బొమ్మ కాదా? మరి? (మిస్టరీ)
మెక్సికో నగరంలోని ఒక బట్టల కొట్లోని బొమ్మ, బొమ్మ కాదట. అది ఆ బట్టల కొట్టు మాజీ యజమానురాలు కూతురి మృతదేహం అని అక్కడి ప్రజలు నమ్ముతున్నారు.
మెక్సికో దేశంలోని చీహుహూ అనే నగరంలో 'లా పాపులర్’ అనే పేరుతో వివాహానికి సంబంధించిన బట్టలు అమ్మే ఒక షాపు ఉంది. ఆ షాపులో చాలా బొమ్మలు ఉన్నాయి గానీ 'లా పాస్కౌలిత’ (La Pascualita) అనే పేరున్న ఒక బొమ్మ( షాపులోని మరే బొమ్మకూ పేరు లేదు) బొమ్మ కాదని, అది చనిపోయిన ఆ షాపు యజమానురాలు కూతురు యొక్క భద్రపరచబడిన మృత దేహం అని చెబుతున్నారు. ‘లా పాస్కౌలిత’ అనే ఈ బొమ్మ ఆ బట్టల కొట్లో గత 80 సంవత్సరాలుగా చెక్కు చెదరకుండా ఉన్నదట.
గత కొద్ది సంవత్సరాల నుండి ఈ బొమ్మ పర్యాటకులను ఆకర్షిస్తోంది. నార్త్ అమెరికా, అమెరికా, యూరోప్ దేశాల నుండి ఆ బొమ్మ పెళ్ళి కూతుర్ని చూడటానికి కొన్నివేల మంది వస్తున్నారట. చూసిన వారందరూ ఆ బొమ్మ యొక్క తదేకమైన, మంత్రముగ్ధుల్ని చేసే చూపులు, ఆ బొమ్మలో వాస్తవికంగా కనిపించే లక్షణాల్ని చూసి అది బొమ్మ కాదని గట్టి నమంకంతో వెళుతున్నారట.
మార్చి 25, 1930 లో పాస్కౌలిత అనే ఈ బొమ్మను పెళ్ళికూతురు అలంకరణతో అలంకరించి కొట్లోని గాజు అద్దాల కిటికీ దగ్గర నిలబెట్టేరు. ఈ షాపు వైపుగా వెళ్ళే ప్రతి ఒక్కరూ తమ దృష్టిని ఈ బొమ్మపై పెట్టకుండా వెళ్ళ లేరు. ఎందుకంటే ఆ బొమ్మ యొక్క సహజమైన అందం, మానవుల పోలికలూ ఎవరినైనా ఆకర్షిస్తుంది. ఆ బొమ్మ ఆ షాపు యజమానురాలు 'పాస్కౌలా ఎస్పర్జా’ పోలికలు కలిగి ఉన్నదని వెంటనే గ్రహించారు. ప్రజల ఆలొచనలు ఒక ముగింపునకు వచ్చాయి. ఆ బొమ్మ,
బొమ్మ కాదని, చనిపోయిన ఆ షాపు యజమానురాలి కూతురు మృతదేహం అని ఒక నిర్ణయానికి వచ్చారు.
ఆ షాపు యజమాని కూతురు ఆమధ్యే, అందులోనూ తన పెళ్ళిరోజున తేలు కాటు వలన చనిపోయింది. కూతురు మీద ప్రేమను చంపుకోలేక యజమానురాలు తన కూతురు శవాన్ని కుళ్ళిపోకుండా భద్రపరచి,
తన షాపులోనే ఒక బొమ్మగా ఉంచిందని కొంతమంది స్థానికులు చెప్పటం మొదలుపెట్టారు. ఈ విషయం మీద షాపు యజమానురాలు, ఆమె తల్లి ఒక ప్రకటన చేసే లోపే ఆ బొమ్మకు 'లా పాస్కౌలిత’ అని అక్కడి ప్రజలు పేరు పెట్టేశారు. మెక్సికో భాషలో లా పాస్కౌలిత అంటే 'ఆమె కూతురు’ అని అర్ధం. శవం ఉనికిని ఊహించారు కాబట్టి సహజంగా దానికి అతీంద్రియ శక్తి ఉన్నదని ప్రచారం జరిగింది. ఆ బొమ్మ గురించిన అసాధారణ సంఘటనలు జరిగినట్లు తెలిపారు. ఎవరూ ఈ సంఘటనలను ధ్రువీకరించలేదు. ప్రేమ విఫలమైన ఫ్రాన్స్ దేశ మాంత్రీకుడొకడు రాత్రిపూట ఈ బొమ్మ దగ్గరకు వచ్చి, తన మంత్రజాలంతో ఆ బొమ్మకు ప్రాణం తెప్పించి, ఆమెతో నగరమంతా తిరుగుతాడట. కొంతమంది ఆ బొమ్మ చూపులు మారుతున్నాయని, షాపులో తమని వెంబడిస్తోందని చెబుతున్నారు. మరికొందరు రాత్రి పూట ఆ బొమ్మ షోరూము కిటికీలో తన స్థానం మార్చుకుంటోందని చెబుతున్నారు.
ఈ కథలన్నీ భయపెట్టేవిగా ఉన్నాయి. ముఖ్యంగా ఆ షాపులో పనిచేసే వారికి,
అందులోనూ అత్యంత ముఖ్యంగా ‘సోనియా బర్షియాగా’ అనే ఉద్యోగికి. ఎందుకంటే పదిహేను రోజులకు ఒకసారి ఆమె ఈ బొమ్మపై ఉన్న దుస్తులను తెరచాటున మారుస్తుంది. 'దుస్తులు మార్చడానికి ఆ బొమ్మ దగ్గరకు నేను వెళ్ళినప్పుడల్లా నా చేతులు చెమటతో తడిసిపోతాయి. ఎందుకంటే ఆ బొమ్మ చేతులు మామూలు మనిషి చేతులులాగానే ఉంటాయి. ఆ బొమ్మ కాళ్ళ మీద నరాలు కనబడతాయి. ఆమె బొమ్మ కాదు, నిజమైన మనిషి అని నేను నమ్ముతున్నాను’ అని ఆ ఉద్యోగి చెబుతోంది.
బొమ్మకున్న ఈ కథను తీసిపారేయలేము.
కారణం,
ఈ షాపు ఉన్న ప్రదేశంలో చనిపోయిన వారిని భద్రపరిచే పద్దతికి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉన్నదట. అంతే కాదు,ఆమెను గౌరవించే విధంగా మెక్సికో దేశంలో 'డెడ్' పండుగ నాడు ఆ బొమ్మ దగ్గర పువ్వులు ఉంచుతారు. అక్కడ స్థానికి స్కూల్ పిల్లలు ఆ రోజున ఆ బొమ్మ దగ్గరకు వచ్చి ఆమె ఆత్మ శాంతించాలని పువ్వులతో ప్రార్ధన చేస్తారు. అంతేకాక, ఈ బొమ్మకు మాత్రం దుస్తులు మార్చేందుకు ఎందుకు తెర ఉంచారో తెలియటం లేదు. ఇప్పటి షాపు యజమానిని అడిగితే, తాను ఈ షాపును కొన్నప్పటి నుండి ఆ బొమ్మకు తెర ఉన్నది. తెర మూసే ఆ బొమ్మకు దుస్తులు మారుస్తామని ఆ షాపులోని వారు చెప్పిన తరువాత నాకు ఆ పద్దతి మార్చటం ఇష్టం లేదు అని చెప్పారట. ఈ షాపు తాలూకు ఇప్పటి యజమాని కూడా ఈ బొమ్మను ఎవరూ ముట్టుకోకుండా చూస్తారు. ఈ బొమ్మ గురించిన ప్రశ్నలు వేయకూడదని షాపులోకి వచ్చేవారితో చెబుతాడట.
"మమ్మీలను భద్రపర్చిన విధంగానే ఈ బొమ్మను కూడా భద్రపరచి ఉంటారు. 1930లలో అంతకంటే మెరుగైన పద్దతి ఏదీ లేదని, మెక్సికోలో చనిపోయినవారిని మమ్మీలుగా బద్రపరిచే పద్దతి 1680 నుండీ ఆచరణలో ఉన్నది.ఇది కూడా అలాంటిదేనని" అంటున్నారు అక్కడి ప్రజలు. కానీ ప్రభుత్వ రంగం ఈ బొమ్మ విషయంలో నోరు మెదపటంలేదు. మైనపు బొమ్మ అని చెప్పడానికి కూడా వీలు లేదు. ఎందుకంటే 1930 లలో మైనంతో బొమ్మలు చేసే పద్దతి లేదు.
2012లోనే ఈ బొమ్మ గురించిన ప్రచారం ఎక్కువైంది. 2014 నుండే ఈ బొమ్మ గురించి విరివిగా పత్రికలలో వార్తలు వచ్చాయి. ఈ బొమ్మ గురించిన నిజమైన విషయాలు అధికారపూర్వకంగా వెలువడితేనే నిజమేమిటో తెలుస్తుంది. అంతవరకు ఇది ఒక పెద్ద మిస్టరీగానే ఉంటుంది.
బొమ్మను చూస్తే మీకేమనిపిస్తోంది?
Images Credit: To those who took the original photos.
****************************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి