5, జులై 2022, మంగళవారం

గాలితో ఒక యుద్దం...(సీరియల్)...(PART3)

 

                                                                         గాలితో ఒక యుద్దం...(సీరియల్)                                                                                                                                                                 (PART-3)

మానవుల మనసులోని నమ్మకాలను పరిశోధించి కొందరు పలు పుస్తకాలు రాసారు. అందులో పలు అద్భుతమైన...అంగీరచబడే అభిప్రాయాలు ఉన్నాయి. అందులో అత్యంత ప్రసిద్ది చెందిన ఒక అభిప్రాయం 'నువ్వు దేనిని ఎక్కువ ఇస్టపడి నమ్ముతావో...అది ఒకరోజు నీకు దొరుకుతుంది! అనేదే. అభిప్రాయం అందరికీ నచ్చింది. కానీ, అందులో పెద్దగా నిజమేమీ లేదు అనే విమర్శలూ ఉన్నాయి.

ఎనభై ఏళ్ళ వృద్దుడు ఒకాయన నాకు అర్ధంచేసుకునే శక్తి వచ్చినప్పటి నుండి...నేను చంద్రుడు దగ్గరకు వెల్తున్నట్టూ, అక్కడ ఆనందంగా నడుస్తూ తిరుగుతున్నట్టు కలలు కంటూ వస్తున్నాను. ఆశ నేరవేరకుండానే చచ్చిపోబోతున్నా. నా వరకు ఎక్కువ ఆశపడింది దొరుకుతుంది అని చెప్పేది అబద్దంఅన్నారు.

కానీ, ఆయనకు కౌన్సిలింగ్ ఇచ్చినాయన... వృద్దుడి మాటల్లో నుండి ఒక పెద్ద నిజం కనుకున్నాడు. ఆయన చంద్రుడు మీద నడవాలనుకుని ఆశపడినదంతా నిజం. కానీ ఆశపడేటప్పుడు ఎలా ఆశపడ్డారంటే...చంద్రుడి దగ్గరకు మనిషి వెళ్ళలేడు. అది ఇంకొక గ్రహం. ఊహల్లో మాత్రమే చంద్రుడి గురించి మనం ఏదైనా చేయగలం. కాబట్టి మనం కూడా ఊహల్లోనే ఆశపడదాం! అని ఒక బేసిక్ ఆలోచనతోనే ఆశపడ్డాడు. అంటే, చంద్రుడినే ఆయన ఒక అబద్దం అని అనుకున్నారు. అందువలనే ఆయన ఆశ అబద్దం అయ్యింది!

అది విన్న ఒకాయన తిరిగి అడిగారు. 'సరే...నేను నిజంగానే ఆశపడుతున్నాను. నా జీవిత కాలంలో అది నెరవేరుతుందా? అన్నారు.

దానికి కౌన్సిలర చెప్పిన సమాధనమేమిటో తెలుసా?

నందిగామ నాలుగు రోడ్ల వీధిలో నుండి ఎడం పక్కకు తిరిగి నవాబు పేటకు వెళ్ళే తారు రోడ్డులోకి వీరబద్రం కారు ఎక్కినప్పుడు, రోడ్డుకు పక్కగా ఉన్న కొబ్బరి బొండాలు అమ్మే కొట్టు ఒకటి కనబడ్డది.

కొట్టును చూసిన వెంటనే కారు ఆపి రెండు కొబ్బరి బోండాలు ఇమ్మన్నాడు వీరబద్రం.

కార్తీక్ 'గాలిదేవుడు గందరగోళంలోనే ఉన్నాడు.

రేయ్ కార్తీక్....కొబ్బరి బోండాం నీళ్ళు తాగరా... అంటూ ఒక బోండాం ను జాపాడు వీరబద్రం. అతనూ తాగాడు. వీరబద్రం యాభై యూపాయలు ఇచ్చి చిల్లర కోసం ఎదురుచూసి ఆగాడు.

సరిపోయిందండీ అన్నాడు కొట్టతను.

వీరబద్రానికి అదొలా అయిపోయింది.

ఏంటయ్యా...ఒక బోండాం ఐరవై ఐదు రూపాయలా? నువ్వు ఎక్కడ వ్యాపారం చేస్తున్నావో నీకు తెలుస్తోందా

ఎందుకు తెలియదు సార్? ఇప్పుడైనా ప్రకృతి అందించే నీళ్ళకు మంచి వెల వస్తుంటే సంతోషంగా ఉన్నది సార్...!కొట్టతని ముఖంలో ఒక స్పష్టత.

ఇలాంటి ఒక  సమాధానాన్ని అతని దగ్గర నుండి ఎదురుచూడలేదు వీరబద్రం.

సార్...నేను చెప్పింది మీకు అర్ధం కాలేదా?

 వీరబద్రం నవ్వుతూ ఎందుకు అర్ధం కాలేదు. మురికి లేని నీళ్ళని అమ్ముతున్నారు. నాలుగు రూపాయలు కూడా ఖరీదు చెయ్యని విదేశీయుల కూల్ డ్రింకులు బాటిల్  పది, పదిహేను రూపాయలకు అమ్ముతున్నారు. అవి కొని తాగుతున్న మనకి తప్ప మిగిలిన వాళ్లందరికీ లాభమే. అమ్మే కొట్టతను, తీసుకు వెళ్ళే వ్యానతను, ప్రకటనలలో నటించే మాడల్స్ కూ...అందరికీ డబ్బులే. కానీ మనకు మాత్రం 'లాస్’. మనీ లాస్, ఆరొగ్యం లాస్అని చెప్పి వెనక్కి తిరిగాడు.

ముందు చూపు, భవిష్యత్తు గురించి ఆలొచించే మనిషి ఈయన అనేది తెలుసుకున్నాడు కొట్టతను.

మీలాగా అందరూ ఆలొచిస్తే చాలా బాగుంటుంది సార్..." అని నవ్వాడు కొట్టతను. కానీ, కార్తీక్ చెవులకు ఇవన్నీ వినిపించలేదు. అప్పుడే ఒకతను కొబ్బరి బోండాం తాగటానికి మోటార్ సైకిల్ మీద వచ్చి కొట్టు దగ్గర ఆగాడు.

వచ్చినతను కార్తీక్ చూసి నుదురు ముడుచుకున్నాడు. తరువాత మాట్లాడటం ప్రారంభించాడు.

తమ్ముడ్ని ఎక్కడో చూసినట్లు ఉందే!

నన్నా?”--- కార్తీక్ అడిగాడు.

అవును...నీ పోలికలన్నీ అచ్చం మా రామశర్మ పంతులుగారి లాగానే ఉన్నది

ఆయన మా నాన్నగారే...!

...అయితే గాలిదేవుడి ఇంటి యజమాని కొడుకు అని చెప్పు

అతను గాలిదేవుడి ఇంటి యజమాని అన్నది కార్తీక్ మనసులో చురుక్కున గుచ్చుకుంది. వీరబద్రం దాన్ని క్షుణ్నంగా గమనించాడు.

అవును...మీరెందుకు ఊరికి రాకుండా ఇక్కడే ఆగిపోయేరు?”

ఏంటయ్యా...నువ్వొక్కడివే కొబ్బరి నీళ్ళు తాగటానికి వస్తావా? వీళ్ళు రాకూడదా?”--కొట్టతను సమాధానం చెప్పాడు.

అమ్మా...నాన్నా అందరూ బాగున్నారా?”

...అందరూ బాగున్నారు

వాళ్ళు మళ్ళీ గాలిపేటకే వస్తున్నారనే మాట నా చెవికి వచ్చిందే...నిజమా?”

...అవును...మీకెలా తెలిసింది?”

మీ నాన్నే...మన 'పోస్ట్ మాస్టర్ గారికి ఫోన్ చేసి చెప్పుంటారనుకుంటా! నేను పోస్ట్ ఆఫీసుకు వెళ్ళినప్పుడు నా చెవులకు వినిపించింది

అవును

అందరూ గ్రామం నుండి నగరానికి వెడుతుంటే...మీరు నగరం నుండి గ్రామానికి రావటం కొత్తగా ఉన్నదే తమ్ముడు. కానీ, మీరుండటానికి వీలుగా ఇప్పుడు మన గ్రామంలో ఇల్లు అద్దెకు దొరకటం కష్టం

ఆయన అలా చెప్పేటప్పటికి కార్తీక్ ముఖం వికారంగా మారింది.

అదేమిటండీ. వీళ్ళకని వీళ్ళ ఇల్లే ఉన్నదే! ఇక ఎందుకు అద్దె ఇల్లు?” -- వీరబద్రం అడిగాడు.

ఏమిటీ...మీ ఇంటికే రాబోతున్నారా?”

...అవును”… చెప్పాడు కార్తీక్.

దాన్ని మీ తాతయ్య; గాలిదేవుడికి 'దత్తత చేసి ఇచ్చేరే?”

అది...అది... ప్రశ్నకు సమాధానం చెప్పటం కుదరక తికమక పడ్డాడు కార్తీక్.

హలో మిస్టర్ మోటార్ బైక్...గాలిదేవుడికి వీళ్ళ తాతయ్య, వాళ్ళ ఇంటిని 'దత్తతు చేసి ఇచ్చింది మీరు చూశారా?" -- వీరబద్రం కొంచం ఆవేశంగా మాట్లాడాడు.

మీరేవరు?”

కార్తీక్ స్నేహితుడ్ని

అందుకే అర్ధం కాక మాట్లాడుతున్నారు

మాట మార్చకుండా నా ప్రశ్నకు సమాధానం చెప్పండి...మీరు చూశారా?”

ఇదేం ప్రశ్న తమ్ముడూ. అర్ధం లేని ప్రశ్న అడుగుతున్నారు...! వీళ్ళ తాతయ్య మొక్కుకున్నదానినే నేను అలా చెప్పాను

సరే...నేను దానికి సమాధానం చెబుతాను. బాగా వినండి!  వాళ్ల తాతయ్య పిచ్చిగా మొక్కుకుంటే...దానికి మనవడు కట్టుబడి ఉండాలి అనే అవసరం లేదు. అది వాళ్ళ ఇల్లు. వాళ్ల ఇంట్లో వాళ్లు నివాసముంటారు, ఆడుతారు...పాడుతారు. దాన్ని ఇంకెవరికైనా  అమ్ముతారు. ఇప్పుడు కూడా అమ్మటానికే వచ్చారు. మేము దానికోసమే  ఇక్కడికి వచ్చింది. ఇంటిని నేనే కొనుక్కోవచ్చు. ఇదే సంగతి. ఇంత చాలా...ఇంకా చెప్పాలా?” వీరబద్రం ఆవేశంగా మాట్లాడాడు.

మోటార్ సైకిల్లో వచ్చినతని ముఖంలో నెత్తురు చుక్క లేదు. మౌనంగా, ఏదీ మాట్లాడకుండా కొబ్బరిబోండా నీళ్ళు తాగేసి, డబ్బులిచ్చేసి, బైక తీసుకుని వెళ్ళిపోయాడు.

కొట్టతను వీరబద్రాన్ని అదోలా చూశాడు.

ఏంటన్నా...మీరెందుకు భయపడుతున్నారు?”… కొట్టతన్ని అడిగాడు వీరబద్రం.

మీరు మాట్లాడింది వింటే ఏదోలాగా ఉన్నది తమ్ముడూ

అలాగంటే?”

అర్ధం చేసుకోకుండా మాట్లాడుతున్నట్టు ఉన్నది...

మీరేం చెప్పదలుచు కున్నారో...చెప్పండి

గాలిదేవుడు చాలా శక్తి గల దేవుడు. ఆయనకు మాట ఇచ్చిన తరువాత...అది మీర కూడదు తమ్ముడూ...

అలాగా...?”

అవును తమ్ముడూ...ఇప్పుడు కూడా తన భక్తులకు ఏదైనా సమస్య ఎదురైతే గుర్రం మీద ఎక్కి సహాయం చేయటానికి వచ్చే సాక్షాత్ దైవం ఆయన

...

నేను చాలా మంచి మనసుతో చెబుతున్నా...జాగ్రత్తగా నడుచుకోండి... ---కొట్టతని స్వరంలో నిజంగానే శ్రద్ద కనబడింది.

అది వీరబద్రాన్ని కంటే కార్తీక్ నే ఎక్కువగా బాధపెట్టింది.

బద్రం...కారులో ఎక్కరా. మనం మన ఊరికే తిరిగి వెళ్ళిపోదాం అన్నాడు కార్తీక్.

అరే పోరా...పిరికివాడా! వీళ్ళందరూ ఇలా చెబుతుంటే నాకు ఆత్రుత ఎక్కువ అవుతోంది. కాలంలో ఉంటున్నావు...ఏం మాట్లాడుతున్నావు? మీ ఇంట్లో టీ.వీ అని ఒకటుంది కదా?"

"ఇప్పుడెందుకురా టీ.వీ టాపిక్ తీసుకు వస్తున్నావు?”

మాట్లాడొద్దు...అందులో ఎన్ని ఛానల్స్...ముఖ్యంగా జాగ్రఫీ ఛానల్, అనిమల్ ప్లానట్, డిస్కవరీ...ఇవన్నీ నువ్వు చూస్తావా...చూడవా?”

అవన్నీ కార్లో వెడుతూ మాట్లాడుకుందాం...ఎక్కరా...

కార్లోనే వెళ్ళబోతం. గాలిపేటకు...ముఖ్యంగా మీ ఇంటికి...

ఆవేశమైన సమాధానంతో కార్లో ఎక్కి కూర్చున్నాడు...కారు వేగం పెంచాడు.

అప్పుడు కొబ్బరి బోండాం కొట్టతని కత్తి జారి అతని కాలుకు తగిలి రక్తం వచ్చింది.

అయ్యో స్వామీ... ఇప్పుడే ఇక్కడే నువ్వు నీ కోపాన్ని చూపించటం ప్రారంభించావా---అంటూ కొట్టుకుంది అతని మనసు.

                                                                                                       Continued...PART-4

****************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి