10, మే 2022, మంగళవారం

ప్రేమ ఎంత కఠినమో!...(సీరియల్)....PART-10


                                                                     ప్రేమ ఎంత కఠినమో!...(సీరియల్)                                                                                                                                                              PART-10 

"లతా!"

పిన్ని పిలవటంతో "ఏమిటి పిన్నీ?" అని మినపట్టును ఆమె ప్లేటులో పెట్టింది.

"ఆ...చాలు" అన్న ఆవిడ "ఎల్లుండి విశాల్ కు ఆగ్రాలో మీటింగ్ ఉంది. నువ్వూ అతనితో వెళ్ళిరా" అన్నది. 

"నేనా? ఎందుకు?"

"ఏమిటి! ఇలా అడుగుతున్నావు? నువ్వే కదా ఆశపడ్డావు?"

పిన్ని చెప్పేది అర్ధం కాక లత కన్ ఫ్యూజ్ అయ్యింది.

"నువ్వే కదా చెప్పావు. తాజ్ మహాల్ చూడాలని ఆశగా ఉన్నదని. నువ్వెల్తే చూసి రావచ్చు" అన్నది గౌరి.

అతనితో తాజ్ మహాలుకా?’

తలచుకుంటేనే లతకి నవ్వు వచ్చింది.

మామూలుగానే పొడిచి పొడిచి మాట్లాడతాడే? అలాంటప్పుడు ఆ ప్రేమ చిహ్నాన్ని ప్రశాంతమైన మనసుతో చూడనిస్తాడా? పాపాత్ముడు!

అసలు నన్ను అక్కడకు పిలుచుకు వెడతాడా?

పిన్ని అతని గుణం అర్ధం కాక నా అభిప్రాయం అడుగుతోందే!

"ఏంటమ్మా? టికెట్టుకు చెప్పేయొచ్చు కదా?"

"వద్దు పిన్నీ...అది..." ఆమె దగ్గర ఏం చెప్పాలి?

ఆమెకు ఏం చెప్పాలో తెలియక ఆగిపోతే.

"చెప్పు...!"

"అదొచ్చి...అది ప్రేమ చిహ్నం...మొట్టమొదటిసారిగా చూడటానికి వెళ్ళేటప్పుడు"

"అవును...తెలిసిందే కదా!" అని చెప్పిన గౌరి "చూసావా విశాల్! అమ్మాయలు మామూలు విషయాలను కూడా ఎంత భావనా అనుభూతితో ఆలొచిస్తున్నారో. ప్రేమ చిహ్నాన్ని వేరే ఎవరితోనూ వెళ్ళి చూడకూడదట. భర్త తోడుతోనే అహ్లాదపడాలట. బాగుంది కదా. నేను మొదటి సారి నా స్నేహితులతో వెళ్ళాను. ఇది ఆలొచించలేదు" అని చెప్పి లతను చూసి నవ్వింది.

పిన్ని వివరణ లతను ఆశ్చర్యంలో ముంచింది.

మనం ఒకటనుకుంటే...పిన్ని ఇంకొకటి అనుకుంటోందే!

పిన్ని కంటే ఆ పాపాత్ముడు ఏమనుకున్నాడో!  అన్న ఆలొచన రాగానే, మెల్లగా తలెత్తి విశాల్ ను చూసింది.

అతని మొహంలో అంతులేని ఆగ్రహం. ఆమెలో చిన్న భయాన్ని ఏర్పరిచింది.

అరిచి గోడవపెడతాడో!

పిన్ని చెప్పిన కారణం ఆమె కొంచం కూడా ఆలొచించి చూడలేదే!

లతానా...ఒక తోడును వెతుక్కోవటమా. అలా జరగనే జరగదు.

క్లియర్ ఆలొచనతో "పిన్నీ" అని పిలిచింది. "నేను... విశాల్ తో వెళ్ళకపోవటానికి కారణం... కిరణ్ తాతయ్య డెబ్బై ఐదవ పుట్టిన రోజు ఫంక్షన్. ఫంక్షన్ కు ఇంకా కొద్ది రోజులే ఉంది. ఆ ఫంక్షన్ కు చేయాల్సిన ఏర్పాట్లు కిరణ్ ఒక్కడే చూసుకుంటున్నాడు. కొంచం సహాయం చేస్తావా అని నన్ను అడిగారు. చేస్తానని మాట ఇచ్చాను. రేపు, ఎల్లుండి వస్తువులు కొనడానికి అటూ, ఇటూ వెళ్ళాల్సి ఉంది. అందుకే రేపా అని అడిగాను... సహాయానికి వస్తానని చెప్పి వెళ్ళకుండా ఉంటే బాగుండదు కదా!"

గౌరీ పిన్ని లతను ఏదో ఆలొచనతో చూసింది.

"మీ దగ్గర కూడా చెప్పాను కదా పిన్నీ" అన్నది లత.

"సరేరా...నీ ఇష్టం. తాజ్ మహాల్ ను ఇంకోసారి చూసుకోవచ్చు" అని చెప్పి వెళ్ళిపోయింది.

ఏమీ మాట్లాడకుండా తింటున్న విశాల్, గౌరీ తల కనుమరుగైన తరువాత, దోస తీసుకు వచ్చిన లతను చూస్తూ వెక్కిరింపుగా కొంచం గట్టిగా నవ్వాడు. 

'ఎందుకా నవ్వు?' అన్నట్టు చూసింది లత.

"నిన్ను పోయి ఆ ప్రేమ చిహ్నాన్ని చూడమని అత్తయ్య బలవంతం చేస్తోందే! అది తలచుకున్నాను" అన్నాడు.

అతని నిర్లక్ష్య ధొరణి, లత మనసును గాయపరిచింది.

ఒక్కసారి ఆగి అతన్ని చూసింది. అతను లతను మరింత పొడిచాడు.

"నీ ప్రేమ నాటకం కంకిపాడు నుండి ఈ సిమ్లా వరకు...దక్షిణం నుండి ఉత్తరం వరకు ఇంకా వ్యాపిస్తూనే ఉంది. పాపం ఆ కిరణ్ నీ నిజ స్వరూపం తెలియని పిచ్చి జీవి"

అతని ప్రతి మాటా ముల్లులా హృదయాన్ని గుచ్చగా,

"ఇలా చూడండి మిస్టర్. విశాల్ నన్ను విమర్శించటానికి మీకు ఎలాంటి హక్కూ లేదు. నా నడవడికలను గమనించటానికి మీరేమైనా నా సెక్యూరిటీ గార్డా ఏమిటి?" అని అడిగింది లత.

"మంచికాలం...అలాంటి హీన స్థితి నాకు రాలేదు. లేకపోతే నీ ప్రేమికుల జాబితాను..."

అతను మాట్లాడుతూ వెలుతుంటే.

"కొంచం ఆపుతారా? ఇంత నీచంగా మీవల్ల ఎలా మాట్లాడటం కుదురుతోంది? మంచివాళ్ళు అవతలవారిని మంచివారుగా చూస్తారు. కానీ మీరు ఛీ ఛీ..."

వేగంగా ఆక్కడ్నుంచి జరిగింది లత.

 

"అమ్మమ్మ చెప్పినట్లే చేసేద్దాం లతా " అన్నాడు కిరణ్. 

"అలాగే చేసేద్దాం. కానీ, ఇంటి ఆడవాళ్ళకు పట్టు చీరలూ, బంధువులకు గ్రేప్, సిల్క్, కాటన్ రకాలు ఇద్దాం. ఏం బామ్మా నేను చెప్పేది కరెక్టే కదా!"

"నువ్వు చెబితే కరక్టుగానే ఉంటుందిరా" అన్నది బామ్మ.

" కానీ కిరణ్, పట్టు రకాలకు ముందే ఆర్డర్ పెట్టాలి!  మీ షాపులో ఆ వసతి ఉందా లతా " అడిగాడు కిరణ్.

"ఉంది...ఈ మధ్యే పట్టుచీరల డివిజన్ తెరిచాము. ఇంకో రెండు మూడు రోజులలో కొత్త స్టాక్ వస్తుందని పిన్ని చెప్పిన జ్ఞాపకం. అందువలన మనకు  కావలసిన చీరలు దొరుకుతాయి. ఎందుకైనా మంచిది పిన్ని దగ్గర అడుగుదాం"

"అయితే వెంటనే బయలుదేరు" చెప్పాడు కిరణ్.

షాపును చేరుకున్నప్పుడు 'కౌంటర్ దగ్గర నిలబడున్నాడు విశాల్.

మర్యాదకోసం అతనితో మాట్లాడాడు కిరణ్.

ఆ సమయంలో బయటకు వెడుతున్నట్టు ఒక సంచీతో వచ్చింది గౌరి.

పిన్నిని చూసిన క్షణంలో లత, కిరణ్ చెయ్యి పుచ్చుకుని. 

"రండి. పిన్ని ఎక్కడికో వెళ్ళటానికి బయలుదేరింది" ఆల్ మోస్ట్ అతన్ని లాక్కుని వెళ్ళింది.

అతను, "ఏ! లతా..." అంటూ ఆమె లాక్కు వెడుతున్న చోటుకు వెళ్ళాడు.

కిరణ్ తనతో మాట్లాడుతున్నప్పుడు అతన్ని లత లాకెళ్ళటం, ఆమె తనని ఉదాసీన పరిచినట్టు ఫీలయ్యాడు విశాల్.

అందులోనూ ఆమె కిరణ్ చేతులు పుచ్చుకున్న దృశ్యం అతనిలో అగ్నిపర్వతాన్ని పేలేటట్టు చేసింది. 

అతనితో ఇంత క్లోజుగా ఉంటున్న లత ఎందుకని తనని చూసిన వెంటనే తప్పుకుంటోంది. ధైర్యంగా నా ఎదురుగా నిలబడచ్చు కదా? శత్రువులాగా తన చూపులతో నన్ను పొడవటానికి కారణమేమిటి?

తెలిసిన ఒక అమ్మాయి నిర్లక్ష్యం చేస్తే కలిగే నొప్పిని, అనువనువూ అనుభవించాడు కిరణ్.

తనకొసం తన ఎదురుగా వచ్చిన వారిని స్వాగతించి తన క్యాబిన్ లోకి తీసుకు వెళ్ళింది గౌరి.

క్యాబిన్ కర్టన్స్ దాటి వెడుతున్న తన చూపులను కట్టుపరచలేకపోయాడు విశాల్. కొంచం కొంచంగా లత రూపం అతని మనసులో వెలుగు తేవటం మొదలుపెట్టింది.

ఆ రోజు సాయంత్రమే గౌరీను, లతనూ హోటల్ కు తీసుకు వెళ్ళాడు విశాల్. తందూరి రకాలు అతను ఆనందంగా తినగా, 'బరువు పెరుగుతామేమో నని మామూలు తిండి తిన్నది గౌరి. అక్కడొక ప్రశాంత వాతావరణం నెలకొనడంతో మీకూ, నాకూ అంటూ ఫుడ్డును షేర్ చేసుకుంటున్నప్పుడు -- మొదటిసారిగా లతను చూసి నవ్వాడు విశాల్.

అతని నవ్వు లత మనసులో ఆనందాన్ని పురికొల్పింది.

ఆమె మనసులో ఏర్పడ్డ ఆనందం, ఆమె ముఖంలో ప్రతిభింప, ఆ సన్నని వెలుతురులో, హాయిగా వినిపిస్తున్న సంగీతంలో కొత్తదైన, అవస్త పెట్టే ఒక భావనలోకి నెట్టబడ్డాడు విశాల్.

సిగ్గుతో తలవంచుకునే తింటున్న లతను " లతా " అని పిల్చాడు.

ఆ పిలుపులో ఉన్నది వ్యామోహమా? ఆరాటమా? ప్రేమా?

ఏదో మంత్రానికి కట్టుబడ్డ దానికి మల్లే "హు" అన్న గొణుగుతో ఆమె తలెత్తి చూడగా, ఆరాటాన్ని మోస్తున్న ఆ మగ మనిషి చూపులోని  వ్యామోహమో, ఆరాటమో, ప్రేమో... ఏదీ ఆమె కళ్ళకు కనబడలేదు.

ఎదురుకుండా పిన్నితో మాట్లాడుతూ నిలబడ్డ కిరణే కనబడ్డాడు. మెరుపులా మెరిసిన కళ్ళు, తన కళ్ళను కలుసుకోకుండానే దాటి వెళ్ళటం గ్రహించిన విశాల్ లత కళ్ళల్లోని మెరుపుకు కారణం తెలుసుకుని నలిగిపోయాడు. అంతసేపు విశాల్ లో ఏర్పడ్డ సంతోష మబ్బులు, ఆమె దగ్గరగా ఉన్నప్పుడు ఏర్పడిన వెచ్చదనం, ప్రేమ మత్తు, అతనిలో   మెల్లగా ఏర్పడ్డ సలతరింపు…వీటన్నిటినీ ఒక్కసారిగా పీకి పారేసిన నిరాశా భావనలో కొట్టుకున్నాడు.

కొద్ది నిమిషాల తరువాత వాళ్ళ దగ్గర సెలవు తీసుకుని కిరణ్ వెళ్ళిన పిదప -- పిన్నీ, కూతుర్లు మేజర్ కుటుంబం గురించి స్వారస్యంగా మాట్లాడుకుంటున్నారు. వాళ్ల మాటలు విశాల్ యొక్క రెండు చెవులనూ గాయపరచటమే కాకుండా అతని హృదయాన్ని గాయపరిచిందనేదే వాళ్ళకు తెలియదు.

ఇప్పుడంతా ఇంతకు ముందులా విశాల్ – లత, పిల్లీ -- ఎలుకల్లా పోట్లాడుకోవటం లేదు. అప్పుడప్పుడు కలుసుకున్నప్పుడు నవ్వులతో పలకరించుకుంటూ ఒకరి మొహం ఒకరు చూసుకోవటానికి ఎదురుచూస్తున్నట్టు వాళ్ళ వాళ్ళ సమయాన్ని ఆనందపరచుకున్నారు.

లత యొక్క ఒక్కొక్క కదలికలోనూ నిజాయతీ, బాధ్యత కలిసి ఉండటాన్ని చూసి ఆశ్చర్యపోయిన విశాల్ లత గురించి విన్న విషయం పైన చిన్నగా అనుమానం మొదలైయ్యింది.

లత కూడా తనలో మార్పు రావటాన్ని తాను అర్ధం చేసుకున్నప్పుడు  తనని తాను నమ్మలేకపోయింది. 

విశాల్ యొక్క చూపుల కలయిక! దాని వలన ఏర్పడిన సలపరింపు, దాని వలన హృదయాన్ని తాకి వెడుతున్న ఆనంద తరంగాలు!

ఇదంతా ఎలా? పాలూ పండు వెతుకుతున్న విశాల్ హృదయం ఎలా పండును మరిచిపోయింది? దివాకర్ను ప్రేమించిన నా వల్ల ఎలా విశాల్ ను ప్రేమించ గలను?

పలుసార్లు కన్ ఫ్యూజ్ అయిన మనసుకు యుక్త వయసులో ఏర్పడే వ్యామోహమూ, తగిన వయసులో పూచే ప్రేమకూ మధ్య ఉండే తేడా స్పష్టంగా కనబడింది.

'కళ్ళు పలువుర్ని చూసినా, మనసు మాత్రం ఒకర్ని మాత్రమే ప్రేమించగలదు అని దేంట్లోనో చదివింది ఎంత నిజమో!

అప్పుడు ఏర్పడింది ఇరు హృదయాలూ ఒకదానికొకటి అర్ధం చేసుకోలేని పర్వంలో వచ్చిన ఆకర్షణ. ఇప్పుడు ఏర్పడిందే ప్రేమా?" చాలా సార్లు ఆలొచించింది.

హృదయం సతమతమైయ్యి, పిడుగుపడి నరకయాతన అనుభవించి నీరసపడ్డ తరువాత 'ఎవరి మీదా ప్రేమ పెట్టుకోవాలనే మనోభావంలో నేను లేను అంటూ తన చుట్టూ ఒక గోడ కట్టుకుని తనిని తాను కఠిన పరచుకుంది లత.

విశాల్ వైపు మాటి మాటికీ ఈడుస్తున్న మనసును నియంత్రించుకునే తీరాలని కంకణం కట్టుకుంది ఆమె.

ఇంతకు ముందు కూడా ఆమె ప్రవర్తన గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన వాడి మీద ప్రేమ పెంచుకోవటంలో ఏమిటి లాభం?

ఆ ఆలొచనతోనే విశాల్ ను కలుసుకోవటాన్ని చాలా వరకు  అవాయిడ్ చేసి, మేజర్ యొక్క పుట్టిన రోజు వేడుకలో తనని బిజీ చేసుకోవటమో -- నదీ తీర అందాలను ఆశ్వాదిస్తూనో తన మనసును నియంత్రణ చేసుకుంది లత. 

అలా ఒక రోజు నదీ తీరంలో తనని మరిచిపోయి అందాలను ఆశ్వాదిస్తూ నిలబడి ఉన్నప్పుడు -- ఏదో వ్యత్యాసంగా అనిపించింది. ఆమె వెనుక కొంచం దూరంలో ఇద్దరు మనుషులు నిలబడి కళ్ళార్పకుండా ఆమెనే చూస్తున్నారు.

వాళ్ళను చూసిన వెంటనే ఆమెలో భయం చోటుచేసుకుంది. ఆ భయం ఆమె పొత్తి కడుపును కదిలించింది. మాసిపోయిన స్వటర్, బట్ట తలతో నిలబడున్న వాళ్ళ మీద నుండి వీచిన పొగాకు వాసన, ఆమె నశాలాన్ని తాకి ఆమెను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఆమె మెల్లగా తన చూపులను రోడ్డు మీదకూ, చెవులను వాళ్ళ మీదా పెట్టుకుని జరిగింది.

చెప్పుల పాదాల మధ్యలో తీరంలోని గుండ్రని రాళ్ళు ఆమె నడకను తూలేటట్టు చేసినై -- వణుకుతున్న హృదయంతోనూ, భయంతో తడిసిన శరీరంతోనూ వెళ్ళింది. ఆ ఇద్దరు రౌడీలూ తనకు దగ్గరగా రావటం గ్రహించిన ఆమె, ఇక ఆలశ్యం చేస్తే ఆపద అని అనుకుని చెప్పులను దూరంగా పారేసి -- రాళ్ళూ, ముళ్ళూ అని కూడా చూడకుండా పరిగెత్తటం మొదలుపెట్టింది. ఎదురుగా ఉన్న సూది ఆకుల చెట్ల గుంపును చేరుకోక ముందే టయర్డ్ అయిపోయిన ఆమె కాళ్ళ వేళ్ళు బురదతో తడిసున్నాయి. కళ్ళుమూసుకుని ఎటువెళ్ళాలో తెలియక పరిగెత్తుతున్న ఆమె ఎదురుగా దేనిమీదో గుద్దుకుంది.

తను గుద్దుకుంది ఒక మనిషిమీదే అని తెలుసుకునే లోపు -- "ఆ...అమ్మా!"....అని అరచిన లత, ఎదురుగా నిలబడ్డది ఎవరు అనేది తెలుసుకోకుండానే దొర్లుకుంటూ పడిపోయింది.

తన మీద పూలమాలలాగా పడ్డ ఆమెను పట్టుకున్నాడు విశాల్. అతన్ని చూడగానే లతను తరుముకు వచ్చిన గూండాలు వెనక్కి తిరిగి పారిపోయి దాక్కున్నారు.

సగం స్పృహలో ఉన్న లత యొక్క భావనలు, దేనినో గట్టిగా పట్టుకున్నాం అన్న ధైర్యంతో, ప్రశాంతంగా పూర్తి స్పృహ కోల్పోయింది.

శ్వాశ గాలితో కలిసిన ఆ మగ వాసన, గట్టిగా పట్టుకున్న చేతుల ఇచ్చిన హామీ, గట్టిగా పట్టుకున్న చేతులలో దాగి ఉన్న హక్కు -- ఇవన్నీ ఆమె శరీరంలోని ప్రతి అణువు లోనూ ప్రాణవాయువులా పాకింది.

అతను తనకు తగినవాడే నన్న క్లియర్ నెస్ తో, విశాల్ యొక్క విశాలమైన ఛాతి మీద పూర్తిగా ఒరిగిపోయింది లత.    

ప్రొద్దుటి తేట తెలుపు వెలుతురులో, బండ రాళ్ళపై పడున్న మంచులో తన ముఖ ప్రతిబింబం చూసి ఆనందించి, వసంతకాల పువ్వులు రంగుల దుప్పటిలాగా పూచి వాసన వెదజల్ల, పక్షులు కుతూహలంగా పాటలు పాడగా, ఆ స్వర్గ భూమిలో ఒక దేవతలా చుట్టివస్తున్న లత -- ఎదురుగా గంభీరంగానూ, నవ్వుతూనూ తన రాజకుమారుడుని చూడగానే కొంచం తడబడింది.

ముఖంలో జ్ఞాన ఎరుపుతో సౌందర్యం చేర, ఆశగా రెండు చేతులూ జాపినతని పట్టులో దొరకకుండా జారి సీతాకోకచిలుకలాగా ఎగిరిపోయింది. వేగంగా పరిగెత్తిన కాళ్ళల్లో నొప్పి పుట్టడంతో "అమ్మా" అని అరిచిన ఆమెకు అప్పుడే మెల్లగా స్ప్రుహ రావటం మొదలుపెట్టింది. అంతవరకు కనిపించిన దృశ్యాలు కరెంటు కట్ అయినట్లు మాయమైనై. సడన్ గా పాకిన మెరుపులో కలలో నుండి తన ప్రస్తుత స్థితికి వచ్చింది లత. గదిలో వ్యాపించిన సన్నటి వెలుతురు -- తాను పడుకున్నది తన గదేనని అర్ధమయ్యి లేవటానికి ప్రయత్నించినప్పుడు, రెండు కాళ్ళ వేళ్ళలోనూ నొప్పి.

కంకర రాళ్ళతో దెబ్బ తగిలిన కాలి వెళ్ళకు కట్టు కట్టబడి ఉంది.జ్ఞాపక పుస్తకంలోని పేజీలోని లైన్లు గుర్తుకు వస్తున్నాయి.

గూండాలకు భయపడి పరిగెత్తుతున్నప్పుడు దేనినో ఢీ కొని....లేదు లేదు...ఎవరది?

నేనెలా ఇక్కడ? అని అనుకుంటే, హృదయానికి చివర గుసగుసగా, 'అది ఎవరనేది నిజంగానే తెలియదా?'

తెలియకనా హక్కుగా ఒరిగి నిలబడ్డావు? దాంతో పాటు ఆ మగాడి కౌగిలిలో నిన్ను మర్చిపోయి ఉండిపోలా?--చెప్పు...చెప్పు... అని ఒక గొంతు వినబడగా, సిగ్గుతెరలు లత మొహంలో కనబడ్డాయి.  

ఆ సమయంలో వాకిలిలో నీడ కనబడగా, వచ్చింది ఎవరనేది అర్ధం చేసుకుని -- తన ముఖంలో ప్రతిబింబిస్తున్న సిగ్గుతెరలను కప్పి పుచ్చుకోవటానికి చాలా కష్టపడ్డది లత.

తెల్లటి కాంతి కిరణాల కాంతిలో కళ్ళు కూస్తుంటే, తలెత్తి చూసింది. ఆదుర్దాగా విశాల్ కళ్ళల్లో తనపై ఇష్టాన్ని వెతుక, అతని ముఖంలోని భావాలు అర్ధం చేసుకోవటానికి ముందే అతని ప్రేమ మనసు ఆమె చుట్టూ తిరుగుతోంది. మొట్ట మొదటిసారిగా మగ వాసన పీల్చిన ఆమె శ్వాశ -- సిగ్గుతో చెక్కిలిగింతలు పెట్టటంతో లోతైన శ్వాస మొదలయ్యింది.

అతని స్పర్శతో ఏర్పడ్డ దిగ్భ్రాంతి, మత్తు నుండి స్ప్రుహలోకి వచ్చినట్టు శరీరమంతా అలలాగా పాకింది. చెవులు అతని ప్రేమ మాటలకు ఎదురు చూస్తున్నట్టు రెడీగా ఉన్నాయి.

ఆమెలోని అన్ని భావాలు ఆమె వేసుకున్న కట్టుబాటును దాటి ప్రేమ యుద్దానికి తయారవగా, "నీ ప్రేమికుడి జ్ఞాపకాలతో నిలబడటానికి వేరే చోటే దొరకలేదా నీకు? చుట్టూ నిలబడ్డ ఆపదను గమనించలేనంతగా నిలబడటానికి ఏం మాయ చేసాడో ఆ ప్రేమికుడు?" అని అడిగి లత హృదయంలో బుట్టలు బుట్టలుగా అగ్ని తుంపరలను ఎత్తి పోశాడు విశాల్.

సడన్ గా వేసిన పిచ్చి గాలికి ఆకులురాలిన మొక్కలాగా నిలబడ్డది లత.

                                                                                                     Continued....PART-11 

****************************************************************************************************    

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి