడకొచ్చి గొడవ చేస్తున్నావు?" అన్నాడు విరక్తిగా.

"మామయ్యా!" అంటున్న లత దగ్గరకు దివాకర్ రావడంతో, ఆమెలో కొంత ధైర్యం వచ్చింది.

తనకొక తోడు దొరికిందనే నమ్మకం.

"ఓ" అంటూ అణుచుకున్న ఏడుపు బయటకు వచ్చింది.

"ఏయ్! ఇక్కడొక పక్క అడుగుతుంటే శొకాలు తీస్తూ రాగాలు పెడుతున్నావు" అన్నాడు కిషోర్ కొట్టబోయే దోరణిలో.

"మామయ్యా! ఇప్పుడే ఫోన్ వచ్చింది. ఏమిటేమిటో చెబుతున్నారు. నాన్న చనిపోయారట. చాలా భయంగా ఉంది మామయ్యా. ఏమిటని వచ్చి అడగండి మామయ్యా" అన్నది ఏడుస్తూ.

చిన్నగా షాకుకు గురైనా, రాయిలాగా నిలబడ్డాడు ఆ పాపాత్ముడు.

"నాకు వేరే పనిలేదా?"

"అయ్యో! ప్లీజ్, అలా చెప్పకండి. నాకు ఎవరూ లేరు. నాకు కాళ్ళూ, చేతులూ వణుకుతున్నాయి. మీ కాళ్ళ మీద పడతాను. జరిగిందేదీ మనసులో పెట్టుకోకండి" అంటూ కిషోర్ కాళ్ళ మీద పడ్డది.

అతను "ఏయ్! ఛీ ఛీ...వదులు" అని వెనక్కి జరిగాడు. అతని చుట్టూ నిలబడ్డ అతని భార్య, పిల్లలు ఏమిటి? ఏం జరిగింది? అని ఒక్క మాట కూడా అడగలేదు.

దివాకర్ మొహంలో ఈమె ఎవరో? ఎక్కడిదో? అనే నిర్లక్ష్య దోరణి. తన ప్రేమ పావురం  ఏడుస్తూ నిలబడిందే నన్న తపన కొంచం కూడా లేదు.

"మీ నాన్న చనిపోతే నాకేంటి? బ్రతుకుంటే నాకేంటి? ఏడుపు ఆపి ఇక్కడ్నుంచి పో. ఎవరింటి చావుకో నా ఇంట్లో ఎందుకు శోకాలు?" అంటూ తలుపులను దబేలుమని వేసాడు.

"మామయ్య...అలా చెప్పకండి. మీరు తప్ప నాకు ఇంకేవరున్నారు" అంటూ తలుపు తట్టింది.

ఆమె కన్నీళ్ళు, ఆవేదన ఆ తలుపులకున్న ఇనుప గొళ్ళాలను కూడా కరిగించి ఉంటాయి. కానీ ఆ రాతి గుండె కలిగిన కిషోర్ను కరిగించలేదు!

కుదిరినంత వరకు బ్రతిమిలాడినా ఏమీ ప్రయోజనం లేదని తెలుసుకుని, తూలుతూ రెండడుగులు వేసిన లతకు - అనాధగా అన్య దేశంలో పడున్న తండ్రి జ్ఞాపకమే వచ్చింది.

'నాన్నా నావల్లే కదా...! నా జ్ఞాపకాలే కదా మీ గుండెను కరిగించి, కరిగించి గుండెపోటును తెప్పించింది. ఎలా బాధపడుంటారు? నన్ను క్షమిస్తారా నాన్నా? అయ్యో! నేను మిమ్మల్ని చంపేసానే...నాన్నా!' అంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ ఇంటి ముందు పడిపోయిన లతను అనుకోకుండా చూసిన పక్కింటాయన--వివరాలు అడిగి తెలుసుకుని ఊరి పెద్దలను సమావేశపరిచాడు. అప్పుడు విషయం తెలుసుకున్న వెంకట్, తన  కుటుంబాంతో సహా వచ్చాడు. ఆ విషయంలో వాళ్ళ తోడు లేకుండా పోయుంటే, తండ్రితో పాటూ లత కూడా పైలోకాలకు వెళ్ళుంటుంది.

విశ్వనాద్ బంధువులు రాత్రే వివరాలు తెలుసుకున్నా, సావకాశంగా ప్రొద్దున్నే వచ్చి జేరారు. ఒక వారం తరువాత విశ్వం  ఒక మూటలాగా వచ్చి జేరాడు. చావు ఇంట్లో విశ్వనాద్ చావు గురించి కంటే  లత యొక్క శీలం గురించే ఎక్కువగా చర్చించుకున్నారు.

విశ్వనాద్ తల్లి దీపను చూసి "శనేశ్వరం లాగా నా కొడుకును పీడించుకు తిన్నారు కదవే! మీ అమ్మ నా కొడుకును నా దగ్గర నుండి వేరు చేసింది. నువ్వు వాడిని ఈ లోకం నుంచే వేరు చేశావే! నువ్వు బాగుంటావా? కొవ్వెక్కిపోయి ఊరంతా మేసి నా కొడుకును చంపేసేవే" అంటూ ఏడుస్తూ అరవటంతో ముట్టుకోకూడని పురుగును చూసినట్లు, ఊరు, బంధువులు వెలివేయ-- వెంకట్ భార్య సుందరీనే తల్లిలాగా ఆదుకుంది. బంధువులు శ్మశానం నుండి తిన్నగా వెళ్ళిపోగా, వెంకట్టే అన్ని కార్యాలూ చూసుకున్నాడు. కష్టాలలో స్నేహితులే సహాయ పడతారని నిరూపించాడు.

కిషోర్ యొక్క అవకతవకల పనుల వలననలుగురైదుగురు అప్పు పత్రాలతో వచ్చారు. ఇళ్ళు అమ్మి అన్ని అప్పులూ తీర్చారు. లత ఇష్టపడినట్లు ఆమెను హైదరాబాద్ పంపి చదువుకోవటానికి సహాయపడ్డాడు. ఆమె చదవాలని ఆశ పడిన ఇంజనీరింగ్ చదువు తండ్రితో పాటూ సమాధి అయ్యింది.

"ఆడపిల్లండి. అమ్మాయికి పెళ్ళి జరిగేంత వరకు మీ గార్డియన్ బాధ్యతలో ఉంచుకోండి" అన్నారు ఒకరు.

"మా ఇంట్లోనూ ఆడపిల్లలు ఉన్నారండి. దీని బుద్దులు వాళ్ళకు వస్తాయేమో" అంటూ తప్పించుకున్నాడు బాబాయ్.

"మా అన్నయ్యనే చంపిన ఒక హంతకురాలు. ఇది ఎలా పోతే మాకేంటి?" అంటూ అత్తయ్యలు తప్పుకున్నారు. "వీళ్ళు చెప్పే దాంట్లో కూడా న్యాయం ఉంది" అంటూ మరొకరు చెప్పారు.

అన్ని అవమానాలనూ తట్టుకుని, అన్నీ వేదనలనూ మనసున అణిచి, ఈ రోజు యుక్త వయసు అమ్మాయికి ఉండాల్సిన భావాలే లేకుండా జీవిస్తోంది లత.

                                                                                                  Continued...PART-5

****************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి