28, జులై 2022, గురువారం

దాగుడు మూతలు...(సీరియల్)...(PART-3)

 

                                                                           దాగుడు మూతలు...(సీరియల్)                                                                                                                                                                 (PART-3)

హైదరాబాద్ నుండి బయలుదేరిన తెల్ల రంగు కారు, కనీసమైన వేగంతో గుంటూరు దాటి వెళ్తోంది. ముందు రోజు రైల్లో వెళ్దామని రిజర్వేషన్ చేసుకున్న ప్రశాంతిని ఆపి కారులో పంపించింది ఆమె స్నేహితురాలు పద్మ.

స్నేహితురాలి కారులో, తనకు నమ్మకమైన డ్రైవర్ తోడుతో బయలుదేరటం వలన భయం లేకుండా ప్రయాణం చేసింది ప్రశాంతి. దేవుని మీద భక్తి ఎక్కువగా లేకపోయినా, కళ్ళకు కనబడుతున్న గుడిని చూసి దన్నం పెట్టుకుంది. ఆ అలవాటు కూడా ఆమెకు ఆమె తండ్రి దగ్గర నుండి వచ్చిన అలవాటే.  

అప్పుడు ఆమెకు ఒకరోజు తన తండ్రితో దేవుని గురించి జరిగిన చర్చ జ్ఞాపకం వచ్చింది.  

నాన్నా...నీకు దేవుడి మీద నమ్మకం లేదే! మరలాంటప్పుడు ఎందుకు చర్చ్ కు డబ్బులు ఇచ్చారు, గుడి కుంభాభిషేకానికి నాయకత్వం వహించి జరిపారు? మిమ్మల్ని అర్ధం చేసుకోలేకపోతున్నాను నాన్నా?’

నన్ను చెబుతున్నావే, ‘రహీంఅంకుల్ కూడా మన గుడిలో అన్నదానం చేసేటప్పుడు తన వంతుగా డబ్బులు ఇచ్చాడు. తరువాత సిస్టర్ అమీలియా చేసే సేవలు నాకు బాగా నచ్చాయి. మన పూర్వీకులు రాజులుగా ఉన్నప్పుడు చేస్తూ వస్తున్న పేదలకు ఉచితంగా చదువు చెప్పే పనిని ఇప్పుడు ఈమె చేస్తోంది. అందుకోసం సిస్టర్ అమీలియాకు కావలసింది చేశాను. నీ రెండో ప్రశ్నకు సమాధానం, గుడి నిర్వాహాన్ని మన వారసత్వం నిర్వాహం చేస్తూ వస్తోంది. నా ముత్తాత కట్టింది. నా తరువాత కూడా గుడికి కావలసింది మీరు చేయాలి.

మనిషికైనా, దేనిమీదైనా నమ్మకం ఉండాలమ్మా. అతనికి కష్టం వచ్చేటప్పుడు తట్టుకునే మనో ధైర్యాన్ని ఆ నమ్మకమే ఇస్తుంది. దేవుడి మీద నమ్మకం అది ఇస్తుందంటే...మనం ఎందుకు దాన్ని అడ్డుకోవాలి? దేవుడి భయం లేకపోతే, దేశంలో ఇప్పుడు జరుగుతున్న నేరాలు, అవినీతి శాతం ఇప్పుడున్న దానికంటే పదింతలు ఎక్కువగా జరుగుతుంది. తెలుసా?’

తన తండ్రి మాట్లాడేది నోరు తెరుచుకుని వింటూ ఉండేది ప్రశాంతి. ఆమెకు నమ్మకం లేకపోయినా ఆమె భర్త శ్రీనివాస్ కు దేవుడి మీద భక్తి ఎక్కువగా ఉంది. అతను రోజూ కుంకుమ పెట్టుకోకుండా బయటకు రాడు.

ఆమే స్వయంగా గుడికి వెళ్ళటం ప్రారంభించింది. దేవుడ్ని ప్రార్ధించటం మొదలుపెట్టింది...ఇప్పుడు కూడా అతని కోసం, అతని సంతోషం కోసమే తాత్కాలికంగా అతని దగ్గర నుండి విడిపోవాలని నిర్ణయించుకుంది. అవతలి వారు అడిగినదంతా ఇచ్చే అలవాటున్న ప్రశాంతి -- మొట్ట మొదట ఆశపడింది శ్రీనివాస్ పైనే అనేది జ్ఞాపకానికి వచ్చింది.

అతని దగ్గర తన ఆశను చెప్పి, పెళ్ళి చేసుకోమని అడిగినప్పుడు అతను ఒప్పుకోలేదు. కానీ, అతనిపై ఒత్తిడి తెప్పించి, బలవంతంగా అతన్ని పెళ్ళి చేసుకోవటం తప్పో? లేక రాజ వంశంలో ఉన్న వాళ్ళకు సొంత ఆశలు ఉండకూడదో...? అందువలనే శ్రీనివాస్ ని నా దగ్గర నుండి వేరు చేసి తీసుకు వెళ్ళిందో?’ అనేటటువంటి ఆలొచనలు ప్రశాంతికి ఒక చేదు సంతోషాన్ని ఇచ్చింది. దారి పొడుగునా ఉన్న చెట్లలో నుండి కనబడిన ప్రకృతి దృశ్యాలు ఆమె మనసుకు హాయిగా ఉంది. 

రాత్రి మధురై చేరుకున్న ఆమె, అక్కడున్న ఒక హోటల్లో, ఇంతకు ముందే రిజర్వేషన్ చేసుకున్న రూములో ఉన్నది. గదిలో ఉన్న టెలిఫోన్ ద్వారా పిల్లలతోనూ, స్నేహితురాలుతోనూ మాట్లాడింది. నిద్రపోవటానికి ప్రయత్నం చేసి, కుదరకపోవటంతో దూరంగా ఉన్న గుడి గోపురమును చూస్తూనే పడుకుంది. నిద్రపోయింది.

ప్రొద్దున్నే లేచి స్నానం చేసిన తరువాత, టిఫిన్ తెప్పించుకుని తిన్నది. మార్కెట్టుకు వెళ్ళి అవసరమైన పచారి సరకులు తీసుకుంది. పాల పౌడర్, ఫ్లాస్కు, టీ-కాఫీ పొడి, చక్కెర, బియ్యం, పప్పు, ఎమర్జన్సీ లైటు, గొడుగు మరియు ఇతర సామానులు కొని, మధ్యాహ్నం భోజనం తొందరగా ముగించుకుని కోడైకానల్ వైపు కారులో బయలుదేరింది.

ప్రశాంతి యొక్క తండ్రి మార్తాండ చక్రవర్తి రాజ వంశానికి చెందినతను. బ్రహ్మచారిగా ప్రపంచమంతా తిరిగి వచ్చిన ఆయన, ఒక రోజు హఠాత్తుగా కుమారి అనే యువతిని వివాహం చేసుకుని వచ్చి నిలబడ్డాడు. సాధారణ కుటుంబం నుండి వచ్చిన ఆమెను, మార్తాండ చక్రవర్తి తల్లి-తండ్రులు వాళ్ళను చేర్చుకోనందువలన, ఆస్తిలో  సగం భాగాన్ని తీసుకుని హైదరాబాద్ వచ్చాశారు రాజా మార్తాండ చక్రవర్తి. 

ఇద్దరు మగపిల్లలు పుట్టినా, ఒక ఆడపిల్ల లేదేనన్న మార్తాండ చక్రవర్తి బాధను మరిచిపోయే విధంగా పుట్టిందే ప్రశాంతి. అదేంటో వాళ్ళ వంశానికే ఆడపిల్లలు  అంటేనే అచ్చి రాలేదు. కొన్ని తరాలుగా వంశంలో ఆడపిల్లలు లేరు. అలా కాదని అచ్చి రాని సాంప్రదాయాన్ని మీరి పుట్టిన ఆడపిల్లలూ బ్రతకలేదు.

కోడైకానల్ లో తన ఆంగ్లేయ స్నేహితుడితో గోల్ఫ్ఆడటానికి వచ్చాడు మార్తాండ చక్రవర్తి. మైదానం నుండి కొంచం దూరం జరిగి 'వెల్లకాని ' గ్రామానికి అవతల, కొండజాతి వారు జీవించే చోటునూ దాటి కనిపించిన ఒక అందమైన లోయలో ఒక రాజ భవనం ఇంగ్లాండ్ మోడల్లో కట్టించారు జమీందారు ఒకరు. ఆయన దగ్గర నుండి భవనాన్ని మార్తాండ చక్రవర్తి యొక్క ఆంగ్లేయ స్నేహితుడు కొన్నాడు.   

ఇటికిరాయి రంగుతో పెద్ద పెద్ద కిటికీలతో ఉన్న ఇంట్లో స్నేహితుడితో కలిసి  రాజ భోగ జీవితం అనుభవిస్తూ వచ్చాడు మార్తాండ చక్రవర్తి. అక్కడే కుమారి, ఫిక్స్ చేసిన తారీఖుకు ముందే ప్రసవ నొప్పులతో గిలగిల లాడుతుంటే, తన స్నేహితుడి భవనంలోనే, అక్కడున్న నర్సమ్మ సహాయంతో ప్రసవం జరిగింది. బంగారు శిలలాగా, తెల్ల తెలుపు రంగుతో పుట్టిన ఆడపిల్లకు ' ప్రశాంతి ' అని పేరు పెట్టి ఆనందపడ్డారు మార్తాండ చక్రవర్తి.

తరువాత కొన్ని రోజులలో మార్తాండ చక్రవర్తి యొక్క ఆంగ్లేయ స్నేహితుడు తన సొంత దేశమైన ఇంగ్లాండుకు వెళ్ళ వలసి వచ్చింది. అప్పుడు రాజ భవనాన్ని  మార్తాండ చక్రవర్తి యే కొనుక్కుని, తన కూతురుకు బహుమతిగా ఇచ్చాడు. భవనం చుట్టూ ప్రశాంతత నిండి ఉండటంతో భవనం ' ప్రశాంతి నిలయం' గా మారిపోయింది.  

రాత్రి మధురైలో స్టే చేసిన ప్రశాంతి, ప్రొద్దున త్వరగానే బయలుదేరింది. ముందే చెప్పి ఉంచటం వలన, వెళ్ళే దారిలో జీపులో వచ్చి కాచుకోనున్నాడు జనకరాజ్. నాన్నకు బాగా తెలిసినతను. అతన్ని కలుసుకుని, అతన్ని, అతనితో పాటూ వచ్చిన పని మనుషులనూ తన వెంట తీసుకుని -- ప్రశాంతి నిలయం కు బయలుదేరింది ప్రశాంతి.  

గ్రామానికి చాలాదూరంలో ఉన్నది ఇంద్ర భవనం. ఆమె జీవితంలాగానే ఈ ప్రశాంతి నిలయం కూడా ఆదరణ లేకపోవటంతో పాడుబడిపోయి ఉన్నది. వాహనాలు రాలేనంతగా పొదలు పెరిగి ఉండటంతో, అందరూ దిగి నడవడం మొదలుపెట్టారు.

జనకరాజ్ అన్నయ్యా...నేను ఇంకో పది రోజుల్లో ఇక్కడికి వచ్చేస్తాను. కారు వచ్చి వెళ్ళేలాగా బాటను సరిచేయాలి. మొదటి పనిగా -- నడవటానికి ఉన్న బాటను సరిచేయమనండి. మా పిల్లలకు డస్ట్ పడదు. అలర్జీ. ఇల్లు మొత్తం బూజు దులిపి, నేలంతా క్లీన్ చేయించి కడిగిపెట్టాలి. చలిని తట్టుకునేటట్టు, అన్ని కిటికీలకూ కర్టన్లు తగిలించండి. నేను మధురై నుండే రెడీమేడ్ గా అన్నీ కొనుకొచ్చాశాను. మనుషుల్ను పెట్టి తగిలించండి.

రెండో పనిగా -- రెండోది కాదు, ఇది-కూడా మొదటి పనే. కరెంటుకూ, ఫోను కూ మనుషులను పట్టుకుని ఎలాగైనా ఒక వారం రోజుల్లో వాటిని ఏర్పాటు చేయండి. వంటకి నాకు కిరోసిన్ కావాలి. కట్టెలు కూడా చెప్పండి. మన పక్క గ్రామం వాళ్ళ దగ్గర పాలు, కూరగాయలూ రోజూ తీసుకు వచ్చి ఇమ్మనండి

రాజ గంభీరంతో, సుడిగాలిలా ఆమె వేసిన ఆర్డర్లను ఒప్పుకుని నడవటం మొదలుపెట్టారు అందరూ.

పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. బయిటి ఊరి నుండి వచ్చిన మనుషులు, విసుగు, అలసట అనేది చూపించకుండా పనులు చేసి ముగించారు. అప్పుడు ఇంటి వెనుకకు వెళ్ళిన ఒకతను పెద్దగా అరిచాడు.

అన్నా...ఇక్కడకు పరిగెత్తుకు రండి

ఏమిటో, ఏదో అనుకుని పరిగెత్తుకుని వచ్చిన వాళ్ళందరూ అతను చూపించిన దిక్కు వైపు చూసి నిర్ఘాంతపోయి నిలబడ్డారు.

                                                                                                           Continued...PART-4

****************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి