26, జనవరి 2024, శుక్రవారం

ఇంటింటి వెన్నెలలు...(సీరియల్)....(PART-8)


                                                                               ఇంటింటి వెన్నెలలు...(సీరియల్)                                                                                                                                                              (PART-8) 

జ్యోతీ, పిల్లలతో కలిసి సాయంత్రం బయలుదేరింది. తిన్నగా గాంధీ పార్కుకు వచ్చింది.

చలపతి పది నిమిషాలలో వచ్చి చేరాడు.

పిల్లల చేతికి చాక్లెట్ ఇచ్చి ఆడుకోవటానికి పంపించి, ఇద్దరూ కూర్చున్నారు.

"ఎందుకు ఇక్కడికి రమ్మన్నావు?"

"చాలా మాట్లాడాలి. ఇంట్లో మాట్లాడలేను. కొన్ని నిర్ణయాలు తీసుకొవాలి"

"చెప్పు..."

"మీ నాన్న...మూడు పూట్ల బయట తింటున్నారు. ఇంట్లో మంచి నీళ్ళు కూడా తాగటం లేదు"

"ఇది సరిలేదు జ్యోతీ! అలా వదల కూడదు. ఆయనేం చేశారు...పాపం?”

నేను ఎనిమిదింటికి గానీ లేవలేను"

"అమ్మా, సరోజా ప్రొద్దున్నే నాలుగు గంటలకంతా లేచి టిఫినూ చేసి, చేతికి 'లంచ్' కట్టిస్తారు"

"నా వల్ల కాదు. అది వదలండి"

"సరే! నీకూ, పిల్లలకూ...?"

"నేను చూసుకుంటాను

"అప్పుడు సత్యా పిల్లకు?"

"దాని పేరే చెప్పకండి...బేవర్స్ గిరాకీ! చిల్లి గవ్వ కూడా ఇవ్వకుండా మనింట్లో పంచాయితీ చేస్తోంది. ఇది మీ నాన్న ఇల్లు. అంతే కాకుండా ఆయన, ఆయన జీతం మొత్తాన్ని ఈ ఇంటి ఖర్చులకు ఇస్తున్నారు. -- అందుకే ,అడిగే హక్కు నాకు లేదని వదిలేశాను. ప్రొద్దున నాతో పోట్లాడుతోంది. ఇది దాని ఇల్లా? ఏం చేస్తోంది? సిగ్గు లేదు దానికి? చేసుకుని తిన నివ్వండి. నేను దానికి పనిమనిషినా? పనిమనిషి రెండు నెలలు లీవు. ఇల్లే యుద్దభూమిగా ఉంది. సరి...నేను మాట్లాడాలనుకున్నది వేరు"

"చెప్పు"

మనం నలుగురం. నాన్నా, అమ్మా, సరోజా, రఘూ, పిల్లా, ఆ బేవర్స్ గిరాకీ, ఆ సిగ్గులేని అల్లుడు ఇలా పన్నెండుమంది ఉండేవాళ్ళం. వీరంతా కాకుండా వారానికి ఒకరు మీ పిన్నీ--మీ పెద్దమ్మ అంటూ మీ ఇల్లు ఒక హోటలు. ఇది ఇల్లా...ధర్మ సత్రమా? వచ్చిన వాళ్ళు వెంటనే వెళ్లరు. నాలుగు రోజులు బస! అందులో బిరియానీ, నార్త్ ఇండియన్ భోజనం, ఛాట్ అంటూ మెనూ. మీ పెద్దమ్మ కూతురికి చేతితో అన్నం పిసికి వెన్నల భోజనం వేరే. అన్నిటికీ తల ఊపే సరోజా. ఈ కుటుంబం నాశనమవడానికి ఆమె లాంటి బానిసలే కారణం"

"ఎందుకు అంత కోపం?"

"విషయానికి వస్తాను! మీ అమ్మ రఘూతో వెళ్ళిపోయిన కారణంగా...మీ బంధువుల గుంపు ఇక్కడికి రాదు. రఘూ, పిల్లలతో కలిసి నాలుగు టికెట్లు మైనస్! మీ నాన్న కూడా ఇక్కడ తినటం లేదు. ఇక ఇక్కడ ఇప్పుడు మన కుటుంబం. ఆ పెంకి సత్యా, ఆమె సిగ్గులేని భర్తా, పిల్లా..."

"అల్లుడు రోజూ రావటం లేదే?"

"గారెలు వేసే రోజు వస్తాడు. ఆకలి వేసే రోజు వస్తాడు. ఆకలి తట్టుకోలేకపోతున్నానని గోల చేస్తాడు. ఊల్లో హోటలే లేనట్టు"

"సరే...చెప్పాలనుకున్నది చెప్పు"

"ఇంతవరకు మనం నలభై వేలు ఇచ్చాము. రఘూ కూడా ఇచ్చాడు. ఇక దానికి అవసరముండదు. ఆ సిగ్గులేని దానికి మనమెందుకు తిండి పెట్టాలి?"

"అది నా చెల్లెలే!"

"భర్త చనిపోయాడా? లేక...దాన్ని తన్ని తరిమేశాడా?"

"చాలు జ్యోతీ...అనవసరంగా మాట్లాడుతున్నావు?"

"తోడబుట్టిన అభిమానం పొంగుకు వస్తోందా? పరువు అంటే ఏమిటో ఆమెకు ఎవరూ నేర్పించలేదా? జీవించటానికి వచ్చిన అమ్మాయల గురించి మీ ఇంట్లో ఎవరూ బాధ పడరా?"

అతను మాట్లాడలేదు.

"మన ముగ్గురికి పాతికవేలు ఇవ్వండి...చాలు!"

"మిగిలింది?"

"మీ నాన్న వేసుకుంటారు. వనజాకు తిండి పెట్టే అవసరం ఆయనకే! మిగిలిన పదిహేను వేలు బ్యాంకులో డిపాజిట్ చెయ్యబోతాను"

"సరే! అమ్మే కదా అన్నీ చూసుకునేది. ఆమె ఇప్పుడు లేదే? నాన్నకు సమయం ఉందా? ఆయన చూసుకోగలరా...తెలుసా?"

"ఆయనే చూసుకోవాలి"

"అది కష్టం జ్యోతీ

"అప్పుడు నిర్వాహం మన చేతికి రానీ. నేను నడుపుతాను. బాధ్యతను ఇస్తారా?"

"నేను అడగ గలనా?"

"వదిలేయండి! ఆయన్నే చూసుకోనివ్వండి. పాతిక వేలు ఇచ్చేద్దాం"

"సరేనమ్మా! వంట, ఇంటి పనుల నిర్వహణ ఇవన్నీ ఎవరు చూసుకుంటారు?"

"మనకి నేనే వంట చేస్తాను. మీ నాన్న తింటానంటే ఆయనకీ చేస్తాను. ఆ బేవర్స్ గిరాకీకి వండి పెట్టటం కుదరదు. ఆమె ఇన్ని రోజులు చేసిన పంచాయతీ చాలు!"

"సరే! పనిమనిషి లేదు. ఇంటి పనులు ఎవరు చేస్తారు...?"

"వేరే మనిషిని పెట్టుకోవాలి. నేను మాట్లాడుతాను. పని మనిషికి జీతం మీ నాన్నే ఇవ్వాలి. చెప్పేయండి"

"ఇల్లంటే, కేవలం వంట సామాన్లు, పాలు, కూరగాయలు మాత్రమే కాదు జ్యోతీ. చాలా ఖర్చులు ఉంటాయి. ఇల్లు శుభ్రంగానూ ఉండాలి"

ఇదిగో చూడండి...ఇప్పుడు కూడా పిల్లల ఖర్చులు, మిగతా ఖర్చులూ మనమే చూసుకుంటున్నాం. ఇంటి ఖర్చులకు మన వంతుగా ఇవ్వాలనుకుంటున్న పాతిక వేలే చాలా ఎక్కువ"

అతను మాట్లాడలేదు.

"ఏమిటి మాట్లాడకుండా ఉన్నారు?"

"ఇలా ఒకే ఇంట్లో ఉంటూ మాట్లాడ గలమా? అందులోనూ నాన్న దగ్గర...! ఒక పని చేద్దామా?"

"చెప్పండి..."

"మనం కూడా వేరు కాపురం వెళ్ళిపోదామా?"

"మీకేమన్నా పిచ్చి పట్టిందా?"

"ఒకే ఇంట్లో వేరు వేరుగా గడపటం దేనికి? మనసులు అతకవు. భాందవ్యం నచ్చలేదు. మనం మాత్రం జీవిద్దామనే స్వార్ధం తలెత్తింది. దీని తరువాత కూడా కలిసి ఉండాలని అనుకోవడంలో అర్ధం ఏముంది జ్యోతీ?"

"ఆలొచించరా?"

"దేని గురించి?"

"వేరుగా వెళితే...అద్దె పదిహేనువేలు ఇవ్వాలి. పది నెలలు అడ్వాన్స్. ఇంటికి కావలసిన వస్తువులన్నీ కొనడానికి మూడు లక్షలు. కుటుంబ నిర్వాహం మొత్తం గమనించుకోవాలి. వేరుగా ఒక పనిమనిషి. ఇదే నలభై దాటుతుంది. సొంత ఇల్లు ఉంచుకుని, ఎందుకు అనవసరంగా అద్దెకి...ఇక్కడ ఇరవై ఐదు వేలు విసిరేస్తే చాలు. ఉమ్మడి కుటుంబాన్ని మనం విడగొట్టామనే పేరు ఉండదు. ఇదంతా మీ బుర్రకు ఎక్కుతోందా?"

"కుటుంబం అని వచ్చేస్తే...ఎలాగా?"

"ఏడ్చినట్టుంది! నయాపైసా ఇవ్వకుండా ఒకత్తి రాజభోగం అనుభవిస్తోంది. ఆమెను తరమటానికి ధైర్యంలేదు. మనం వెళ్ళిపోతే, మీ నాన్న యొక్క మొత్త సంపాదనను తీసుకుని మింగేసి, ఆ మహారాణి ఇంటిని కూడా తనపేరుకు మార్చేసుకుంటుంది. పర్మనెంటుగా బంక రాసుకుని కూర్చుంటుంది. వదిలేస్తే దొరకదు. మనమూ జీవించాలి. దాన్నీ తరమాలి. తరిమి తరిమి వెళ్లగొట్టాలి"

"అది కష్టం! ఇది మా నాన్న ఇల్లు"

"మీకూ హక్కు ఉంది"

"రఘూకీ, సరోజాకీ కూడా ఉంది. వాళ్ళు వెళ్ళ లేదా?"

"నేను వెళ్ళమన్నానా? వాళ్ళకు రోషం ఎక్కువ అయితే...దానికి మనమా బాధ్యులం? ఆమె కూడా తెలివైనదే! మీ అమ్మగారిని తనతో తీసుకు వెళ్ళింది. మీ నాన్న డబ్బు బాగా ఇస్తారు?”

"సరోజా స్వార్ధపరురాలు కాదు!"

అది మీ నమ్మకం! ఆమె తెలివిగలది. మంచి యాక్టర్. వదిల్తే మొత్తాన్ని తీసుకుపోతుంది. మాట్లాడకండి"

"సరే...వదులు! నువ్వు త్యాగి...ఒప్పుకుంటున్నా"

"ఎగతాలి వద్దు. నేనెప్పుడూ మీకు కావాలి"

"అది నా తలరాత!"

"ఏం చెప్పారు?"

"వదులమ్మాయ్! నీతో యుద్దం చేయటానికి నా దగ్గర శక్తి లేదు"

"రేపు జీతం వస్తుంది. నేను చెప్పినట్టు చేయండి"

"ఊ...డైలాగులు రాసి ఇచ్చేయి. ఒక మాట కూడా మరిచి పోకుండా మాట్లాడతాను. సరేనా...?"

"ఇప్పుడు హోటల్లో తినేసి ఇంటికి వెళ్దాం. నేనొచ్చి వంట చేస్తానని ఆ బేవర్స్ గిరాకీ కాచుకోనుంటుంది. ఆమెకు ఒక పాఠం నేర్పించకుండా వదిలిపెట్టను"

వాళ్ళు తిని ముగించి ఇంటికి వెళ్ళినప్పుడు టైము పది.

జగన్నాధం కూడా అదే సమయానికే ఇంట్లోకి వచ్చారు.

"నాన్నా! మీరు డిన్నర్ చేశారా?" -- చలపతి అడిగాడు.

"లేదని చెబితే...ఎవరైనా చేసి పెడతారా చలపతి?"

అతని మొహం వాడిపోయింది.

సత్యా న్యూడుల్స్ చేసుకుని, ఆమె తిని, పిల్లకూ పెట్టింది.

"నాన్నా! పనిమనిషి మంగమ్మ రెండు నెలలు రానని చెప్పింది. ఇంటి పనులకు వేరే పనిమనుషిని వెంటనే ఏర్పాటు చేయాలి. నేను ఇద్దర్ని మాట్లాడి ఉంచాను. రేపే వస్తారు"

"ఎంత జీతం సత్యా?"

ఇంటి పనులకు మూడు వేలు, ఇల్లు ఉడ్చి, తుడిచి, అంట్లు తోమి, మూడు పూట్లా వంట చేయటానికి తొమ్మిది వేలు. మొత్తం పన్నెండు వేలు. రఘూతో కలుపుకుని ముగ్గురు మనుషులు తక్కువ అయ్యారే...ఆ ఖర్చు మిగిలినట్లేగా?"

"వాళ్ళ జీతం మన చేతికి రాదే?"

"మీ జీతం, అన్నయ్య జీతం ఉందే?"

జ్యోతీ లోపలకు వచ్చింది.

"మీ నాన్న జీతం గురించి మాత్రం మాట్లాడు. మీ అన్నయ్య జీతంతో నువ్వు 'బడ్జెట్' వెయ్యకు! నీ భర్త ఏం చేస్తున్నాడు?"

"వదినా...తప్పుగా మాట్లాడకండి"

"దీనికంటే ఘోరంగా మాట్లాడతాను"

"ఆయన సహాయం అవసరం లేదు! మాకూ కలిపి మా నాన్న ఇస్తారు. మీరు నోరు ముయ్యండి" అంటూ వదిన మీద అరిచి తండ్రి వైపు తిరిగింది సత్యా "నాన్నా రేపు ఇద్దరు పనిమనుషులు పనిపనిలోకి వస్తారు"

"లేదమ్మా...నా దగ్గర డబ్బులేదు. నీ భర్త ఇస్తానంటే ఇద్దరి పనివాళ్ళనూ, పనుల్లో పెట్టుకో...నాకు అభ్యంతరం లేదు"

"నాన్నా..."

"నేను ఇంట్లో తినబోయేదే లేదు. అందువలన వంట మనిషి అవసరం నాకు లేదు. నేను ఇంట్లో చెత్త ఏదీ పడేయను. నా బట్టలు నేనే ఉతుక్కుంటాను. అందుకని నా పనులకు పనివాళ్ళు అవసరం లేదు. నేనెందుకు డబ్బు లివ్వాలి?"

"శభాష్!" -- జ్యోతీ చప్పట్లు కొట్టింది.

"నాన్నా...మీరూనా? నా సంగతెంటి? నేనూ, నా పిల్లా తినద్దా?"

"వంట చేసుకుని తినమ్మా...ఎవరు కాదంటారు?"

"మావయ్యా! ఇంతవరకు అత్తయ్య, సరోజా చేసి పెట్టటం వలన పొట్ట పెరిగింది. ఇప్పుడు అది జరగదుగా...?"

"మీరేం చెయ్యలేదుగా...?"

"నేనెందుకు నీకు వంట చేసి పెట్టాలి? నువ్వేమన్నా మంచాన పడున్నావా? నీ వల్ల కాకపోతే, నువ్వు చంద్రగిరి మహారాణిగా ఉంటే, కాళ్ళూ--చేతులూ పట్టించుకోవటానికి పనివాళ్లను పెట్టుకో. లేకపోతే నీ భర్తను వంటచేయమని చెప్పు"

"ఆయన మగవారు"

"అలాగా? విన్నారా చలపతి గారూ...దీని భర్త మగ వాడట" -- చెప్పి గట్టిగా నవ్వింది జ్యోతీ.

ఆవేశపడిన సత్యా, వెర్రితో దగ్గరకు వచ్చింది.

"ఏఒ మాట్లాడుతున్నావు? వదినా అని కూడా చూడను"

"రావే పిల్లా! నిన్నూ, పిల్లనూ ఇక్కడ వదిలేసి...వారానికి నాలుగు రోజులు వచ్చి రుచి,రుచిగా నాలుగు రకాల వంటలతో తినేసి, పది రూపాయలు కూడా ఖర్చు పెట్టని నీ మొగుడు మగాడిని చెబితే, ఆ మాటకే అసహ్యం. నోరు ముయ్యి!"

"నాన్నా! ఈమె నన్ను అవమానపరుస్తోంది...చూస్తూ నిలబడ్డారా?  నన్ను కన్నది నన్ను మురికి గుంటలోకి తోసేసి వెళ్ళిపోయింది..."

తండ్రికి కోపం వచ్చింది.

"ఆపు సత్యా! మీ గొడవలకు మధ్యలో నేను రాను. కానీ, మీ అమ్మ గురించి ఎవరైనా ఒక్క మాట మాట్లాడితే...నేను మనిషిగా ఉండను. ఆమె పని చేసి చేసి పనిమనిషిలా అయిపోయి, తట్టుకోలేక వెళ్ళిపోయింది. డబ్బును విసిరిపారేసి 'హాస్టల్లో' లాగా ఈ ఇంటి ఆడవారు జీవిస్తున్నారు. మీ అమ్మ గురించి గానీ, సరోజా గురించి గానీ మాట్లాడటానికి ఎవరికైనా అర్హత ఉందా? చిల్లిగవ్వ కూడా సంపాదించకుండా ఇంట్లో పంచాయతీ పెడుతూ, ఉద్యోగానికి వెళ్ళి సంపాదిస్తుకు వస్తున్న ఆడవాళ్లను విమర్శించే ఆడవాళ్ళ నాలుకలను కోసిపారేయాలి"

జ్యోతీ ముఖం వాడిపోయింది.

"నేను నా భర్త సంపాదించిన డబ్బుతోనే తింటున్నా. పరువు మర్యాద లేకుండా మీ నాన్నపెడుతున్న తిండిని తినటం లేదు"

"జ్యోతీ...చాలు!"అరిచాడు చలపతి.

"ఏమిటండీ చాలు! అది ఇష్టం వచ్చినట్టు వాగుతోంది...నాన్న ఇల్లు కాబట్టి ఇక్కడ తనకే ఎక్కువ హక్కున్నదట? ఆమెకు వంట చేసి పెట్టటానికి మనిషి కావాలా? పుట్టిల్లే కదా! గోడలను గోక్కుని తిననివ్వండి. తలుపులు విరగొట్టి తినమనండి. నేనేం అడగను. పనులకు మనుషులట...సిగ్గులేకపోతే సరి?"

జ్యోతీ లోపలకు వెళ్ళిపోయింది.

చలపతి ఒక విధంగా కలవరపడ్డాడు. తండ్రి యొక్క దీర్ఘమైన చూపులు తనపైనే ఉన్నట్టు గ్రహించాడు...ఒళ్ళు జలదరించింది. ఆయన్ని తలెత్తి చూసే ధైర్యం లేకపోయింది.

తలను కొంచంగా వంచుకుని జరిగి వెళ్ళాడు.

సత్యా, తండ్రి దగ్గరకు వచ్చింది.

"నేను మాట్లాడాలి..."

"ఇంకానా? సారీ! రేపు నాకు 'ఆఫీసు' లో ఎక్కువ పనుంది. నేను నిద్రపోవాలి"

లోపలకు వెళ్ళి తలుపులు వేసుకున్నారు.

సత్యా మొహం...వాడిపోయింది.

                                                                                            Continued...PART-9

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి