31, డిసెంబర్ 2022, శనివారం

ఎక్కడ నా ప్రాణం...(సీరియల్)...(PART-11)

 

                                                                            ఎక్కడ నా ప్రాణం...(సీరియల్)                                                                                                                                                                   (PART-11)

గాలి వీచిన వేగానికి ఎక్కడ పడిపోతానో అని భయపడింది. మెల్లగా అడుగులో అడుగువేసుకుంటూ మొత్తానికి పంచలింగానికి ఎదురుగా ఉన్న నాగలింగ వృక్షం కొమ్మను గట్టిగా పట్టుకుని నిలబడ్డది.

కొమ్మలలో నుండి ఊడిపడిన ఆకులు, గాలివేగానికి గలగలమని శబ్ధం చేసుకుంటూ వెడుతున్నాయి.

బలమైన గాలి వీచటంతో, వెన్ను చూపించి నిలబడున్న మనిషి కప్పుకున్న తెల్ల గుడ్డ జారి తొలగిపోయింది.

అదే సమయం-- మనిషి వెను తిరిగి చూశాడు. చెవులు చిల్లి పడేలాంటి పిడుగు శబ్ధం తరువాత ఆకాశంలో మెరుపు మెరిసి మాయమైయ్యింది.

ప్రకాశవంతమైన మెరుపు వెలుతురులో...అయన మొహాన్ని చూసిన ఆమె ఒక్క క్షణం నెవ్వరపోయింది.

'నా...నాన్నా...మీ...మీరా?'

దివ్యా తన కళ్ళను తానే నమ్మలేకపోయింది.

'నాన్న జ్ఞాపకంలోనే ఉన్నాను కాబట్టి, ఎదురుగా కనబడే ముఖం, ఆయన లాగా కనబడుతోందా? లేక నిజంగానే నాన్నేనా?'

డాక్టర్ సుధీర్ చేతుల్లో చిక్కుకున్న నాన్న ఇక్కడికెలా వచ్చారు?

రుషులు తలచుకుంటే రూపంలోనైనా తిరుగుతారు అని విన్నాను.

ఒకవేల రుషి నాన్న రూపంలో తిరుగుతున్నారో?

జరిగేదంతా ఆశ్చర్యంగా ఉన్నదే? నేను చూసేది కలా...నిజమా?

గిల్లి చూసుకుంటే నొప్పి పుడుతోందే? ఇది నిజమే... గంగయ్య స్వామీజియే నాన్న రూపంలో తిరుగుతున్నారో?

మనసులో ఎన్నెన్నో ప్రశ్నలు. 

"ఏమిటి దివ్యా...అలా చూస్తున్నావు? నాన్నను గుర్తు పట్టలేకపోతున్నావా?"

సాక్షాత్ నాన్న గొంతే అది. నాన్నే అది!

"నాన్నా..."

బెదురుతూ బెదురుతూ పరిగెత్తుకు వెళ్ళి, ఆయన చేతులు పుచ్చుకుని కళ్లకు అద్దుకుంది.

డాక్టర్ సుధీర్ గూండాల దగ్గర నుంచి ఎలా నాన్నా తప్పించుకుని వచ్చారు? మీరు కనిపించకుండా పోయిన తరువాత...మిమ్మల్ని వెతుక్కుంటూ నేనూ, అర్జున్ అడవికే వచ్చాశాము!

గంగయ్య స్వామిజీ గారే మాకు ఆశ్రయం ఇచ్చారు. పెద్ద ఆపద నుండి కూడా మమ్మల్ని కాపాడారు.

మిమ్మల్ని కాపాడాలంటే,  సీతమ్మను స్వయంగా కలుసుకోవాలి. ఆవిడ్ని కలిస్తే, ఒక పరిష్కారం దొరుకుతుందని అర్జున్ ఎక్కువగా నమ్మారు. నా దగ్గర కూడా చెప్పకుండా మధ్యరాత్రి సమయంలో ఆవిడ్ని కలవటానికి వెళ్ళిన ఆయన....తిరిగి రానే లేదు.

మనకోసం అడవికి వచ్చిన ఆయనకు ఏమైందో తెలియటంలేదు. అందుకనే ఆయన్ను వెతుక్కుంటూ నేను ఇక్కడికి వచ్చాను.   

మీరు కనిపించకుండా పోయిన దగ్గర్నుంచి...ఇదిగో నిమిషం వరకు నేను పడ్డ తపన ఉందే...ఇది భగవంతుడికే తేలుసు"

పంచలింగాలను చూపించి రెండు చేతులతోనూ ముఖాన్ని మూసుకుని '' అని రోదించింది.

ఆమె భుజంపైన మృదువుగా ఒక చేయి పడటంతో, గబుక్కున వెనక్కి తిరిగింది.

కాషాయ వర్ణం చీరతో మెడలో రుద్రాక్ష మాలతో,స్ఫటిక మాలతో వేసుకుని నుదుటి మీద విభూది, పెద్ద కుంకుమబొట్టు, జటిల డలతో ఒక అమ్మ నిలబడుంది.

వయసు సుమారు అరవై ఉంటుంది.

ముఖంలో దివ్యమైన తేజస్సు! పెదవులమీద దైవీక నవ్వు అతుక్కోనున్నది.

"మనసును ఎప్పుడూ జారవిడుచుకోకూడదు దివ్యా. చివరిదాకా నమ్మకాన్ని వదలి పెట్టనే కూడదు.  ఇంతవరకు ఏం జరిగినా పరవాలేదని వైరాగ్యంగా ఉండి పోరాడి ధైర్యంగా కొండ శిఖరం దాకా వచ్చావే?

నిన్ను నేను అభినందిస్తున్నాను...ఎప్పుడూ ఇలాగే మనో ధైర్యంతో ఉండాలి. అర్ధమైందా?"

నీళ్ళు నిండిన కళ్లతో అమ్మనే చూస్తూన్న దివ్యా ఒకసారి విఠల్ రావ్ ను చూసి మళ్ళీ ఆమెనే చూసింది.

"మీరు...?'-- తడబడుతూ నిలబడింది.

"సీతమ్మనే..." నవ్వింది.

దివ్యా ముఖంలో ఆశ్చర్యం, ఉత్సాహం . గబుక్కున చేతులెత్తి నమస్కరిస్తూ ఆమె కాళ్ల మీద పడ్డది.

"పడకూడదు...భగవంతుని సన్నిధి ముందు వేరే ఎవరి కాళ్ల మీద పదకూడదు. లే! ఏమిట్రా ఇది? మూడు తరాలు గడిచిన తరువాత కూడా, ఇంకా గూని పడకుండా ఉన్నానే అని చూస్తున్నావా?

"...అవును"

"అంతా సంజీవి మూలిక మహిమ"

... మూలిక గురించి తెలుసుకోవాలి. మూలికను పెట్టుకుని డబ్బు సంపాదించాలనే కక్కుర్తితోనే డాక్టర్ సుధీర్ , నాన్నను అపహరించుకుపోయాడు. దేవుని పుణ్యమా అంటూ నాన్న ఎలాగో తప్పించుకున్నారు. విషయంగా మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చిన అర్జున్ కనబడటం లేదే? ఒకవేల అతను డాక్టర్ సుధీర్ గూండాల దగ్గర దొరికిపోయుంటాడో?”--బాధతో ప్రశ్నలడిగిన దివ్యాను చూసి పకపకా నవ్వింది సీతమ్మ.

డాక్టర్ సుధీర్ దగ్గర మీ నాన్న దొరికిపోయుంటాడని నీకు చెప్పింది ఎవరు?”  

ఆమె వెనుక వైపు నుండి వినబడ్డ గొంతు విని గబుక్కున వెనక్కి తిరిగి చూసింది.

గంగయ్య స్వామి నిలబడున్నారు. ఆశ్చర్యపోయింది దివ్యా.

"స్వామీజీ....మీరు తిరిగి వచ్చేంత వరకు ఆశ్రమంలో నేను ఉండలేకపోయాను. మనసు ఆందోళన పడుతుంటే మీ అనుమతి లేకుండా మీ ఆశ్రమాన్ని వదిలి ఇక్కడకు వచ్చాను. అర్జున్ కూడా ఇదే తప్పు చేశారు.

మీకు మొత్తం తెలుసుంటుందే? నన్ను క్షమించండి" అంటూ రెండు చేతులూ జోడించి నమస్కారం చేసింది.

"నా ప్రశ్నకు నువ్వింకా సమాధానం చెప్పలేదు" అంటూ మందహాసంగా నవ్వారు.

డాక్టర్ సుధీర్ కిడ్నాప్ చేసుంటాడని నాకు నేనుగా ఊహించుకున్నాను. ఎందుకంటే...మొదటిరోజు ఇంటికి వచ్చిన ఆ మనిషి నాన్నకు ఎన్నో ప్లానులు వివరించాడు, నాన్న అతని ప్లానుకు అంగీకరించలేదు. దానితో ఆయన కోపంగానూ, ఆవేశంగానే లేచి వెళ్ళిపోయాడు.

అహంకారంతోనూ, మూర్ఖత్వంతోనూ నాన్నను హెచ్చరించి వెళ్ళడం నేను చూశాను. మరుసటి రోజే నాన్న, ఇంటికి రాలేదు 

డాక్టర్ సుధీర్ తన గూండాల సహాయంతో నాన్నను అపహరించి అడవికే తీసుకుపోయుండాలని అర్జున్ ఊహించాడు?"

మీ ఊహింపు కరక్టే. కానీ, డాక్టర్ సుధీర్ కిడ్నాప్ చేయలేదు"........

"మా ఊహింపు కరెక్ట్ అంటున్నారు. డాక్టర్ సుధీర్ కిడ్నాప్ చేయలేదని చెబుతున్నారు. గందరగోళంగా ఉంది"

దివ్యా తండ్రి విఠల్ రావ్ ని , గంగయ్య స్వామిజీని మార్చి మార్చి చూసింది.

డాక్టర్ సుధీర్ తనని కిడ్నాప్ చేస్తాడని ఎదురు చూశాడు మీ నాన్న. అదొక్కటే కాదు...పేరాశతో అతను ఏం చేయటానికైనా సాహసిస్తాడు అని తెలుసుకున్న మీ నాన్న వెంటనే మందుల కొండకు తానుగానే వచ్చాసారు..."

"...అలాగా? అలా జరుగుతుందని బాగానే ఊహించి, నా దగ్గర కూడా చెప్పకుండా ఇక్కడికి వచ్చారా? చాలా ఆశ్చర్యంగా ఉంది. అయితే అర్జున్ ఏమయ్యారు? దయచేసి చెప్పండి స్వామీ"

సమాధానం ఏమీ రాలేదు.

ముగ్గురూ ఒకర్ని ఒకరు చూసుకుంటూ మౌనంగా నిలబడటంతో, దివ్యాకి లోలోపల భయం పట్టుకుంది.

                                                                          **************************

అడవి బాటలో ఒంటరిగా కొండ ఎక్కి వచ్చినప్పుడు కంటే, ఇప్పుడు తన గుండే ఎక్కువ వేగంగా కొట్టుకుంటున్నట్టు అనిపించింది దివ్యాకి.

"నాన్నా! ఏమిటి నాన్నా ఇది? ఇలా ముగ్గురూ మౌనంగా ఉండటాన్ని చేస్తే నాకు చాలా గందరగోళంగా ఉందే? అర్జున్ కి ఏమైంది నాన్నా? మనవల్లే కదా ఆయనకు గతి? ఆయనకు ఏదైనా జరిగితే...నేను...నేను...ప్రాణాలతో ఉండను"

ఓర్చుకోలేక వెక్కి వెక్కి ఏడ్చింది.

"దివ్యా! ఇదిగో...నేను ఇక్కడే ఉన్నాను" ఒక లోయ ద్వారం నుండి చెట్ల కొమ్మలను పక్కకు తోసుకుంటూ వస్తున్నాడు అర్జున్ .

అతన్ని చూసిన వెంటనే దివ్యా లోకాన్నే మరిచిపోయింది. పరుగునవెళ్ళి అతని ఎదురుగా నిలబడ్డ ఆమె, "మీకు ఏమీ కాలేదుగా... అర్జున్! ' లవ్ యూ సో మచ్...' మీలాగా నేను నా ప్రేమను తెలుపటం లేదు అని నామీద నేరం మోపేవారే? ఇప్పుడు చెబుతున్నాను...వినండి. మీరు లేకుండా నేను ఒక్క నిమిషం కూడా జీవించలేను. మీరు మాత్రం రాకుండా ఉంటే....కచ్చితంగా నేను నా ప్రాణాలు వదిలేదాన్ని" అంటూ ఏడ్చింది. 

హాక్కుతో ఆమెను దగ్గరకు లాక్కుని, తన హృదయానికి హత్తుకున్నాడు అర్జున్.

"నీ గురించి నాకు తెలియదా? నేను జాగ్రత్తగా వచ్చాసాను కదా...కళ్ళు తుడుచుకో. జరిగిన విషయాలు చెబితే -- నువ్వు చాలా ఆశ్చర్యపోతావు"

"ఏం జరిగింది అర్జున్?"  

ఎడం చేత్తో కళ్ళు తుడుచుకుని, అతని పిడిలో నుండి మెల్లగా జారుకుని సంకోచంతో చూట్టూ ఉన్న అందరినీ ఒకసారి చూసి ఆదుర్దాగా అర్జున్ ను చూసింది.

"నిన్న రాత్రి కొండ బాట ద్వారా ఎక్కి వస్తున్నాను. చెట్లు-చేమలను, కొమ్మలను తోసుకుంటూ ఎవరో నన్ను వెంబడిస్తూ వస్తున్నట్టు గలగలమని శబ్ధం వినబడింది. ఏదైనా కృర మృగమా? కాదు, డాక్టర్ సుధీర్ మనుష్యులేమోనని నేనూ ఆలొచించుకుంటూ ఉన్నప్పుడు ఎవరో ఒకతను చెక్క కర్రతో నా తలమీద కొట్టాడు. తలపట్టుకుని తిరిగి చూసినప్పుడు, డాక్టర్ సుధీర్ తన గూండాలతో నిలబడున్నాడు. నేను అలాగే మూర్చపోయాను

"అయ్యో...తలమీద బలంగా కొట్టారా?"

"ఆందోళన చెందకు దివ్యా! నేను కళ్ళు తెరిచినప్పుడు...మూలికలను పసుపు గుడ్డలో కట్టి, గాయాలకు కాపు పెడుతున్నది సీతమ్మే. పక్కన జడల ముడులతో ఆమె భర్త. ఎదురుగా గంగయ్య స్వామి, మీ నాన్నా నిలబడున్నారు.

మామయ్యను చూసిన తరువాత నా ఆశ్చర్యానికి అంతే లేదు. ఏదో మూలికల కషాయమ్ను గంగయ్య స్వామీ నాకు ఇచ్చారు. నీకొకటి తెలుసా? మామయ్యా, గంగయ్య స్వామీ ఒకరే! ఏమిటలా నెవ్వరపోయి చూస్తున్నావు. అవును... దివ్యా!

గంగయ్య స్వామి లాగానే మూలిక వైద్యంలో మామయ్య నిపుణులు. ఆయన లాగానే ఈయనకీ జ్ఞాన దృష్టి ఉన్నది"

"అలాగా?"

ఆశ్చర్యంవలన, సంతోషంవలన కళ్ళల్లో నీళ్ళు తిరిగినై. గర్వంతో  తండ్రిని చూసింది.

దూరంగా మళ్ళీ అడవి కుక్కల, నక్కల ఏడుపు శబ్ధం వినబడటంతో....అందరూ దిక్కు వైపుగా చూసారు.

"నిన్నరాత్రి డాక్టర్ సుధీర్ గుంపు నన్ను కొట్టి పడేసి నదిని దాటుతున్నప్పుడు వరద ప్రవాహం వేగంగా రావడంతో వాళ్ళందరూ అందులో కొట్టుకుపోయారు. ఒకళ్ళు కూడా మిగల లేదు. అందులో ఎవరిదో ఒకరి శరీరం నది తీర మట్టిలోనో, బండరాయి క్రిందనో  చిక్కుకోనుంటుంది. అందుకనే నక్కల గుంపు తమకి ఆహారం దొరికిందని ఆనందంతో అరుస్తున్నాయి"

అర్జున్ మాట్లాడి ముగించిన తరువాత సీతమ్మ నవ్వింది.

"చెడిపోయే వాడే చెడు ఆలొచిస్తాడని చెబుతారు. అది ఇప్పుడు నిజమయ్యింది చూసావా దివ్యా. అపూర్వమైన విషయాలన్నీ అపూర్వమైన మనుష్యులకే దొరుకుతుంది. అందరికీ దొరకదు. దొరికితే దాన్ని తప్పైన విషయంకోసం వాడటం మొదలుపెడతారు. కొన్ని రహస్యాలు రహస్యాలుగానే ఉండాలి. అలా జరగలేదనుకో--దాని వలన ఊరికి, ప్రపంచానికీ ఆపద.

డాక్టర్ విఠల్ రావ్ చాలా మంచాయన. ఆయన గంగయ్య స్వామితో కలిసి, అరుదైన మూలికల సహాయంతో మానవ జాతికి సేవ చేస్తూ ఇక్కడే ఉండిపోవాలని ఆశపడుతున్నారు.

దివ్యా! నువ్వూ, అర్జున్  డాక్టర్లు. మీకు కొన్ని రకాల మూలికల గురించి, వాటి మహాత్యం గురించి గంగయ్య స్వామి గారు చెబుతారు. వాటిని పెట్టుకుని, తగ్గించలేని రోగాలతో కష్టపడుతున్న మంచి మనుష్యులకు మీరు సహాయం చేయాలి. మనుష్యులు చూసే చూపులతోనే వాళ్ళు మంచి వారా, కాదా అని తెలుసుకోగల శక్తి మీ దగ్గర ఉన్నది" అని చెప్పింది సీతమ్మ.

"అది మాత్రమే కాదు...ప్రాణమే పోయే పరిస్థితి వచ్చినా చివరి వరకు వైరాగ్యంగా, పోరాడే గుణం మీకు ఉన్నందువలన రహస్యాన్నైనా కాపాడతారనే నమ్మకం మాకు ఉంది. ఇదంతా మేము మీకు పెట్టిన పరీక్షే ఇది. అన్నిటిలోనూ జయించి వచ్చిన మిమ్మల్ని దీర్గాయుస్సుతో ఉండాలని ఆశీర్వదిస్తున్నాను" చేతులు పైకెత్తి ఆశీర్వదించారు గంగయ్య స్వామిజీ.

దగ్గరున్న శివలింగ పుష్పాల  చెట్టు క్రింద పడ్డ శివలింగ పుష్పాలను తీసుకుని ఇద్దరి మీద అక్షింతలుగా జల్లారు డాక్టర్ విఠల్ రావ్. ఇద్దరి చేతులను పుచ్చుకుని ఒకరి చేతిలో ఒకరి చేయి ఉంచారు.

"మందుల కొండమీద వెలసిన శివుని దీవెనలు కూడ మీకు లభించాయి. ఆయన దీవెన లేనిదే మీరు పుణ్య భూమికి రాలేరు. మీరు గొప్పగా జీవించాలి. వైద్యరంగంలో మీరు ఎంతో సాధించాలి"

డాక్టర్ విఠల్ రావ్ చెప్పి ముగించిన వెంటనే, పెద్ద గంట మోత మళ్ళీ వినబడింది. ఓం నమఃశివాయా అంటూ పంచాక్షర మంత్రాన్ని ఉచ్చరిస్తూ సీతమ్మ, గంగయ్య స్వామిజీ, డాక్టర్ విఠల్ రావ్ శివలింగాన్ని చుట్టొచ్చి దాని ఎదురు కుండా కూర్చుని ధ్యానం చెయటం మొదలుపెట్టారు....దూరంగా నిలబడి చూస్తున్న దివ్యా కళ్ళల్లో నీళ్ళు తిరిగినై. ఒదార్పుగా ఆమె భుజం మీద చేయివేసి అభయం ఇచ్చాడు అర్జున్.

చోటంతా శివలింగ పుష్పాల వాసనతో గుమగుమలాడింది.

***************************************************సమాప్తం*****************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి