3, జులై 2022, ఆదివారం

గాలితో ఒక యుద్దం...(సీరియల్)....PART--2

 

                                                                        గాలితో ఒక యుద్దం...(సీరియల్)                                                                                                                                                                  PART-2

నమ్మకాల వలనే ఈ ప్రపంచం నడుస్తోంది. ఒక రైలులోనో, బస్సులోనో మనం ఎక్కి కూర్చుంటునప్పుడు...ఆ వాహనం మనల్ని ఖచ్చితంగా, మంచి విధంగా, సేఫ్ గా వెళ్ళాల్సిన చోటుకు తీసుకు వెళ్ళి చేరుస్తుందని నమ్ముతాము. ఒక పోస్టు బాక్సులో ఉత్తరాన్ని జారవిడిచేటప్పుడు...ఆ ఉత్తరం, చేరవలసిన వాళ్ళకు వెళ్ళి చేరుతుందని నమ్ముతాము.

అంతెందుకు?

మనం తినే ఆహారం కూడా మనల్ని ఏమీ చేయదని, మన ఆకలిని మాత్రమే తీరుస్తుందని నమ్మే తింటున్నాము.

దేనినైనా కళ్ళతో చూసిన తరువాతే...పూర్తిగా అనుభవించిన తరువాతే నమ్ముతాను అంటే; ఈ ప్రపంచంలో ఒక్క విషయం కూడా జరగటం సాధ్యపడదు.

నమ్మకం -- నమ్మకం...ఇది లేకపోతే జీవితమే లేదు...జీవించే దారే లేదు.

.'కాఫీ షాపు’

వీరబద్రం, కార్తిక్ కాఫీ తాగటానికి వచ్చారు. కార్తిక్ లో పెద్దగా ఉత్సాహమే లేదు.

"ఏమిట్రా...మీ బామ్మ చెప్పిందే నీ చెవులల్లో గింగురుమంటోందా?"

"అవును బద్రం! బామ్మా చాలా మంచిది. అనవసరంగా ఏదీ మాట్లాడటమో...చెప్పటమో చేయదు"

"అయితే మీ బామ్మా చెప్పిన మాటను వినే నిర్ణయానికి రా"

"అదీ కుదరటం లేదే...! దగ్గర దగ్గర 500 గజాల స్థలంలో సిమెంటు, ఇటుకలతో కట్టబడ్డ ఇల్లు. స్వాతంత్రం దొరికిన సమయంలో మా తాతయ్య సంతోషంగా కట్టిన ఇల్లు. అప్పుడే ఆ ఇల్లు కట్టటానికి లక్ష రూపాయలు అయ్యిందట. ఇప్పుడు ఈ ఇంటి విలువ ఎంతుంటుందో లెక్కేసి చూడు"

"సరే...ఈ రోజు ఎంత రేటుకు పోతోంది?"

"ఖచ్చితంగా యాభై లక్షలకు పోతుంది"

"ఆ రేటు ఇస్తానంటే అమ్మేసి వెళ్ళిపోవచ్చు కదా...? బామ్మకు తెలియాల్సిన అవసరం లేదే...?"

"నాన్నగారి ప్లాను కూడా అదే. కానీ మా తాతయ్య ఆ ఇంటి గురించి కొన్ని విషయాలు కొందరి దగ్గర చెప్పటం వలన, ఆ విషయాలే ఆ ఇల్లు అమ్మటానికి మాకు అడ్డంగా ఉన్నాయి"  

"అలా ఆ ఇంటి గురించి మీ తాతయ్య ఏం చెప్పారు?"

"చెబుతాను. మొదట ఇది చెప్పు నీ కారులో ఇప్పుడే ‘గాలిపేట’ వరకు వెళ్ళొద్దామా?"

"నేనే అడుగుదామనుకున్నా. ఆ ఇంటిని చూడాలని నాకూ ఆశగా ఉన్నది. నాకు నచ్చితే నేనే ఆ ఇంటిని కొనుక్కుంటాను"

వీరబద్రం ఒక ఐ.టీ కంపెనీలో నెలకు లక్ష రూపాయలు జీతంగా తీసుకుంటున్నాడు. ఆ ధైర్యంతోనే మాట్లాడుతున్నాడు.

“బద్రం...నువ్వు అలా చెప్పటమే నాకు కొండంత బలంగ ఇస్తోందిరా!”

“సరే...కాఫీ తాగు. ఇప్పుడే బయలుదేరదాం. అవును...ఆ గాలిపేట ఇక్కడికి ఎంత దూరం?"

"కోదాడ వెళ్ళి...అక్కడ్నుంచి ఖమ్మం వైపు వెళ్ళే దోవలో...మధ్యలో ఈ గ్రామం ఉంది"

"ఎలాగూ 60 కిలోమీటర్ల దూరం ఉంటుంది కదా?"

"ఉంటుంది!"

"సరే...బయలుదేరుదాం"

వీరబద్రం అర్జెంటు పరిచాడు.

కాఫీ షాపు ముందు అతని కారు కాచుకోనున్నది. ఇద్దరూ ఆ కారులో ఎక్కారు... ‘గాలిపేటకు’ వెళ్ళే వారి ప్రయాణం మొదలయ్యింది.

జగ్గయ్యపేట నుండి దక్షిణం వైపుకు వెళ్ళే నాలుగు లైన్ల రోడ్డులో ప్రయాణం. రోడ్డు బాగుండటం వలన కారు వేగం పుంజుకుంది.

కారులో వాళ్ళ సంభాషణ మొదలయ్యింది.

“ఇప్పుడు చెప్పు కార్తిక్...మీ బామ్మ భయపడటానికి కారణం ఏమిటి?”

“చాలా సింపుల్! నేను వివరంగానే చెబుతాను. మా తాతయ్య- బామ్మల పూర్వీకుల గ్రామమే గాలిపేట. ఆ గ్రామంలో గాలిదేవుడినే అందరూ దేవుడుగా పూజిస్తారు. ఐ మీన్ గాలినే దేవుడిగా కొలుస్తారు. గ్రామం లోపలకు వెళ్ళే ముందు ఒక పెద్ద చెరువు. చెరువు పక్కన ఒక పెద్ద రావి చెట్టు . ఆ రావి చెట్టు క్రింద రెండు రాళ్ళు ఒకటి పక్కన ఒకటి అతికించినట్టు ఉంటుంది. ఆ రాళ్ళకు పైన అర్ధ చక్రం ఆకారంలో పైకప్పు ఉంటుంది. ఆ రాళ్ళే అక్కడ గాలి దైవం...”

“రాళ్ళే గాలిదైవమా...? అయితే గాలికి రూపంలేదో?”

“గాలిదేవుడికి రూపం లేదు. ఆయన గాలిలాగా ఊరిలోపల తిరుగుతుంటారని చెబుతారు”

“యూ మీన్ విండ్?”

“అవును...గాలే. గాలే ఆయన రూపం”

“ఇది చాలా వినోదంగానూ, కొత్త రకంగానూ ఉన్నదే!”

“అవును. ఇదే గాలిపేటలో ఉన్న నమ్మకం”

“మరైతే ఆ రాళ్ళు, గాలిదైవం?”

“రూపంలేని గాలిని ఎలా కొలుస్తారు? కానీ, ఆ రాళ్ళు ఎన్నో వందల సంవత్సరాల క్రితం నుండి అక్కడ ఉన్నాయి. అందుకని ఆ గ్రామంలో గాలిదేవుడు ఆ రూపంలో ఉన్నాడని చెబుతారు”

“సరే...ఈ గాలిదేవుడికీ, మీ తాతయ్యకూ ఏమిటి సంబంధం?”

“అది వింటే నువ్వు నమ్ముతావో...లేవో?”

“ఇంతవరకు నువ్వు చెప్పిన విషయాలన్నీ నమ్మేటట్టుగానా ఉన్నాయి...అవి నేను వినలేదా?”

“వాస్తవానికి గాలిదేవుడు వ్యవసాయం చేసే ప్రజలకు ఇష్ట దైవం. మాకు తిరుపతి వెంకటేశ్వర స్వామి వారే కులదైవం. కానీ, ఆ ఊరిలోనే పలు తరాలుగా నివసించటం వలన మా పూర్వీకులు కూడా గాలిదేవుడినే కులదైవంగా తీసుకున్నారు...”

“సరే...తరువాత?”

“అలా తీసుకున్నందు వలన ప్రతి శివరాత్రి రోజున మా కుటుంబమే ఆ రాళ్ళకు పూజలూ, అభిషేకాలూ నిర్వహించే కార్యక్రమాన్ని తమ కర్తవ్యంగా తీసుకుంది. మిగిలిన వాళ్ళు గాలిదేవుడికి కోడి, మేక బలి ఇస్తే...వెజిటేరియన్ అయిన మా పూర్వీకులు పొంగలి పెట్టి ప్రార్ధించేవారు”

“అది సరే...నువ్వింకా ముఖ్యమైన విషయానికి రాలేదే?”

“వస్తున్నా...అలా ఒక శివరాత్రి రోజున మేము పూజలు జరుపుతున్నాం. ఆ రోజు  ఆ ఊరి వారే కాకుండా పక్క ఊరి ప్రజలుకూడా  ఆ గుడి దగ్గర గుమికూడారు. కనీసం పదివేలమందైనా ఉంటారు”

“అయ్య బాబోయ్...అంతమంది జనమా?”

“అదే శివరాత్రి పూజకున్న స్పేషాలిటీ. అలా పూజలు చేస్తున్నప్పుడు నా వయసు ఐదో, ఆరో...”

“సరే...విషయానికి రా”

“అలా పూజలు జరుగుతున్నప్పుడు మా ఇంట్లో ఎవరూ లేరు. అందరూ గుడి దగ్గర ఉన్నాం. నా మెడలొ ఒక గొలుసు ఉండేది. చెవులకు పోగులు, కాలుకి గొలుసు”

“ఉంటే ఏమిటి?”

“ఆ శివరాత్రి రోజున నగలకోసం ఒక దొంగ నన్ను ఎత్తుకు పోయాడు”

“అరే...ఎంత దారుణం...!”

“ఆ రోజుల్లో నగల కోసం పిల్లల్ని ఎత్తుకు పోయే గుంపు నగలు తీసుకుని, పిల్లల్ని కాలవలోనో, చెరువులోనోపారేసి వెళ్ళటం అలవాటుగా ఉండేది”

“ఏమిట్రా కార్తిక్...బలంగా భయపెడుతున్నావు”

“భయపెట్టటం లేదు...! జరిగిందే చెబుతున్నా. ఎందుకంటే...పోలీసులకు ఆ దొంగ దొరికినప్పుడు, ఎత్తుకెళ్ళిన పిల్లలు...వీడే నన్ను ఎత్తుకెళ్ళిందీ అని చై చూపిస్తే?”

“పిల్లల్ను చంపేంత ఘోరమైన కిరాతకులా ఆ దొంగలు? వాళ్ళవి రాతి మనసులురా”

“లేకపోతే చంపేంత ధైర్యం వస్తుందా?”

“సరే నీ విషయంలో ఏం జరిగింది...అప్పుడు నువ్వేం చేశావు?” 

“నాకు ఏదీ జ్ఞాపకం లేదు బద్రం. కానీ, మా ఇంటికి నేను ఒకే ఒక మగపిల్లాడ్ని. నాన్నకూ--అమ్మకూ పెళ్ళైన వెంటనే నేను పుట్టలేదు. మూడు సంవత్సరాల తరువాతే పుట్టేను. అందువలన...నేను కనిపించ కుండా పోవటం వలన మా తాతయ్య-బామ్మతో పాటూ అందరూ బెదిరిపోయారు. మా నాన్న...పోలీసులకు ఫిర్యాదు చేద్దామని బయలు దేరేరట. అప్పుడు తాతయ్య మా నాన్నను ఆపి, ‘గాలిదేవుడు’ ముందు వెళ్ళి నిలబడి వేడుకో! అంతా మంచే జరుగుతుందని చెప్పారట. కానీ, మా నాన్న, మా తాతయ్య మాట వినకుండా తన తండ్రిని చూసి “మీరు గాలిదేవిడ్ని నమ్మండి...నేను పోలీసులను నమ్ముతాను” అని ఆయనకు ఎదురు చెప్పి పోలీస్ స్టేషన్ కు బయలుదేరి వెళ్ళిపోయారు”

“శభాష్...అదే కరెక్ట్ పద్దతి!”

“తరువాతే అన్ని కష్టాలూ వచ్చినై”

“ఎలాంటి కష్టాలు”

“నా మెడలో...చెవులలో అప్పుడు వేసున్న అభరణాలు బంగారం కావట. 'రోల్డ్ గోల్డ్'...”

“ఇందులో ఇలా ఒక ట్విస్టా?”

“మధ్యలో మాట్లాడకుండా విను...నగలను చెక్ చేసిన దొంగకు కోపం. విపరీతమైన కోపం. వాడికి డబ్బు అవసరం. చాలా ముఖ్యం. వెంటనే ఏం చేశాడంటే...ఎలాగో మా ఇంటి ఫోన్ నెంబర్ తెలుసుకుని, ఇంటికి ఫోన్ చేసి ఐదు లక్షల రూపాయలు ఇస్తే నన్ను ప్రాణాలతో వదిలిపెడతానని చెప్పి 'డీల్’ మాట్లాడుకున్నాడు”

 “దారి కాచే దొంగ...బ్లాక్ మైలర్ గా మారాడా?”

“అవును...పోలీసులు మా నాన్న దగ్గర డబ్బులిచ్చి, ముందు పంపించి, వెనకాలే నన్ను ఎత్తుకెళ్ళిన దొంగను పట్టుకోవటానికి రెడీగా ఉన్నారట. కానీ, అది దొంగకు తెలిసిపోయింది...అతను చెప్పిన చోటుకు రాలేదు. మా ఇంటికి ఫోన్ చేసి, మీరు పోలీసులకు వెళ్ళినందువలన...మీ పిల్లాడు శవంగానే ఇంటికి వస్తాడని చెప్పేశాడు”

“అప్పుడే మా నాన్నకు తెలిసింది ఒక చిన్నతప్పు, పెద్ద తప్పుగా మారిందని. మా కుటుంబంలోని వారందరూ ఏడుపు మొదలు పెట్టారు. అదే సమయం పోలీసులు, ‘వాడు అలాంటి తప్పు చేయాడు, వూరికే మిమ్మల్ని భయపెడుతున్నాడు’ అంటూ మా వాళ్ళకు  ధైర్యం చెప్పారు. ఏం చేయాలో తెలియక అందరూ గందరగొళంలో ఉన్నప్పుడు........

"ఆ ఉన్నప్పుడు?" ఆసక్తిగా అడిగాడు వీరబద్రం.

"చెబుతున్నాగా..."

“మా తాతయ్య తిన్నగా గాలిదేవుడి గుడి దగ్గరకు వెళ్ళాడు. “రేయ్ గాలిదేవుడా! నువ్వు ఉన్నది నిజమైతే...నా మనవుడు చిన్న గాయం కూడా లేకుండా తిరిగి రావాలి. నువ్వేం చేస్తావో...ఎలా చేస్తావో నాకు తెలియదు. లేదంటే, ఈ రాయి రూపంలో, నిన్ను ఈ ఊరిని కాపాడే దైవంగా భావిస్తున్న ఈ ఊరు...లోకం అదంతా పెద్ద అబద్దం అని చెప్పి, నీమీద పెట్టుకున్న నమ్మకాన్ని వదులుకుంటరు” అని చెప్పి నిమ్మ పండు అంత సైజు కర్పూరం ను వెలిగించారు. అప్పుడు అక్కడకు వచ్చిన పూజారి...మా తాతయ్యను చూసి, 'వూరికే ఐదు రూపాయలు ఖర్చు చేసి కర్పూరం కొని వెలిగిస్తే సరిపోతుందా...గాలిదేవుడికి మొక్కులాగా ఏదైనా ఇస్తానని చెప్పు. ఏదీ వదులుకోకుండా గాలిదేవుడి దగ్గర నీ కోరిక నెరవేరాలనుకుంటున్నావా' అని అడిగాడు”

వెంటనే తాతయ్య... “నేను ఏం చేయాలి?” అని అడిగారట.. “అది నాకు తెలియదు. కానీ ఒకటి...నువ్వు ఇవ్వాలనుకున్నది నిజంగా పెద్దదిగా ఉండాలి. అప్పుడే గాలిదేవుడు కరుణిస్తాడు. అదే సమయం ఆయన తలుచుకుంటే...నీ మనవుడు మంచిగా తిరిగి రావటమూ ఖచ్చితమే!” అని చెప్పగా, తాతకు ఏం చేయాలో తోచలేదు! పూజారేమో నవ్వుతూనే ఉన్నాడు. తాతయ్య మనసులో చటుక్కున ఒక ఆలొచన.

"పూజారీ...నా దగ్గర నాకని ఉన్నది నేను నివాసముంటున్న ఇల్లు ఒకటే. ఇంకేదీ నా చేతిలో లేదు. ఆ  ఇల్లూ, వాకిలికి ఒకే వారసడు నా మనవుడే. వాడు ఎటువంటి నష్టమూ లేకుండా తిరిగి వచ్చేడంటే... నా ఇంటినే నేను గాలిదేవుడికి ఇచ్చేస్తాను. కానీ ఒకటి...నా కాలం చెల్లేంతవరకు నేను ఆ ఇంట్లోనే ఉంటాను. ఇదే నా మొక్కు” అని చెప్పగా.

“సరే...అలాగే కర్పూరం వెలిగించి వాగ్ధానం చేసి ఇంటికి వెళ్ళండి. మరో రెండు గంటలలో గాలిదేవుడు నీ మనవుడు ఎక్కడున్నా సరే నీ దగ్గరకు తీసుకువచ్చి చేరుస్తాడు!” అని చెప్పటంతో తాతయ్య అదే విధంగా కర్పూరం వెలిగించి వాగ్ధానం చేసేసి బయలుదేరారు”

“తరువాత...?”

“నువ్వు నమ్మినా సరే...నమ్మకపోయినా సరే. ఈ విషయం మాత్రం నాకు బాగా జ్ఞాపకం ఉంది. నన్ను ఆ దొంగ దాచి పెట్టున్న చోట హఠాత్తుగా ఒక పెను గాలి వీచింది. హోరుమని వీస్తున్న గాలికి నేనూ, ఆ దొంగ ఊగిపోతున్నాం.  అప్పుడు ఆ గాలి దుమారంలో నుండి చేతిలో ఒక కత్తితో గుర్రం మీద ఒకాయన వచ్చారు. ఆయన్ని చూసిన వెంటనే...దొంగ ఆయనతో యుద్దం చేయడానికి వెళ్ళాడు. కానీ, దొంగ వల్ల కాలేదు. ఎత్తిన చెయ్యి అలాగే ఉండిపోయింది. అంతే...ఆయన నన్ను ఎత్తి గుర్రం పైన తన ముందు కూర్చోబెట్టకున్నారు. గుర్రం బయలుదేరింది. అంతవరకు ఏడుస్తున్న నాకు ఆ గుర్రపు సవారి ఆనందాన్ని పంచింది”

---- కార్తిక్ ఈ సంఘటనను చెప్పేటప్పుడు వీరబద్రం మొహంలో ఒక చిరునవ్వు.

“ఏమిటి బద్రం నవ్వుతున్నావు?”

“ఏమీ లేదు...నువ్వు 'కామిక్స్’ కథలను అప్పుడు ఎక్కువగా చదివేవాడివో?”

“రేయ్...నేను సీరియస్ గా మాట్లాడుతున్నాను. నువ్వు వేళాకోలంగా నవ్వుతున్నావు”

“లేకపోతే ఏమిట్రా...గుర్రంలో ఒకడు వచ్చాడట, ఎత్తుకుని బయలుదేరాడు. సరదాగా ఉన్నది అంటూ సినిమా కథ చెబుతున్నావు! ఈ కాలంలో ఎవరురా గుర్రాలు వాడుతున్నారు.?”

“బద్రం...నేను చెప్పేది నిజం. నీ దగ్గర అబద్ధం చెబితే నాకేమొస్తుంది?”

“సరే...తరువాత ఏం జరిగింది?”

“ఏం జరుగుతుంది? ఊరి సరిహద్దులో నన్ను ఆ మనిషి దింపేసి, 'చూసి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు’ అన్నారు. నేనూ ఇంటికి వెళ్ళి చేరాను. నన్ను చూసిన వెంటనే అందరికీ సంతోషం. అప్పుడు చెప్పారు తాతయ్య...‘రెండు గంటల్లో నా మనవడు వచ్చేస్తాడని ఆ పూజారి చెప్పడం ఫలించిందీ...”

“అంటే మీ తాతయ్య మొక్కుకున్నందు వలనే గాలిదేవుడు గుర్రం మీద వచ్చి నిన్ను కాపాడాడు అంటున్నావా?”

“అవును...అప్పట్నుంచి నేనూ గాలిదేవుడ్ని భయ భక్తులతో నమస్కరిస్తున్నాను”

“నువ్వు వేప చెట్టు దగ్గర నుండి రావి చెట్టుదాకా అన్నిటినీ దేవుడిగా నమస్కరిస్తావే! ఇక దీని గురించి నేను వేరుగా చెప్పాలా?”

“ఇదిగో చూడు బద్రం....అది ఏదైనా సరే, అనుభవమనేది నిదర్శనమైన విషయం. నీ జీవితంలో కూడా జరిగితే...నువ్వూ ఖచ్చితంగా నాలాగా అనుకుంటావు!”

“ఒక్క రోజు కూడా అలా అనుకోను...”

“అలాగైతే ఆ రోజు గుర్రంలో వచ్చి నన్ను కాపాడిందెవరు?”

“ఎవరైనా వేటగాడుగా ఉంటాడు. ఎందుకంటే...వాడి దగ్గరే గుర్రం ఉండే ఛాన్స్ ఉంది...”

“ఆ దొంగ అతన్ని కొట్టటానికి చెయ్యి పైకెత్తినప్పుడు ఆ చేయి అలాగే ఆగిపోయిందే? అది ఎలా...?”

“బెనుకు పట్టి ఉంటుంది. ఇదంతా ఒక ప్రశ్ననారా? ఏది ఎలాగో...కాకి కూర్చున్నది కాబట్టి తాటి చెట్టు పడిపోయిన కథలాగా, మీ తాత ఇంటిని ఇస్తానని మొక్కు కున్నప్పుడు, నువ్వు వచ్చి చేరావు! అవునూ...మీ తాతయ్య మొక్కుకున్నట్టు ఆ తరువాత ఆ ఇంటిని గాలి దేవుడికే ఇచ్చాశారా?”

“మరి...మా తాతయ్య బ్రతికున్నంత వరకు ఆ ఇంట్లోనే ఉన్నారు. ఆయన చనిపోయిన తరువాత బామ్మ మాతో పాటూ ఇక్కడికి వచ్చేసింది. ఆ ఇంటికి 'గాలి దేవుడి’ ఇల్లు అనే పేరు పుట్టి అది స్థిరపడిపోయింది”

“అంటే ఆ ఇంటి డాక్యూమెంట్స్ మీ దగ్గరే ఉన్నాయని చెప్పు...”

“అవును...ఎందుకంటే గాలిదేవుడి గుడికని నిర్వాహ ఆఫీసో, నిర్వాహ ట్రస్టో లేనందు వలన ఇంటిని ఎవరి దగ్గర అప్పగించాలో తెలియలేదు. ఒక పూజారి మాత్రం ఉన్నాడు. ఆయన కూడా కొంత కాలానికి చనిపోయాడు”

“అయితే గాలిదేవుడు ఇప్పుడు దిక్కులేకుండా ఉన్నాడని చెప్పు”

“అలాగంతా ఏమీ లేదు. పాత పూజారి కొడుకు వచ్చి చూసుకుంటున్నాడు. అయితే ఒకటి...ఆ పూజారి ఎప్పుడూ గుడి దగ్గరే ఉండేవాడు. ఇతను అలా కాదు. ఒక రోజుకు ఒకసారి వచ్చి దీపం వెలిగించి, పూజ చేసి వెళ్ళిపోతాడు”

కార్తిక్ చెప్పింది విని మళ్ళీ నవ్వాడు వీరబద్రం.

“వద్దు! అలా నవ్వకు...”

“సరే నువ్విప్పుడు ఏం చెయ్యబోతావు?”

“ఏం చెయ్యబోతాను అని అడిగితే...చెల్లి పెళ్ళికి డబ్బు కావాలి. చేతిలో ఉన్న ఆస్తి ఇదొక్కటే. దానిని వాడుకోవటానికి మనుషులు లేరు. అందువలన...గాలిదేవుడు దగ్గర వేడుకుని ఆ ఇంటిని అమ్మటం తప్ప నాకు వేరే దారి లేదు”

“మంచి నిర్ణయం! ఎవరో సులేమాన్ గారిని ఒకరు ఆ ఇల్లు కొనడానికి రెడిగా ఉన్నారని చెప్పినట్టున్నావే?”

“అవును...! కానీ, ఆయన మా ఇంటి గురించి ఈ ఊర్లో మాట్లాడుకుంటున్నది విని, ఎవరైనా ఆ ఇంట్లో ఒక నెలరోజుల పాటూ నివాసముండి చూపిస్తే అది పాడు బడిపోయిన ఇల్లు కాదు, నివాసముంటున్న ఇల్లే అని మా వాళ్ళతో చెప్పి ఆ ఇల్లు కొనుక్కుంటానని చెప్పారు”

"బాధ పడకు! ఒకవేల ఆయన కొనుక్కోకపోయినా పరవాలేదు...నేను కొనుక్కుంటాను. నీకు సహాయం చేసినట్లూ ఉంటుంది. నేనూ ఇల్లు కొనుక్కున్నట్టు అవుతుంది"

“వద్దు బద్రం...నాకోసం నువ్వు శ్రమ పడొద్దు!”

“శ్రమా...ఇందులో నాకు శ్రమ ఏముంది?”

“లేదు... నేను ఏం చెప్ప దలుచుకున్నా నంటే?”

“ఏం చెప్పదలుచుకున్నావు?”

“మొదటిది, ఆ ఇల్లు అమ్మటమే మాకున్న ఒకే ఒక దారి...ఇంకొకటి, ఆ ఇల్లు అమ్మటానికి నాకు భయంగానూ ఉన్నది”

“అలా మాట్లాడటం మూర్ఖత్వం అని నీకే అనిపించటం లేదూ?”

“లేదురా...మా తాతయ్య నాకోసం మొక్కుకున్నారు.  కానీ, ఇప్పుడు నేనే  ఆ మొక్కును కాదని ఆ ఇల్లు అమ్ముదామని అంటున్నానే”

"పిచ్చోడా...ఏమిటో గాలిదేవుడు అనే దేవుడు ఒకరు నిజంగానే ఉన్నారని...ఆయన చేతిలో ఆస్తిని అప్పగించినట్టు, ఇప్పుడు ఆయన్ని నువ్వు కొట్టి దాన్ని లాకుంటున్నట్టు మాట్లాడుతున్నావే...! మీ తాతయ్య ఆ రోజు మూఢ నమ్మకంతో అలా నడుచుకుంటే...ఈ రోజు నువ్వూ అదే చేస్తావా?”

“అంటే....మా తాతయ్యది మూఢ నమ్మకం అంటున్నావా?”

“ఇంకేమని చెప్పను...దేవుడికి ఎందుకురా ఇల్లూ వాకిలి?  లేదు ఆయన మీ ఇల్లు కావాలని మీ తాతయ్యను అడిగాడా? వూరికే ఉండక ఒక పూజారి ఎక్కించాడు! మీ తాతయ్య ఎక్కేశారు...అందులో ఉన్న విషయం ఇంతే"----వీరబద్రం విసుక్కోకుండా సమాధానం చెప్పాడు.

అయినా కానీ, కార్తీక్ నుదిటి మీద ఉన్న చలనం పోనేలేదు. ఏదో ఆలొచిస్తున్నట్టు మౌనంగా ఉన్నాడు.

“ఏమిటి ఆలొచిస్తున్నావు?”-- అడిగాడు వీరబద్రం.

“ఏమీ లేదు...”

“మనం ఇప్పుడు ఆ గాలిపేటకు వెడుతున్నాం. ఆ ఇంటిని చూస్తున్నాం”

“వెళ్ళే తీరాలిరా. సులేమాన్ అడిగినట్లు ఆ ఇంట్లో నెలరోజులు నివసించాలనే నిర్ణయానికి  అమ్మా, నాన్నా వచ్చేరు! కాబట్టి ఆ ఇంటిని శుభ్రపరచటానికి వెళ్ళాలి”

కార్తీక్ స్వరంలో ఉత్సాహం లేదు. 

                                                                                                       Continued...PART-3

****************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి