2, మే 2022, సోమవారం

ప్రేమ ఎంత కఠినమో!...(సీరియల్)....PART-6

 

                                                                        ప్రేమ ఎంత కఠినమో!...(సీరియల్)                                                                                                                                                               PART-6

లత హైదరాబాదుకు వచ్చి నాలుగైదు నెలలు అయ్యింది.

అప్పుడప్పుడు మధుమితను, సుందరిని ఫోను మూలం కలిసి యోగక్షేమాలు విచారించింది. ఎప్పుడైనా బాగా ఒంటరిగా ఉన్న భావన వస్తే వెంటనే స్నేహితులకు ఫోన్ చేసి మాట్లాడుతుంది లత.

ఇప్పుడంతా లతకు ఒంటిరిగా ఉంటున్నామన్న ఫీలింగ్ దూరమయ్యింది.

రూమ్ మేట్స్ తో కలిసి అప్పుడప్పుడు గుడి, ట్యాంక్ బండ్, షాపింగ్ అని చుట్టొచ్చేది. బయట మనుషులను చూడటం, గలగలమని మాట్లాడటంతో ఆమెకు బాగానే పొద్దు పోతోంది.

ప్రొద్దున ఎనిమిదింటికి బయలుదేరితే, సాయంత్రం ఏడు గంటల సమయంలో తిరిగొస్తుంది. ఆ రోజు జీతాలు ఇచ్చిన రోజు కాబట్టి గుడికి వెళ్ళి తిరిగి వచ్చేటప్పటికి టైము ఎనిమిది దాటింది.

లత అంటే హాస్టల్ వార్డన్ కు మంచి అభిప్రాయం ఉంది.

కొంతమంది అమ్మాయలలాగా రోజుకు ఒకడితో వచ్చి దిగకుండా, 'తానూ-తన పని అని మాత్రమే ఉండే లత అంటే ఆమెకు ఇష్టం.

వార్డన్ గది దాటేటప్పుడు, ఎప్పుడూ చెప్పే 'గుడ్ ఈవెనింగ్' విష్ ను ఆ రోజు కూడా చెప్పినప్పుడు " లతా ఒక్క నిమిషం" అన్నది.

"ఏమిటి ఆంటీ?"

"నిన్ను వెతుక్కుని ఒకరు వచ్చారు" అన్న వార్డన్ "మామూలు టైము కంటే నువ్వు ఒక గంట ఆలశ్యంగా వస్తావు కదా, అందుకని ఆయన్ని అరగంట తరువాత రమ్మన్నాను. మన హాస్టల్ రూల్స్ ప్రకారం ఈ సమయంలో ఆయన్ని అనుమతించకూడదు. కానీ, ఆయన చెప్పిన విషయం...అదిగో ఆయనే వచ్చారు. మాట్లాడు" అని చెప్పి తన పనిలో లీనమయ్యింది.

ఏమీ అర్ధం కాని లత-- వచ్చినాయన్ని తలెత్తి ఒకసారి దీర్ఘంగా చూసింది.

" లతా?"

"అవును...మీరు?"

"చెప్తాను. విజిటర్స్ రూముకు వెల్దామా?"

అతని అధికార దోరణి 'కంగు అంటున్నా, అందరినీ గౌరవించే అలవాటు ఉండటం వలన "అదిగో ఆ గదే" అని చూపించి, ముందు నడిచిన అతని వెనుక నడిచింది లత.

ఆ రెండు నిమిషాల నడకలో ఆమెకు పలు ఆలొచనలు.

'ఎవరితను? ఎందుకంత అధికార దోరణి?'

'ఇంతకు ముందు ఇతన్ని ఎక్కడైనా చూసామా?'

ఆలొచిస్తూ నడుస్తున్న ఆమె - గదిలోకి వచ్చినట్టు గమనించలేదు.

ఎదురుకుండా నిలబడ్డ అతను దీర్ఘంగా ఆమెనే చూస్తూ ఉండటంతో ఒక్క క్షణం తికమక పడుతూ -- ఏదో ఆ గదిని కొత్తగా చూస్తున్నట్టు ఆశ్చర్యపడి నిలబడ్డది.

"కూర్చో"

అదే అధికారం.

కూర్చుంది.

"నా పేరు విశాల్ "

"ఏమిటి విషయం?"

అతను తన వీపు వైపుగా వేలాడుతున్న సంచిని లాగి -- అందులోంచి ఒక కవరు బయటకు తీసాడు.

లోపలున్నది ఒక ఫోటో. తీసి ఆమె ముందు జాపిన అతని దగ్గర నుండి బిడియంతో దాన్ని తీసుకుంది.

గందరగోళంతో చూసిన ఆమె చూపులు మరు క్షణం ఆనందంతో వెలిగింది. ఆమె తల్లి, పిన్ని కలిసున్న ఫోటో అది.

ఆమె ఇంట్లో కూడా ఇలాంటి ఫోటో ఒకటి ఉండేది. ఆ ఫోటో గురించి ఒక రోజు తండ్రిని అడిగినప్పుడు.

"అవునమ్మా, ఇద్దరూ కవల పిల్లలు. మా పెళ్ళికి ముందే తనకంటే ఇరవై సంవత్సరాలు వయసు ఎక్కువ ఉన్న ఒకర్ని పెళ్ళి చేసుకుని నార్త ఇండియా వైపు వెళ్ళిపోయారని మీ అమ్మ చెప్పేది. పెళ్ళి చేసుకు వచ్చిన వాళ్ళను మీ అమ్మమ్మా, తాతయ్య గడప తొక్కనివ్వలేదట. ఆ తరువాత ఇంతవరకు ఇటు పక్కకే రాలేదు"

ఎక్కడున్నారో, ఎలా ఉన్నారో? ఏదీ తెలియదు. నువ్వు కూడా అసలు మీ అమ్మలాగానే ఉంటావు. మీ ముగ్గురునీ చూస్తే ఇట్టే గుర్తు పట్టేయచ్చు" అని చెప్పిన జ్ఞాపకం. కొన్ని సంవత్సరాల తరువాత ఒక బంధువును కలుసుకున్న ఆనందం...ఆ ఫోటోను చూసిన వెంటనే కలిగింది.

ప్రేమ భావనతో ఫోటోను మళ్ళీ మళ్ళీ చూసింది.

ఎదురుకుండా ఉండే అతను లత కళ్ళల్లోని భావాలను గమనించాడు.

చిన్న పిల్లలాగా ఆ ముఖంలో ఏర్పడిన సంతోషాన్నీ, ఆనందాన్నీ...వాటితో పాటు కొన్ని విషాద ఛాయ లను గమనించాడు...!

మొదట్లో భయపడ్డ ఆమె కనురెప్పలు కొద్ది క్షణాల తరువాత మెల్లగా పైకి వెళ్ళి అతని ముఖంలోకి దీర్ఘంగా చూసినై. అతనికి తెలియకుండానే అతనిలో సంతోషం ఏర్పడింది.

"ఎవరని తెలుస్తోందా?"

"ఊ... గౌరి పిన్ని. కానీ చూడలేదు"

"ఆమె నా అత్తయ్య"

"ఓ!...పిన్ని ఎలా ఉంది? అప్పుడు నార్త్ ఇండియాలో ఉండేవాళ్ళని"

"అవును... సిమ్లా-అత్తయ్యకు నిన్ను చూడాలని ఆశ"

"నేను ఇక్కడున్నానని మీకు ఎలా?"

ఆమె అడిగిన ప్రశ్నను అతను లెక్క చేయలేదు.

"ఎల్లుండి ప్రొద్దున విమానం. నువ్వు రెడీ అవాలి"

"నేనా? నావల్ల ఇప్పుడు రావటం కుదరదు. సెలవులు లేవు. సెలవు దొరికినప్పుడు వస్తాను"

"ప్రేమతో వెతుకుతున్న పిన్ని ముఖ్యం కాదా?"

"అయ్యో! నేను అలా చెప్పలేదు. నా పరిస్థితి వివరించాను"

"నాకు తెలుసు. ఇలా హాస్టల్లో స్వతంత్రంగా ఉంటూ ఎప్పుడు పడితే అప్పుడు బయటకు వెళ్ళి వచ్చే అమ్మాయి, కుటుంబం అనే కట్టుబాటులో ఒదిగి ఉండలేదు అని" అన్నాడు.  ఆమె ఆ రోజు హాస్టల్ కు లేటుగా రావటం నేరం అనే అర్ధంతో చెప్పాడు.

ఏమిటితను? ఏం మాట్లాడుతున్నాడు?’

"నేను ఎప్పుడూ ఏడు గంటలకే వచ్చేస్తాను. వార్డన్ కు తెలుసు. ఈ రోజు..."

"నువ్వెందుకు లేటుగా వచ్చావు, దానికి కారణమేమిటనేది తెలుసుకోవటానికి రాలేదు నేను. అత్తయ్య కోరిక కోసం నువ్వు సిమ్లా రావాలి. నిన్ను పిలుచుకు వెళ్ళటానికే నేను వచ్చాను" అన్నాడు గంభీరమైన గొంతుకతో.

లతకు అతని అధికార దోరణి, అతని వాలకం చిరాకు తెప్పిచ్చింది. మీరు ఎవరనేదే నాకు తెలియదు. ఏ నమ్మకంతో నేను మీతో రాగలను? ఒక ఫోటో అధారంగా చేసుకుని మీ వెనుక రావటానికి నేను మూర్ఖురాలుని కాదు" అన్నది గబుక్కున.

"ఇంత తెలివిగలదానిని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళి అతి ముఖ్యమైన రహస్యాన్ని తెలుసుకోవలసిన అవసరం నాకు లేదు" అన్నాడు అతను, అదే కంఠ స్వరంతో.

అతను మాట్లాడిన దోరణితో ఆమెకు తెలియకుండానే నవ్వేసింది.

విప్పారిన ముఖంతో, ఆమె ముఖాన్ని క్షుణ్ణంగా చూసాడు విశాల్.

ముక్కూ మొహం తెలియని ఒకనితో సహజంగా మాట్లాడి పళ్ళు ఇకిలిస్తూ నవ్వటం అతిపెద్ద తప్పుగా భవించింది లత. వెంటనే మనసు మార్చుకుంది.

"ఇలా చూడండి మిస్టర్..."

" విశాల్ "

మిమ్మల్ని నమ్మాలా వద్దా అనేది ఇప్పుడు సమస్య కాదు. ఆఫీసుకు ఎప్పుడు పడితే అప్పుడు లీవు పెట్టలేం. అందులోనూ ఇప్పుడున్న పరిస్థితికి నాలాంటి కొత్త వాళ్ళకు పొజిషన్ ఏమిటో తెలియదు. అందువలన నేను..."

ఇలా చూడండి మిస్ లతా. ఒకే ఒక ఫోటోను ఆధారంగా చూపించి మిమ్మల్ని నేను ఆహ్వానించటం -- మీ వరకు న్యాయమైన పని కాదు. కాబట్టి ఇంకొన్ని ఆధారాలతో రేపు సాయంత్రం మిమ్మల్ని కలుస్తాను" అని చెప్పాడు విశాల్.

ఆ తరువాత అన్నీ హడావిడిగా జరిగిపోవటంతో, ఢిల్లీ విమానాశ్రయంలో దిగినా కూడా లతకు నమ్మకం రాలేదు.

ఏది నమ్మాలి?

అనాధ నంటూ ఒంటరిగా ఉండిపోయిన ఆమెకు, ఒక బంధుత్వం ఉన్నదా? ఫోనులో విన్న పిన్ని గొంతు, అన్ని ఆశలను రేకెత్తించిందా? జ్ఞాపకాలలో మసకగా కనబడే తల్లి ముఖమూ, చెవులలో దూరంగా కోయల కూస్తున్న గొంతు -- తల్లి రూపం మొత్తంగా పిన్ని రూపంలో ఉన్నట్టు అనిపించడమా -- ఏదీ అర్ధం కాలేదు ఆమెకు!

ఏ నమ్మకంతో ఒక మగాడితో కొన్ని వందల మైళ్ళు దాటి వచ్చింది.

ఢిల్లీ విమానాశ్రయంలో వైటింగ్ సమయంలో ఆమెను చుట్టుముట్టిన ఆలొచనలు ఆమెను అయోమయంలోకి తోసినై.

ఆనందం, భయం, కన్ ఫ్యూజన్, ఆత్రుత అని పలు రకాల భావాల కలయుకలో సిమ్లా లోయ ప్రాంతంలో ఉన్న ఆ అందమైన భవనం ముందుకు వచ్చి నిలబడింది లత.

                                                                                                          Continued...PART-7

****************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి