14, డిసెంబర్ 2022, బుధవారం

ఎక్కడ నా ప్రాణం...(సీరియల్)...(PART-3)

 

                                                                       ఎక్కడ నా ప్రాణం...(సీరియల్)                                                                                                                                                                (PART-3)

సమయం చాలా నెమ్మదిగా కదులుతోంది. స్నానం ముగించుకుని తిన్నగా పూజ గదికి వెళ్ళింది దివ్యా.

పది నిమిషాలు కళ్ళు మూసుకుని ధ్యానం చేసి నిలబడప్పుడు మనసు నిలకడగా ఉన్నది.

'ట్రింగ్...ట్రింగ్...ట్రింగ్...'

టేబుల్ మీదున్న సెల్ ఫోన్ మళ్ళీ మొగటంతో వేగంగా వెళ్ళి ఫోన్ తీసుకుంది.

స్క్రీన్ మీద కనబడిన నెంబర్ను చూసింది.

అర్జున్!

"హలో దివ్యా...నీమీద పిచ్చి కోపంతో ఉన్నాను. విమానాశ్రయానికి వస్తావని ఎంత ఎదురు చూశాను తెలుసా...ఎందుక రాలేదు?"

"సారీ!...కుదరలేదు..."

"కుదరలేదా? తన్నులు తింటావు. ! ఆడపిల్లవేనా నువ్వు. నువ్వూ, నేనూ మనస్పూర్తిగా ఇష్టపడుతున్న ప్రేమికులం. అదన్నా జ్ఞాపకం ఉందా, లేదా నీకు? లేక...అదీ మర్చిపోయావా?"

"నేను ఏదీ మర్చిపోలేదు?" తడబడుతూ చెప్పింది.

మర్చిపోలేదా...పరవలేదు. నా తృప్తికోసం ఒకసారి జ్ఞాపకం చేసేస్తాను! మనిద్దరం ఒకే కాలేజీలో చదువుకున్నాం. నువ్వు నాకు జూనియర్. చదువులో నువ్వూ నా లాగే అన్నిట్లోనూ ఫస్ట్ ర్యాంకు తెచ్చుకోవటం చూసి నా మనసు పారేసుకుని, నీ దగ్గరకు వచ్చి 'నేను నిన్ను ప్రేమిస్తున్నా దివ్యా ' అని చెప్పాను.

' ప్రేమా, దొమా మీద నాకు నమ్మకం లేదు. ప్రతి అమ్మాయికీ ప్రేమ అనే భావం, పెళ్ళైన తరువాత తన భర్త మీదే రావాలని అనుకునే దాన్ని నేను.

మీ ప్రేమ నిజమైనదైతే -- మీ ఇంటి పెద్దలను తీసుకుని వచ్చి మా నాన్న దగ్గర సంప్రదాయ పద్దితిలో కూతుర్ను అడగండి  అని నువ్వు కచ్చితంగా చెప్పావు.

చదువు పూర్తి అవటానికి ఇంకా మూడు నెలలే ఉన్నాయని ఇంట్లో చెప్పి, వాళ్లను ఒప్పించి, మా పెద్ద వాళ్లను తీసుకుని మీ ఇంటికి వచ్చి సంబంధం మాట్లాడాము. చివరగా మీ నాన్న కూడా ఒప్పుకున్నారు. విదేశాలకు వెళ్ళి  ఎం.ఎస్ చదవాలనుకుని ఆశపడ్డాను. చదువు ముగించుకు వచ్చి పెళ్ళి చేసుకుందామని తీర్మానించుకున్నాము.

తాంబూళాలు మార్చుకుని, నిశ్చయం చేసుకున్నారు. ఫోనులో నేనే ఎరువు వేసి ప్రేమను పెంచుకుంటూ వచ్చాను. నువ్వు మొండి దానివి! నీకు ఆత్మ గౌరవం ఎక్కువ. ఒక్క రోజైనా నువ్వుగా నాకు ఫోన్ చేసి ' అర్జున్, నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను అని చెప్పావా?

ఇప్పుడు కూడా చూడు. రెండు సంవత్సరాల తరువాత ప్రేమికుడు వస్తున్నాడే? వాడ్ని విమానాశ్రయానికి వెళ్లి స్వాగతిద్దాం అనే ఆలొచన వచ్చిందా? నువ్వు నిజానికి రాతి గుండే దానివి!"

"అర్జున్...ప్లీజ్...మీ ధ్యాస మారిపోతుందేమో అన్న భయంతో నేను ఫోన్ చేయకుండా ఉన్నాను. రోజు విమానాశ్రయం రాకపోవడం తప్పే. కానీ దానికి ఒక కారణం ఉంది. మీరు తిన్నగా ఇక్కడకు రండి...చెబుతాను.

నేను ఉద్యోగానికి వెళ్ళలేదు. లీవు పెట్టాను. ఇంట్లోనే ఉన్నాను. త్వరగా రండి...మీతో మాట్లాడాల్సింది ఎక్కువ ఉన్నది"

ముంచుకొస్తున్న ఏడుపును అనగదొక్కుకుని మాట్లాడింది.

బేగం పేటలోనే అర్జున్ ఇల్లు. తల్లి, తండ్రి, కాలేజీలో చదువుకుంటున్న తమ్ముడు అని చిన్న అందమైన కుటుంబం.

పిల్లల ఇష్టాలకు, పెద్దలు ఏనాడూ అడ్డుచెప్పలేదు.

"రారా అర్జున్! బాగున్నావా? ఏమిట్రా ఇలా చిక్కిపొయావు? విమానాశ్రయానికే వచ్చుంటాం. నువ్వే మమ్మల్ని ఎవర్నీ రావద్దని చెప్పావే?" హారతి తిప్పుతూ చెప్పింది తల్లి కళావతి.

"మీకు అనవసరమైన శ్రమ ఎందుకని రావద్దని చెప్పాను"

"నిన్ను రిజీవ్ చేసుకోవటానికి వియ్యంకుడు, దివ్యా వచ్చారా?" అని తండ్రి చలం అడిగాడు.

"లేదు నాన్నా...వాళ్ళు రాలేదు"

"రెండు రోజులుగా వియ్యంకుడి సెల్ ఫోనుకు ట్రై చేశాను. సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుంచారు. ఎందుకో తెలియటం లేదు. నిన్న రాత్రి దివ్యాతో మాట్లాడాను . ఆమె గొంతులో ఎప్పుడూ ఉండే ఉత్సాహం లేదు...శోకంగా మాట్లాడినట్లు అనిపించింది"

 "స్నానం చేసి, బ్రేక్ ఫాస్ట్ తిని, తిన్నగా దివ్యా వాళ్ళింటికే వెళ్లబోతాను. మామగారినీ, దివ్యాని స్వయంగా కలుసుకుని విషయమేమిటో అడిగొస్తాను. సరేనా నాన్నా?"

తరువాతి అరగంటలో తన ద్విచక్ర వాహనం తీసుకుని దివ్యా ఇంటికి వెళ్ళాడు.

బైకు ఆగిన శబ్ధం విని వాకిట్లోకి వచ్చి తొంగి చూసింది దివ్యా.

"రా...రండి అర్జున్! బాగున్నారా?"

శోకంగా పెట్టుకున్న మొహంతో స్వాగతం పలికిన దివ్యాను పైకీ, కిందకూ చూశాడు.

నిన్ను చూడటానికి ఎప్పుడు వచ్చినా అప్పుడే పూసిన రోజా పువ్వులాగా నిగనిగలాడుతూ అందమైన నవ్వుతో ఉత్సాహంగా ఉంటావే...ఇప్పుడలా లేవే? ఏమైంది నీకు? వొంట్లో బాగుండలేదా? మామయ్య ఎక్కడ? ఆయన సిన్సియర్ డాక్టర్ కదా? పని ఉన్నదని రోజు కూడా ఆసుపత్రికి వెళ్ళారా?"

ప్రశ్నలపైన ప్రశ్నలు అడుగుతూ హాలులో ఉన్న సోఫాలో కూర్చున్నాడు.

దూరంగా నిలబడి నేల చూపులు చూస్తున్న దివ్యా దగ్గరకు వెళ్ళి హక్కుగా ఆమె చెయ్యి పుచ్చుకుని లాక్కొచ్చి సోఫాలో కూర్చోబెట్టాడు.

"నేను ప్రశ్నలు అడుగుతూనే ఉన్నాను. సమాధానమే చెప్పకుండా ఉంటే ఏమనుకోవాలి? మామయ్య తన సెల్ ఫోన్ ను ఎందుకు స్విచ్ ఆఫ్ లోనే ఉంచారు?"

దివ్యా కళ్లల్లో నుండి కన్నీరు ధారగా కారింది...వెక్కి వెక్కి ఏడుస్తూ అతని భుజాలపై తలపెట్టుకుంది.

"ఏమైంది దివ్యా?"  

అతని స్వరంలో ఆదుర్దా తెలుస్తోంది.

మెల్లగా తనని తాను సమాధాన పరచుకుని జరిగిందంతా వివరించింది.

"నువ్వు చెప్పిన దానిని బట్టి చూస్తే... డాక్టర్ సుధీరే మామయ్యను  కిడ్నాప్ చేసుంటారని అనిపిస్తోంది. ఇంకేమీ ఆలొచించకుండా పోలీసులకు కంప్లైంట్ ఇచ్చేద్దామా?"

"వద్దు...పోలీసుకు వెడితే...కోపంతో అతను నాన్నను ఏదైనా చేసేస్తాడేమోనని భయంగా ఉన్నది"

"అది కూడా ఆలోచించాల్సిన విషయమే. పోలీస్ స్టేషన్ కు వద్దు. మనమే ఏదైనా చేద్దాం...సరే, అరుదైన మూలికల గురించి  తెలుసుకుని వాటిని చేజిక్కించుకోవాలనే వెర్రి కోరికతో డాక్టర్ సుధీర్ ఉండటం వలన, కచ్చితంగా మామయ్యను కిడ్నాప్ చేసి కొండకే తీసుకు వెళ్ళుంటాడు"

"అయ్యో అర్జున్! నాకు చాలా భయంగా ఉంది.  నాన్నగారికి బాగా వైరాగ్యం ఉన్నది. డాక్టర్ సుధీర్ ఎన్ని చిత్రహింసలు పెట్టినా సరే, దేనికీ లోంగరు. కోపంలో నాన్న ప్రాణాలకు ఏదైనా హాని తలపెడతాడేమోనని కంగారుగా ఉంది. నాన్నకు మాత్రం ఏదైనా జరిగితే...అది నేను తట్టుకోలేను" 

ఏడుస్తూ చెప్పిన దివ్యాను తధేకంగా చూశాడు.

"మనసును దృడంగా ఉంచుకో దివ్యా! అప్పుడే ఎలాంటి సమస్య వచ్చినా సరే...మనం దానికి పరిష్కారం కనుక్కోగలం. కళ్ళు తుడుచుకో"

వీపు మీద అభయంగా చేతితో తట్టాడు.

"టైము వేస్టు చేయకుండా తిన్నగా మనమూ మందుల కొండకు  వెళ్ళాల్సిందే"

"ఏమంటున్నారు?".

"మందుకొండ- చుట్టుపక్కల కొండలలోకి వెళ్ళి మామయ్యను వెతుకుదాం అంటున్నాను"

"మనవల్ల అవుతుందా? నాన్నను కాపాడగలమా?"

"కాపాడగలం అని నమ్మాలి. నమ్మకమే జీవితం! మందుల కొండ  ఋషులు, మునులు తిరిగే అడవి ప్రాంతం  అని చెబుతున్నావు...అందువల్ల మామయ్యకు ఎటువంటి ఆపద రాదని నా మనసు చెబుతోంది.

మామయ్యను కాపాడటమే మన ప్రధాన లక్ష్యం అయినా.... కొండ మీద జరుగుతున్న అద్భుతాలను నీ నోట విన్న తరువాత, నాకు అక్కడకు వెళ్ళాలనే ఆసక్తి ఎక్కువ అయ్యింది దివ్యా!

నువ్వూ, మామయ్యా దూరపు బంధువుల పెళ్ళికి చిత్తూరు వెళ్లారని మా ఇంట్లో చెప్పేస్తాను.

తరువాత...నేను సొంతంగా నర్సింగ్ హోం మొదలుపెట్టాలి. దానికి సంబంధించిన ముఖ్యమైన ఆఫీసర్స్ ను నేరుగా కలిసి ఆలొచనలు జరపాల్సి ఉంది.అందుకోసం తిరుపతి వరకు వెళ్ళాలి అని ఇంట్లో చెప్పేసి వచ్చేస్తాను. వైజాగ వరకు విమానంలో వెల్దాం. అక్కడ్నుంచి కారు ఏర్పాటుచేసుకుందాం.

రెడిగా ఉండు. నేను త్వరగా వచ్చేస్తాను. సరేనా?"

డాక్టర్ విఠల్ రావ్ ని ప్రమాదం నుండి  కాపాడటానికి తమ ప్రయాణాన్ని మొదలుపెట్టారు ఇద్దరూ.

కానీ విధి, వాళ్ళను అపదలోకి తోసేయడానికి...మంచి సమయం కోసం కాచుకోనుంది.

                                                                                                                        Continued...PART-4

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి