2, జనవరి 2023, సోమవారం

అక్షయ పాత్ర…(సీరియల్)...(PART-1)

 

                                                                               అక్షయ పాత్ర…(సీరియల్)                                                                                                                                                                     (PART-1)

మనిషి జీవితంలో పలు సంఘటనలకు కొన్ని సందర్భాలలో పరిస్థితులే కారణమవుతాయి. కరెక్టా, తప్పా అనేది పరిస్థితులను బట్టే. ఎటువంటి పరిస్థితులలోనూ అనురాగమును హైజాక్ చేయటమనేది కొందరికి మాత్రమే సాధ్యమవుతుంది. నాలుగు నెలలుగా ఇంటికే రాని తండ్రిని వెతుక్కుని వెళుతుంది తులసి.

తండ్రి అంటే ఆమెకు ప్రాణం.

ఎంత తీసుకున్నా తరిగిపోని అనురాగమును మాత్రమే ఇచ్చే అక్షయపాత్ర ఆయన. అనురాగము మాత్రమే సర్వరోగనివారిణి అని నమ్మే తండ్రిని ఆమె కలుసుకుందా? ఆమె అక్షయపాత్ర ఆమెకు దొరికిందా? వీటన్నిటికీ జవాబు చెప్పే అక్షయ పాత్రే నవల.

 సీరియల్ను చదివి మీ అభిప్రాయాలను పంచుకోండి.

***************************************************************************************************

                                                                                                PART-1

వీధి చివర ఆటో ఒకటి వేగంగా వస్తున్న శబ్దం విన్న వెంటనే తులసి ఉప్పొంగి లేచింది. నాన్న వచ్చేశారమ్మా! -- వంట గదిలో పనులలో ఉన్న అమ్మకు వినబడేటట్టు అరిచి చెప్పి వాకిలి వైపుకు పరిగెత్తింది. ఆటో ఆమె ఇల్లును దాటుకుని నాలుగైదు ఇళ్ళ తరువాత వెళ్ళి ఆగింది.

తులసి ముఖం వాడిపోయింది. నాన్న కాదు...ఇంకెవరో -- చెప్పుకుంటూ లోపలకు వచ్చింది. తల్లి ముఖం కూడా వాడిపోయున్నది. కన్నీరు వస్తున్న కళ్ళను చూపించటానికి ఇష్టంలేక మళ్ళీ వంట గదిలోకి దూరింది తల్లి.

ఒంటరిగా ఉండాలనుకుని మేడపైకి వెళ్ళింది తులసి. పిట్ట గోడ మీద కూర్చున్న రెండు మైనా పక్షులు ఆమె వచ్చిన హడావిడి శబ్దం విని భయపడి ఎగురుకుంటూ దగ్గరున్న వేప చెట్టు కోమ్మల పైకి చోటు మార్చుకున్నాయి. 

డాబా మీద హాయిగా వీస్తున్న చల్లగాలిని అనుభవించ లేకపోయింది. దూది ముక్కలలాగా పలు ఆకారాలలో  ఆకాశంలో తేలుతూ వెళుతున్న మేఘాల గుంపును ఆస్వాదించటం కుదరలేదు. గుంపు గుంపుగా ఎగురుతున్న తెల్లటి కొంగలను కళ్ళు విరిచి చూడలేకపోయింది. ఎక్కడ చూసినా తండ్రి మొహమే కనబడ్డది. ఎందుకు నాన్న రాలేదు?’ -- ప్రశ్నే తులసి మనసును గుల్ల చేస్తోంది.

నాన్నను చూసి నాలుగు నెలలు అయ్యింది. నెలలోని రెండో వారంలో ఎక్కడ పని ఉన్నా వాటిని ముగించకుండా అలాగే వదిలేసి ఇక్కడికి పరిగెత్తుకు వస్తారు. వారమంతా ఇల్లు ఆహ్లాదకరంలో తేలుతుంది. చూసేవన్నీ మనోరంజకంగా కనబడుతుంది. గాలీ, నిప్పు, ఆకాశం, నీరు, నేల అన్నీ రమణీయంగానే ఉంటుంది. ఆమెకు ఊహ తెలిసినప్పటి నుండి పద్దెనిమిదేళ్ళల్లో ఒక్కసారి కూడా తండ్రి రెండో వారంలో అక్కడ లేకుండా పోవటం జరగలేదు.

వచ్చేటప్పుడు ఖాలీగా రారు. ఒక బుట్ట నిండుగా పండ్లు, బిస్కెట్లు, స్వీట్లు, సూటు కేసులో ఆమెకోసం ఖచ్చితంగా ఒక కొత్త డ్రస్సు ఉంటుంది. చిన్న వయసులో గౌను అయితే, ఇప్పుడు చుడీధార్, సాల్వార్ అంటూ అది కూడా పెరిగింది. ఆయన వచ్చే ఆటో వీధి చివర్లోకి వస్తున్నప్పుడే తులసి జింకలాగా ఎగురు కుంటూ పరిగెత్తుతుంది. బల్లిలాగా ఆయనకు అతుక్కుని ఆయన్ని లోపలకు తీసుకు వస్తుంది.

ఆటోలో వచ్చేది నేనేనని కరెక్టుగా నీకెలా తెలుస్తోంది తులసీ?”

తెలుస్తుంది...!

అదే ఎలా?”

వాసన వస్తుంది...గాలిలో! అది కాకుండా వార్త వస్తుంది. దాని మూలంగా! ఆమె పైకి చూస్తూ ఆకాశాన్ని చూపిస్తుంది. ఆయన ప్రేమతో ఆమె తల మీద చెయ్యి వేసి వాత్సల్యముతో తల నిమురుతూ నవ్వుతారు.

ఒక వారం రోజులూ వంట గది రెండుగా అవుతుంది. విధ విధమైన వాసనలతో ఇల్లంతా నిండిపోతుంది. చాలు చాలు అని తండ్రి ప్రాధేయపడేంత వరకు అమ్మ భోజనం, టిఫిన్ మార్చి మార్చి చేసి పెట్టి ఆయన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. సాయంత్రాలలో బీచ్, సినిమా, బేల్ పూరీ, ఐస్ క్రీమ్ అని సమయం సంతోషంగా గడుస్తుంది.

తండ్రి వస్తున్నప్పుడు ఎగురుకుంటే వెళ్ళే తులసి, ఆయన వెళ్ళేటప్పుడు తన గది వదలి బయటకే రాదు.

నువ్వు వెళ్ళేది నేను చూడలేను నాన్నా. ఆటోలో ఎక్కేటప్పుడు నాకు ఏడుపు వస్తుంది. దాన్ని అమ్మ అపశకునం అంటుంది. అవన్నీ ఎందుకు? నువ్వు బయలుదేరేటప్పుడు నాకు చూడటం ఇష్టం లేదు!

ఆయన ఒత్తిడి చేయరు. రోజులు గడుస్తున్న కొద్దీ అది ఆయనకు అలవాటు అయ్యింది.

నాన్న ముంబైకి వచ్చి సరిగ్గా నాలుగు నెలలు అవుతోంది...లీవు దొరకలేదా...ఏమిటి అనేది తెలియలేదు. ఒక ఉత్తరమో, సమాచారమో కూడా లేదు. ఏమై ఉంటుంది! ఎప్పుడూ లేనట్లు మంచి రోజులాగా, ఆయన చివరగా వచ్చి వెళుతున్నప్పుడు, తాను సాగనంపటానికి వెళ్ళింది తప్పైపోయిందా?

రోజు ఎందుకో ఆయన బయలుదేరుతున్నప్పుడు ఆమె వాకిటి వరకు సంచులు తీసుకు వచ్చి ఆటోలో పెట్టింది. తన అభిమతము మరిచిపోయినట్టు నవ్వు మొహంతో వాకిట్లో నిలబడింది. దాని గురించి ఏదో అడగటానికి అమ్మ నోరు తెరిచినప్పుడు, నాన్న ఆమెను కళ్ళతోనే ఆపి, చేతులు ఊపుతూ కూతుర్ని చూస్తూ వెళ్ళి కళ్ళకు దూరమయ్యారు.

నాన్న నవ్వు చాలా అందంగా ఉంటుంది. ఆకాశమే నవ్వుతున్నట్టు నిర్మలంగా ఉంటుంది. కల్లాకపటం లేని నవ్వు. నవ్వే ఆయన జీవంగా ఉంటుంది.

అందరూ ఎందుకు నాన్నా నీలాగా నవ్వరు?” -- ఒకరోజు తిలసి తండ్రిని అడిగింది.

ఏం ప్రశ్న ఇది?”

నిజమే నాన్నా! అందరి నవ్వులలో ఏవేవో అర్ధాలు తెలుస్తాయి. దొంగ నవ్వు, కపట నవ్వు, వక్ర నవ్వు, పిచ్చోడి నవ్వు అంటూ విధ విధంగా ఉంటుంది. నీ నవ్వు మాత్రం ప్రకాశవంతంగానూ, నిర్మలంగా ఉండే ఆకాశంలాగా పువ్వు వికసిస్తున్న నవ్వు. నువ్వు మాత్రం ఎలా పరిశుద్దంగా నవ్వ గలుగుతున్నావు?”

కారణం చెప్పనా?”

చెప్పు

తులసి... తులసి అనే ఒక దేవతకు తండ్రిగా ఉన్నాను కదా? అందుకే పరిశుద్దంగా నవ్వ గలుగుతున్నా!

అలాగా...అలాగైతే అమ్మ నవ్వు ఎందుకు వికారంగా ఉంటుంది! మొహమంతా ఏదో కారుతుంది!

కొట్టాలే నిన్ను...! అమ్మ దొంగ కోపంతో చేయి ఎత్తగా, నాన్న ఇంకా అందంగా నవ్వుతారు. నవ్వు మొహంతో వెంటనే నాన్నని చూడాలని ఉంది.

నాలుగు నెలలుగా తొంగి కూడా చూడలేనంతగా అలా ఏంటి పని? లేక ఆరోగ్యం బాగుండలేదా? తులసి కలత చెందింది. మామూలుగా కలత చెందటం నాన్నకు ఇష్టం లేని విషయం. తనపైనా, దేవుని మీద నమ్మకం ఉన్నవాడు దేనికీ కలత చెందడుఅంటారు మాటి మాటికీ.

అలాగంటే అన్నిటినీ దైవం చూసుకుంటుందని ఏమీ చేయకుండా ఉండిపోదామా?”

ఒకరోజు తులసి అడిగింది.

బాధ్యతలను చెయ్యి. ఫలితాన్ని నా దగ్గర వదిలేయి. గీతలో శ్రీకృష్నుడు చెప్పుంటాడు. ఎదురు చూసే ఫలితం దొరుకుతుందా అని కలత చెందేవాడు బాధ్యతను ఎలా కరెక్టుగా చేయగలుగుతాడు? సరిగ్గా చేయని బాధ్యతకు ఫలితం ఎలా లభిస్తుంది?” -- నాన్న తన జవాబును ప్రశ్నలాగా చెప్పి ముగించగా.

దానికి సమాధానం చెప్పలేక ఆశ్చర్యపడింది ఆమె. ఆయన ఎప్పుడూ అంతే. ఆయనతో మాట్లాడి గెలవలేము. ఆయనతో మాట్లాడాలంటే విషయ జ్ఞాని అయ్యుండాలి. ఆయనకు తెలియని విషయమే ఉండదనేంతగా విషయం గురించి అడిగినా దాని గురించి బాగా తెలిసినట్లు మాట్లాడతారు.

ఎక్కడ్నుంచి ఇన్ని విషయాలు నేర్చుకున్నారు?”

ఎక్కువగా చదవాలి, ఎక్కువగా చూడాలి. ఎక్కువ వినాలి. మన చుట్టూ ఎంతోమంది గురువులు ఉన్నారు!

ఎవర్ని చెబుతున్నారు?”

మంచి విషయాలు నేర్పించే అందరూ, అన్నీ గురువే. చీమ దగ్గర నుండి చురుకుదనం, సాలెపురుగు దగ్గర నుండి పట్టుదలతో ప్రయత్నం, తేనెటీగల దగ్గర నుండి సేవింగ్స్, పిల్లల దగ్గర నుండి ఇన్నొ సన్స్, నేచర్ దగ్గర నుండి నిష్పక్షపాత గుణం, నిప్పు దగ్గర నుండి పరిశుద్ధత, ఇలా చాలా! మన చుట్టూతా గురువులకు కరువా ఏమిటి? మాట్లాడే గురువు, మాట్లాడలేని గురువు, మౌన గురువు - అని ఎంతోమంది

మౌన గురువంటే?”

పంచ భూతాలే! భూమి దగ్గర నుండి ఓర్పు, గాలి దగ్గర నుండి విశాల ఉద్దేశ్యం , ఆకాశం దగ్గర నుండి ధైర్యం, నీళ్ళ దగ్గర నుండి కరుణ, నిప్పు దగ్గర నుండి దేన్నైనా సేవింగ్ చేసే గుణం, వృక్షాల దగ్గర నుండి అనురాగం. ఇంకా చెప్పుకుంటూ వెళ్లచ్చు

నాన్న చెబుతున్నప్పుడు ఒళ్ళు జలదరిస్తుంది. ఆయన నవ్వుతూ ఆమె గడ్డం దగ్గర ఒక వేలు పెట్టి ఆమె మొహాన్ని పైకెత్తాడు.

సమయం దొరికినప్పుడంతా ఆకాశాన్ని చూడు తులసి. మౌనంగా అది చాలా విషయాలు చెబుతుంది. దాని లాంటి అద్భుతమైన గురువు వేరే ఏదీ లేదు...అంటారు.

తులసి తల పైకెత్తి ఆకాశాన్ని చూసింది. నాన్న ఎందుకు రాలేదు? నీకు తెలుసా?’ -- దాన్ని అడుగుతుంది.

నువ్వు ఇక్కడా ఉన్నావు? ‘టిఫిన్చల్లారిపోతోందే! తినడానికి రావటం లేదా?” అమ్మ గొంతు వినబడగానే, వెనక్కి తిరిగింది.

అమ్మ ముఖం కూడా వాడిపోయి ఉన్నది.

మనసులో ఏర్పడ్డ నొప్పి ముఖంలో తెలిసింది.

నేను కావాలంటే ఒకసారి హైదరాబాదుకు వెళ్ళి... తులసి ముగించేలోపు అమ్మ వేగంగా అడ్డుకుంది.

వద్దు...అది మాత్రం వద్దు!

ఏమ్మా...

వద్దు తులసీ... -- అమ్మ కలవరపడుతూ చెప్పింది.

సరి... వెళ్ళను. ఫోన్చేసైనా మాట్లాడనా...నెంబర్మన దగ్గరుందే?”

నువ్వు ఎవరు అని అడిగితే ఏం చెబుతావు?”

అదంతా నేను చూసుకుంటాను. నువ్వు టిఫిన్తీసి పెట్టు. నేను ఇప్పుడు వచ్చేస్తాను

తులసీ వేగంగా కిందకు దిగి వెళ్ళింది. ఫోను చెయ్యటానికైనా అమ్మ ఒప్పుకుందే. అంతవరకు నయం! కిందకు వచ్చి పర్స్ తీసుకుని వీధి చివర ఉన్న ఎస్.టి.డి బూతుకు వేగంగా వెళ్ళింది.

అరగంట తరువాత తిరిగి వచ్చిన తులసీ ముఖం ఇంకా ఎక్కువగా వాడిపోయున్నది.

ఏమిటే...ఉన్నారా? మాట్లాడావా?”

ఊహూ...లైనే దొరకలేదు. అవుట్ ఆఫ్ ఆర్డర్అని అనుకుంటా

నేరుగానూ రాకుండా, ఉత్తరం కూడా వెయ్యకుండా ఇన్ని సంవత్సరాలలో ఇలా ఎప్పుడూ జరగలేదే?”

అందుకే ఒకసారి నేరుగా వెళ్ళొస్తాను అంటే, వద్దంటూ పట్టుదల పడుతున్నావు!

దానిక్కాదే...

నాకు తెలుసమ్మా...అక్కడికి వెళ్ళి ఎలా నడుచుకోవాలో నాకు తెలుసు. నువ్వు భయపడుతున్నట్టు ఏమీ జరగదు...సరేనా? రేపటికి ట్రావల్స్లో దేనికో ఒకదానికి ఫోను చేసి ఒక టికెట్టుకొంటాను -- నువ్వు వర్రీ అవకుండా ఉండు. నేను జాగ్రత్తగా వెళ్ళోస్తాను

తులసి తన నిర్ణాయాన్ని గట్టిగా చెప్పగా, కూతుర్ని ఇక అడ్డుకోలేమని తల్లికి అర్ధమయ్యింది.

రెండే రెండు చపాతీలు మాత్రం తిని లేచింది కూతురు. తండ్రి యొక్క హైదరబాద్ అడ్రస్సు తీసుకుని జాగ్రత్తగా సంచీలో బద్ర పరుచుకుంది. ఒక జత బట్టలు మాత్రం చిన్న ఏర్ బ్యాగులో ఉంచుకుని, పడుకోటానికి వెళ్ళింది.

రాత్రంతా నిద్ర పోలేదు. నాన్న జ్ఞాపకాలే!

ఏం నాన్నా, నెలలో ఐదు రోజులు మాత్రమే మనం సంతోషంగా ఒకటిగా కలిసి ఉండగలమా? నువ్వు ఇక్కడికే వచ్చి ఉండటం కుదరదా? లేకపోతే మమ్మల్ని కూడా హైదరాబాద్ తీసుకు వెళ్ళోచ్చు కదా?”

స్కూల్ ఫైనల్ ఇయర్చదువుతున్నప్పుడు ఒకసారి తండ్రి దగ్గర ఇలా అడిగింది. అమ్మను చూసాడు ఆయన. ఆమె మొహం దించుకుంది. కూతురు హఠాత్తుగా అలా అడుగుతుందని ఆమె ఎదురు చూడలేదు.

తండ్రి ఆలొచనతో కూతుర్ని చూసారు.

అది కుదరదురా చిట్టీ

ఏం నాన్నా...?”

చెబితే అర్ధం చేసుకునే వయసు, బుద్ది నీకు ఇప్పుడు ఉన్నది కాబట్టి అన్నీ చెప్పటమే మంచిది. నేను చెప్పేది అర్ధం చేసుకుంటావా తులసీ?”

అలా ఏం చెప్పబోతారు నాన్నా?’ అనేలా చూసింది తులసి.

నాకు అక్కడ కూడా ఒక కుటుంబం ఉన్నది తులసీ -- తండ్రి చెప్పటంతో, షాక్ తో తలెత్తి చూసింది కూతురు.

ఏంటి నాన్నా చెబుతున్నారు -- తులసి స్వరం వణికింది.

నిజాన్నిచెబుతున్నా! అదే నా మొదటి కుటుంబం. మీ అమ్మ రెండోదే! ఒక తప్పించుకోలేని, ఇరకాటమైన, ఒత్తిడి పరిస్థిలో మీ అమ్మను నేను పెళ్ళి చేసుకున్నాను

తులసి శిలలాగా నిలబడిపోయింది!   

Continued...PART-2    

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి