4, మే 2022, బుధవారం

ప్రేమ ఎంత కఠినమో!...(సీరియల్)....PART-7

 

                                                                          ప్రేమ ఎంత కఠినమో!...(సీరియల్)                                                                                                                                                              PART-7

తెల్లటి మంచు కొండలు గంభీరంగా నిలబడున్నాయ్. సూది ఆకుల చెట్లు గుంపుగా పచ్చని పట్టు వస్త్రం విరిచినట్లు నిలబడున్నాయి. పచ్చటి గడ్డి తివాచీ మీద మెల్లగా కాలు పెట్టింది లత.

ఒక జలదరింపు వొళ్ళంతా పాకగా, లోయ యొక్క అందం ఆమెకు పరవశాన్ని ఇచ్చింది. అందానికి అందం చేర్చినట్టు ఆ రాజ భవనం అక్కడ రోడ్డుకు దగ్గరగానే ఉంది!

ఈ రాజ భవనంలోనా పిన్ని జీవిస్తోంది?’

ఆ డబ్బు గల తనాన్ని చూస్తే ఎందుకనో లతలో ఒక జంకును ఏర్పరచింది.

ఆమె మనసుకు ఏమీ అర్ధం కాక ఆశ్చర్యంతో నిలబడిపోయిన ఆమె చెవిలో ద్రావకం పోయటానికి ప్రయత్నించాడు విశాల్.

"ఏమిటీ! అలా భ్రమించిపోయి నిలబడ్డావు? బంగళా ఎంత ఖరీదు చేస్తుందని ఆలొచిస్తున్నావా?"

రకరకాల గందరగోళంతోనూ, బిడియంతోనూ వచ్చిన లత, విశాల్ వేసిన ఆ ప్రశ్నతో స్థంభించి పోయింది.

"లేదు...నేను..." అని మాట్లాడటానికి తటపటాయిస్తున్న లత, దగ్గరగా నిలబడున్న అతన్ని తల ఎత్తి చూసింది.

ఇంతసేపు చూసిన అతను ఇప్పుడు కొత్తగా కనబడుతున్నాడు.

ఆమె యొక్క మొదటి విమాన ప్రయాణం కాబట్టీ, పిన్నికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవటానికీ, ఆమెను చాలా అభిమానంగా చూసిన అతను, ఇప్పుడు ఒక విలన్ లాగా మాట్లాడటంతో లత భయపడిపోయింది.

అతని ముఖంలో కొత్తగా కనబడిన నిర్లక్ష్య వైఖరి, వెక్కిరింపు చూపులు ఆమెకు దివాకర్ను గుర్తు చేసాయి.

ఆ రోజు తన సొంత ఇంటి ముందు సిగ్గుతో కృంగి క్రుషించి తల వంచుకుని నిలబడ్డ అదే పరిస్థి తితో, ఈ రోజు పిన్ని ఇంటి ముందు నిలబడింది.

కానీ కొద్ది నిమిషాలలో ఏదో నిర్ణయించుకున్న దానిలా ఆమెలో ఒక ధైర్యం.

"ఎవరితను? ఇతని ముందు నేనెందుకు తలవంచుకోవాలి?"

ఒక విధమైన గర్వంతో అతన్ని ధైర్యంగా చూసింది.

నేనేమన్నా తిండికి గతిలేక వచ్చానా?

బంధుత్వాన్ని కదా వెతుక్కుంటూ వచ్చాను...అది కూడా వాళ్ళు బలవంతం చేస్తేనే!

ఇతని దగ్గర నేనెందుకు తలవంచుకునుండాలి?

చాలా ధ్యాంక్స్ మిస్టర్ విశాల్. మీరు చెయ్యాల్సిన పని పూర్తి అయ్యిందనుకుంటా. నా పిన్ని ఉండే చోటుకు నన్ను తీసుకు వచ్చి చేర్చారు అనుకుంటా" అని నిర్లక్ష్య వైఖరితో చెప్పి 'ఇక నువ్వు వెల్ల వచ్చు అనేలాగా ఒక చూపు చూసింది.

ఆమె కూడా తనని నిర్లక్ష్య పరచటానికే అలా మాట్లాడిందని గ్రహించిన విశాల్ -- కళ్ళల్లో విషం పాకినట్టు, ఒక విధమైన రొమాంటిక్ నవ్వు నవ్వాడు.

అత్తయ్య పోలికలలో ఎన్నో పోలికలను తన ముఖ భావనలో చూపుతున్న ఆ అమ్మాయిపై స్వారస్యం ఎక్కువైంది విశాల్ కు. కానీ ఆమెను చూడటానికి ముందు అతనిలో ఆమె మీద ఏర్పడ్డ విసుగు, కోపం ఇప్పుడు రసమయంగా పరిణామం చెందింది. కానీ దాన్ని అతను బలవంతంగా మనసులో నొక్కి పెట్టాడు.

పిన్నిని చూడబోతున్నామనే ఆశను ఆణుచుకోలేని లత, విశాల్ చూపులోని వెకిలి తనానికి అర్ధంకాక కురువాలను చిట్లించుకుంటూ తన ముఖాన్ని మరో పక్కకు తిప్పుకుంది.

అప్పుడు ఇంట్లో నుంచి ఒక ఆడ మనిషి వచ్చింది.

" వందనా! అత్తయ్య ఎక్కడుంది?"

"ఆమె గదిలో ఉంది సార్"

"ఈమెను అత్తయ్య దగ్గరకు తీసుకు వెళ్ళు"

"రండమ్మా"

లత చేతిలోని పెట్టెను ఆమె తీసుకోగా, హ్యాండ్ బ్యాగుతో ఆమె వెనుకే వెళ్ళింది లత.

మేడ ఎక్కి, వరాండాలో కొద్ది నిమిషాలు నడిచిన తరువాత -- "ఇదిగో ఈ గదే" అన్నది వందనా. "మీ హ్యాండ్ బ్యాగు ఇవ్వండి. ఎదురుగా ఉన్నదే అదే మీ గది" అని చెప్పి హ్యాండ్ బ్యాగు తీసుకుని ఆ గదిలోకి వెళ్ళింది.

పిన్ని గది దగ్గరకు వెళ్ళింది లత.

తలుపు తిట్టింది.

"రావచ్చు" పాటలా వినబడింది గొంతు.

బిడియంతో తలుపు తెరుచుకుని వెళ్ళి, తనకు వీపు చూపిస్తున్నట్టు నిలబడ్డ ఆవిడ్ని ముట్టుకుంది.

తనవైపుకు తిరిగిన ఆవిడ్ని చూసి, ఆశ్చర్యంతో నిలబడ్డది.

"పిన్నీ!"

" లతా! నా తల్లీ!"

కౌగలించుకుంది గౌరి.

ముప్పై ఐదు ఏళ్ళున్న అమ్మాయిలాగా సాల్వార్ కమీజ్ వేసుకోనుంది. ఒక గొప్ప జాతి ఆడదానిలాగా నిలబడ్డ ఆమె - తల్లి పోలికలతో ఆమె లేకపోతే ఆమె తన పిన్ని అని నమ్మేది కాదు లత.

మొదటి రోజు లతాను హాస్టల్లో కలుసుకున్న విశాల్, మరుసటి రోజు తన 'లాప్ టాప్' ను తీసుకు వచ్చాడు. అందులో లతకు ఆమె పిన్నిని, తన అత్తయ్యను, ఆమె పిన్ని ఉన్న మరికొన్ని ఫోటోలను చూపించాడు. ఆ ఫోటోలన్నిటిలోనూ లత పిన్ని స్వటర్ వేసుకుని చీర కట్టులో ఉన్నది. అచ్చం తను తండ్రి దగ్గర చూసిన తన తల్లి ఫోటోలో, తల్లి  పోలికలతో ఉన్నది గౌరి.

కానీ, ఈ రోజు ఒక సామ్రాజ్యానికే మహారాణిలాగా గంభీరంగా తెలుస్తోంది పిన్ని.

"నన్ను క్షమించు కన్నా, నీ పరిస్థితి ఇలా ఉంటుందని నేను ఎదురు చూడలేదు. ఇన్ని రోజులు నిన్ను ఒంటరిగా ఉండేట్టు కష్టపెట్టాను" కన్నీటితో తన బాధను తెలిపింది.

భావాద్వేగంతో పెద్దగా ఏడ్చింది లత.

పట్టు విడువకుండా చోటు వెతుకుతున్న తనకు, తన సొంత గూడే దొరికినంత సంతోషం కలిగింది!

కన్నీటితో ఒకరినొకరు పలుకరించుకుని తమ ప్రేమను వెలిబుచ్చుకున్నారు.

"అత్తయ్యా!  'ప్రేమ గూడు సినిమా మీ ముందు బలాదూర్" -- వెక్కిరింపు గొంతుక కంగుమని వినిపించడంతో ఇద్దరాడవాళ్ళూ మామూలు స్థితికి వచ్చారు.

"రా... విశాల్" -- కాంతివంతమైన కళ్ళతో మేనల్లుడ్ని ఆహ్వానించింది పిన్ని. గౌరి దగ్గరకు వచ్చాడు విశాల్ --' అత్తయ్య నాకు మాత్రమే సొంతం ' అనే లాగా, ఆప్యాయంగా, హక్కుతో ఆమెకు దగ్గరగా నిలబడ్డాడు.

అతని కళ్ళు నేరుగా లతను చూసి 'ఈమె నా అత్తయ్య అని మొండిగా చెప్పినట్టు అనిపించడంతో, లత ఒక్క క్షణంలో తన చూపును మార్చుకుంది.

'ఇతనికీ, మనకూ ఏమిటి సమబంధం?' అన్నట్టు చూసింది.

"ఆ గది నీ గది లతా. వెళ్ళి కాళ్ళూ, చేతులూ కడుక్కుని రా. భోజనం చేద్దాం" అన్నది గౌరి.

"సరే...పిన్నీ" – హమ్మయ్య అనుకుంటూ అక్కడ్నుంచి కదిలింది లత.

గౌరి యొక్క చూపులు పలు భావల కలయుకతో లతను వెన్నంటినై.

"లతా పాపం కదా... విశాల్. ఇంత చిన్న వయసులో ఎన్ని కష్టాలో!"

"తానుగా తెచ్చుకున్న బాధలను అనుభవించాల్సిందే కదా అత్తయ్యా" అన్నాడు అతను యింకిపోయిన స్వరంతో.

అతన్ని ఒక మారు తల ఎత్తి చూసింది గౌరి.

అతని ముఖంలో కనిపించిన కఠినం, కళ్ళ చివర్లలొ మడతలూ అతను చాలా విరక్తితొతో ఉన్నది తెలుపటంతో ఆమె అర్ధం కాని భావనతో నుదురు చిట్లించింది.

"విధి ఆడిన ఆట గురించి చెప్పాను" గబుక్కున మాట మార్చుకుని చెప్పాడు.

గదిలోకి వచ్చి మంచం మీద కూర్చుంది లత. తెల్లవారు జామున విమానం ఎక్కి, పలు మైళ్ళు దాటి సిమ్లా కు రావడానికి ఇదిగో మిట్ట మధ్యాహ్నం అయ్యింది.

కొంచం కూడా టయర్డ్ అనిపించకపోయినా, ఎప్పుడూ తనతోనే ఉన్న విశాల్ వలనే కొంచం శ్రమ అనిపించింది.

ఎవరూ లేరని అనాధగా విరక్తితో జీవితం గడుపుతున్న ఆమెకు 'నేనున్నాను అన్నది పిన్ని.

తండ్రి తరపు బంధువుల వలన ఎటువంటి అభిమాన సహాయాన్ని అందుకోలేని లత, గుప్త నిధిలాగా దొరికిన పిన్ని బంధుత్వాన్ని ఎంతో ఇష్టపడింది.

కానీ, ఆ విశాల్!

గడ్డి పరకలాంటి వాడే! ….ఇంత నీచంగా ఎవరినీ విమర్శించ కూడదు అని తన మనసులోనే మొట్టికాయలు వేసుకుంది లత.

పలురకాల ఆలొచనలతో స్నానం పూర్తి చేసి, డ్రస్సు మార్చుకుని సింపుల్ గా తయారైయ్యింది.

స్నేహితురాళ్ళు బలవంతంగా కొనిపెట్టిన బట్టలు, కచ్చితంగా తనకు సరిపోగా, ఆమె మనసు, వొళ్ళు కొత్త ఉత్సాహం పొందింది.

గదిలోపల ఉన్న అనవసరమైన వస్తువులను సాధ్యమైనంత వరకు పక్కకు పెట్టింది. ఇక...ఈ కొండ ప్రాంతం అందాన్ని ఆశ్వాదిస్తూ, పిన్ని యొక్క ప్రేమను అనువనువు అనుభవిస్తూ, జీవితాన్ని ఆనందమైన జీవితంగా మార్చుకోవాలి.

దృఢంగా అనుకున్న లత, సంతోషంగా మేడ మీద నుండి కిందకు దిగింది. కానీ, డైనింగ్ టేబుల్ ముందు కూర్చుని ఎవర్నో వెతుకుతున్న విశాల్ ను చూసిన తరువాత ఆమె ఉత్సాహం కొంచం తగ్గింది.

"రా...అమ్మాయ్!" గౌరి ప్రేమగా పిలవగానే ఆమె దగ్గరకు వచ్చి కూర్చుంది లత. సింపులా గా రెడీ అయి వచ్చిన లత ఆందాన్ని గర్వంగా చూసింది గౌరి.

చపాతి, పప్పు, పరవాన్నం, కూరగాయలూ అంటూ అమృతంలాగా రుచిగా ఉన్నది వంట.

"వస్తాను లతా. షాపు నుండి సాయంత్రం వస్తాను" అని చెప్పి గౌరి వెళ్ళిపోయింది.

ఏమీ అర్ధం కాకపోయినా, నవ్వుతూ తల ఊపింది లత.

వందనాను భోజనం చెయ్యమని చెప్పి, గిన్నెలను కడిగి తుడిచిన ఆమె -- హాలులో కూర్చుని టీవీ ఆన్ చేసింది.

కొంతసేపైన తరువాత ఒక సంచీతో వచ్చిన వందనా, "మార్కెట్టు వరకు వెళ్ళొస్తాను" అన్నది.

"నేనూ వస్తాను..." అని ఆమెతో బయలుదేరింది లత.

కొండలోయల అందాలను ఆశ్వాదిస్తూ నడుస్తున్న లతకు అరగంట టైము ఎలా గడించిందో తెలియలేదు. అందులోనూ ఎస్టేట్ ప్రదేశం అవటంతో సైలంటుగా ఉన్న ఆ చోటు ఎంతో అందంగా కనబడింది.

భూమాదేవికి పింపుల్స్ వచ్చినట్టు అక్కడక్కడ నిలబడున్న కొండరాళ్ళని నిర్లక్ష్యంగా దాటుకుంటూ వేగంగా ప్రవహిస్తోంది నది.

ప్రొద్దుటి వేలలో నదీ తీరాన్ని వెతుక్కుంటూ వచ్చిన ఆమెకు అప్పుడు కలిసారు....ఆ వృద్ద దంపతులు.

మేజర్ ఫిలిప్స్, ఆయన భార్య డైనా. వాళ్ళకు డెబ్బై ఏళ్ళు ఉంటాయి. వాళ్ళ కారు దారిలో పాడైపోయి ఆగిపోవటంతో, కారును డ్రైవర్ కు అప్పగించి చేతి నిండా సంచులతో నడిచి వస్తున్న వాళ్ళను దాటి వెళ్ళిన లత, వాళ్ళు తెలుగులో మాట్లాడుకోవటం విని ఆనందంతో....

"ఆంటీ! తెలుగు మాట్లాడుతున్నారు?" అన్నది. ఏదో వింతను చూసినట్టు.

ఒకసారి లతను కిందకూ పైకీ చూసిన మేజర్, "ఏంటమ్మా! అందమైన తెలుగు భాష మాట్లాడటం తప్పా?" అన్నారు.

ఆయన మిలటరీ మీసాల మధ్య దాగి ఉన్న వెక్కిరింపు లతకు అర్ధమయ్యింది.

"లేదు...ఈ హిమాచల ప్రదేశ్ లో తెలుగు భాషను వినడం వలన ఏర్పడిన ఆనంద షాక్" అన్నది.

"నీ ఇల్లు ఎక్కడుందమ్మాయ్?"

"సియాన్ ఎస్టేట్"

"మిసస్ గౌరీ...?"

"మా పిన్ని. మా ఊరు విజయవాడ దగ్గర కంకిపాడు"

"మేము గుడివాడ"

"ఇక్కడకొచ్చి చాలా సంవత్సరాలు అయ్యింది"

"ఇవ్వండి ఆంటీ. నేను తీసుకు వస్తాను" అంటూ వాళ్ళ దగ్గరున్న కొన్నిసంచీలు తీసుకున్న లత "మీ ఇల్లు ఎక్కడ?" అని అడిగింది.

"గ్రీన్ ఆపిల్ ఎస్టేట్"

"చుట్టూ ఆపిల్ చెట్లతో...నదికి అవతలవైపు"

"అవును"

"అద్భుతమైన చోటు"---మాట్లాడుకుంటూనే వంతెన దాటారు. టీ రెడీ చేయటానికి లోపలకు వెళ్ళిన డైనా ఆంటీని కూర్చొమని చెప్పి "నేను టీ బాగా పెడతాను ఆంటీ"  అంటూ వంట గదిలోకి వెళ్ళింది లత.

చాలా అందంగా, శుభ్రంగా ఉంది వంట గది.

టీ కప్పుతో వచ్చిన ఆమెతో, " మంగమ్మ, భోపాల్ కు వెళ్ళిపోతే రావటానికి పది పదిహేను రోజులు అవుతుంది" అని పనిమనిషి గురించి చెప్పింది ఆంటీ.

"ఇల్లు ఇంత శుభ్రంగా ఉందే?"

"ఒక రోజుకు నాలుగుసార్లు ఊడుస్తానమ్మా. బయట మాత్రమే పులి, ఇంట్లో ఎలుక" అన్నారు మేజర్.

ఆ వయసులోనూ గంభీరం తగ్గలేదు. అదే సమయం పిల్లలలాగా ఉత్సాహంగా ఉన్న ఆయన్ను చూసి లత బాగా ఇష్టపడింది. మరికొన్నిసార్లు కలుసుకోవటంతో అంకుల్, ఆంటీలు--తాతా, అమ్మమ్మలు అయినట్లు సన్నిహితాన్ని ఏర్పరిచింది.

                                                                                                        Continued...PART-8

****************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి