22, డిసెంబర్ 2022, గురువారం

ఎక్కడ నా ప్రాణం...(సీరియల్)...(PART-7)

 

                                                                             ఎక్కడ నా ప్రాణం...(సీరియల్)                                                                                                                                                                 (PART-7)

గంగయ్య స్వామి తల ఎత్తి చూశారు. అతిపెద్ద వేప చెట్టు, పెద్ద పెద్ద కొమ్మలతో, ఆకుపచ్చ, పసుపు ఆకులతో వెన్నల వెలుతురులో ఆనందంగా నృత్యం చేస్తున్నట్టు ఆడుతున్నాయి.

చెట్టు క్రింద ఉన్న నేలను ఆదుర్దాగా వెతికేరు. ఎన్నో రకాల చెట్లకు మధ్యలో మెరుస్తూ వ్యత్యాసమైన ఊపుతో ఊగుతున్న 'చంద్రకాంతి మీద ఆయన చూపు పడింది.

వెతుకుతున్న నిధి దొరికినట్లు ఆయన మొహం అంతా తృప్తితో నిండిపోయింది. కళ్ళల్లో ఒక విధమైన మెరుపు కనబడింది. భవ్యంగా వంగొని, పక్వంతో -మృదువుగా చంద్రకాంతి మూలిక చెట్టును వేరుతో సహా తవ్వి తీసుకుని బుట్టలో వేసుకున్నారు.

"దీనికొసం ఎంత వెతికేనో తెలుసా? దగ్గర దగ్గర రెండువందల యాబై పౌర్ణమి రాత్రులు కొండంతా సంచరించాను. రోజే కళ్ళకు తగిలింది. మీరు నాతో వచ్చినప్పుడే ఇది దొరకాలనేదే ప్రాప్తం లాగుంది"

గంగయ్య స్వామి గారి మొహంలో ఆనందం తాండవమాడింది.

"దీన్ని కళ్లతో చూడటానికి మాకు ఎంతో అదృష్టం ఉండుండాలి! ఎన్నో పౌర్ణమి రాత్రులు నిద్ర మానుకుని శ్రమపడ్డా కొంచం కూడా విరక్తి, విసుగు చెందకుండా ప్రతి పౌర్ణమికి ఇక్కడికి రావటం మీలోని నిజాయితీని ఎత్తి చూపుతోంది" అంటూ ఆయన చేతిలోని బుట్టను రెండు చేతులతో ముట్టుకుని కళ్లకు అద్దుకున్నది దివ్యా.

"నువ్వు చెప్పింది చాలా కరెక్టు దివ్యా. మనం నిజంగా చాలా పుణ్యం చేసుకున్నాం. ఆయనతో మనల్ని తీసుకు వెళ్లడానికి ఆయన అంగీకరించింది ఒక పెద్ద పుణ్యం. దాని కంటే పెద్ద పుణ్యం ఏమిటంటే....ఇంత అద్భుతమైన మూలికను మనం కళ్లతో చూడటమే. అందుకు గంగయ్య స్వామి గారికి కృతజ్ఞత చెప్పాలి"    

అర్జున్ పులకరించిపోయి మాట్లాడుతున్నప్పుడు, గలగల మంటూ మొక్కలూ,  చెట్లకొమ్మలు కదులుతున్న శబ్ధం వినబడింది.

ఆకులు విరుగుతున్న శబ్ధం కూడా బలంగా వినబడటంతో--ముగ్గురూ దిక్కు వైపు చూశారు.

గబగబా ఒక ఏడెనిమిదిమంది  వారికి ఎదురుగా వచ్చి వరుసగా నిలబడ్డారు.

అందరి చేతుల్లోనూ పదునైన కత్తులు. వెన్నల వెలుతురులో నిగనిగ మెరుస్తున్నాయి.

వాళ్ళకు పక్క నుంచి నిదానంగా వచ్చిన మనిషిని చూసి దివ్యా నిశ్చేష్టురాలు అయ్యింది.

ఆదుర్దాగా పక్కనున్న అర్జున్ తో "అర్జున్...ఈయనే డాక్టర్ సుధీర్ " అని మెల్లగా చెప్పింది.

"...అలాగా?"

"నేను అప్పుడే చెప్పాను కదా... గంగయ్య స్వామి ఆశ్రమ వైద్యశాలను ఎవరో గూఢచార తత్వంతో గమనిస్తున్నారని! ఇప్పుడు వాళ్ళ చేతికి బాగా దొరికిపోయామే అర్జున్?"

అతనికి మాత్రమే వినబడేటట్టు మెల్లగా చెప్పింది.

"ఎవరు మీరు? ఎందుకు మా ముందుకు వచ్చి నిలబడ్డారు?"

ఏమీ తెలియనట్లు అడుగుతూ...భుజం మీద ఉన్న తన తుండును తీసుకుని ఒకసారి విదిలించి- గొంతు చుట్టూ ఒక మాల లాగా వేసుకుని దివ్యాకీ, అర్జున్ కూ మధ్యలో వచ్చి నిలబడ్డారు గంగయ్య స్వామి.

"ఏం మూలిక వైద్యులు గారూ...ఏమీ తెలియనట్లు మాట్లాడుతున్నారు? నేను ఇదివరకే మిమ్మల్ని కలిశాను. జ్ఞాపకం ఉంది కదూ...?

యౌవ్వనాన్ని కాపాడే మూలికకు, మరణాన్ని వాయిదా వేసే మూలికకు వెల కట్టలేము. ఎంత డబ్బైనా ఇవ్వటానికి మేము రెడిగా ఉన్నాము. మాకు మూలికల మొక్కలను గుర్తించి చూపించాలి అని ప్రాధేయపడ్డానే? మర్చిపోయారా? నన్ను ఎదిరించి మాట్లాడి, తిట్టి పంపించారే?"

"ఇదిగో ఇలా చూడండి...నేనొక సాధారణ వైద్యుడ్ని. అంతే. అరుదైన మూలికలను మీరో, నేనో, ఇంకెవరైనా సరే దక్కించుకోనేలేరు. దానికి భగవంతుని అనుగ్రహం ఉండాలి. స్వార్ధం తెలియని మునులకు,రుషుల కళ్ళకు మాత్రమే అవి కనబడతాయి. నాకు మూలికల గురించి తెలియదు. ఎందుకు మా టైమును వేస్టు చేస్తున్నారు?"

"ఏమీ తెలియదని అంత పెద్ద అబద్దం చెబితే ఎలా? ఒక కుష్టు రోగిని పరి పూర్ణంగా గుణపరిచారన్న వివరం... చుట్టు పక్కలున్న గ్రామ ప్రజలందరికీ తెలుసే? దీన్ని మీరు కాదనగలరా? ఇప్పుడు రాత్రి సమయంలో, కొండ అడవి ప్రాంతంలో ఎందుకు తిరుగుతున్నారు? మూలికలను కోసుకెళ్ళటానికేగా వచ్చారు?"

ఎగతాళిగా నవ్వుతూ మాట్లాడిన డాక్టర్ సుధీర్ ని క్రింద, పైకీ చూసారు గంగయ్య స్వామి గారు.

"నేను ఏవో కొన్ని ఆకులు పెట్టుకుని వైద్యం చేసే మామూలు మనిషిని. మీకు కావలసిన మూలికలను మీరే అడవంతా గాలించి వెతుక్కుని తీసుకు వెళ్ళొచ్చు కదా?"

"ఊహు. అమ్మా, బాబూ అంటే వీళ్ళు వినరు. లక్షల కొద్ది డబ్బులు ఇస్తాను, మూలికలను చూపించు అని వేడుకున్నాను. ఊహు. కొంచం కూడా జాలి చూపలేదు. కానీ డాక్టర్ విఠల్ రావ్ కూతురుకీ, ఆమె ప్రేమించిన వీడికీ మూలిక వైద్యుడు ఎంత మర్యాద ఇస్తున్నాడో చూశారారా? తనతో పాటు అడవికి తీసుకు వచ్చి మూలికలు కోసుకు వెళ్లడానికి వచ్చారు...చూశారా?  ఈ స్వాములోరు మాట వినే రకం కాదు. వీడి కళ్ల ఎదుటే డాక్టర్ విఠల్ రావ్ కూతుర్ని, ప్రేమికుడ్ని చంపి పారేస్తే గాని మాట వినేటట్లు లేడు"

పిచ్చి కోపంతో చట్టుక్కున వెనక్కి తిరిగి తన సహచరలను రెచ్చగొట్టాడు.

అతను వెను తిరిగి నిలబడిన క్షణం.

గంగయ్య స్వామి గారు తనకు ఇరు పక్కల నిలబడున్న దివ్యా - అర్జున్ చేతులు పుచ్చుకుని నొక్కాడు.

'నా చేతిని గట్టిగా పుచ్చుకోండి. వెనుక ఉన్న లోయలోకి మనం ఇప్పుడు దూకాలి

కళ్ళతో ఆయన చేసిన సైగలను అర్ధం చేసుకున్న దివ్యా - అర్జున్ ఆవగింజంత కూడ ఆలొచించలేదు. కనురెప్ప మూసి తెరుచుకునే సమయంలోపు గంగయ్య స్వామి గారి చేతులు గట్టిగా పుచ్చుకున్నారు. అలాగే ముగ్గురూ వెనుక ఉన్న లోయలోకి దూకారు.

కారుచీకట్లో...అది లోయా లేక అదః పాతాళమా? అని కూడా తెలియలేదు.

దూకేటప్పుడు గంగయ్య స్వామి గారు 'ఓం నమో నారాయణాయ నమః' అని గట్టిగా అరిచి ఉచ్చరించింది మాత్రం చెవులకు వినబడింది.

భయంతోనూ, ఆందోళనతోనూ దివ్యా కళ్ళు మూసుకునే దూకింది.

'మరు క్షణం ఏం అపాయం జరగబోతోందో!' అని ఇద్దరూ ఆలొచించనేలేదు.

దివ్యా యొక్క మనో దృష్టిలో తండ్రి విఠల్ రావ్ ఒకసారి కనబడి వెళ్ళారు. ఆమె మనసంతా పూర్తిగా మందుల కొండపైన ఉన్న శివుని శరణులో ఐక్యమై పోయుంది.

గంగయ్య స్వామి గారిని శిఖరంలా నమ్ముకుంది.

గాలిని చించుకుని పై నుండి కిందకు పడుతున్నప్పుడు పొత్తికడుపులో పేగులు ముడి వేసుకున్నట్లు అనిపించింది.

గబుక్కున ఆమె మూర్చ పోయింది.

                                                            ****************************************

అడివి పక్షుల సంగీత గీతాలతో కోయిల గీతం కూడ వినబడుతోంది.

మెల్లగా కళ్ళు తెరిచింది దివ్యా.

'ఎక్కడున్నాను నేను?'

గంగయ్య స్వామి ఆశ్రమంలో చిన్న గోడకు పక్కన తనకోసం ఇవ్వబడ్డ చోటులో చాప మీద పడున్నది గ్రహించింది దివ్యా. 

గుడారానికి ఉన్న చిన్న రంద్రంలో నుండి పగటి వెలుతురు లోపలకు వస్తోంది. వెలుతురు మొహం మీద పడటంతో ఉలిక్కిపడి లేచి కూర్చుంది.

'ఇక్కడికి ఎలా వచ్చాను?'

'అర్జున్ ఏమైయ్యాడు?'

గంగయ్య స్వామి గారి చేతులు పుచ్చుకునే కదా అంత ఎత్తులో నుండి దూకాము... తరువాత ఏం జరిగింది?

ఒకవేల, ఇదంతా కలగా ఉంటుందేమో...ఎవరో కొట్టి పడేసినట్లు ఇంతసేపటి వరకు నిద్రపోయా నో? ఇక్కడ ఎవరూ లేరే?'

వేగంగా ప్రవేశ ద్వారం దగ్గరకు వచ్చి నిలబడింది.

ఎదురుగా మారేడు చెట్టు నుండి ఆకులు కోస్తున్నాడు గంగయ్య స్వామి శిష్యుడు పురుషోత్తం.

చుట్టూ చూసింది దివ్యా. కొంచం దూరంలో...

తడి గుడ్డలను పిండి చెట్ల కొమ్మల మధ్య కట్టబడిన దన్నెం మీద బట్టలు ఆరేస్తున్న అర్జున్ ఎదురుగా వెళ్ళి నిలబడింది.

"దగ్గరలోనే అందమైన జలపాతం ఒకటి ఉన్నది. స్నానం చేసి వచ్చాను దివ్యా. జలపాతాన్ని నువ్వు చూస్తే...అక్కడ్నుంచి రావటానికి నీకు మనసే రాదు తెలుసా? నేను ప్రొద్దున్నే లేచాను. నువ్వు బాగా ఆదమరచి నిద్రపోతున్నావు! నిన్ను లేపటానికి నాకు మనసు రాలేదు. వచ్చిన పని ముగిసినా కూడా, ఇక్కడ్నుంచి కదలటానికి మనసే రాదనుకుంటా! ఇవన్నీ చూస్తుంటే మనం కూడా పురుషోత్తం గారు లాగా మనసు మార్చుకుని ఇక్కడే ఉండిపోతామేమో దివ్యా "

కళ్ళ్పకుండా అతని మొహంలోకి సూటిగా చూసింది.

"ఏమిటి అర్జున్...సీరియస్ నెస్ లేకుండా మాట్లాడుతున్నావు? నిన్న ఏమిటెమిటో గొడవలు జరిగినైయే? నువ్వేమిటి ఏమీ జరగనట్లు మాట్లాడుతున్నావు. జరిగిందంతా కలా...నిజమా అని నేను గందరగోళంలో కొట్టుకుంటున్నాను. ముగ్గురం చేతులు పుచ్చుకుని లోయలోకి దూకేమే? అలా దూక కుండా ఉండుంటే మన పరిస్తితి ఎలా ఉండేదో, తలచుకుంటేనే గుండె దఢ పుడుతోంది.మీరేంట్రా అంటే...జలపాతంలో స్నానం చేసి, తడి గుడ్డలను పిండుకుంటూ సర్వ సాధారణంగా మాట్లాడుతున్నారే?"

"ఎప్పుడైనా సరే జరిగిపోయిన దాని గురించి ఆలొచిస్తూ ఉండకూడదు. జరగబోయే దాని గురించి మాత్రమే ఆలోచించాలి"

జవాబిచ్చాడు.

"కొంచం సీరియస్ గా ఉండండి అర్జున్.....ఎంత పెద్ద సంభవం జరిగింది. అది సరే...మనం ఇక్కడికి ఎలా వచ్చాము? దూకుతున్నప్పుడే భయంతో నేను స్పృహ కోల్పోయాను"

అతను పెద్దగా నవ్వి, గొంతు సవరించుకుని మాట్లాడటం మొదలుపెట్టాడు.

"ఇది చెప్పటానికి నాకు సిగ్గుగానే ఉంది. దూకేటప్పుడు నాకూ భయంగానే ఉన్నది. నాకు తెలియకుండానే కళ్ళు గట్టిగా మూసుకున్నాను. కళ్ళు తెరిచి చూస్తే ఆశ్రమంలో పడుకోనున్నాను. నీకు లాగానే నేను కూడా స్పృహ కోల్పోయేను అనుకుంటాను. ఒక మగాడికి ఇంత భయం రావచ్చా అని నన్ను నేను తిట్టుకుంటున్నే ఉన్నాను"

"భయం అనేది మానవుల సహజ లక్షణమే కదా? ఇందులో సిగ్గు పడాల్సిన అవసరం ఏముంది అర్జున్? సినిమాలో కధానాయకులు వందల అడుగు ఎత్తులో నుండి 'డైవ్' చేసి--నవ్వు మొహంతో లేచి నడిచేటట్టు చూపిస్తారు. అదంతా సాధ్యపడే విషయమా?

సరే...అది వదిలేయండి. నిన్న రాత్రి ఎంతదూరం కొండ అడవిలోకి వెళ్ళాము? మనం దూకిన చోటుకు, మన ఆశ్రమానికి ఉండే దూరాన్ని తలుచుకుంటే ఆశ్చర్యంగా ఉందే? మన ఇద్దరినీ ఇక్కడికి తీసుకువచ్చి చేర్చింది గంగయ్య స్వామి గారే అయ్యుండాలి...కదా?"

"ఖచ్చితంగా"

డాక్టర్ సుధీర్ ఇప్పుడు చాలా కోపంలో ఉండుంటాడు. తను మోసపోయినందుకు నాన్నను ఏదైనా చేస్తాడేమోనన్న భయంగా ఉన్నది"

ఒక రుషి యొక్క అభిమానం, ప్రేమ, ఆశీర్వాదం దొరికిందే? ఇది ఎంత పెద్ద భాగ్యం? కాబట్టి, మంచే జరుగుతుందని నమ్ముదాం.సీతమ్మను ఒకసారి చూసేస్తే అన్ని సమస్యలకు ఒక పరిష్కారం దొరుకుతుందని నాకు నమ్మకం కలుగుతోంది"

"పౌర్ణమి రోజు మధ్యరాత్రి మందుల కొండపై ఉన్న పంచలింగ దర్శనానికి ఆవిడ వస్తుంది కదా...అక్కడకెళ్ళి చూస్తే సరిపోతుంది"

"ఊహు...ఆవిడ ఉండే చోటుకు వెళ్ళి చూస్తేనే మంచిదని నా మనసుకు అనిపిస్తోంది"

"మందుల కొండ లోయకు అవతలివైపున దిగి దట్టమైన అడవిలోపల ఉన్న గుహను ఎలా వెతికి తెలుసుకునేది?"

"ప్రయత్నం చేస్తే తెలుసుకోలేనిది ఏదీ లేదు. మందుల కొండపై ఉన్న శివుడిపై భారం వేసి, ప్రయత్నంలోకి దిగితే తానుగా దారి కనబడుతుంది"

" గంగయ్య స్వామి గారి దగ్గర అనుమతి తీసుకోవద్దా?"

"మనల్ని ఇక్కడకు తీసుకు వచ్చి దింపేసి గంగయ్య స్వామి గారు వెంటనే తిరిగి వెళ్ళిపోయారట. మూలికలు కోసుకోవటంలో నిన్న ఏర్పడ్డ ఆటంకం వలన, ఇక ఇప్పట్లో ఆశ్రమానికి తిరిగి రారట. ఒక వారం కూడ పట్టొచ్చుట! అలాగని పురుషోత్తం గారు చెబుతున్నారు"

"అందుకని ఆయన అనుమతి ఎదురుచూడకుండా మనమే గుహను వెతుక్కుని వెల్దామని చెబుతున్నారా?"

"వెళ్ళాల్సిందే. కానీ, దాంట్లో చిన్న మార్పు. సారి నేను మాత్రమే వెల్తున్నాను"

"లే..లేదు అర్జున్! ఇది నేను ససెమీరా ఒప్పుకోను. నాన్నను ఇంకా మనం కనిపెట్టలేక కష్టపడుతున్నాము. మీరు ఒంటరిగా వెళ్ళి...ఆపదలో చిక్కుకుంటే ఏమవుతుంది?  కావాలంటే ఇద్దరం కలిసి వెలదాం"

"నిన్ను తీసుకు వెళ్ళటానికి నేను రెడీగా లేను దివ్యా! నిన్న రాత్రి డాక్టర్ సుధీర్ తో ఎంతమంది రౌడీలు ఉన్నారో చూశావు కదా? వాళ్లంతా నిన్ను చూసిన చూపే సరిలేదు. వద్దు. నువ్వు నాతో రావటం మంచిది కాదు"

"మిమ్మల్ని ఒంటరిగా పంపించి--నేనెలా ప్రశాంతంగా ఉండగలను? ఏమైందో...ఏం జరిగిందో...అనుకుంటూ ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని ఆందోళన పడాలి. అలా కష్టపడటానికి బదులు నేను కూడా మీతో వస్తానే?".

"ఏమిటి దివ్యా...అర్ధం చేసుకోకుండా మాట్లాడుతున్నావు? నువ్వొక అందమైన అమ్మాయివి. దేవ కన్యలాగా మెరుస్తున్నావు! నీకు వేరే విధమైన ఆపద వస్తుందని హెచ్చరిస్తున్నాను. నేనూ వస్తానని మళ్ళీ మళ్ళీ మొండి పట్టుదల పట్టకు?"

కాబోవు భార్య కన్నీరు తుడవటానికి అడవిలోకి వచ్చి ఇంత కష్టపడటం చూస్తుంటే...నాకు మనసులో నొప్పిగా ఉంది. చాలు అర్జున్. నిన్ను ఒంటరిగా పంపించటానికి నేను రెడీగా లేను. గంగయ్య స్వామి గారు వచ్చేంతవరకు కాచుకోనుందాం. మనంగా నిర్ణయం తీసుకోవటం తప్పు. ఆయనతో కలిసి మాట్లాడకుండా పనీ చేయకూడదు అర్జున్ "

దివ్యా అలా మాట్లాడేసరికి, ఏమీ అనలేక తన నిర్ణయం మార్చుకున్నాడు అర్జున్.

"సరే...నీ ఇష్టం! ఎక్కువగా ఆందోళన చెందకు.  వాటర్ ఫాల్స్ లో స్నానం చేస్తావా? రా...తోడుగా నేనూ వస్తాను. స్నానం చేసేసి పురుషోత్తం గారు తయారు చెస్తున్న మూలిక మందులలో సహాయపడదాం"

"సహాయమా! మనం ఎలాంటి సహాయం అందించగలం?"

"రుబ్బటం, పొడిచేయటం...ఇలా మనవలన చేయగలిగిన సహాయం చేద్దాం".

"సరే...ఇదిగో నేను రెడీ అయి వస్తాను" అని చెప్పి లోపలకు వెళ్ళింది దివ్యా.

త్వరలో....ఎంతో ప్రాణంగా ప్రేమిస్తున్న ప్రేమికుడ్ని పోగొట్టుకుని అనాధగా నిలబడుతుందని ఆమె కలలో కూడా ఎదురు చూడలేదు.

                                                                                                                         Continued...PART-8

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి