30, ఏప్రిల్ 2022, శనివారం

ప్రేమ ఎంత కఠినమో!...(సీరియల్)....PART-5

 

                                                                    ప్రేమ ఎంత కఠినమో!...(సీరియల్)                                                                                                                                                                 PART-5

"అరే దుర్మారుగుడు! నిన్ను చూసి కూడా చూడనట్లు వెళ్ళిపోయాడు" మూడవసారి అడిగింది కుమారి.

"హు..." అనే నవ్వు మోనాలీసా ఛాయతో లత దగ్గర నుండి వచ్చింది.

ఎదురుగా ఉన్న నిండు కుండ లాంటి సముద్రం లాగా ఆమె మనసు కూడా పలువిధ ఆలొచనలతో నిండుగా ఉంది. ఆమె తండ్రిని పోగొట్టుకుని బాధపడుతున్నప్పుడు కూడా మాట వరసకు ఒక ఓదార్పు మాట మాట్లాడని వాడిని గురించి, ఆమె ప్రేమతో కరిగిపోయినా...ఆ నిర్లక్ష్య చూపు...ఆమె హృదయాన్ని బలంగా దెబ్బకొట్టింది.

మనల్ని నిరాకరించినతని ముందు మనం అతని కంటే గొప్పగా నిలబడితేనే గొప్ప. కానీ, లత అలా లేదే! అతని కంటే పలు విషయాలలో తక్కువగానే కదా నిలబడింది. ఓడిపోయిన వాళ్ళు గెలవటం, గెలిచినవారు ఓడిపోవటం ప్రకృతి.

మంచి దారిలో తెచ్చుకున్న పేరు, ప్రతిష్ట, అంతస్తు ఎలాంటి నష్టాన్నైనా తట్టుకునే మందు అనేది ఆమెకు తెలియక కాదు. నిజాయితీగా సంపాదించుకున్న సంపాదనే నిలబడింది.

అది మంచి కుటుంబం కాదు లతా. వాడి అక్కయ్య వాళ్ళ గురించిన వార్తలు ఈ చుట్టు పక్కల బాగా వ్యాపించి ఉంది. కావాలంటే మన మధు దగ్గర అడిగి చూడు...ఏం మధూ" అన్నది సుందరి, మధుమితను చూసి.

"అవును లతా. ఆ ఆడవాళ్ళు బాగా రంగుగా  ఉంటారు. కానీ, ఏ మగాడ్నీ విడిచిపెట్టరు. ప్రేమిస్తున్నామని మోసం చేసి డబ్బు, నగలూ లాకుంటారు. మీ ఇంటిని కూడా ఆ మనిషి ఏదో అవకతవక చేసి అపహరించాడని ఊరు చెబుతోంది" అన్నది మధుమిత.

"ఒక ప్రాణాన్ని బలి తీసుకుని ఆ ఇంట్లో వాళ్ళు ఎలా ఉండ గలుగుతున్నారో! వాళ్ళకు మంచి చావే రాదు?"అన్నది సుందరి ఆవేశంగా.

అక్కడ ఇప్పుడు ఎవరూ నిన్ను తప్పుగా మాట్లాడటం లేదు లతా. వాళ్ళనే నీచంగా మాట్లాడుతున్నారు. విశ్వనాద్ గారి కుటుంబాన్ని నాశనం చేసిన పాపాత్ముడు అనే చెబుతున్నారు"

"వాళ్ళు బాగానే కదా ఉంటున్నారు. 'రియల్ ఎస్టేట్' బిజినస్ చేస్తున్నారట. డబ్బు బాగా సంపాదిస్తున్నారట. నాన్న చెబుతూ ఉండేవారు"

"ఎందుకు సంపాదించకుండా ఉంటారు? అడ్డ దారిలో వెడితే డబ్బు గడించడం పెద్ద కష్టం కాదు. ఒకే స్థలాన్ని నలుగురికి బేరమాడుతారట. వీళ్ళ బుద్ది తెలిసి కూడా మా నాన్నే రెండు లక్షలు ఇచ్చి మోసపోయారంటే చూసుకో" అన్నది మధుమిత ఆవేదనతో.

"నిజంగానా? నా దగ్గర చెప్పనే లేదు" అన్నది సుందరి.

"ఎలా చెప్పగలం? ఎవరితోనైనా చెబితే మాకే అవమానం. ఇచ్చిన డబ్బుల్ని అడిగితే తల్లి, తండ్రి, పిల్లలూ కర్రలు తీసుకుని కొట్టటానికి వస్తున్నారట. వాళ్ళ వీధి కుక్కలు కూడా వాళ్ళకు మర్యాద ఇవ్వటం లేదు.

ఆ దివాకర్ 'హీరో' లాగా కారులోనూ, మోటార్ సైకిల్ మీద వెలుతున్నా కూడా ---బిచ్చగత్తె కూడా తిరిగి చూడటం లేదు" అన్నది మధుమిత.

"ఛ ఛ...వాళ్ళ గురించి మాట్లాడి ఎందుకు టైము వేస్టు చేసుకోవాలి" అని సుందరి చెప్పినప్పుడు, ఇద్దరు స్నేహితురాళ్ళూ తాము ప్లాన్ చేసుకున్నట్టు లతను ఉత్సాహ పరిచే విధంగా దివాకర్ కుటుంబ వివరాలు చెప్పామని తృప్తి చెందారు.   

తమ ప్రాణ స్నేహితురాలిని ఈ పరిస్థితికి తోసిన అతని మీద పగ తీర్చుకున్న తృప్తి వాళ్ళకు.

"నీ మీద నాకు కోపం లతా. అక్కడికి వచ్చిన నువ్వు మా ఇంటికి రాకుండానే పోయేవే! ఒక విసిట్ వచ్చుండచ్చు కదా? మన టీ కొట్టు నాయర్ నువ్వు వచ్చింది, ఇక్కడున్నావనే వివరం నాన్న దగ్గర చెప్పాడు! నిన్ను చూసి రమ్మని నాన్నే మమ్మల్ని పంపించాడు" అన్నది మధుమిత.

"నా వలన మీరెందుకు అవమానపడాలి అని అనుకునే రాలేదు" తలవంచుకుని చెప్పింది లత.

ఇలా చూడూ. ఇంకోసారి అలా మాట్లాడకు. నాకు పిచ్చి కోపం వస్తోంది. నువ్వేం అంత పెద్ద తప్పు చేసావు? ఈ ప్రపంచంలో ఎవరూ ప్రేమించలేదు చూడు. ఆ ఏమీ అర్ధంకాని వయసులో మంచేది...చెడేది...అనేది తెలుస్తుందా? తెలిస్తే చేసేదానివా?" అని అడిగిన మధు "నీ ఈ పరిస్థితికి నీ స్నేహుతురాలమైన మేమూ ఒక కారణమే! నిన్ను ఖండించి వద్దని చెప్పకుండా, ప్రేమించమని ఉత్సాహ పరిచామే" అన్నది.

లత మనసులో నిర్లక్ష్య వైకరి.

ఎవరు చెప్పినా వినే స్థితిలోనా ఆమె ఉన్నది?

ప్రేమ మత్తు తలకెక్కి పిచ్చి పట్టినట్టు కదా ఆమె ఉన్నది.

ప్రాణంగా ప్రేమిస్తున్న తండ్రి కూడా జ్ఞాపకం రాలేదే?

"లతా! ఎలాగూ ఇంత దూరం వచ్చావు. ఇంకో రెండే రెండు రోజులు మాతో పాటూ ఇక్కడే ఉండు. అమ్మ నిన్ను పిలుచుకు రమ్మంది" చెప్పింది మధుమిత.

"ఏయ్ మధూ! నువ్వు చెప్పినా, చెప్పకపోయినా ఇది ఇక్కడే ఇంకా మూడు రోజులు ఉంటుంది. నాన్న ఆదివారానికే దీనికి రైలు టికెట్టు కొన్నారు" అన్నది సుందరి.

ముగ్గురూ నడుచు కుంటూ ఆ సముద్ర తీరంలో నడుస్తున్నారు. సాయంత్రం మెల్లగా జారుకుంటోంది. పిలిచేంత దూరంలో సుందరి ఇల్లు.

"చీకటి పడుతోంది...ఇక నేను బయలుదేరతాను" అంటూ మధుమిత బయలుదేరటానికి రెడీ అయ్యింది. ముగ్గురూ కలిసి రోడ్డు దగ్గరకు వచ్చారు.

తన స్కూటిని స్టార్ట్ చేసిన మధుమితతో "చూసి, జాగ్రత్తగా వెళ్ళు" అన్నది లత.

"సరే...రేపుప్రొద్దున్నే తొమ్మిదింటికి రెడిగా ఉండండి. నేను వచ్చేస్తాను" అని చెప్పి వెళ్ళిపోయింది మధుమిత. మంచికాలం, ఏదో పండగ అంటూ శుక్రవారంతో కలిపి మూడు రోజులు కలిసొచ్చింది.

మరుసటిరోజు ఫ్రెండ్స్ ముగ్గురూ బయటకు వెళ్ళారు. షాపింగ్, పార్క్, హోటల్, సినిమా అని తిరగటంతో మనసు సంతోషంగా ఉంది. దగ్గర దగ్గర నాలుగు సంవత్సరాలు ఎవరితోనూ కలవక ఒంటరి తనానికి అలవాటుపడిన లత మనసులో పిల్లతనం తిరిగి వచ్చింది. మనసు ఆట పాటతో టయర్డ్ అయ్యింది.

మరుసటి రోజు ముగ్గురూ గుంటూరు వెళ్ళారు. సుందరి బండిలో వెనుక లత కూర్చుంది. ప్రయాణం కొనసాగింది. వాళ్ళు వెళ్ళి చేరుకునేటప్పటికి సమయం పన్నెండు అయ్యింది.

తిన్నగా కనబడ్డ హై క్లాస్ వెజిటేరియన్ హోటల్ కు వెళ్లారు. తృప్తిగా భోజనం చేసారు.

రిసెప్చన్ బెంచిలో మధుమిత, లత కూర్చున్నారు... సుందరి బిల్లు కట్టింది.   

"రండి వెళదాం" అని పిలవగా -- ముగ్గురూ హోటల్ బయటకు వచ్చిన సమయంలో ఎదురుగా ఒక అందమైన అమ్మాయితో వచ్చేడు దివాకర్. లతను చూసిన వెంటనే కావాలని ఆ అమ్మయి భుజం మీద చేయి వేశాడు. లతను చూసి వెక్కిరింపుగా నవ్వాడు. అతన్ని చూసి మధుమిత ఆవేశంగా మాట్లాడింది.

"ఎంత వెక్కిరింపుగా చూస్తున్నాడో చూడు! అంత అంద వికారంగానా ఉన్నాము. వాడి కళ్ళు పీకేయాలి. వాడికనే దొరుకుతున్నారు చూడు" అని కచ్చెగా చెప్పిన మధుమితతో "అతనిపైన తప్పులేదు. లతను చూడు ఎలా ఉందో. ఆడ స్వామీజీలాగా లూజులూజుగా ఉండే ఒక చుడీదార్, గట్టిగా, ఒత్తుగా వేసుకున్న జడ. నుదుటి పైనున్న జుట్టునైనా అలంకరించుకోనుండాలి. సిటీలో ఉన్నదన్న మాటే గానీ మనిషిలో ఏమీలేదు" అన్నది సుందరి .

"అవును లతా నువ్వు మారాలి. మనిషి సగం, అలంకారం సగం అంటారు. మన గ్రామంలో చూసావా? అమ్మాయులు ఎంత నాగరీకంగా ఉన్నారో. మనల్ని మనమే అందంగా చూపించుకోవటంలో తప్పు లేదే! మన పురాణాలు కూడా స్త్రీ అలంకరణ గురించి చెప్పింది. ఒక స్త్రీకి బలమే ఆమె స్వయం మర్యాద, అలంకరణ టాలెంటేనట. నువ్వెందుకు నత్తలాగా చుట్టుకున్నావు? మంచిగా డ్రస్సు చేసుకో, ఇప్పుడున్న ఆడపిల్లల లాగా నాగరీకంగా ఉండు. నిన్ను నువ్వే ఎందుకు ఇంత కించ పరుచుకుంటున్నావు? నిన్ను మేము వదిలిపెట్టం. ఏమంటావ్ సుందరీ?" అన్నది మధుమిత.

ఇద్దరూ వెంటనే రంగంలోకి దిగారు. వద్దు వద్దు అంటున్నా లతను బ్యూటీ పార్లర్ కు తీసుకు వెళ్ళారు. ఫేషియల్, బ్లీచింగ్ అనే పేరుతో ఆమె ముఖ చర్మం ఊడిపోయేలాగా మొహాన్ని అందంగా తీర్చి దిద్దారు. నడుం వరకు వేసుకున్న జుట్టును నాగరీకంగా కత్తిరించారు. రెండు గంటల తరువాత, తాళం వేసున్న గది తెరుచుకుని బయటకు వచ్చిన ఆమెను చూసి స్థంభించిపోయారు. నిలువెత్తు అద్దం ముందు ఆమెను నిలబెట్టి "చూడు! ఎంత అందంగా ఉన్నావో. ఇక మీదట ఒత్తుగా, పొడుగ్గా దువ్వుకోకు.ఇదేలాగా రెండు వైపులా లూజుగా వదిలి క్లిప్స్ పెట్టుకో. అందంగానూ, నాగరీకంగానూ ఉంటుంది." అన్నది మధుమిత.

అంతటితో ఆగలేదు. కొన్ని చుడీదార్లు, బట్టలు కొని పడాసారు.

లత డబ్బు ఇచ్చినా తీసుకోలేదు.

"ఇది నాన్నగారు ఇచ్చిన డబ్బు" అన్నది మధుమిత.

"మా అన్నయ్య పోయిన సారి క్రిస్మస్ కు ఇచ్చిన డబ్బు ఇది" అన్నది సుందరి.

మొదట ఈ లూజు, లూజుగా ఉన్న బట్టలను టైట్ చేయించుకో. ప్రతి అమ్మాయిలోనూ అందం దాగుంటుంది లతా. కరెక్ట్ అయిన దుస్తులు వేసుకుని, జుట్టు అలంకార స్టైలును మారుస్తే చాలు 'లుక్కు వచ్చేస్తుంది. దుప్పటాని ఇలా దుప్పటిలాగా వేసుకోకూడదు. కాస్త స్టైలుగా ఇలా వేసుకోవాలి. ఇలా అందంగా వేసుకుంటే నీ శీలం ఏమీ ఎగిరిపోదు" అన్నది.

ఇంటికి వచ్చిన తరువాత కొత్త దుస్తులు ధరించి తన ప్రతిభింబాన్ని తానే చూసుకున్నప్పుడు లతకి ఆత్మవిశ్వాసం అనే విత్తనం మొలకెత్తింది. దాక్కున్న అందం బయటపడటంతో మనసు తేలిక అయిపోయిన భావం. 'నీతీ, న్యాయం, ధర్మం --ఈ ముగ్గురుకీ తప్ప ఇంకెవరికి నేను బానిస? ఎందుకు భయపడాలి? అనే ప్రశ్నలు తల ఎత్తగానే--కొంచం కొంచంగా ఆమెను లోబరచుకున్న నేర భావన, ఆత్మ విశ్వాసం, నమ్మకం లేకపోవటం లాంటి మాటలు ఊడి పడిపోయినై.

దగ్గర దగ్గర నాలుగు సంవత్సరాల తరువాత సొంత ఊరినే తడబాటుతోనూ , నేర భావనతోనూ తొక్కినా --- ఈ రోజు పూర్తి ఆత్మవిశ్వాసంతో హైదరబాద్ కు బయలుదేరింది.

రైల్వే స్టేషన్ లో లతకు వీడ్కోలు చెప్పటానికి వచ్చిన వాళ్ళకు కన్నీటితో బై చెప్పిన లత "నాకు ఎంతో ఆదరణగా ఉన్న మిమ్మల్ని నా ప్రాణం ఉన్నంత వరకు మర్చిపోను" అంటూ ఆవేశంగా చెప్పింది.

స్నేహితులు కౌగలించుకుని వీడ్కోలు చెప్పారు.

"పాపం కదా. చాలా కష్టపడింది. ఇక మీదట బాగుంటుంది" అని మాట్లాడుకుంటూ ఇంటికి తిరిగి వెళ్ళారు మధుమిత, సుందరి.

                                                                                                            Continued...PART-6

****************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి