26, ఫిబ్రవరి 2023, ఆదివారం

కళ్ళల్లో ఒక వెన్నల....(సీరియల్)..(PART-2)


                                                                           కళ్ళల్లో ఒక వెన్నల....(సీరియల్)                                                                                                                                                              (PART-2) 

బరువైన దేహంతో, గుండు కొట్టించుకున్న తలతో ఎత్తుగా పరిగెత్తుకు వస్తున్న అతన్ని -- తరుముకొస్తున్న వాళ్ళలోని ఒకడు వైష్ణవీని చూసి అరిచాడు.

మ్యాడం! వాడ్ని పట్టుకోండి...వాడ్ని పట్టుకోండి! హలో...బ్లూ చీరా! అతన్ని పట్టుకోండి -- గంభీరమైన స్వరంతో అతను అరుస్తూ పరిగెత్తి వస్తుంటే, ఆమె ఎక్కువ ఆశ్చర్యపోయింది.

బ్లూ చీరా? నాకే చెబుతున్నాడా? ఎవరతను? ఎందుకని వీడ్ని తరుముతున్నారు? రౌడీ గుంపుతో నన్నూ కలిపేస్తారు లాగుందే!

హలో...మిమ్మల్నే. పట్టుకోండి! లేకపోతే అతన్ని కిందకు తొసేయండి...ప్లీజ్!

వైష్ణవీ భయంతో -- ముందు పరిగెత్తుకొస్తున్న అతన్ని చూసింది. అత్యంత వేగంగా పరిగెడుతున్నాడు అతను. జింకను తరుముతున్న చిరుతపులి పరుగు కాదు అది. చిరుతపులి దగ్గర నుండి తన ప్రాణాన్ని కాపాడుకోవటానికి భయంతో పరిగెడుతున్న జింక పరుగు.

వీడ్ని పట్టుకోవాలా? ఒకవేల వీడ్ని చంపటానికి తరుముతున్నారా? ఒక ప్రాణం పోవటానికి మనమెందుకు కారణంగా ఉండాలి? మాట్లాడకుండా వెళ్ళిపోదాం’ -- అనుకుని తిరిగిన క్షణంలో అది జరిగింది.

దొమ్అంటూ ఆమె కుడి భుజంపై బలంగా డాష్ కొట్టాడు అతను. డాష్ కొట్టిన వేగంలో వైష్ణవీ కుడి చేతిలో ఉన్న క్యారేజీ బుట్ట దూరంగా వెళ్ళి పడిపోయి చెల్లా చెదురయ్యింది. హఠాత్తుగా డాష్ కొట్టిన షాక్ లో - వేగంలో బ్యాలన్స్ తప్పింది.

బొంగరంలాగా ఒక చుట్టు చుట్టి, బ్యాలన్స్ పోయి, కింద పడిపోతున్నప్పుడు, ఒక మగవాడి బలమైన చెయ్యి ఆమెను పట్టుకుని ఆపింది.

ఏం జరిగిందని ఆమె తెలుసుకునే లోపు, అదే గంభీర స్వరం మళ్ళీ వినబడింది.

హలో! మీకు ఏం కాలేదే...?”

స్వరానికి సొంతమైన అతని ఇనుములాంటి చేయి తనని పట్టుకున్నదని తెలుసుకుని బెదిరి, అతని దగ్గర నుండి తన చేతిని విడిపించుకుని నిలబడ్డది. అతన్ని చూసింది.

తనని డాష్ కొట్టినతను చాలా దూరం వెళ్ళిపోయున్నాడు. అతన్ని ఇప్పుడు ఏడెనిమిది మందున్న గుంపు తరుముతోంది. తన దగ్గర నిలబడున్న అతను కూడా అతన్ని పట్టుకోవాలనే పరుగుకు రెడీ అవుతూనే అడిగాడు.

మ్యామ్! మీకేం కాలేదే!

లేదు

సరే...మీ వస్తువులన్నీ కింద పడున్నాయి చూడండి. అవి తీసుకోండి -- అంటూనే అతను వదిలిపెట్టిన పరుగును మొదలుపెట్టాడు. వైష్ణవీ కోపంతో అతన్ని తిట్టింది.

రౌడీ వెధవలు. వీళ్ళ రౌడీ తనానికి హద్దే లేకుండా పోయింది. పోలీసు వాళ్ళంతా ఏం చేస్తున్నారో -- ఆమె పెద్ద స్వరంతో తిట్టగా, పరిగెత్తిన అతను ఆయాసంతో నిలబడి తిరిగాడు.

వైష్ణవీ ఒళ్ళు బలంగా వణికింది. భయంతో ఎంగిలి మింగుతూనే అతన్ని చూసింది.

ఒక్క క్షణం...ఒకే క్షణం...ఆమెను చూసేసి, అతి చిన్న నవ్వు పారేసి, తన బలాన్నంత కూడగట్టుకుని మళ్ళీ పరిగెత్తటం మొదలు పెట్టడు.

అతడు తన కళ్ల నుండి తప్పి పోగా, కొంచం ప్రశాంతతో కిందకు చూసింది. పొద్దున తల్లి తొందరపడి -- ఆశగా వండిన కేసరీ, ఇడ్లీలూ, అన్నమూ చిందరవందరగా పడున్నాయి. కళ్ళల్లో నీరు నిండింది.

ఇది నాన్న కోసం ఇచ్చిన లంచ్ అయ్యిందే!బయట తింటే ఒంటికి పడదనే కారణంగా, ఆయన ఎక్కువ సమయం పనిచేయవలసిన రోజులలో లంచ్, టిఫిన్ తానే తీసుకువెళ్ళి ఇస్తుంది వైష్ణవీ.

మనసు మండుతుంటే, వొంగుని పాత్రలు సేకరిస్తుంటే కుడి భుజం బాగా నొప్పి పుట్టింది. ఇనుములాగా ఢీ కొట్టాడే...ఆంబోతు! పక్కనుండి వెళ్ళుండచ్చు కదా?’ మనసులో శపించుకుంటూ ఎడం చేత్తో -- నొప్పి పుడుతున్న చోటును నొక్కుకుంది.

అరెరే...భోజనమంతా చిందిపోయిందే! ఏమ్మా, ఇది లంచ్ భోజనమా?” -- రోడ్డు మీద నిలబడ్డవారు అడగ, తల ఊపింది. అవును.

మీ ఇల్లు ఎక్కడమ్మా?”

ఇక్కడే పక్కనే...

అయితే ఇంటికి వెళ్ళి వేరే భోజనం తీసుకు వెళ్ళమ్మా అన్నారు ఒకరు.  

కాలం చెడిపోయిందమ్మా! రోజుల్లో ఆడవాళ్ళు పట్టపగలు కూడా తిరగలేకపోతున్నారు

కరెక్టే! బండ వెధవ ఎలా ఢీ కొట్టి వెళ్తున్నాడో చూశారా?”

మంచి కాలం...ఇంకో రౌడీ వెధవ పట్టుకున్నాడు. లేకపోతే అమ్మాయి రోడ్డు మీద పడుండేది

భోజనం పోతేపోయింది...వదులమ్మా. నీకేం జరగలేదు కదా! అంతవరకు సంతోషం -- ఒక్కొక్కరూగా వోదార్పు మాటలు చెప్పగా, మౌనంగా ఇంటివైపు నడవటం మొదలుపెట్టింది.

మంచికాలం... బండోడు పడిపోకుండా పట్టుకున్నాడు

అతను పట్టుకున్న ఎడం చేయి చురుక్కు, చురుక్కు మంటోంది. చూపులు న్యాచురల్ గా చోటికి వెళ్ళగా, ఎడం మోచేతికి కొంచం కింద అతను పట్టుకున్న చోటు కొంచంగా కందిపోయుంది.

మూర్ఖపు పట్టు...ఇనుప చేతులు! ఖచ్చితంగా అతనొక రౌడీనే. ఛఛ! పుట్టిన రోజు నాడు రౌడీ ముఖాన్ని చూడవలసి వచ్చిందే!’ -- మనసులో అతన్ని తిట్టుకుంటూ ఇల్లు చేరుకుంది.

తల్లి దగ్గర పూర్తి వివరం చెబితే భయపడుతుందని కాలు స్లిప్ అవటం వలన భోజనం బుట్ట కిందపడిందీ అని చెప్పి అమ్మను నమ్మించింది.

మేనకా ఆందోళనచెంది కూతురి నుదుటి మీద కొంచంగా విభూది రాసి -- తలమీద కూడా కొంచం జల్లింది. క్యారేజీ గిన్నెలు తోమి, మళ్ళీ భోజనం నింపి, సాగనంప...

పరుగులాంటి నడకతో బస్సు ఎక్కి - జనం గుంపులో చిక్కుకుని  - నలిగి కంపెనీకి వెళ్ళి భోజనం క్యారేజీ ఇచ్చింది.

తండ్రి దగ్గర నిలబడి మాట్లాడే సమయంలేక ఆయసపడుతూ పరిగెత్తి, పరిగెత్తి వచ్చి ప్రభుత్వ ఆసుపత్రి లోపలకు వెళ్ళినప్పుడు టైము పదిన్నర అయిపొయింది.

ఆగకుండా పరిగెత్తి, తాము దుస్తులు మార్చుకునే గదికి చేరుకుని, అలమారులో ఉన్న తన తెల్ల దుస్తులను తీసుకుని, తన వస్తువులను అందులో పెట్టి తాళం వేసి, తెల్ల దుస్తుల నర్స్ డ్రస్సుతో, జడను గుండ్రంగా చుట్టుకుంటున్నప్పుడు ఆమె సహ ఉద్యోగి సంధ్యా నర్స్ వచ్చింది.

ఏమిటి సిస్టర్...ఇంత ఆలస్యం చేశారు?”

సారీ సంధ్యా! వచ్చే దారిలో ఒక చిన్న ప్రమాదం...అందుకే ఆలస్యమైపోయింది -- మాట్లాడుతూ వార్డులోకి వచ్చింది.

ప్రమాదమా...దెబ్బ తగిలిందా?”

లేదు. చిన్నగా తగిలింది. చీఫ్ డాక్టర్ వచ్చారా?”

మీకు మంచి టైము. ఇంకా రాలేదు. రిజిస్టర్ లో సంతకంపెట్టండి

థ్యాంక్యూ సంధ్యా! నావల్ల నీకే శ్రమ. నేను తొమ్మిదింటికి రావలసింది అంటూ డాక్టర్ రూములోకి వెళ్ళి అటెండన్స్ రిజిస్టర్ లో సంతకం పెట్టింది.

సరే, సంధ్యా! ఇక నేను చూసుకుంటాను. నువ్వు బయలుదేరు

సరే సిస్టర్! పేషంట్ల పేర్లు ఇందులో రాసుంచాను

సరే

సిస్టర్! లోపల డ్రస్సింగ్ రూములో ఒక పేషెంటు ఉన్నాడు. కాలుకి దెబ్బ తగిలింది. కట్టు వేయండి. ఇంజెక్షన్ వేసేసాను

సరే, నేను చూసుకుంటా. నువ్వెళ్ళిరా. నా వలనే నీకు ఆలస్యమయ్యింది. సారీమ్మా

పరవాలేదు సిస్టర్! రోజు పుట్టిన రోజు అని చెప్పారే! గుడికి వెళ్ళొచ్చారా?”

లేదు. సాయంకాలం వెళతా. నేను ఎప్పుడూలాగానే కరెక్టు టైముకు ఇంట్లొంచి బయలుదేరాను. వచ్చే దారిలో కొంతమంది రౌడీలు, రోడ్డు మీద గొడవపడ్డారు. ఒకడ్ని ఏడెనిమిదిమంది తరుముకు వెళ్ళారు. అందులో ఒకడు నన్ను ఢీకొట్టి తొసేసి వెళ్ళిపోయాడు

అయ్యో! తరువాత...?”

భోజనం అంతా రోడ్డు మీద పడిపోయి వేస్ట్ అయిపోయింది. తిరిగి ఇంటికి వెళ్ళి భోజనం కట్టించుకుని, నాన్న దగ్గర ఇచ్చేసి రావటానికి ఆలస్యమయ్యింది

పరవాలేదు సిస్టర్! ఎప్పుడూ పావుతక్కువ తొమ్మిదింటికల్లా వచ్చేస్తారు. రోజు రాకపోయేసరికి లీవుతీసుకున్నారేమో అనుకున్నా

లేదు...లేదు. చెప్పకుండా ఎప్పుడూ లీవు తీసుకోను

హ్యాపీ బర్త్ డే సిస్టర్ -- సంధ్య, వైష్ణవీ చేతులు పుచ్చుకుని షేక్ హ్యాండ్ ఇస్తే...నవ్వుతూ చిన్నగా మొహాన్ని చిన్న బుచ్చుకుంది వైష్ణవీ.

థాంక్యూ...సిస్టర్!

ఒక ఆంబోతు వచ్చి డాష్ ఇవ్వటంతో భుజం దగ్గర చాలా నొప్పిగా ఉంది. ఇంకో ఆంబోతు నన్ను కింద పడకుండా పట్టుకున్న చోట కూడా నొప్పి పుడుతోంది.

నొప్పి ఇంజేక్షన్ వేయనా సిస్టర్?”

వద్దు. నువ్వు బయలుదేరు. నేను ఇంటికి వెళ్ళి ట్యాబ్లెట్ వేసుకుంటా. అవును! పేషెంట్ ఎక్కడున్నారు?”

ఇదిగో...ఇక్కడే -- గదికి మధ్యగా వేయబడున్న పచ్చ రంగు తెరను చూపించింది సంధ్యా.

అయ్యయ్యో! పేషెంటును ఉంచుకునే ఇంతసేపు మాట్లాడుతున్నామా? నువెళ్ళు. నేను చూసుకుంటాను అంటూ ఆమెను బయటకు పంపించి, మందులున్న ట్రే తో తెరను పక్కకులాగి లోపలకు వెళ్ళిన ఆమె బలంగా అదిరిపడ్డది.

ఆసుపత్రిలో పేషెంట్లను పరీక్షించే బెడ్ మీద కూర్చుని, కుడి కాలును మాత్రం జాపుకోనున్నాడు అతను. అతను -- పొద్దున ఆమె చేతిని పుచ్చుకుని ఆమెను కింద పడకుండా ఆపినతను.

వైష్ణవీకి ఒళ్ళు చెమటలు పట్టింది. అయ్యో! ఇతనా? వీడ్నిపెట్టుకునా వీడి గురించి మాట్లాడాము? ఏం చెబుతాడో? భగవంతుడా! డాక్టర్ కూడా ఇంకా రాలేదే! వీడి దగ్గర ఒంటరిగా వచ్చి చిక్కుకుపోయామే!

అశ్విన్ యొక్క మొహమే వికసించింది. పొద్దున చూసిన బూరగదూది చేతులకు సొంతమైనదా ఈమె? ఎంత మెత్తన? చిన్న పిల్ల యొక్క లేత చేతులను ముట్టుకున్నట్టు జలదరించిందే!

మళ్ళీ ఆమెను చూడటంతో అతని మనసు కుతూహలం చెందింది. చేతిలో మందులతో ఆమె భయపడుతూ నిలబడున్న అవతారం, మరింత ఎక్కువ నవ్వును తెప్పించ...చిన్నగా నవ్వాడు.

హలో! నన్ను చూస్తే, రౌడీలాగానా ఉన్నాను?” -- అతను అదే గంభీర స్వరంతో అడగ, ఆందోళనతో కాదన్నది.

లే...లేదే!

మరి? ఇప్పుడు సిస్టర్ దగ్గర ఏం చెప్పారు?”

పొంచి వినటం తప్పు

అది అవతలి వారు మాట్లాడే రహస్యమైతేనే! మీరు లౌడ్ స్పీకర్ లేకుండానే లౌడ్ స్పీకర్ లాగా ప్రచారం చేసారే! దీన్ని దాక్కుని దొంగతనంగా వినాలా?”

అది...నేను మీ గురించి మాట్లాడలేదు

వేరే ఎవరి గురించి? ! మీ మీద డాష్ కొట్టిన  -- ఆంబోతు గురించి మాట్లాడారా?”

....

దెబ్బ బాగా తగిలిందో?” -- అన్న అతన్ని కోపంగా చూసింది.

అదంతా ఏమీ లేదు. మీకు ఎక్కడ గాయం?”

అతని బరువు నూట ఇరవై కిలోలు. అతను డాష్ కొడితే నొప్పి పుట్టకుండానా ఉంటుంది? మర్చిపోకుండా మందు వేసుకోండి -- అతను సహజంగా మాట్లాడ...భయమూ, తడబాటూ తగ్గిపోగా...మందుతో వెళ్ళింది.

ఏం గాయం సార్...చూపించండి... -- మందులను టేబుల్ మీద ఉంచి, దూది ముక్కతో అతని దగ్గరకు జరగ, కుడి కాలు జాపాడు. ప్యాంటును కొంచంగా మడతపెట్టుకుని...మొకాలుకు దగ్గరగా చర్మం గోక్కు పోయి ఉండగా, నెత్తురు గడ్డకట్టింది.

అరె...ఎలా ఏర్పడింది?” -- ఆమె ఆందోళన చెందటం ఎంజాయ్ చేసాడు.

రోడ్డు మీద పడటంతో దెబ్బ తగిలింది

పడిపోయారా? అరెరె! గాయం బాగా లోతుగా ఉండేట్టు ఉందే! అంటూ ఒక చేతితో అతని కాలు పుచ్చుకుని, దూదితో గాయాన్ని శుభ్ర పరిచింది

ష్...

కాలును కదపకండి. కొంచం నొప్పిగానే ఉంటుంది. ఓర్చుకోండి

... -- నవ్వుతూ తల ఊపాడు.

ఇప్పుడు మందు రాయబోతాను. మంటపుడుతుంది. ఇక్కడ చూడకండి

సరి అన్న అతను, ఆమె ముఖాన్నే చూసాడు. లేతగానూ, దయతో కలిపిన  తెల్లటి ముఖం. ఆమె ట్రీట్ మెంట్ చేసిన విధమూ, మాట్లాడిన విధమూ చూసి ఆనందించాడు.

నెమలి ఈకతో రాస్తున్నట్టు...మంచు బిందువులు జల్లుతున్నట్టు ఉండటంతో...అతను మైమరచి ఆనందసాగరంలోకి వెళ్ళిపోయుండటంతో... వైష్ణవీ మందురాసి, గాయానికి కట్టుకడుతూ అడిగింది.

ఏం సార్...ఎవరతను?”

ఎవరు?”

అతనే...ఒకడ్ని తరుముకుంటూ వెళ్ళేరే?”

అతనా? అతను ఒక హంతకుడు, దొంగ

దొంగా? అలాగైతే మీరు పోలీసా --- దొంగా--పోలీసూ ఆట ఆడుతున్నారా?”

ఏమిటి ఎగతాళా?”

మరి? మీరు చెప్పేది అలాగే ఉంది?”

ఎందుకని? నన్ను చూస్తే పొలీసు లాగా తెలియటం లేదా?” -- అతను అడగ, ఎగతాళిగా నవ్వింది.

తెల్ల చొక్కా, నీలి రంగు జీన్స్ మీ పోలీసు యూనీఫారమా?”

హలో! పోలీసులంటే ఎప్పుడూ కాకీ డ్రస్సు వేసుకునే ఉండాలా! మేమంతా కలర్డ్రస్సు వేసుకోకూడదా?” -- అశ్విన్ సీరియస్ గా అడగ, అప్పుడే అమె అతన్ని నెమ్మదిగా చూసింది.

మిలటరీ పోలీసు కట్టింగ్ క్రాఫు’, లిమిట్ గా కత్తిరించుకున్న మీసాలూ. క్లీన్ సేవ్ తో ముఖం తలతలలాడుతోంది. దృఢమైన శరీరం. కూర్చున్న పొజిషన్ లోనూ నిటారు రూపం. గట్టి కండరాలు. సరాసరి మనిషి కంటే కొంచం ఎక్కువ ఎత్తు. కళ్ళల్లో షార్ప్ నెస్.

భయంగా లేచింది. ఆమె కళ్ళల్లో కనబడ్డ బెరుకుతనం చూసి కళ్ళు పెద్దవి చేసి అడిగాడు అశ్విన్.

నమ్మకం వచ్చిందా?”

సార్...! మీరు...నిజంగానే పోలీసా?”

ఇంకా నమ్మలేదా?”

లేదు సార్! నేను...నిజమైన పోలీసుని...ఇంతవరకు ఇంత దగ్గరగా చూడలేదు. సినిమాలోనే చూసాను. అదే...

సరే! నన్ను బాగా చూసుకోండి

ఏమిటీ?”

దగ్గరగా చూడలేదన్నారుగా...?”

ఎక్స్ క్యూజ్ మి సార్ అనే భవ్యమైన స్వరం వినబడటంతో ఆమె వెనక్కి తిరిగింది. కాకీ దుస్తుల్లో కొంచం పెద్ద మీసాలతో కానిస్టేబుల్ ఒకరు నిలబడున్నారు.

చెప్పండి రమణా! వాడేం చెబుతున్నాడు?”   

ఆడమనిషి తాళి చైన్ వాడి దగ్గరే ఉన్నది సార్. తీసుకున్నాము. వాడిప్పుడు లాక్-అప్ లోనే ఉన్నాడు

ఆడమనిషి దగ్గర చైన్ ఇచ్చేసారా?”

ఇంకా లేదు సార్! మీరు వస్తే స్టేట్ మెంట్ రాసేసి...

ఇదిగో వస్తున్నా అంటూనే ప్యాంటుతో గాయాన్ని మూసి అశ్విన్ కిందకు దిగాడు. హడావిడిపడుతూ ఆయన్ని ఆపింది వైష్ణవీ.

అయ్యో! కాలు కిందపెట్టకండిఇప్పుడే కదా కట్టువేసింది. డాక్టర్ వచ్చిన తరువాత చూపించి...

ఏమండీ! ఇది ఒక మామూలు గాయం. దీనికి ట్రీట్ మెంటే ఎక్కువ. నాకు చాలా పనుంది. వెళ్ళిరానా...?”

జాగ్రత్తగా చూసి వెళ్ళండి అంటూ ఆయనతోనే వెళ్ళింది. పోలీసతను వేగంగా బయటకు వెళ్ళి పోలీసు వాహనంలో ఎక్కి బండిని తీయ, వాకిటి వరకు వెళ్ళినతను వెనక్కి తిరిగాడు. నిలబడి సంకోచంతో ఆమెను చూసాడు.

హలో మ్యాడం

చెప్పండి సార్

ఇప్పుడు నేను పోలీసని...

నమ్ముతున్నా సార్

మంచిది. నా పేరు అశ్విన్. గాంధీ నగర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్

...

మీ పేరు ఏమిటని చెప్పనే లేదు!

నా పేరు... వైష్ణవీ

వావ్...బాగా సూటైన పేరు. మీ అభిమానమైన చికిత్సకు థ్యాంక్స్... తరువాత మీకు నా బర్త్ డే గ్రీటింగ్స్

... ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసింది.

చాన్స్ దొరికితే మళ్ళీ కలుసుకుందాం. బై...బై అంటూ అతను వ్యానులోకి ఎక్కి, కూర్చుని, చెయ్యూప -- వాహనం బయలుదేరింది.

వైష్ణవీ వాకిలిలోనే కదలకుండా నిలబడింది.  

                                                                                                                   Continued...PART-3

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి