కృతిమ సూర్యుడా? లేక
నకిలీ సూర్యుడా? (ఆసక్తి)
చైనా అంటే మనకి గుర్తు వచ్చేదే నకిలీ
వస్తువులు. ఎంత ఖరీదైన వస్తువును సైతం తమ తెలివితో అతి చవక ధరలో, అసలైన
వాటికీ ఏ మాత్రం తీసిపోకుండా నకిలీది తయారు చేయడమే చైనా ప్రత్యేకత. అయితే ఇప్పుడు
ఇంకొక అడుగు ముందుకు వేసి కృత్రిమ సూర్యుడిని సైతం తయారు చేసింది చైనా. సూర్యుడు
కన్నెర్ర చేస్తేనే తట్టుకోలేని పరిస్థితి, అలాంటిది
సృష్టికి ప్రతి సృష్టి మంచిదేనా అనే సందేహాలు ఉన్న తరుణంలో చైనా తయారు చేసి
చూపించింది. గత సంవత్సరం ఈ కృత్రిమ సూర్యుడిని ప్రకటించగా, ఇపుడు
దీనిని మొదటిసారిగా ప్రయోగించింది అని ఆ దేశ మీడియా సంస్థ తెల్పింది.
అనంత విశ్వంలోని సమస్త జీవరాశికి
సూర్యుడే ఆధారం. సూర్యుడి నుంచి వచ్చే వెలుతురు, వేడిమితోనే
మానవులు, జంతు, వృక్ష
జాతులు మనుగడ సాగిస్తున్నాయి. సూర్యుడు లేని ప్రపంచాన్ని ఊహించలేం. సూర్యుడి
శక్తిని భూమ్మీదే ఉత్పత్తి చేసేందుకు చైనా కొన్నాళ్ల కిందట బృహత్తర పరిశోధన
చేపట్టింది. ఎక్స్ పెరిమెంటల్ అడ్వాన్స్ డ్ సూపర్ కండక్టింగ్ టోకామక్ (ఈఏఎస్టీ)
పేరిట చైనా అకాడమీ ఆఫ్ సైన్సెస్ కృత్రిమ సూర్యుడ్ని సృష్టించింది. ఇందులోని
టోకోమాక్ రియాక్టర్ సూర్యుడి తరహాలోనే పనిచేస్తోంది.
సూర్యుడిలో శక్తి ఉత్పత్తి ప్రక్రియను
అనుకరించే ఈ రియాక్టర్.. తాజాగా 1056
సెకెన్ల పాటు అంటే 17 నిమిషాలకుపైగా ఏడు
కోట్ల డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను విడుదల చేసింది. సూర్యుడి ఉష్ణోగ్రత 1.5
కోట్ల డిగ్రీల సెల్సియస్‌తో పోల్చితే ఇది దాదాపు అయిదు రెట్లు ఎక్కువని ఈ
ప్రయోగానికి నేతృత్వం వహించిన చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్
ప్లాస్మా ఫిజిక్స్ శాస్త్రవేత్త గాంగ్ జియాన్జు తెలిపారు. నిరంతర అధిక ఉష్ణోగ్రత
ప్లాస్మా ఆపరేషన్‌లలో ప్రపంచంలోనే ఇది అత్యంత సుదీర్ఘమైందని ఆయన వెల్లడించారు.
డ్యుటేరియం వినియోగంతో సూర్యుడిలో జరిగే
న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రక్రియను అనుకరించి స్వచ్ఛమైన శక్తిని ఉత్పన్నం చేయడమే
ఈస్ట్ ఉద్దేశం. ఈ ఫ్యూజన్ ఎనర్జీ పరికరం చైనా హీఫీలోని చైనీస్ అకాడమీ ఆఫ్
సైన్సెస్‌లో ఉంది. భవిష్యత్తులో దీని సాయంతో శక్తిని ఉత్పాదన చేసి దేశీయ అవసరాలకు
వినియోగించుకోవాలన్నది చైనా లక్ష్యం.
ఇంటర్నేషనల్ థర్మోన్యూక్లియర్ ఎక్స్‌పెరిమెంటల్
రియాక్టర్ (ఐటీఈఆర్) కార్యక్రమంలో భాగమైన ఇది.. 2006లో
తొలిసారి అందుబాటులోకి వచ్చింది. ఐటీఈఆర్ ప్రాజెక్ట్‌లో భారత్, దక్షిణ
కొరియా, జపాన్, రష్యా, అమెరికా
వంటి దేశాలూ భాగస్వాములుగా ఉన్న విషయం తెలిసిందే.
చైనా ప్రయోగంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం
అవుతున్నాయి. దీని వెనుక దురుద్దేశం కూడా ఉండొచ్చనే అనుమానిస్తున్నారు. ఈ శక్తిని
అణ్వాయుధాలకు సైతం ఉపయోగించుకునే అవకాశం లేకపోలేదని భావిస్తున్నారు. అలా గనుక
చైనా చేస్తే.. భారత్, అమెరికా
వంటి దేశాలకు ముప్పు తప్పదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Images Credit:
To those who took the original photos.
****************************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి