19, జనవరి 2023, గురువారం

మారని రాగాలు...(సీరియల్)...(PART-1)


                                                                            మారని రాగాలు...(సీరియల్)                                                                                                                                                                   (PART-1) 

రచన అనేది వరమో...తపమో మాత్రమే కాదు! అదొక ఎండిపోని జీవనది. చల్ల చల్లగా రాసుకుని వెళ్ళే ఈదురుగాలి. ఒంటి మీద పడి జలదరింపు పెట్టే వానజల్లు. ఇంటి నిండా గుమగుమలాడే సన్నజాజి వాసన. ఎప్పుడూ కొత్తగా వాసన ఇచ్చే వాడిపోని మల్లె.

రచనకు మాత్రమే ఇవి సొంతం కాదు...ప్రేమకు కూడా! ఎన్ని సంవత్సరాలు అయినా ప్రేమ...ప్రేమే. వయసైతే చల్లగాలి గిలిగింత పెట్టదా ఏమిటి? వర్షపు జల్లు జలదరింపు తీసుకురాదా? మత్తు ఎక్కించదా? సన్నజాజి వాసన ముక్కును తాకదా? వాడిపోని మల్లె మత్తు ఎక్కించదా?

వయసవుతున్న కొద్దీ నిజమైన ప్రేమకు బలం ఎక్కువ అవుతుంది. శరీరాన్ని ముట్టుకోవటం ప్రేమ కాదు. మనసును తాకి లోతుగా చెక్క బడుతుందే...దాని పేరే ప్రేమ!

ముందురోజు మొగ్గలను మాలకట్టి, రాత్రంతా గిన్నె కిందపెట్టి మూసిపెడతారు. మరుసటి రోజు పొద్దున దాన్ని తీస్తే గుప్పుమని విరుచుకుని, ఇల్లంతా వాసన వీస్తుంది.

అలాగే ప్రేమ కూడా! దాని వాసన జీవితాంతం వీస్తుంది. మనసులో మూతపెట్టి, మూసిపెట్టిన మాలలాగా జీవితాంతం పూస్తుంది.

వాడిపోకుండా...నలిగిపోకుండా ఉంటుంది. వాడిపోని మెల్లె పూవులాగా కొత్తగా తెలుస్తుంది.

కృష్ణమూర్తి -- మాలతీ ప్రేమ కూడా అలాంటిదే! దాన్ని ప్రేమ అని చెప్పటం కూడా తప్పే అవుతుంది. ప్రేమలో కామం ఉంటుంది. కామంలో ప్రేమ ఉండాల్సిన అవసరం లేదు. వీళ్ళకున్నది కామంలేని...మనసును మాత్రమే తాకిన ప్రేమ. ఒకటిగా కలవని...కానీ ఒకటిగా ప్రయాణం చేసిన ప్రేమ.

ఇలాంటి ప్రేమ అపురూపం...ఆశ్చర్యం కూడా! వీళ్ళకు మాత్రమే సాధ్యం. మామూలుగా మానవ కులం మొత్తానికీ సాధ్యం అవాల్సిన విషయం సుతిమెత్తని కొన్ని మనసులకే సాధ్యమవుతుంది.

అలా ఎందుకు...ఎలా? తెలుసుకోవటానికి వర్ణజాలాన్ని చూడండి. కళ్ళను ఆకర్షించే దాని అందాన్ని అనుభవించండి. తరువాత మీ అభిప్రాయాలు తెలియజేయండి!

****************************************************************************************************  

                                                                                PART-1

కృష్ణమూర్తి బయటకు వెళ్ళటానికి రెడీ అయ్యారు. చెప్పుల స్టాండులో నుండి, చెప్పులు తీసి తగిలించుకుంటున్నప్పుడు బాగా నీరసంగా ఉన్నట్లు అనిపించింది. ఇదే చెప్పుల స్టాండులో ఒకప్పుడు నాలుగైదు జతల చెప్పులు ఉండేవి. పద్మజా....సీత...శారదా అంటూ ఆడవాళ్ళ చెప్పులు. అందులో వెతికి తన చెప్పులు తీసుకునేవారు అప్పట్లో.

ప్రస్తుతం వెతుకుడుకు అవసరంలేదు. తనలాగానే చెప్పులు కూడా ఒంటరిగా పడుండటం అనేది అనుకున్నప్పుడు మనసులో నిండిపోయున్న శూన్యం ఇంకొంచం ఎక్కువ అయ్యింది.

లొతైన ఒక నిట్టూర్పుతో వాకిలి తలుపు తెరిచిన ఆయన మెట్లమీద సంకోచిస్తూ నిలబడ్డారు. ఎండ చుర్రున మొహాన కొడుతున్నది. రోహిణీ కార్తి. వీధిలో మనుష్యుల హడావిడే లేకుండా ఖాలీగా ఉంది. నీడకు తలదాచుకోవటానికి ఒక చెట్టు కూడా లేని వీధి అది. వరుసగా, ఇరుకుగా కట్టబడ్డ ఇళ్ళు. గాలికి కరువైన చోటు. సాయం సమయంలో అందరికీ ఖాలీ మేడలే స్వర్గం. ఎండకి ఖాలీ మేడ నేల కూడా కాలుతుంది. 

పరిస్థితిలో సుమారు పావుమైలు దూరం నడిచి వెళ్ళి హోటల్లో భోజనం చేసి తిరిగిరావాలి. రోజూ మూడు వేళలూ ఇలా భోజనం కోసం తిరగటం ఆయనకు కష్టంగా ఉన్నది. దీనికొసమే రాత్రి భోజనాన్ని తగ్గించి, పొద్దున తినేసి వస్తున్నప్పుడే ఒక చిన్న బ్రెడ్, రెండు అరటిపండ్లు కొనుక్కుని వచ్చేస్తారు.

వాటిని తినేసి, మంచినీళ్ళు తాగేసి పడుకుంటారు. రోజు పొద్దుటి భోజనానికి వెళ్ళటానికి కూడా ఇష్టంలేక పోయింది. పొద్దుటి నుండి కారణం చేతనో మనసు నిలకడగా ఉండకుండా తిరుగుతున్నది. అది ఎందుకు అనేది అర్ధంకాలేదు. ఆయనా మనసును కట్టుబాటులోకి తీసుకురావటానికి ఏమిటేమిటో చేసి చూసారు.

బిందెతో నీళ్ళు తోడుకుని, తలమీద పోసుకుని స్నానం చేసారు. పూజ రూములోకి వెళ్ళి కూర్చున్నారు. లలితా సహస్రనామంచెప్పారు. ఆమ్మవారి ఫోటోకు అర్చన చేసారు. పూజలో కూర్చున్నారు.

కొద్ది నిమిషాలే. మనసు దాంట్లో ఏకాగ్రత వహించకుండా మొరాయించింది...పీటను తీసి గోడకు ఆనించి, చొక్కా తొడుక్కుని బయలుదేరారు. రోజు మాత్రమే కాదు...రెండు మూడు రోజుల నుంచే మనసు అలజడిగా ఉంది. ఏదోదే జ్ఞాపకాలతో కంగారుపడుతోంది. సతమతపడుతోంది. పాత జ్ఞాపకాలలో మునిగి మునిగి లేస్తోంది.

భార్య పద్మజా జ్ఞాపకం, పెద్ద కూతురు సీత యొక్క జ్ఞాపకం, పదిహేనురోజుల క్రితం పెళ్ళి చేసుకుని, అల్లుడితో బాంబే వెళ్ళిపోయిన చిన్న కూతురు శారదా జ్ఞాపకాలు...భార్య చనిపోయిన తరువాత, పెద్ద కూతురు సీత వివాహం జరిగిన తరువాత చిన్న కూతురు శారదానే ఇన్ని సంవత్సరాలు ఆయనతో ఉన్నది. చూసి చూసి అన్నీ చేసింది. నేనూ వెళ్ళిపోతే మీకు ఎవరు నాన్నా తోడు?'’ అంటుంది.

అలా ఎన్ని రోజులు తోయగలడు? చివరగా ఈయనే పట్టుదల పట్టి చిన్న కూతురు శారదాకి పెళ్ళి జరిపించి ముగించారు. పెళ్ళి అయిన నాలుగో రోజే భర్తతో ఊరికి బయలుదేరిన రోజు ఆమె ఏడ్చిన ఏడుపు, రోజు రాత్రి ఒంటరిగా ఇంటికి తిరిగి  వచ్చి, తలుపులు తీసుకుని, లోపలకు వచ్చినప్పుడు మొట్టమొదటి సారిగా ఒంటరి తనాన్ని చవి చూసాడు. శూన్యత భావన కూడా మనసును దెబ్బతీసింది. ఒక్కొక్క సంఘటన జ్ఞాపకానికి వచ్చి వెళుతోంది.మనుషులందరూ జ్ఞాపకాలతో  తేలుతున్నారు. పద్మజా....సీత...శారదా...చివరగా మాలతీ.

మాలతీ...

                                                                             ******************

ఇన్ని సంవత్సరాల తరువాత కూడా క్లియర్ గా ఎదురుగా వచ్చి నిలబడిన ఆమె రూపం, పాల తెలుపు రంగు, పుష్టిగా ఉండే శరీరం, పొడవు పొడవుగా ఉన్న కళ్ళు. వాటి నుండి బయటపడుతున్న ఇంపైన చూపులు. అపూర్వంగానే నవ్వుతుంది.  ప్రతిదానికీ నవ్వే జాతికాదు. కరిగించే అందం లేదు.

రంభ, ఊర్వశీ, మేనకా అని అందరూ చెబుతారే...అలాంటి వాళ్లను నిలబెట్టి ఆశ్చర్యపరిచే అందం అంతా లేదు. రవివర్మ గీసిన లక్ష్మీ ఫోటో, సరస్వతి ఫోటో లలో చూసే నిరాడంబరమైన అందం, భవ్యమైన అందం, నిదానమైన అందం.

నిదానమూ, భవ్యమే కృష్ణమూర్తిని ఆకర్షించింది. మొదటిరోజు పాఠాలు చెప్పటానికి క్లాసు రూముకు వెళ్లాడు ఆయన. ఆమె ఎలా కాలేజీకి కొత్త స్టూడెంటో, అదేలాగానే ఆయనకూడా కొత్తగా చేరిన లెక్చరర్. మొట్టమొదటి సారిగా క్లాసుకు పాఠం చెప్పటానికి లోపలకు వెళ్లారు.

ఇంగ్లీష్ లిటరేచర్. పురుష గంభీరంతోనూ, లిటరేచర్ చదివిన ఆత్మ విశ్వాసంతోనూ లోపలకు వెళ్ళిన వెంటనే విధార్ధినుల సంచలనం. ఆయన రంగుతోనూ, మొహ లక్షణంతోనూ స్థంభించిన కొందరు కూర్చోనుండగా...తనని పరిచయం చేసుకున్నాడు. తరువాత విధ్యార్ధినులు పరిచియం చేసుకున్నారు.

ఒక్కొక్కరుగా లేచి తమ పేర్లు చెప్పినప్పుడు చేతులు కట్టుకుని, టేబుల్ కు ఆనుకున్న కృష్ణమూర్తి, మాలతీ లేచినప్పుడు గుండెల్లో మంచు గడ్డలు చెదురుమదురుగా పడటంతో జలదరింపుకు గురి అయ్యారు.

అలాంటి ఒక అందం...?

ఇలాంటి దేవతలాంటి ఒక మొహం ఉండటం సాధ్యమా?

మాలతీ.

పేరు విన్నప్పుడే ఆయనలో పుణ్య నది ఒకటి గలగలమని పారింది.

మాలతీ... మాలతీ... మాలతీ.

తరువాత పరిచయమూ ఆయన చెవి వెంట వినబడలేదు. గుండెలకు హత్తుకోలేదు. మనసులో ఆమె రూపం మెరుస్తూ మెరుస్తూ దాగిపోతుంటే...కీద్స్ కవిత్వం ఒకటి చెప్పటం ప్రారంభించాడు.

పూల కుండి ఒక దానిపై అందమైన మగవాడు, ఆడది ముద్దుపెట్టుకుంటున్నట్టు బొమ్మ గీయబడి ఉంది. దాన్ని చూస్తున్న కవి యొక్క భావనలు మాటలతో జల్లబడుతున్నాయి.

వాళ్ళు రక్తమూ, చర్మమూ ఉన్న నిజమైన మనుష్యులే అయ్యుంటే, ముద్దుపెట్టుకుంటున్న పరిస్థితి నుండి విడిపోవటం జరిగేది.

విడిపోవటం బాధ పడటానికి దారి తీస్తుంది. బాధ పడి, ఒళ్ళు క్షీణించి విరహానికి దారితీస్తుంది. కానీ, పూల కుండీ మీద గీయబడ్డ రూపానికో మార్పులేదు. విడిపోవటం లేదు. దానివల్ల ఏర్పడే బాధ ఉండదు. విరహం లేదు. వృద్దాప్యం లేదు.

కాలం కాలంగా...యుగం యుగంగా...జన్మ జన్మలుగా ముద్దుపెట్టుకుంటూనే ఉంటారు. వాళ్లకు మరణమూ లేదు. తరువాత పుట్టుకా లేదు.

కళ్ళు మాత్రం చూసే అందానికి వాడిపోవటం, మగ్గిపోవటం ఉంది. కానీ, హృదయంలో లోతుగా చోటుచేసుకున్న అందానికి మరణమేది...?

ఎమోషనల్ గానూ, మాటల జాలంతోనూ చెప్పేసి తలెత్తి మాలతీను చూసారు. క్లాసులో ఉన్న ఇతర స్టూడెంట్స్ కళ్లకు అతకలేదు...మనసులోకి దూరలేదు. ఆయన హృదయం పూర్తిగా ఆక్రమించుకున్నది మాలతీ.

ఇన్ని సంవత్సరాల తరువాత పరిస్థితుల్లోనూ గుర్తుకు వస్తున్నప్పుడు కూడా ఆయనకు ఆమె మొహమే జ్ఞాపకానికి వస్తోంది. పూల కుండి రూపంలాగా మనసులో ముద్రించుకుపోయున్న అందానికి రోజూ ముగింపు లేదు. వాడిపోవటంలేదు. వృద్దాప్యంలేదు. మరణం లేదు.

దగ్గర దగ్గర మూడు సంవత్సరాలు ఆమెకు పాఠాలు జరిపారు. ఇద్దరూ మనసారా దగ్గరై, కలిసిపోయి, లిటరేచర్ ప్రేమికుల్లాగా తిరిగి అంతోనీ-కిలియోపాట్రా, ఓతెల్లో-ఉష్ట్మోనా, రోమియో-జూలియట్....

వాళ్లకు ఏర్పడ్డ ముగింపు వీళ్ళకు రాకూడదనే భయం ఇద్దరిలోనూ ఏర్పడినప్పుడు --

అదే జరిగింది!

మాలతీ ఇంటి పెద్దలకు విషయం తెలిసింది. కాలేజీ చదువును ఆపేసారు.  

ఇంట్లోనే నిర్బంధించబడి, అన్నయ్యతోనూ, తండ్రితోనూ దెబ్బలు తిని...

మర్చిపో...అతన్ని మర్చిపో!అనేది వేదంలాగ చెప్పబడి రెండు నెలలలో వాళ్ళ కులంలోనే వేరే వరుడ్ని చూసి, పెళ్ళికి ముహూర్తం పెట్టబడింది----

కృష్ణమూర్తి  కల్యాణ మండపంలోకి రాకుండా ఉండాలని ఆమెకు సంబంధించినవారు అందరూ జాగ్రత్తగా ఉన్నారు. అతను రాకుండా చూసుకోవడానికి ప్రత్యేక కాపలాదారులను ఏర్పరిచారు. ఒకవేళ అతను లోపలకు వచ్చినా, అతన్ని కొట్టి పడేయటానికి మనుషులను నియమించారు.

వాటిని అన్నింటినీ మీరి కృష్ణమూర్తి, కల్యాణ మండంపంలోకి చొరబడ్డాడు. కుచించుకుపోయిన ఎమోషన్స్ తో ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నారు. ఒకసారి ఈయన్ని తలెత్తి చూసిన మాలతీ కళ్ళల్లో కన్నీటి వరద.

ఏడవకూడదుఅన్నట్టు సైగ చేసారు.

మాంగల్యం కడుతున్నప్పుడు కూడా మాలతీ చూపులు ఈయన మీదే పడి ఉండగా -- ఏదైనా చేసి పెళ్ళిని ఆపేస్తారా అనే భయంతోనూ, ఆందోళనతోనూ, ఆవేశంతోనూ సతమతమవుతుంటే-----

కృష్ణమూర్తి ఏమీ చెయ్యలేదు. నిదానంగా, నెమ్మదిగా, జీవితాన్ని దాని దోవలోనే అంగీకరించటానికి తయారైన వాడిలాగా, తీసుకు వచ్చిన నిమ్మ పండును ఆమె చేతిలో ఇచ్చి------

నీ యొక్క ఉపాధ్యాయుడు అనే ఉద్దేశంతో చెబుతున్నా, నీ భర్తకు తగిన భార్యగానూ, ధర్మం మర్చిపోని విధంగా కుటుంబాన్ని నడిపించాలని ఆశీర్వదిస్తున్నాను!

అంతటితో బయటకు వచ్చాసారు.

మండపంలో గొడవ చేయకూడదని, కృష్ణమూర్తి బయటకు వచ్చేంత వరకు  కాచుకోనున్న కిరాయి గూండాలు నలుగురు కలిసి ఆయన్ని లాక్కుని వెళ్ళి కొట్టి పడేసారు. ఆయన వాళ్లను అడ్డగించలేదు.

శరీరాన్నే మాత్రమే కదా మీరు చితకబాది వేరు చేయగలరు. కొట్టండి. మా ఇద్దరి మనసులూ కిద్సిన్ పూల కుండీలలాగా రూపాంతరం చెందిన తరువాత మాకు విడిపోవటం ఎక్కడుంది? ఇది అర్ధం కాని మూర్ఖులారా...కొట్టండి...

తరువాత ఆయన జీవితంలో ఎన్నో మార్పులు. ఈయనకీ పెళ్ళి జరిగి, ఇద్దరు ఆడ పిల్లలకు తండ్రి అయ్యి, లెక్చరర్ పోస్టు నుండి రిటైర్ అయ్యి, ఇదిగో చిన్న కూతురికి పెళ్ళి జరిపించి, కాపురానికి పంపి ఇప్పుడు ఒంటరిగా ఉంటున్నారు.

భోజనం చేసి ఇంటికి తిరిగొచ్చిన ఆయన ఫ్యాను వేసుకున్నాడు. ఈజీ చైర్ ను విడదీసి కూర్చోబోయినప్పుడు ఏదైనా చదవాలని అనిపించింది.

ఏది చదువుదాం?’ అన్న ఆలొచనతో తన పాత జ్ఞాపకాల గురించి చదువుకుందామనుకుని నిర్ణయించుకుని అలమారును తెరిచారు. డైరీలను తీసారు. ఇరవై ఐదు సంవత్సరాలుగా ఆయన దాచిపెట్టిన నిధి.

మొదటి రోజు రాసుకున్నది తీసుకుంటునప్పుడు ఆయన చేతులు వణికినై. అందులోనే మాలతీ గురించి రాయటం మొదలుపెట్టారు.

తీసిన వెంటనే పెద్ద అక్షరాలతో ఏప్రిల్-25. మాలతీ పుట్టిన రోజు బహుమతిగా శ్రీశ్రీ రాసిన రచన ఒకటి అని రాసుంది. కింద పెట్టేసి తరువాతది తీసి చూసారు. అదే ఏప్రిల్-25 ఆయన బహుమతిగా ఆయన ఆటోగ్రాఫ్ చేసిన పుస్తకం.

తరువాత పుట్టిన రోజుకూ ఒక పుస్తకమే.

గబుక్కున ఆయన చూపు పైకి వెళ్ళి క్యాలండర్ పైకి వెళ్ళింది.

రోజు ----

ఏప్రిల్-20.

ఇంకో ఐదు రోజుల్లో మాలతీ యొక్క పుట్టిన రోజు. దానికి వెళితే ఏం...? ఇరవై ఐదు సంవత్సరాలుగా మనసును లాగి కట్టి పడేసాము. ఆమెను మనసులోనే ఉంచి జీవ సమాధి కట్టాసాడు.

ఆమె ఉండే చోటు తెలిసి కూడా ఆమెతో ఎటువంటి టచ్ పెట్టుకోవటానికి ప్రయత్నించలేదు. చూడాలని, మాట్లాడలని...ఒక వాక్యం రాయాలని...ఊహూ...ఏదీ లేదు. అంత కట్టుదిట్టంగా ఉన్న మనసు, ఇప్పుడు కట్టుబాటును దాటాలని తపిస్తోంది. ఎవరూ లేని ఒంటరి తనం, ఆదరణ లేని పరిస్థితి. అన్నీ కలిసి ఆమెను ఒకసారి చూడాలనే ఆశని ప్రెరేపించింది.

ఇంత వయసు వచ్చిన తరువాత ఆమెను కలుసుకోవటంలో తప్పు ఏముంది? మనశ్శాక్షి అభ్యంతరం తెలుపలేదు. బీరువాలోని చివరి రాక్ కింద పడేసున్న ఆమె అడ్రస్సును వెతికి తీసుకుని బెంగళూరుకు వెళ్లటానికి ఫస్ట్ క్లాసు టికెట్టు కొనడానికి బయలుదేరారు ఆయన.  

                                                                                                         Continued...PART-2

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి